Tulsi
-
కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే...
పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు. ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చు. -
కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్!
ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం. తులసి, అలొవెరా జెల్ ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఆ నీటిని ఐస్‌క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి. స్పిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఐస్‌క్యూబ్స్ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దోసకాయ ముక్కలతో ఒక బౌల్లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది. కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు. కుంకుమ పువ్వును కొంచెం రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్ మారిపోతుంది. చదవండి: Beauty: కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే.. -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
తులసి వరమాల
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక నెట్టింట వైరల్ అవుతోంది. కారణం వీరీ పెళ్లిలో తులసిమొక్కలు ప్రధాన పాత్ర పోషించడమే. విషయమేమింటే.. ఆదిత్య అగర్వాల్, మాధురి బలోడి స్కూల్ ఏజ్ నుంచి స్నేహితులు. చదువులు పూర్తయ్యాక పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, తమ మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా పర్యావరణం పట్ల ప్రేమనూ చాటుకోవాలనుకున్నారు. రెండు కుటుంబాలవారూ ధనవంతులే అయినప్పటికీ ఇరు కుటుంబాల నుంచీ పెళ్లి ఖర్చునూ తగ్గించాలని ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆలోచించుకొని అన్నింటా ఖర్చును తగ్గిస్తూ వచ్చారు. తులసిమొక్కని తమ పెళ్లికి పెద్దగా నిర్ణయించారు. ఊరేగింపులో మొక్కలు వరుడు తన స్నేహితులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చే ముందు జరిగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గుర్రం లేదా కారులో కాకుండా వరుడు ఎలక్ట్రిక్ సైకిల్ మీద మండపానికి చేరుకున్నాడు. పూల దండలకు బదులుగా వధూవరులు తులసి మాలలు మార్చుకున్నారు. వధూవరుల దుస్తులు రూ.6000కు మించకుండా జాగ్రత్తపడ్డారు. పెళ్లి మండపం అలంకరణ అంతా పర్యావరణ అనుకూలమైన వాటితో తీర్చిదిద్దారు. ఈ వివాహంలో అతిథులకు బహుమతులకు బదులుగా మొక్కలు అందించారు. ఇలా తమ పెళ్లి ద్వారా పర్యావరణం పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. ‘మా పెళ్లికి కార్డులు కూడా ముద్రించలేదు. ఇ–ఆహ్వానాలనే డిజైన్ చేసి, పంపించాం. వేదిక ముందు ప్రింటెడ్ బ్యానర్ కు బదులుగా చాక్‌పీస్‌తో రాసిన బోర్డును ఏర్పాటు చేశాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి మా రెండు కుటుంబాలు మద్దతు తెలపడం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు వధూవరులు. ప్లాస్టిక్ వాడకం లేని ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లిని నెటిజన్లు విపరీతంగా ప్రశంసిస్తున్నారు. వివాహంతో ఒక్కటయ్యే జంటలు ఇలాంటి వివాహ పద్ధతులను అవలంబించాలని కొందరు, ఇదొక సృజనాత్మక మార్గం అని మరికొందరు కొనియాడుతున్నారు. పర్యావరణ అనుకూలమైన బైక్‌లపై ఊరేగింపుగా వివాహ వేదికకు చేరుకుంటున్న వరుడు, అతడి స్నేహితులు. -
సంపదలిచ్చే కల్పవల్లి... మోక్షమిచ్చే తల్లి
నేడు... క్షీరాబ్ధి ద్వాదశి ఈ రోజు తులసి దగ్గర దీపదానం చేస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి. వంద దీపాలను దానం చేసినవారు భగవత్ సాన్నిధ్యం చేరతారు. ఒక వత్తితో దీపం దానమిస్తే, విజ్ఞాని అవుతారు. రెండు వత్తులతో ఇస్తే, రాజు అవుతారు. పది వత్తులతో ఇస్తే, దైవసాక్షాత్కారం లభిస్తుంది. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే, తుదిశ్వాసతో ఆ దైవంలో లీనమవుతారని వ్యాసుడి మాట. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తిక మాసం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వచ్చే మాసం కాబట్టి, దీని పేరు ‘కార్తికం’. ఈ నెలలో రోజూ పుణ్యప్రదమే. కొన్ని ప్రత్యేకదినాలు మరింత పుణ్యప్రదం. వాటిలో ఒకటి - కార్తిక శుక్ల ద్వాదశి. కార్తికంలో 12వ రోజైన ద్వాదశిని ‘క్షీరాబ్ధి ద్వాదశి’ అంటారు. దీనికే ‘మథన ద్వాదశి’, ‘చిలుకు ద్వాదశి’, ‘చినుకు ద్వాదశి’, ‘తీర్థన ద్వాదశి’, ‘తులసి ద్వాదశి’, ‘యోగేశ్వర ద్వాదశి’, ‘హరిబోధిని ద్వాదశి’ - ఇలా రకరకాల పేర్లు. విష్ణుమూర్తి నిద్ర లేచిన నాడు... ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి ముందు రోజు ‘ఉత్థాన ఏకాదశి’. ప్రతీ పక్షానికీ, అంటే పదిహేను రోజులకూ ఏకాదశులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చే ఏకాదశులు అన్నింటిలోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తిక శుద్ధ ఏకాదశి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. కాబట్టి అది ‘శయన ఏకాదశి’. అలా శయనించిన విష్ణుమూర్తి నాలుగు మాసాల తరువాత ఈ కార్తిక శుద్ధ ఏకాదశికి నిద్ర నుంచి మేల్కొంటాడు. ఉత్థానమంటే లేవడమని అర్థం. కాబట్టి, దీనికి ‘ఉత్థాన ఏకాదశి’ అని పేరు. దీన్నే ‘ప్రబోధిన్యేకాదశి’ అని కూడా అంటారు. పాలకడలిని చిలికింది ఈ రోజే! ఆ మరునాడైన ద్వాదశి నాడే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలకడలిని మథించడం మొదలైందని కథనం. క్షీరసాగర మథనం ప్రారంభమైంది కాబట్టి, అది ‘క్షీరాబ్ధి ద్వాదశి’. పాల కడలిని మథించారు. అంటే చిలికారు కాబట్టి, ఇది ‘మథన ద్వాదశి’. మామూలు మాటల్లో ‘చిలుకు ద్వాదశి’. ద్వాదశి ముందు రోజైన ఏకాదశి నాడు పండరీపురంలోని విఠలేశ్వర ఆలయంలో పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. కాయధాన్యాల ఆహారం తినకుండా, ఫలహారం చేయాలి. రాత్రి జాగారం చేయాలి. ద్వాదశి ఉదయాన్నే తలంటు స్నానం చేసి, వ్రతం ఆచరించాలి. శ్రీహరికి నైవేద్యం పెట్టాలి. కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఈ అన్నదానం అనంత పుణ్యాన్నిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరంలో కోటిమందికి అన్నదానం చేస్తే వచ్చేంత పుణ్యం ఈ రోజు అన్నదానంతో వస్తుందంటారు. తెలుగు నాట... తులసి, ఉసిరికల పూజ భారతీయ సంప్రదాయంలో తులసి పరమ పవిత్రం, శుభకరం. అందుకనే, స్త్రీలు ప్రతిరోజూ తులసి చెట్టును పూజించి, తులసి చెట్లన్నిటినీ పెంచే ‘బృందావనం’ (తులసి కోట)లో నీళ్ళు పోస్తారు. ఇక, క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి చెట్టును సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మిగా భావించి, పూజిస్తారు. ఈ ద్వాదశి నాటి తులసీ పూజ వెనుక ఒక కారణం ఉంది. అప్పటి దాకా పాలకడలిపై శయనించి ఉన్న విష్ణువు ‘ఉత్థాన ఏకాదశి’ నాడు శ్రీమహాలక్ష్మితో కలసి, బ్రహ్మాది దేవతలు వెంట రాగా, తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడని పెద్దల మాట. అందుకే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి చెట్టునూ, ఉసిరిక చెట్టునూ పూజించడం సంప్రదాయం. విష్ణువు, లక్ష్మీదేవి సహితంగా ఈ రెండు చెట్లకూ ఆవు నెయ్యితో తడిపిన 360 వత్తులతో నీరాజనమిస్తారు. ఇంట్లో ఉసిరిక చెట్టు ఉండకపోవచ్చు కాబట్టి, తులసి చెట్టు పక్కనే, ఉసిరి కాయతో ఉన్న ఉసిరి చెట్టు కొమ్మ పాతి, పూజ చేయడం ఆచారం. అందుకే, ‘క్షీరాబ్ధిశయన వ్రతకల్పం’లో ‘తులసీ సహిత ధాత్రీ లక్ష్మీనారాయణ’, ‘తులసీ ధాత్రీ సహిత లక్ష్మీనారాయణ’ లాంటి మాటలు కనిపిస్తాయి. ‘ధాత్రి’ అంటే ఉసిరిక అనీ అర్థం. ఈ ద్వాదశికి ఉసిరికాయల్లో పూజా సమయంలో దీపారాధన చేయడం తెలుగు నాట ఆచారం! తులసి, ఉసిరిక ఒకేచోట, ఒకేసారి పుట్టినట్లు ‘శివపురాణ’ కథ. ఈ ‘క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం’ చేస్తే కోర్కెలన్నీ నెరవేరతాయని ధర్మరాజుకు వ్యాసుడు చెప్పాడు. ఎలా పూజించాలి? ద్వాదశి నాటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కలన్నిటినీ పెంచే తులసి కోట దగ్గర స్త్రీలు శుభ్రం చేసి, ముగ్గులు తీర్చాలి. తులసి కోటను అలంకరించాలి. తులసికి కుంకుమ పెట్టాలి. కోట చుట్టూ దీపాలు వెలిగించాలి. దీపారాధనకు ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ శ్రేష్ఠం. ధూప, దీప, నైవేద్యాలతో తులసిని పూజించి, విష్ణు స్తోత్రం, లక్ష్మీ స్తుతి చేస్తారు. ఇది కాక కొందరికి తులసి చెట్టును చీరతో అలంకరించి, పువ్వులు, ఎర్ర గాజులు పెట్టి, తాంబూలం కూడా సమర్పించే ఆచారం ఉంది. ‘క్షీరాబ్ధి ద్వాదశి’ నాడు ఇలా శ్రద్ధాసక్తులతో శ్రీమహావిష్ణువునూ, తులసినీ పూజిస్తే సమస్త పాపాలూ నశిస్తాయి. విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. మహారాష్ట్రలో... తులసీ కల్యాణం మహారాష్ర్ట, మాళవ ప్రాంతాల్లో ఈ రోజున శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడికీ, తులసికీ కల్యాణం చేసే సంప్రదాయం ఉంది. పాలకడలిని చిలుకుతుంటే కల్పవృక్షం, కామధేనువు పుట్టాయి. లక్ష్మీదేవి కూడా అలా పాలకడలి నుంచి పుట్టినదే. ఆమెను క్షీరాబ్ధి ద్వాదశి నాడే విష్ణుమూర్తి వివాహం చేసుకున్నట్లు మరో కథనం. దానికి గుర్తుగా ఏటా ఆనాటి సాయంత్ర వేళ లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు అవతారమైన కృష్ణుడికీ, లక్ష్మికి ప్రతిరూపమైన తులసికీ కల్యాణం చేస్తారు. తెలుగునాట ఈ తులసి వివాహతంతు లేదు కానీ, తులసి పూజ ఎక్కువ. కార్తికంలో నిత్య దీపారాధన శ్రేష్ఠం. రోజూ చేయలేకపోయినా, కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమినాడైనా దీపారాధన మంచిది. తులసి వద్ద దీపారాధన చేసినంతనే అమితపుణ్యమిచ్చే రోజు కాబట్టే, ‘క్షీరాబ్ధి ద్వాదశి’కి అంత విశిష్టత. నమ స్తులసి కల్యాణి... నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి... నమః సంపత్ ప్రదాయికే. - రెంటాల జయదేవ -
కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే..
బ్యూటిప్స్ * నీటిని మరిగించి అందులో గుప్పెడు తులసి, క్యాబేజీ ఆకులు వేసి మూతపెట్టి ఇరవైనిమిషాల సేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత వడపోసి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఈ మిశ్రమం యాక్నె, పింపుల్స్‌కు బాగా పని చేస్తుంది. * కీరదోస కాయను చక్రాలుగా కోసి కళ్ల మీద పెట్టుకుని అరగంట సేపు ఉంచుకుంటే క్రమంగా వలయాలు పోతాయి. * ఒక కప్పులో నీరు పోసి అందులో వాడిన టీ బ్యాగ్‌లను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని, రాత్రి పడుకునే ముందు కాని, బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాని పదిహేను నిమిషాల సేపు కళ్ల మీద పెట్టుకుంటుంటే వలయాలు పోతాయి. * శరీరానికి అవసరమైనంత నీటిని తాగాలి. కనీసం రెండు లీటర్లకు తగ్గకుండా తాగినప్పుడే శరీరంలోని మలినాలు సులభంగా బయటకు పోతాయి. అవసరమైనంత నిద్ర కూడా తప్పని సరి. ఎంత సమయం అనేది కచ్చితంగా ఉండకపోయినప్పటికీ శారీరక, మానసిక అలసటను బట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. * తగినంత విశ్రాంతి పొందినప్పుడు శరీరం రుగ్మతలతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. చర్మం వార్ధక్యానికి దూరంగా నిత్య యవ్వనంతో ఉంటుంది. విశ్రాంతి సమయంలో రక్తంలోని తెల్లరక్త కణాలు ఉత్తేజితమవుతాయి.