ఐక్యరాజ్యసమితి: భారత్‌కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త ఒకరు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సలహా మండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకూ దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలను వీరు యూఎన్ చీఫ్‌కు అందిస్తారు. ఈ మండలికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు (18–28 ఏళ్ల వారు) ఎంపిక కాగా భారత్ నుంచి అర్చన సొరెంగ్(24) అందులో ఒకరు కావడం విశేషం. పర్యావరణాన్ని సమతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. మన పూర్వీకులు సంప్రదాయ విధానాల్లో అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత మనపై ఉందని, వాతావరణ మార్పులతో మనం పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈమె టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై (టిస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్ పూర్తి చేశారు. ఆమె టిస్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ‘మనం పర్యావరణ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. మనకు ఎక్కువ సమయం లేదు’అని గుటెరస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని కోవిడ్‌తో పాటు, అన్యాయం, అసమానత్వం, పర్యావరణ నాశనం వంటి వాటిపై పోరాడాలన్నారు. యువతను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment