సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్‌లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్‌కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్‌లో హరికృష్ణతోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు.
వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్‌స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్‌యు ఏఎస్‌ఈ సూపర్‌బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్‌ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment