pentela Harikrishna
-
హరికృష్ణ, విదిత్ జట్టుకు టైటిల్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీపడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, చెక్ రిపబ్లిక్లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్‌మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్‌లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్‌లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు. విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ డాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. అర్జున్ 7 గేమ్‌లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. -
European Chess Club Cup 2022: హరికృష్ణ జట్టుకు యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్లో హరికృష్ణతోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్‌యు ఏఎస్ఈ సూపర్‌బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
Chess Olympiad 2022: అజేయంగా భారత్ ‘ఎ’
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ ఖాతాలో నాలుగో విజయం చేరింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 2.5–1.5తో రొమేనియాపై గెలిచింది. పెంటేల హరికృష్ణ–బొగ్డాన్ గేమ్ 31 ఎత్తుల్లో... విదిత్–లుపులెస్కు గేమ్ 31 ఎత్తుల్లో... నారాయణన్–జియాను గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 46 ఎత్తుల్లో పరిల్‌గ్రాస్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో భారత్ ‘బి’ 2.5–1.5తో స్పెయిన్‌పై గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేయగా...భారత్ ‘సి’ 2.5–1.5తో చిలీపై నెగ్గింది. మహిళల విభాగంలో భారత్ ‘ఎ’ 2.5–1.5తో ఫ్రాన్స్‌పై గెలుపొందగా... భారత్ ‘బి’ 1–3తో జార్జియా చేతిలో ఓడిపోయింది. భారత్ ‘సి’–బ్రెజిల్ మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. -
Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్లో పదోసారి చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘2000 నుంచి నేను చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఓపెన్ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్ హరికృష్ణ అన్నాడు. -
హరికృష్ణ పరాజయం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగం నాలుగో రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు పరాజయం ఎదురైంది. అమిన్ (ఇరాన్)తో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ తప్పనిసరిగా గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాడు. మరోవైపు విదిత్ (భారత్) 49 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై విజయం సాధించాడు. మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ ముందంజ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్లోకి ప్రవేశించాడు. కాన్స్టాన్టిన్ లుపులెస్కు (రొమేనియా)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన హరికృష్ణ, సోమవారం జరిగిన రెండో గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ 0.5–1.5తో ఆంద్రికిన్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. విదిత్–ఆధిబన్ (భారత్); ప్రజ్ఞానంద (భారత్)–క్రాసెన్‌కౌ (పోలాండ్) నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు హిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 0.5–1.5తో గునీనా (రష్యా) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
మూడో రౌండ్లో హరికృష్ణ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు భారత్‌కే చెందిన ఆధిబన్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హరికృష్ణ 1.5–0.5తో యాసిర్ పెరెజ్ క్యూసాడా (క్యూబా)పై, ఆధిబన్ 2–0తో న్యూరిస్ డెల్గాడో రమిరెజ్ (పరాగ్వే)పై, ప్రజ్ఞానంద 2–0తో గాబ్రియెల్ సర్గాసియన్ (అర్మేనియా)పై, నిహాల్ 1.5–0.5తో సనన్ జుగిరోవ్ (రష్యా)పై గెలిచారు. నిర్ణీత రెండు గేమ్‌లు ముగిశాక విదిత్ (భారత్)–అలెగ్జాండర్ ఫియెర్ (బ్రెజిల్); గుకేశ్ (భారత్)–దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు శనివారం ‘టైబ్రేక్’ నిర్వహిస్తారు. అరవింద్ చిదంబరం (భారత్) 0.5–1.5తో నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... ఇనియన్ (భారత్) 0–2తో తొమాస్‌షెవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. హారిక ప్రత్యర్థి మెదీనా (ఇండోనేసియా)కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె బరిలోకి దిగలేదు. భక్తి కులకర్ణి 0.5–1.5తో నటాలియా పొగోనినా (రష్యా) చేతిలో... వైశాలి 0–2తో బేలా ఖొటెనాష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయారు. పద్మిని రౌత్ (భారత్)–సారాసదత్ (ఇరాన్) 1–1తో సమంగా నిలువడంతో శనివారం టైబ్రేక్‌లో తలపడతారు. -
ఒక విజయం... ఒక ‘డ్రా’
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో శుక్రవారం భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2.5–1.5తో విజయం సాధించిన భారత్... ఆ తర్వాత యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ తమ గేముల్లో గెలిచారు. ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించగా... విదిత్ ఓటమి చవిచూశాడు. యూరప్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విదిత్ తన గేమ్‌లో నెగ్గగా, హరికృష్ణ ఓడిపోయాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిది రౌండ్లు ముగిశాక భారత్ నాలుగో స్థానంలో ఉంది. -
మెరిసిన హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్జెన్ నగరంలో ముగిసిన ఈ లీగ్‌లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్ క్లబ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్‌గా ఉత్తమ ప్లేయర్ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్‌లో షాంఘై క్లబ్ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 17 మ్యాచ్‌ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్‌లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్ మాక్సిమ్ (రష్యా), వాంగ్ పిన్, ని షికిన్, జు వెన్జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు. -
పతకాలతో తిరిగి రావాలని...
బటూమి (జార్జియా): గతంలో ఎన్నడూలేని విధంగా సన్నద్ధత... పదేళ్ల తర్వాత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం... రెండేళ్ల తర్వాత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి పునరాగమనం... వెరసి సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఐదో సీడ్... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టుకూ ఐదో సీడ్ లభించింది. పురుషుల విభాగంలో 185 దేశాలు... మహిళల విభాగంలో 155 దేశాలు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్లో 11 రౌండ్లు జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. పురుషుల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1927లో... మహిళల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1957లో జరిగింది. ఆనంద్, హరికృష్ణ లేకుండానే... పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్ కృష్ణన్, ఆధిబన్, లలిత్ బాబు సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 2014లో కాంస్యం సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 2012లో హారిక, ఇషా కరవాడే, తానియా, మేరీఆన్ గోమ్స్, సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా ఉన్న భారత మహిళల జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆనంద్, హరికృష్ణలతోపాటు హంపి కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండటం... టోర్నీకి శిక్షణ శిబిరాలు నిర్వహించడం... టోర్నీ సందర్భంగా సన్నాహాల కోసం భారత జట్లకు తొలిసారి సెకండ్స్ (సహాయకులు)ను ఏర్పాటు చేయడంతో రెండు జట్లూ పతకాలతో తిరిగి వస్తాయని భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో అమెరికా, రష్యా, చైనా, అజర్బైజాన్... మహిళల విభాగంలో చైనా, రష్యా, ఉక్రెయిన్, జార్జియా జట్లతో భారత్‌కు గట్టిపోటీ లభించే అవకాశముంది. -
తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి
తిబిలిసి (జార్జియా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో తొలి రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు ఓటమి ఎదురైంది. యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో హరికృష్ణ నల్లపావులతో ఆడుతూ 36 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఆశలు సజీవంగా ఉండాలంటే సోమవారం గొంజాలెజ్‌తో జరిగే రెండో గేమ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 66 ఎత్తుల్లో తియాన్ లి యో (మలేసియా)పై గెలిచి శుభారంభం చేశాడు. ఇతర తొలి రౌండ్ గేముల్లో రుస్లాన్ పొనోమరియోవ్ (ఉక్రెయిన్)తో సేతురామన్ 16 ఎత్తుల్లో; ఎన్గుయెన్ త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్ 15 ఎత్తుల్లో; వాంగ్ హావో (చైనా)తో దీప్ సేన్‌గుప్తా 34 ఎత్తుల్లో; డెల్గాడో రమిరేజ్ (పరాగ్వే)తో విదిత్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. వలేజో పోన్స్ (స్పెయిన్)తో జరిగిన గేమ్‌లో కార్తికేయన్ మురళి 64 ఎత్తుల్లో ఓటమి చవిచూశాడు. -
ఆధిక్యంలో హరికృష్ణ
న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన అజేయ రికార్డును కొనసాగిస్తున్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఎనిమిదో రౌండ్లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసుకున్న హరికృష్ణ ఎనిమిదో రౌండ్ తర్వాత 6.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు.. నైజేల్ షార్ట్ (ఇంగ్లండ్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 56 ఎత్తుల్లో విజయం సాధించాడు.ఎసెర్మన్ (అమెరికా) తో గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ 23 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా...జోల్టాన్ (హంగేరి)తో జరిగిన గేమ్‌లో హారిక 56 ఎత్తుల్లో ఓడిపోయింది. -
హరికృష్ణపైనే ఆశలు
నేటి నుంచి ప్రపంచకప్ చెస్ బరిలో లలిత్ బాబు కూడా బాకు (అజర్బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సిద్ధమయ్యాడు. నేటి నుంచి ఇక్కడ జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 128 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. విశ్వనాథన్ ఆనంద్, కార్ల్సన్ మినహా ప్రపంచంలోని ప్రముఖ గ్రాండ్‌మాస్టర్లంతా బరిలో నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న హరి తొలి రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్ ఇల్లింగ్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు. హరికృష్ణ కాకుండా మరో ఐదుగురు భారత ఆటగాళ్లు ఆదిబన్, సూర్య శేఖర్ గంగూలీ, విది త్ గుజరాతీ, సేతురామన్, ఎంఆర్ లలిత్ బాబు ఈ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. తెలుగు కుర్రాడు లలిత్ బాబుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో అతను 18వ ర్యాంకర్ వోటాసెక్ (పోలండ్)తో తలపడతాడు.