యూరోపియన్ కప్ టోర్నీలో మూడోసారి విజేతగా నిలిచిన నోవీ బోర్ చెస్ క్లబ్
బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీపడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, చెక్ రిపబ్లిక్‌లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్‌మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్‌లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్‌లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు.
విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ డాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.
అర్జున్ 7 గేమ్‌లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్‌కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment