Andhra Pradesh Grandmasters
-
జాతీయ ఓపెన్ చెస్ చాంపియన్ కార్తీక్ వెంకటరామన్
ఆద్యంతం అజేయంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది. నిర్ణీత 11 రౌండ్లకుగాను కార్తీక్‌తోపాటు సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు), నీలేశ్ సాహా (రైల్వేస్) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కార్తీక్‌కు టైటిల్ వరించింది. కార్తీక్‌కు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా 2025 ప్రపంచకప్ టోర్నీకి భారత్ తరఫున కార్తీక్ అర్హత సాధించాడు. సూర్యశేఖర గంగూలీ రన్నరప్‌గా నిలువగా, నీలేశ్ సాహా మూడో స్థానం దక్కించుకున్నాడు. మిత్రబా గుహ (రైల్వేస్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన కార్తీక్ 58 ఎత్తుల్లో గెలిచాడు. కార్తీక్కిది రెండో జాతీయ టైటిల్. 2022లో అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. -
రన్నరప్‌గా ఏపీ గ్రాండ్ మాస్టర్ కార్తీక్ వెంకటరామన్
సన్వే ఫార్మెన్‌టెరా అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ రన్నరప్‌గా నిలిచాడు. స్పెయిన్‌లో ముగిసిన ఈ టోర్నీ లో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత ఫెదోసీవ్ వ్లాదిమిర్ (రష్యా), కార్తీక్ వెంకటరామన్ (భారత్), ప్రణవ్ (భారత్), లియోన్ ల్యూక్ మెండోకా (భారత్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఈ నలుగురి మధ్య ప్లే ఆఫ్ గేమ్‌లను నిర్వహించారు. వ్లాదిమిర్, కార్తీక్ ఫైనల్ చేరగా.. ఫైనల్లో కార్తీక్‌పై నెగ్గి వ్లాదిమిర్ విజేతగా నిలిచాడు. -
World Blitz Chess: హంపి అద్భుతం
అల్మాటీ (కజకిస్తాన్): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది. -
European Chess Club Cup 2022: హరికృష్ణ జట్టుకు యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్లో హరికృష్ణతోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్‌యు ఏఎస్ఈ సూపర్‌బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
డబుల్ ధమాకా
సాక్షి, చెన్నై: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. ► నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. ► పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, విదిత్, నారాయణన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానంలో... సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, మురళీ కార్తికేయ, అభిమన్యులతో కూడిన భారత ‘సి’ జట్టు 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి. ► చివరిదైన 11వ రౌండ్లో భారత్ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్ తమ ప్రత్యర్థులపై గెలిచారు. అమెరికాతో మ్యాచ్ ను భారత్ ‘ఎ’ 2–2తో... కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్ ‘సి’ 2–2తో ‘డ్రా’ చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు సభ్యులు ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్, నిహాల్ సరీన్, గుకేశ్ అమెరికా చేతిలో ఓడి... మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. సోమ వారం జరిగిన చివరిదైన 11వ రౌండ్లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్ గోమ్స్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 16 పాయింట్లతో 8వ స్థానంలో... ఇషా కరవాడే, నందిద, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారి ణులు సాహితి వర్షిణి, ప్రత్యూష, విశ్వ వాస్నావాలాలతో కూడిన భారత ‘సి’ జట్టు 15 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాయి. ► క్లాసికల్ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పరిమార్జన్ నేగి, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్లైన్లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్ కాంస్యం సాధించింది. మనోళ్లకు ఏడు పతకాలు టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వ్యక్తిగత విభాగం పతకాలను (కనీసం 8 గేమ్‌లు ఆడాలి) ఖరారు చేయగా... భారత ప్లేయర్లకు ఏడు పతకాలు లభించాయి. బోర్డు–1పై 11 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు గుకేశ్ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... బోర్డు–2పై 10 గేమ్‌లు ఆడిన నిహాల్ సరీన్ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో రజతం... బోర్డు–3పైనే 9 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో కాంస్యం గెల్చుకున్నారు. మహిళల విభాగంలో బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన వైశాలి 7.5 పాయింట్లతో కాంస్యం, బోర్డు–4పై 11 గేమ్‌లు ఆడిన తానియా 8 పాయింట్లతో కాంస్యం... బోర్డు–5పై 9 గేమ్‌లు ఆడిన దివ్య 7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. -
ఆరో స్థానంలో హంపి
వార్సా (పోలాండ్): ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కొస్టెనియుక్ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్–8.5) రన్నరప్ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్బె (కజకిస్తాన్) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
హరికృష్ణ ముందంజ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్లోకి ప్రవేశించాడు. కాన్స్టాన్టిన్ లుపులెస్కు (రొమేనియా)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన హరికృష్ణ, సోమవారం జరిగిన రెండో గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ 0.5–1.5తో ఆంద్రికిన్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. విదిత్–ఆధిబన్ (భారత్); ప్రజ్ఞానంద (భారత్)–క్రాసెన్‌కౌ (పోలాండ్) నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు హిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 0.5–1.5తో గునీనా (రష్యా) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
లలిత్ గేమ్ డ్రా
జిబ్రాల్టర్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుకు... ట్రేడ్వైస్ జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో మరో డ్రా ఎదురైంది. ఎనిమిదో రౌండ్లో అలెగ్జాండర్ మోతేలెవ్ (రష్యా-5.5)తో జరిగిన గేమ్‌ను అతను 51 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇవాన్ చెపిర్నోవ్ (బల్గేరియా-6)తో జరిగిన గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. మహిళా గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... రొమేయిన్ ఎడ్డార్డ్ (ఫ్రాన్స్-5)ల మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. పద్మినికి గ్రాండ్‌మాస్టర్ నార్మ్ ఒడిశాకు చెదిన పద్మిని రౌత్‌కు గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన నార్మ్ లభించింది. ఎనిమిదో రౌండ్లో ఆమె... తమిర్ నబతే (ఇజ్రాయిల్)పై నెగ్గింది. దీంతో పద్మిని ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. పద్మినికి ఇది వరుసగా మూడో గ్రాండ్‌మాస్టర్ నార్మ్. -
ఖతార్ మాస్టర్స్ టోర్నీ: హారికకు రెండో గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంది. ఎరిక్ హెడ్మాన్ (స్వీడన్)తో ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ టోర్నీలో తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. ఎల్తాజ్ సఫర్లీ (అజర్బైజాన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన విజయలక్ష్మీ, కొంగువేల్ పొన్నుస్వామి, అభిజిత్ గుప్తా, సందీపన్ చందాలు తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. -
ఆసియా చెస్: లలిత్ బాబు ఓటమి
షార్జా: ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి పరాజయాన్ని చవిచూశాడు. తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న అతను శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఓడిపోయాడు. చైనా ప్లేయర్ జూ యింగ్లున్ 52 ఎత్తుల్లో లలిత్‌ను ఓడించాడు. మరో గేమ్‌లో భారత్‌కే చెందిన అధిబన్ 93 ఎత్తుల్లో సహచరుడు గోపాల్‌పై గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత అధిబన్ మూడు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
హంపి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది. హంపి క్లబ్ ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచింది. మొత్తం 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొనాకో జట్టుకు యూరోపియన్ క్లబ్ కప్ దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం. మొనాకో జట్టులో హంపితోపాటు ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా), అన్నా ముజిచుక్ (స్లొవేనియా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), అల్మీరా స్కిర్ప్చెంకో (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగాల్లో హంపి బోర్డు-2లో విజేతగా నిలిచింది. హంపి ఆడిన ఏడు గేముల్లో ఐదింటిలో గెలిచి మిగతా రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. -
ఇక్కడితో ఆగను: హంపి
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ‘గ్రాండ్‌ప్రి’ విజయాలతో సరిపెట్టుకోకుండా... తన చిరకాల స్వప్నం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. సోమవారం ముగిసిన తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఈ విజయవాడ అమ్మాయి మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ ఏడాదిలో గ్రాండ్‌ప్రి టోర్నీలు ముగిశాయని... వచ్చే ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలకుగాను తాను రెండింటిలో బరిలోకి దిగుతున్నట్లు వివరించింది. ఆ రెండు టోర్నీల్లోనూ రాణించి 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘తాష్కెంట్’ టోర్నీలో టాప్ సీడ్ హంపి స్థాయికి తగ్గట్టుగా ఆడి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 19 నుంచి గ్రీస్‌లో జరిగే యూరోపియన్ క్లబ్ కప్‌లో బరిలోకి దిగుతానని వెల్లడించింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించానని ఇప్పటికైతే తనకు అకాడమీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసింది. -
‘క్వీన్’ హంపి
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. సోమవారం ముగిసిన ‘ఫిడే’ తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో హంపి విజేతగా నిలిచింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆమె 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మాయి ఆరు గేముల్లో గెలిచి... నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... మిగతా ఒక గేమ్‌లో ఓడిపోయింది. గత జూన్‌లో అర్మేనియాలోని దిలిజాన్లో జరిగిన గ్రాండ్‌ప్రి టోర్నీలోనూ హంపి చాంపియన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. పదో రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న హారిక చివరి రౌండ్లో జావో జుయ్ (చైనా) చేతిలో 38 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆరున్నర పాయింట్లతో హారిక, జావో జుయ్ ఉమ్మడిగా మూడో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా జావో జుయ్ నాలుగో స్థానాన్ని, హారిక ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు చివరి రౌండ్లో విజయాలతో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా), కాటరీనా (ఉక్రెయిన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బేలాకు రెండో స్థానం... కాటరీనాకు మూడో స్థానం లభించాయి. 2013-14 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా మొత్తం ఆరు టోర్నీలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ ఏడాది మూడు టోర్నీలు ముగిశాయి. మిగతా మూడు టోర్నీలు వచ్చే ఏడాదిలో జరుగుతాయి. ఈ గ్రాండ్ ప్రి సిరీస్ ఓవరాల్ విజేత 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తారు. -
హంపి, హారికల ఓటమి
తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు శనివారం అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి. తొమ్మిదో రౌండ్లో హంపి 60 ఎత్తుల్లో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా) చేతిలో; హారిక 48 ఎత్తుల్లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. ఈ టోర్నీలో హంపి, హారికలకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. తొమ్మిదో రౌండ్ తర్వాత హంపి ఆరున్నర పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండ గా... హారిక ఐదున్నర పాయింట్లతో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), బేలా ఖోతెనాష్విలిలతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో హంపి 50 ఎత్తుల్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచింది. లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హంపి ఐదున్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆధిక్యంలో కొనసాగుతోంది. కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హంపి 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. జూ వెన్జున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. నాలుగో రౌండ్ తర్వాత హంపి మూడున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... మూడు పాయింట్లతో హారిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం విశ్రాంతి దినం. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ ఈనెల 30న ముగుస్తుంది.