ఇక్కడితో ఆగను: హంపి
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ‘గ్రాండ్‌ప్రి’ విజయాలతో సరిపెట్టుకోకుండా... తన చిరకాల స్వప్నం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. సోమవారం ముగిసిన తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన ఈ విజయవాడ అమ్మాయి మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది.
ఈ ఏడాదిలో గ్రాండ్‌ప్రి టోర్నీలు ముగిశాయని... వచ్చే ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలకుగాను తాను రెండింటిలో బరిలోకి దిగుతున్నట్లు వివరించింది. ఆ రెండు టోర్నీల్లోనూ రాణించి 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘తాష్కెంట్’ టోర్నీలో టాప్ సీడ్ హంపి స్థాయికి తగ్గట్టుగా ఆడి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 19 నుంచి గ్రీస్‌లో జరిగే యూరోపియన్ క్లబ్ కప్‌లో బరిలోకి దిగుతానని వెల్లడించింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించానని ఇప్పటికైతే తనకు అకాడమీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసింది.