‘క్వీన్’ హంపి
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. సోమవారం ముగిసిన ‘ఫిడే’ తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో హంపి విజేతగా నిలిచింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆమె 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మాయి ఆరు గేముల్లో గెలిచి... నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... మిగతా ఒక గేమ్‌లో ఓడిపోయింది.
గత జూన్‌లో అర్మేనియాలోని దిలిజాన్‌లో జరిగిన గ్రాండ్‌ప్రి టోర్నీలోనూ హంపి చాంపియన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. పదో రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న హారిక చివరి రౌండ్‌లో జావో జుయ్ (చైనా) చేతిలో 38 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆరున్నర పాయింట్లతో హారిక, జావో జుయ్ ఉమ్మడిగా మూడో స్థానంలో నిలి చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా జావో జుయ్ నాలుగో స్థానాన్ని, హారిక ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.
మరోవైపు చివరి రౌండ్‌లో విజయాలతో బేలా ఖోతెనాష్‌విలి (జార్జియా), కాటరీనా (ఉక్రెయిన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బేలాకు రెండో స్థానం... కాటరీనాకు మూడో స్థానం లభించాయి. 2013-14 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా మొత్తం ఆరు టోర్నీలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ ఏడాది మూడు టోర్నీలు ముగిశాయి. మిగతా మూడు టోర్నీలు వచ్చే ఏడాదిలో జరుగుతాయి. ఈ గ్రాండ్ ప్రి సిరీస్ ఓవరాల్ విజేత 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తారు.