తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్‌ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్‌లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్‌లు కూడా అలాంటివే.
ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్‌లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్‌లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్‌లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment