study report
-
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
అతిగా పగటి కలలు.. కలిగే నష్టాలేంటో తెలుసా?
లండన్: పగటి కలలు.. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. మనసుకు ఉల్లాసం కలిగించడంతోపాటు విసుగు, ఒంటరితనం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి కలలను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. పగటి కలలతో మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని గతంలో పరిశోధనల్లో తేలింది. పేదవాడు క్షణాల్లో ధనవంతుడిగా మారిపోవడం పగటి కలల్లోనే సాధ్యం. అయితే, ఇలాంటి కలలు ఒక పరిమితి వరకు అయితే ఫర్వాలేదు. మితిమీరితే అనర్థాలు తప్పవని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. మేల్కొని ఉన్నప్పుడు సగం సమయం కలల్లోనే గడిపితే వాటిని మితిమీరిన పగటికలలు అంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరగొచ్చు.అయితే.. ఇలాంటి వాటితో పలు మానసిక రుగ్మతలు తలెత్తుతాయట. ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్(ఓసీడీ) వంటి ముప్పు ఎదురవుతుందని సైంటిస్టులు గుర్తించారు. జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.5 శాతం మంది మితిమీరిన కలలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్(ఫాంటసీ డిజార్డర్) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందట. ఇజ్రాయెల్ హైఫా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎలి సోమర్.. బ్రిటన్ సహాకారంతో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ డిజార్డర్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. ఇలాంటి కలల ద్వారా సానుకూలత కంటే.. ప్రతికూల ధోరణే మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ధ్యానం ద్వారా పగటి కలలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
ప్రతిస్పందించే తీరులో మెదడుకూ ‘జెండర్’ భేదం.. ఆసక్తికర విషయాలు ఇవే..
విషయాలను అర్థం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రతిస్పందించే తీరులో మెదడుకూ లింగ భేదం (బ్రెయిన్ జెండర్) ఉందని తేలింది. విభిన్న రంగాలను, విషయాలను అర్థం చేసుకునే విషయంలో ‘జెండర్’ ప్రధాన అంశంగా ఉన్నట్టుగానే.. తాజాగా జరిగిన మెదడు అధ్యయనంపై కూడా ‘జెండర్’ ప్రధాన భూమిక ΄పోషిస్తోందని తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ‘జెండర్’ కేంద్రంగా జరిగిన తాజా అధ్యయనాలు మాత్రం విచిత్రంగానూ, కొంచెం విభిన్నంగానూ ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ కేజీ రాఘవేంద్రారెడ్డి: మనిషి మెదడు.. ఓ అంతుచిక్కని వ్యవహారం. మనిషి మొత్తం బరువులో కేవలం 2 శాతం బరువు ఉండే మెదడు మనిషి ఉపయోగించే మొత్తం ఆక్సిజన్‌లో ఏకంగా 20 శాతం ఉపయోగించుకుంటుంది. అంటే ఏ స్థాయిలో మెదడు పనిచేస్తుందో ఇది తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ మెదడును ఏ మేరకు అర్థం చేసుకున్నామని అడిగితే.. ‘మనం ఇంకా క్రిమికీటకాల మెదడునే అర్థం చేసుకోలేదు’ అని అలెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ క్రిస్టోఫ్ కోచ్ చెబుతున్నారు. వాస్తవానికి మనిషి మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి 100 ట్రిలియన్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. కానీ.. క్రిమికీటకాల మెదడులో కేవలం 302 సెల్స్ ఉంటాయి. అయినా పురుగు మెదడునే ఇంకా అధ్యయనం చేయలేక΄ోతున్నామని కోచ్ చెబుతున్నారంటే.. మనిషి మెదడును అధ్యయనం చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఊహించడానికి కూడా కష్టమే. కాగా, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తాజాగా నిర్వహించిన పరిశోధన కాస్త విభిన్నంగా సాగింది. ఇది మగ/ఆడ (జెండర్) మెదళ్ల మధ్య వ్యత్యాసాలను తేటతెల్లం చేసింది. భావోద్వేగ సంబంధాలకే ప్రాధాన్యం పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మరికొందరు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇందుకోసం అప్పుడే పుట్టిన పిల్లలు తమ మొదటి 24 గంటల సమయాన్ని ఎవరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయానికి వచ్చామని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందుకోసం మొబైల్ బొమ్మతో ΄పాటు కొద్దిమంది వ్యక్తులను ఎదురుగా ఉంచి.. అప్పుడే పుట్టిన 102 మంది పిల్లలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ బారన్, కోహెన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుట్టిన తర్వాత మొదటి 24 గంటల΄పాటు ఎంతసేపు మొబైల్ బొమ్మతోను, మనుషులతోను పిల్లలు సమయాన్ని వెచి్చస్తున్నారో తెలుసుకునేందుకు దీనిని చేపట్టారు. విచిత్రంగా మగపిల్లలు ఎక్కువగా మొబైల్ బొమ్మను చూడటంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆడ పిల్లలు మాత్రం ఎక్కువగా మనుషులవైపే తమ దృష్టిని ఎక్కువ సమయం కేంద్రీకరించడం గమనార్హం. అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు వస్తువులపైన, అమ్మాయిలకు బంధాలపై ఎక్కువ అటెన్షన్ ఉంటుందని తేల్చారు. అయితే, కేవలం ఈ ఒక్క అంశం ద్వారానే తుది నిర్ణయానికి రాలేమని మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జెండర్ అంశం కేంద్రంగా మెదడు అధ్యయనాలు జరగడం ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటాన్ని మాత్రం లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ ఆహా్వనించాల్సిందే. పురుషుల్లోనే భయం ఎక్కువ.. సహజంగా శారీరక దారుఢ్యం మహిళల కంటే పురుషులకే కాస్త ఎక్కువనేది తిరుగులేని వాస్తవం. ఇందుకు జన్యుపరమైన అంశాలతో ΄ాటు తరతరాలుగా జరిగిన పని విభజన కూడా ఒక కారణంగా చెబుతారు. కానీ.. మెదడు విషయానికి వస్తే శారీరక దారుఢ్యంతో΄ాటు మెదడు పరిమాణం కూడా స్త్రీలతో ΄ోలిస్తే మగవారిలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. లైజ్ ఎలియట్, అతని టీం సభ్యులు చేసిన అధ్యయనాల ప్రకారం.. పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే పరిమాణంలో 15 శాతం పెద్దగా ఉంటుందని తేలింది. ఇందుకు అనుగుణంగా అమిగ్డాలా (మనిషి భావోద్వేగంతో ముడిపడిన మెదడులోని ఒక భాగం) కూడా పరిమాణంలో పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లోని అమిగ్డాలాను స్త్రీలలోని అమిగ్డాలాతో ΄ోల్చి అధ్యయనం చేస్తే పురుషుల్లోనే ఎక్కువ భయం ఉంటుందని వీరి అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలోనే భావోద్వేగాలు అధికం పురుషులు, మహిళల్లో ఎవరికి ఎక్కువ భావోద్వేగం ఉంటుందనే అంశంపైనా పరిశోధనలు జరిగాయి. జీవితంలో జరిగిన ఏదైనా ఘటన లేదా సామాజికంగా బాగా గుర్తుండి΄ోయేలా జరిగిన బాధాకరమైన ఘటనలను గుర్తుచేస్తే ఏం జరుగుతుందో పరిశీలించారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే అటువంటి భావోద్వేగ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని తేలింది. పురుషులతో ΄ోలిస్తే ఆ సంఘటన తాలూకు వివరాలను స్త్రీలు వెంటనే గుర్తుతెచ్చుకోవడంతో ΄ాటు పురుషుల కంటే ఎక్కువగా ఆ ఘటనలకు సంబంధించిన విషయాలను కూడా పేర్కొనడాన్ని గమనించారు. మెదడుపై ‘జెండర్’ అధ్యయనాల్లో కొన్ని.. జెండర్ కేంద్రంగా ఇప్పటికే వివిధ పరిశోధనలు జరిగాయి. 1991లో మొదలైన ఈ అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. - మొదటిసారిగా 1991లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన డయాన్ హాల్పెర్న్ ‘సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ కాగి్నటివ్ ఎబిలిటీస్’ అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. - 1995లో స్టాండ్ఫర్డ్ ప్రొఫెసర్ నైరో షా... స్త్రీ, పురుషుల మెదళ్లపై అధ్యయనం చేశారు. - 2017లో జెండర్ కేంద్రంగా పలువురు రాసిన 70 ఆరి్టకల్స్తో కూడిన ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ రీసెర్చ్’ ప్రత్యేక సంచికను ్ర΄÷ఫెసర్ లారి కాహిల్ వెలువరించారు. - 2021లో బ్రిటన్‌లో 40 సంవత్సరాల వయసు పైబడిన 5 లక్షల మందికి చెందిన జెనటిక్, హెల్త్ డేటాపై ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన గినా రిప్పన్ అనే న్యూరో బయాలజిస్టు అధ్యయనం చేశారు. -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
పంజాబ్‌ను మించి ఏపీ.. నాబార్డు అధ్యయన నివేదిక ఏం చెప్పిందంటే?
సాక్షి, అమరావతి: గత దశాబ్ద కాలంలో దేశంలో వ్యవసాయ రుణాల పంపిణీ మూడు రెట్లు పెరిగినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. 2011–12లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల పంపిణీ రూ.5.11 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి మూడు రెట్లు పెరిగి రూ.15.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో 11.9 శాతం వృద్ధి నమోదైంది. పంజాబ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణ లభ్యత మెరుగ్గా ఉండటం గమనార్హం. నాబార్డు నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు.. ♦2011–12 నుంచి స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక టర్మ్ రుణాలు పెరిగాయి. 2017–18లో దీర్ఘకాలిక టర్మ్ రుణాల పంపిణీలో వృద్ధి 9.9 శాతం ఉండగా 2020–21 నాటికి 43.17 శాతానికిచేరింది. ♦వ్యవసాయ యాంత్రీకరణ, పంపు సెట్లు, నీటి పారుదల నిర్మాణాలు, తోటల అభివృద్ధి, ఫామ్ పాండ్లు, మైక్రో ఇరిగేషన్, పొలంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు తదితరాలకు నాబార్డు, బ్యాంకులు దీర్ఘకాలిక టర్మ్ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ♦బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి లభించినా బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయి. ♦దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయ రుణాల పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో హెక్టార్‌కు రుణ లభ్యత మెరుగ్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల హెక్టార్‌కు రుణ లభ్యత రూ.లక్ష లోపే ఉంది. ♦2019 – 20లో ఆంధ్రప్రదేశ్‌లో హెక్టార్‌కు రూ.1.29 లక్షలు, పంజాబ్‌లో రూ.లక్షకు పైగా రుణ లభ్యత ఉంది. ♦వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంలో కిసాన్ క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019 మార్చి 31 నాటికి 1,896 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరయ్యాయి. ♦2011–12లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు రూ.3.96 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి రూ.8.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక టర్మ్ రుణాలు ఇదే సమయంలో రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయి. -
5జీకి ఎక్కువ చెల్లించడానికైనా రెడీ
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ రెడీ స్మార్ట్ఫోన్లు ఉన్న 10 కోట్ల మందికి పైగా యూజర్లు అత్యంత వేగవంతమైన సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటి కోసం 45 శాతం వరకూ ఎక్కువ చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎరిక్సన్ కన్జూమర్ల్యాబ్ రూపొందించిన ’5జీ హామీ’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దీన్ని నిర్వహించారు. 5జీ సర్వీసులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (యూజరుపై సగటు ఆదాయం) ఆర్జించే అవకాశాలు దేశీయంగా టెల్కోలకు మరింత ఊతమివ్వగలవని నివేదిక పేర్కొంది. కంపెనీ లకు యూజర్లు కట్టుబడి ఉండాలంటే 5జీ నెట్వర్క్ పనితీరే కీలకంగా ఉంటుందని వివరించింది. సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఏ నెట్వర్క్ బాగుంటే దానికే మారిపోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది యూజర్లు తెలపడం ఇందుకు నిదర్శనం. మెరుగైన కవరేజీ కన్నా 5జీతో వినూత్నమైన కొత్త ఉపయోగాల గురించి ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం మంది పేర్కొన్నారు. ఇందుకోసం వారు ఆయా ప్లాన్ల కోసం 45 శాతం వరకూ ప్రీమియం చెల్లించేందు కైనా సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులో ఉన్న బ్రిటన్, అమెరికాలతో పోలిస్తే కొత్త సర్వీసులకు అప్‌గ్రేడ్ అవ్వాలని భావిస్తున్న వారి సంఖ్య భారత నగరాల్లో రెండింతలు ఎక్కువగా ఉంది. ► రెండేళ్లలో 5జీ హ్యాండ్సెట్ వినియోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 5జీ రెడీ ఫోన్లు ఉన్న 10 కోట్ల మంది పైగా యూజర్లు 2023లో 5జీ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే యోచనలో ఉన్నారు. వీరిలో సగం మంది వచ్చే 12 నెలల్లో మరింత ఎక్కువ డేటా ప్లాన్లకు మారాలని భావిస్తున్నారు. ► సేవల నాణ్యత, లభ్యతపై మరింతగా దృష్టి పెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు టెలికం సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదు. తొలినాళ్లలోనే 5జీ సేవలను ఎంచుకునే వారికి వినూత్నమైన అనుభూతిని అందించగలిగితే కంపెనీలు మరింతగా ఆర్జించే అవకాశాలు ఉంటాయి. -
మహిళా వ్యాపారవేత్తలకు బిజినెస్ లోన్స్ అంత ఈజీ కాదు!
న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎక్కువ మంది మహిళా పారిశ్రామికవేత్తలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ‘భారతీయ యువ శక్తి ట్రస్ట్’ (బీవైఎస్టీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దేశ రాజధాని ప్రాంతం, చెన్నై, పుణెకు చెందిన 450 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచు కున్నారు. బ్యాంకుల నుంచి కీలక ఆర్థిక సేవలను పొందడంలో తాము సమస్యలు ఎదుర్కొన్నట్టు 60 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా రుణాలు తీసుకునే విషయమై 85 శాతం మందికి సవాళ్లు ఎదురైనట్టు ఈ సర్వే వెల్లడించింది. బీవైఎస్టీ సహకారంతో వచ్చే రుణ దరఖాస్తులను ఆహ్వనించేందుకు ప్రభుత్వరంగ బ్యంకులు సముఖంగా ఉన్నట్టు.. మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. రుణ దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించే ముందు తమ నిపుణుల ప్యానెల్ మదింపు వేస్తుందని చెప్పారు. -
హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!
న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్‌కు అవరోధం కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్‌లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్‌కు కలిసొచ్చినట్టు వివరించింది. గృహ రుణాలకు డిమాండ్ ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్‌ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు. జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్ ఎస్టేట్ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది. 2022లో హౌసింగ్ బూమ్..! పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్‌పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్‌ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్‌ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం. పండుగల జోష్ అయితే పండుగల సీజన్ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్ పరిశ్రమ నిర్మాణాత్మక అప్‌సైకిల్ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. -
హైబ్రిడ్ వర్క్: ఐటీ దిగ్గజాలకు ఆ తలనొప్పి బాగా తగ్గిందట!
కాలిఫోర్నియా: వర్క్ ఫ్రం హోం పని విధానం అటు ఐటీ ఉద్యోగులకు, ఇటు ఐటీ సంస్థలకు బాగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే హైబ్రిడ్ వర్క్ కంపెనీలకు ఇతర ఉపయోగాలతోపాటు మరో ప్రయోజనం కలిగిందని తాజా అధ్యయనంలో తేలింది. పని విధానం రేటింగ్, ప్రమోషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడమేకాదు, ఐటీ దిగ్గజాలకు అట్రిషన్ (కంపెనీనుంచి మరో కంపెనికి తరలిపోవడం) అనే పెద్ద తలనొప్పినుంచి మూడోవంతు ఊరట లభించిందట. హైబ్రిడ్ పనివిధానంతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు 35 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ బ్లూమ్ ఆధ్వర్యంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొత్తంగా హైబ్రిడ్, లేదా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, సంస్థలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో హైలైట్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలబించాయి. ఆ తరువాత సడలింపులతో హైబ్రిడ్ వర్క్ పద్దతిని ఫాలో అవుతున్నాయి. సాధారణంగా ప్రతి వారం కార్యాలయంలో రెండు నుండి మూడు రోజులు పని చేయడం , మిగిలిన రోజుల్లో ఇంట్లోనుంచే పని చేయడం అన్నమాట. నిరుద్యోగం రేటు ఐదు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇంటి నుండి పని చేసే విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కొందరు కూడా ఉద్యోగులను ఆకర్షించడానికి వర్క్ ఫ్రం హోంను ఎంచు కున్నారుని స్టడీ వ్యాఖ్యానించింది. గ్లోబల్ ట్రావెల్ ఏజెంట్ Trip.comలో 2021, 2022లో 1,612 ఇంజనీర్లు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉద్యోగులపై ట్రయల్ స్టడీ చేసింది. ఇందులో భాగంగా బేసి డేట్స్‌లో జన్మించిన వారు బుధ, శుక్రవారాల్లో ఇంటి నుండి పని చేసేందుకు నిర్ణయించుకోగా, మరికొందరు పూర్తి సమయం కార్యాలయంలో పని చేశారు. ఈ అధ్యయనం సానుకూల ఫలితాలతో Trip.com మొత్తం కంపెనీకి హైబ్రిడ్ పనిని అందించిందని ఈ స్టడీ నివేదించింది. బ్లూమ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూబింగ్ హాన్ , జేమ్స్ లియాంగ్ సహ రచయితలుగా ఒక పేపర్‌ను పబ్లిష్ చేశారు. అట్రిషన్‌లో మెరుగుదలతో పాటు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ పేపర్ హైబ్రిడ్ ఏర్పాట్లు పని షెడ్యూల్లు ,అలవాట్లను ఎలా మారుస్తుందో కూడా హైలైట్ చేసింది. రిమోట్ రోజులలో తక్కువ గంటలు పని చేసినా కానీ వారాంతంతో సహా ఇతర రోజులలో పని గంటల సంఖ్యను పెంచారు. మొత్తంగా, ఉద్యోగులు ఇంటి రోజులలో దాదాపు 80 నిమిషాలు తక్కువ పనిచేశారు కానీ ఇతర పని దినాల్లో వారాంతంలో దాదాపు 30 నిమిషాలు ఎక్కువ పనిచేశారు. ఈ పనివిధానంతో వర్క్ రివ్యూ, ప్రమోషన్స్‌లో ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. మొత్తంగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఉత్పాదకతను నివేదించారు. ఆఫీసుల్లో పనిచేసినవారితో పోలిస్తే కోడ్ లైన్లలో 8 శాతం పెరుగుదల నమోదైందట. -
శాస్త్రీయ అధ్యయనంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేశాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ముందుకు సాగించింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీలోని ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేమిటి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? ఇలా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వాటి ఆధారంగా లోతైన అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల విభజన– ఆర్థిక అంశాలు, ఐటీ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై అధ్యయనం, మార్గదర్శకాల కోసం మరో నాలుగు సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అయ్యే వ్యయం, ఉద్యోగుల విభజన, దానికి సంబంధించిన విధివిధానాలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. మరో రెండు కమిటీలు ఇతర అంశాలపై నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైంది. జనాభా గణన అంశంతో జాప్యం అయితే కేంద్రం జనాభా గణన చేపడుతూ అది పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. కానీ కరోనా కారణంగా కేంద్రం జనాభా గణన చేపట్టలేదు. పలుమార్లు షెడ్యూల్‌ని ప్రకటించినా, కరోనా కారణంగా సాధ్యపడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత 2022 జూన్ వరకు జనాభా గణన చేపట్టలేమని, అప్పటి వరకు జిల్లాల హద్దులు మార్చడంపై నిషేధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను 2021 సంవత్సరం చివర్లో తిరిగి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలతో జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. సూచనలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో ప్రజల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి, అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ఈ కమిటీకి సూచించారు. సుమారు 17,500 సలహాలు, సూచనలు రావడంతో వాటిని 284 అంశాలుగా ఈ కమిటీ విభజించింది. ప్రతి అభ్యంతరం, పరిశీలనపై తొలుత సంబంధిత జిల్లా కలెక్టర్ సిఫారసు తీసుకుని, ఆ తర్వాత కమిటీ దాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని నమోదు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటులో పలు మార్పులు జరిగాయి. అంతిమంగా వాటన్నింటినీ రాష్ట్ర మంత్రివర్గానికి పంపి అక్కడ ఆమోదం తీసుకున్నాక ఉగాది రోజున తుది నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాల విభజన ప్రక్రియ అంతా పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండేలా ప్రభుత్వం అడుగడుగునా చర్యలు తీసుకుని.. అందుకనుగుణంగా ఆ పని పూర్తి చేసింది. -
Niti Aayog: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా టాప్ 5 రాష్ట్రాల సరసన చోటు సాధించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అధిగమించిన రాష్ట్రాల కోవలో నిలిచింది. దేశంలో అత్యధిక అక్రిడిటేషన్ కలిగిన జిల్లా, సబ్ డివిజన్ ఆసుపత్రులు ఏపీలోనే ఉన్నట్లు వెల్లడైంది. వ్యాధి నిరోధకత, టీకాల పంపిణీకి సంబంధించి రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ప్రసూతి సేవలు కూడా గణనీయంగా మెరుగయ్యాయి. చదవండి: 2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’ రాష్ట్రాల ఆరోగ్య సూచీ నాలుగో ఎడిషన్ 2019–20ను ‘ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేష్ సర్వాల్, ప్రపంచ బ్యాంక్ సీనియర్ హెల్త్ స్పెషలిస్ట్ షీనా చబ్రా సంయుక్తంగా దీన్ని విడుదల చేశారు. రాష్ట్రాల్లో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి 24 అంశాల్లో అధ్యయనం నిర్వహించి నివేదికను రూపొందించారు. ఏపీ మరింత మెరుగ్గా.. అన్ని అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గతంలో ఉన్న 68.88 సోర్క్‌ను మెరుగు పరుచుకుని ఈదఫా 69.95 స్కోర్‌తో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ 4వ ర్యాంక్ సాధించింది. తొలి మూడు ర్యాంకులు కేరళ, తమిళనాడు, తెలంగాణ (69.96 స్కోరు) దక్కించుకున్నాయి. ఆరోగ్య సూచీల కేటాయింపు 2017లో ప్రారంభమైంది. నాలుగు దఫాలుగా పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈసారి కేరళ 82.20 స్కోరు సాధించగా యూపీ 30.57 స్కోరు దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ 19వ ర్యాంక్‌తో చివరిలో నిలిచింది. నాలుగు అంశాల్లో సుస్థిర లక్ష్య సాధన శిశు మరణాలు, ఐదేళ్లలోపు మరణాల రేటు, ప్రసూతి మరణాల నిష్పత్తి, లింగ నిష్పత్తి.. ఈ నాలుగు అంశాల్లో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించింది. ఏపీలో లక్ష జననాలకు 70 కంటే తక్కువ మాతృ మరణాలు ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో 53.7 శాతం జిల్లా, సబ్ డివిజన్ ఆస్పత్రులకు అక్రిడిటేషన్ ఉన్నట్లు తేలింది. దేశంలో ఐదు రాష్ట్రాలు మాత్రమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించగా అందులో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. వ్యాధి నిరోధకత, టీకాల పంపిణీకి సంబంధించి 98.87 శాతంతో దేశంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఆపరేషన్ థియేటర్లలో ప్రసూతి సమయంలో సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు, కాన్పు జరిగిన మహిళలకు అందిస్తున్న సేవలు, మందులు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇచ్చే గుర్తింపు గతంలో ఒక్క జిల్లా ఆసుపత్రికి కూడా లభించకపోగా ప్రస్తుతం 7.96 శాతం ఆసుపత్రులకు ఉన్నట్లు వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1145 పీహెచ్సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకం, సుమారు 3 వేల సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం ఇందుకు దోహదపడింది. కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. -
ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదు
వాషింగ్టన్: ఆరుబయట కాకుండా ఆఫీస్, నివాస స్థలం వంటి ఇండోర్ ప్రాంతాల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘సస్టేనబుల్ సిటీస్, సొసైటీ’ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. వైరస్‌ని అడ్డుకోవాలంటే భౌతిక దూరం ఒక్కటే సరిపోదని, మాస్క్ ధరించడం, గదిలో ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. చదవండి: కరోనా ఎఫెక్ట్ నిల్.. అంటార్కిటికా కంటే పెద్ద హోల్, 2070 కూడా కష్టమేనా? నిర్దిష్ట ప్రాంతం గుండా ప్రయాణించే గాలి; వెలుగురు, గాలి వచ్చేందుకు ఉన్న వెంటిలేషన్ పరిస్థితులు; మాట్లాడినపుడు గాల్లోకి వెదజల్లబడే వైరస్ స్థాయి.. ఇలా మూడు ప్రాథమిక అంశాలపై పరిశోధకులు అధ్యయనం కొనసాగించారు. భవంతుల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వదిలే గాలి ద్వారా ఎంత స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే తెల్సుకునేందుకే అధ్యయనం చేసినట్లు యూఎస్‌లోని పెన్సిల్వే నియా వర్సిటీ విద్యార్థి జెన్ పీ చెప్పారు. చదవండి: క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు -
మీ రెజ్యూమ్ ఎందుకు సెలక్ట్ కావట్లేదో తెలుసా?
Automated Hiring Software: చాలామంది ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లను.. నౌకరీలాంటి జాబ్ పోర్టల్స్‌లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఫ్రొఫైల్ ఎంత ఘనంగా ఉన్నా.. ఉద్యోగాలకు పిలుపు మాత్రం అందదు. అదే టైంలో తమ కన్నా తక్కువ ప్రదర్శన ఉన్న వాళ్లకు మంచి మంచి కంపెనీలలో, మంచి హైక్‌లతో జాబ్‌లు వస్తుండడంతో తెగ ఫీలైపోతుంటారు. మరి సమస్య ఎక్కడ ఉంటోంది?.. ఈ సమస్య ఎక్కడో కాదు.. కంపెనీలు ఎంపిక చేసే విధానంలోనే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ కోసం కంపెనీలు హైరింగ్ డిపార్ట్మెంట్స్(లేదంటే హెచ్ఆర్ వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకుంటాయి కంపెనీలు. అయితే కరోనా ముందు వరకు ఈ విభాగాల్లో ఎక్కువ మంది పని చేసేవాళ్లు. ఆ తర్వాత నుంచి తీసివేతల కారణంగా.. ఆ విభాగాల్లోనూ ఉద్యోగులు తగ్గిపోయారు. దీంతో మిగిలిన ఉద్యోగులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ‘ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్’ను ఉపయోగించుకుంటున్నాయి చాలా కంపెనీలు. అవును.. ఈ సాఫ్ట్వేర్లు జాబ్ పోర్టల్స్ నుంచి తమ కంపెనీలకు కావాల్సిన ప్రొఫైల్స్‌ను స్కాన్ చేసి ఉద్యోగులను ఎంపిక చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. అర్హతలు ఉన్నా లక్షల మంది ఉద్యోగుల రెజ్యూమ్‌లు ఎంపిక కావడం లేదు. లెక్కగట్టి.. సీవీ(రెజ్యూమ్) స్కానింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉద్యోగుల సెలక్షన్ ప్రాసెస్‌లో తప్పనిసరిగా మారింది. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ పేరుతో అమెరికాలో 75 శాతం కంపెనీలు, భారత్‌లో సుమారు 65 శాతం కంపెనీలు(ఎక్కువగా ఎంఎన్‌సీలు) ఈ రకమైన పద్దతిని ఉపయోగిస్తున్నాయి. కొన్నిసార్లు మధ్యవర్తి కంపెనీలు(హైరింగ్ ప్రాసెస్ నిర్వహించే థర్డ్ పార్టీలు) కూడా ఇలాంటి సాఫ్ట్వేర్లను ఆశ్రయిస్తున్నాయి. ఇవి తమ పరిధిలోని ప్యాకేజీకి తగ్గట్లు ఉద్యోగుల్ని ఎంపిక చేస్తున్నాయి. ఈ ప్రాసెస్‌లోనే ప్యాకేజీకి తగ్గట్లు ప్రొఫైల్ లేకపోవడం, లేదంటే స్కానింగ్ పొరపాట్లు జరగడం వల్ల రెజ్యూమ్ తిరస్కరణకు గురవుతోంది. ఇలా అర్హత ఉన్నా.. మంచి ప్రొఫైల్ ఉన్నవాళ్లు ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ఇదీ జరుగుతున్న అసలు కథ. కిందటి ఏడాదితో పోలిస్తే.. ఇది ఈ ఏడాదిలో మరింతగా పెరిగిందట. లక్షల మంది ఈ టెక్నికల్ ప్రాసెస్ వల్ల మంచి ప్యాకేజీలకు దూరం అవుతుండడం గమనార్హం. హర్వార్డ్ బిజినెస్ లా నిర్వహించిన స్టడీలో పై సమాచారం వెల్లడైంది. ‘హిడెన్ వర్కర్స్: అన్టాప్డ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన స్టడీలో పాజిటివ్ కోణంలో ఉపయోగించాలనుకుంటున్న ఇలాంటి సాఫ్ట్వేర్లు.. ఉద్యోగుల పాలిట ఎలా శత్రువులుగా మారుతున్నాయో వివరంగా తెలియజేశారు. చదవండి: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా చేయొద్దు -
కరోనా: కాపాడాల్సిన ఎంజైమ్.. ప్రాణం మీదకు తెస్తోంది!
కరోనా బారినపడ్డ వారిలో చాలావరకు కోలుకున్నా కొందరు మాత్రం పరిస్థితి సీరియస్ అయి చనిపోయారు. పొద్దున్నే బాగున్నవారు కూడా సాయంత్రానికో, రాత్రికో కన్నుమూశారు. ఇలా కొద్దిగంటల్లోనే ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మన శరీరాన్ని కాపాడే ఓ ఎంజైమ్.. మనకు ప్రాణాపాయంగా మారుతోందని తేల్చారు. ఏమిటీ ఎంజైమ్, ఎందుకు ప్రమాదకరంగా మారుతోందన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ శత్రు కణాలను.. చంపడం కోసం.. మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను సంహరించడానికి విడుదలయ్యే ఎంజైమ్‌లలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్ ఫాస్ఫోలిపేస్ ఏ2 గ్రూప్ ఐఐఏ)’ ఎంజైమ్ చాలా కీలకం. ఇది మన రోగనిరోధక శక్తికి అనుబంధంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండి శరీరమంతా తిరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు కనిపిస్తే.. వాటిని చుట్టుముట్టి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. సాధారణంగా సూక్ష్మజీవుల పైపొర ప్రత్యేకమైన కొవ్వు పదార్థంతో కూడి ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆ పొర ఆధారంగానే గుర్తించి దాడి చేస్తుంది. మానవ కణాల్లోనూ ఈ కొవ్వుపదార్థం ఉంటుంది. కానీ పూర్తిగా ఉపరితలంపై ఉండదు. ఈ కొవ్వుపొరకుపైన ఇతర పదార్థాల పొర (త్వచం) ఉండి.. కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన కణాలపై దాడితోనే.. సాధారణంగా మన కణాలపై ఉన్న త్వచం ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మన శరీర కణాలు ఎంజైమ్ దాడికి గురవుతున్నాయి. అవయవాల్లో కణాలు నశించి, వాటి పనితీరు దెబ్బతింటోంది. ఇది మరణానికి దారితీస్తోంది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయినవారిపై, మృతులపై.. ఫ్లాయిడ్ చిల్టన్ నేతృత్వంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ గుట్టు విప్పారు. ఎంజైమ్ ఏం చేస్తుంది? తీవ్రంగా దెబ్బతినడం, గాయపడటం వంటివి జరిగినప్పుడు.. వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. మన శరీర కణాలు బలహీనం అవుతాయి. వాటి త్వచం దెబ్బతిని, లోపలి కొవ్వుపొరలు బహిర్గతం అవుతాయి. దీనితో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనవుతాయి. ఈ ఎంజైమ్ అలాంటి కణాలపై దాడిచేసి ముక్కలు చేస్తుంది. దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాల వల్ల.. ఇతర కణాలకు ప్రమాదం లేకుండా శరీరంలో ఉండే ఏర్పాటు ఇది. ఇక దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాలు.. వాటిలోని మైటోకాండ్రియా (కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగం)ను విడుదల చేస్తాయి. మైటోకాండ్రియాలు కొవ్వుపొరతో కూడుకుని వైరస్, బ్యాక్టీరియాను తలపించేలా ఉండటంతో.. ఎంజైమ్ వాటిపైనా దాడి చేసి ముక్కలు ముక్కలు చేస్తుంది. కరోనా సోకినప్పుడు ఏం జరుగుతోంది? సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా అయినా ఇన్ఫెక్షన్ కొంతమేరకే ఉంటుంది. ఆ సూక్ష్మజీవులను రోగనిరోధక శక్తి చంపేయడం, అవి సోకిన కణాలను ఎంజైమ్ నాశనం చేయడంతో శరీరంలో వాటి విస్తరణ ఆగిపోతుంది. బాధితులు సదరు వ్యాధి నుంచి కోలుకుంటారు. కానీ కరోనాలో మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంటోందని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ చెప్తున్నారు. కరోనా తీవ్రస్థాయిలో సోకినవారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందని.. ఊపిరితిత్తులు, కిడ్నీలు సహా చాలా అవయవాల్లో పెద్ద సంఖ్యలో కణాలు ఇన్ఫెక్ట్ అవుతున్నాయని వివరించారు. ఇలా ఇన్ఫెక్ట్ అయిన కణాలన్నీ కూడా ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనుకావడంతో సదరు అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ‘‘కణాలపై ఎంజైమ్ దాడి, రోగనిరోధకశక్తి విపరీత స్పందన, దాని వెంట ఇన్ఫ్లమేషన్ శరవేగంగా జ రుగుతాయి.అది మనం జారుడుబండపై జారుతూ పోతున్నట్టే. మనకు అర్థమయ్యేలోగానే చాలావే గంగా పరిస్థితిక్షీణిస్తుంది..’అని ఫ్లాయిడ్ తెలిపారు. 127 మంది.. వెయ్యి ఎంజైమ్, రసాయనాలు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 127 మందిని ఎంపిక చేశారు. అందులో కోవిడ్‌తో మరణించినవారు 30 మంది, ప్రాణాపాయస్థితికి వెళ్లి బయటపడ్డవారు మరో 30 మంది, మధ్యస్థాయి లక్షణాలున్న ఇంకో 30 మంది ఉండగా.. మిగతా 37 మంది కోవిడ్ సోకనివారు. రక్తంలో ఉండే వెయ్యి ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల స్థాయిలు, పనితీరు.. ఈ 127 మందిలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ కీలకమని గుర్తించారు. ఆరోగ్యవంతుల్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ స్థాయి లు ఒక్కో మి.మీ. రక్తంలో 10–20 నానోగ్రామ్‌ల వరకు ఉంటాయి. కానీ కరోనా మృతులు, సీరియస్ అయినవారిలో వెయ్యి నానోగ్రామ్లకుపైగా ఉన్నట్టు గుర్తించారు. ‘బ్లడ్ యూరియా నైట్రోజన్’ కూడా.. కరోనా మృతుల్లో ‘బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్)’ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. శరీరంలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థంగా ‘బీయూఎన్’ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు దీనిని రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపేస్తాయి. అయితే తీవ్రస్థాయి కరోనా సోకినవారిలో కిడ్నీలు వైరస్ దాడికి గురవుతున్నాయని.. ఇన్ఫెక్ట్ కణాలను ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ముక్క లు చేయడంతో కిడ్నీలు దెబ్బతింటున్నట్లు తేల్చారు. దీనివల్లే వారి రక్తంలో ‘బీయూఎన్’ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుజాగ్రత్తలు.. ఔషధాలకు లైన్‌క్లియర్ కరోనా సోకినవారిలో కొందరి పరిస్థితి వేగంగా విషమించి మరణించడానికి కారణమేంటో తేలినందున.. దీనికి ఔషధాలు రూపొందించడం సులువని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ తెలిపారు. అంతేకాదు.. కరోనా పేషెంట్ల రక్తంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్, మూత్రంలో ‘బీయూఎన్’ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా ఆరోగ్యం విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని వివరించారు. తగిన చికిత్స చేయడం ద్వారా పేషెంట్లను కాపాడుకోవచ్చని వెల్లడించారు. -
2080లో కరోనావైరస్ కంటే మరో తీవ్రమైన వైరస్ !
కరోనా లాంటి మరో మహమ్మారి రాబోతోందా? మళ్లీ ఎన్నేళ్లకి ప్రపంచ దేశాలపై ఇలాంటి వైరస్ కొమ్ములు విసురుతుంది ? పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టించే కోవిడ్–19లాంటి వ్యాధులు వందేళ్లకి ఒకసారి వస్తాయని ఇన్నాళ్లూ భావించాం. కానీ ఆ అంచనాలన్నీ తప్పయ్యే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. మరో 60 ఏళ్లలోనే ఇలాంటి మహమ్మారి ప్రజల్ని కాటేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో అత్యంత అరుదుగా సంభవించే ఇలాంటి వైరస్లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకు ఒక్కసారి కాదని , వచ్చే 60 ఏళ్లలో.. అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని హెచ్చరించారు. ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనం ఎలా చేశారు ?: ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్ మార్కో మరాని, ఆయన బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు. 400 ఏళ్లలో చికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా భవిష్యత్‌లో వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు. ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా, టైఫస్, స్పానిష్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడు వచ్చాయి ? ఎన్నేళ్లు మానవజాతిని పీడించాయి ? ఎంత తరచుగా ఇలాంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది ? వంటి వివరాలన్నీ సేకరించి దాని ఆధారంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పుపై అంచనాలు వేసినట్టుగా మార్కో మరాని వెల్లడించారు. సర్వసన్నద్ధంగా ఉండాలి ! భవిష్యత్‌లో పుట్టుకొచ్చే వైరస్‌లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సర్వసన్నద్ధంగా ఉండాలని అధ్యయనం రచయిత డాక్టర్ మార్కో మరాని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో.. వందేళ్లలో ఇలాంటి వరదలు చూశామని ఎవరైనా వ్యాఖ్యానిస్తే మళ్లీ అంతటి ఉధృతిలో వరద రావడానికి మరో 100 సంవత్సరాలు వేచి చూడాలని అర్థం కాదని ఇక అధ్యయనం సహ రచయిత అయిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త గార్బియల్ కాటుల్ అభిప్రాయపడ్డారు. వందేళ్ల లోపులో ఎప్పుడైనా అంటే వచ్చే సంవత్సరమైనా అలాంటి వరద ముంచెత్తుతుందని అన్వయించుకోవాలన్నారు. తరచూ ఎందుకు వైరస్లు పంజా విసురుతున్నాయో తెలుసుకోవడానికే ఈ గణాంకాలను సేకరించి అధ్యయనం చేశామని ఆయన వివరించారు. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ప్రపంచ దేశాలపై కోవిడ్–19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉంది అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్ కల్లోలాన్ని తమ జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్లు బయల్పడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్ ఉంది. 1918–1920 మధ్య 3 కోట్ల మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లూను మించిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి వ్యా«ధుల ముప్పు అధికం కావడానికి జనాభా పెరుగుదల, ఆహార విధానంలో మార్పులు, పర్యావరణం ధ్వంసం, వ్యాధి కారక జంతువులతో మనుషులు కలిసిమెలిసి తిరగడం వంటి కారణాలెన్నో ఉన్నాయి. -
కొవ్వు కరిగించే మందుతో కరోనా కట్టడి!
లండన్: రక్తంలో అసాధారణ స్థాయిలో ఉన్న కొవ్వు పదార్ధాలను తొలగించేందుకు వాడే ఒక మందు కరోనా వైరస్‌ను 70 శాతం వరకు కట్టడి చేస్తోందని తాజా అధ్యయనం తెలిపింది. యూకేలోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో కొవ్వు తగ్గించేందుకు వాడే ఫీనోఫైబ్రేట్ ఔషధం కోవిడ్19 వైరస్ ఇన్ఫెక్షన్ను బాగా తగ్గిస్తున్నట్లు తెలిసింది. వైరస్ వ్యాప్తిని కరోనా తీవ్ర ప్రభావాన్ని ఫీనో ఫైబ్రేట్ తగ్గిస్తున్నట్లు తేలిందని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎలిసా విసెంజి చెప్పారు. ఈ మందును రక్తంలో కొవ్వు తగ్గించేందుకు వాడతారు. నోటి ద్వారా తీసుకునే ఈ మందు ప్రపంచవ్యాప్తంగా చౌకగానే లభిస్తోందని, దీనివల్ల దుష్పరిణామాలు తక్కువేనని ఎలిసా చెప్పారు. కరోనాపై దీని వాడకానికి ముందు క్లీనికల్ ట్రయిల్స్ జరపాలని, ట్రయిల్స్‌లో సత్ఫలితాలు వస్తే అల్పాదాయ దేశాలకు వరంగా ఈ మందు మారుతుందని చెప్పారు. టీకా తీసుకోవడం కుదరని వారికి ఈ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రక్తంలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించేందుకు ఈ మందు వాడవచ్చని యూఎస్ ఎఫ్డీఏతోపాటు పలు దేశాల ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతినిచ్చాయి. మనిషి కణాల్లోకి కరోనా ప్రవేశాన్ని కల్పించే చర్యను ఈ ఔషధం సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. దీని ఆధారంగా కరోనాపై ఫీనోఫైబ్రేట్ ప్రభావాన్ని అధ్యయనం చేసే క్లీనికల్ ట్రయిల్స్ ప్రస్తుతం యూఎస్, ఇజ్రాయిల్‌లో జరుగుతున్నాయి. అలాగే డెల్టా వేరియంట్‌పై ఈ ఔషధ ప్రభావాన్ని గుర్తించేందుకు సైతం పరిశోధనలు జరుగుతున్నాయి. చదవండి : Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
కోవిడ్‌తో వచ్చే దీర్ఘకాలిక బాధలను ఇట్టే పసిగడతాయి...!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు లాంగ్ కోవిడ్-19 దీర్ఘకాలిక బాధలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ నుంచి విముక్తి పొందినా కూడా శ్వాస కోశ, ఇతర బాధలతో అనేక మంది సతమతమవుతున్నారు. తాజాగా కోవిడ్ -19తో వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించడంలో స్మార్ట్‌వాచ్స్ ఎంతగానో సహాయపడుతున్నాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను గుర్తించడంలో స్మార్ట్ వాచ్‌లు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఆపిల్ వాచ్, ఫిట్‌బిట్ స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఇతర స్మార్ట్‌వాచ్‌లు కోవిడ్ -19 దీర్ఘకాలిక ప్రభావాలను కచ్చితంగా గుర్తించగలవని ఓ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్‌వాచ్ ధరించడంతో హృదయ స్పందన రేట్లను, శరీర ఉష్ణోగ్రత, శారీరక శ్రమ వంటివి స్మార్ట్‌వాచ్‌లో రికార్డవడంతో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం సులువు అవుతుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయర్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో గణనీయమైన మార్పులను గుర్తించామని అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్-19 కోలుకున్న వ్యక్తుల్లో ప్రవర్తనా, శారీరక మార్పులను గమనించామని పరిశోధకులు తెలిపారు.అంతేకాకుండా కరోనా వైరస్ వారిని ఎంతగా ప్రభావం చేసిందనే విషయాన్ని గుర్తించడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రాబర్ట్ హిర్టెన్, ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వేరబుల్ నిపుణుడు పేర్కొన్నారు. డిజిటల్ ఎంగేజ్మెంట్ అండ్ ట్రాకింగ్ ఫర్ ఎర్లీ కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్ (DETECT) ట్రయల్ అందించిన డేటా ప్రకారం.. మార్చి 2020 నుంచి 2021 జనవరి వరకు ఫిట్బిట్లను, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగిస్తోన్న 37,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి.వారు ధరించిన స్మార్ట్ వాచ్ డేటాలను పరిశోధకులతో పంచుకున్నారు. ఈ డేటాలో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులకు అధిక హృదయ స్పందన రేటు ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. సాధారణం కంటే ఎక్కువ హృదయ స్పందన రేట్లను కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్న రెండు-మూడు నెలల తర్వాత చాలా మంది రోగులలో ఈ పరిస్థితి నెలకొంది. స్మార్ట్‌వాచ్ అందించే డేటాతో ముందుగానే రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. -
ఆవు కడుపులోని ఆ ద్రవాలతో ప్లాస్టిక్ భూతానికి చెక్!
తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్‌ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్‌లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్‌లు కూడా అలాంటివే. ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్‌లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్‌లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్‌లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. -
వామ్మో..! 20 వేల సంవత్సరాల క్రితమే కరోనా వైరస్....!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్‌తో ప్రతి దేశం ఇబ్బందిపడుతోంది. వైరస్ మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపివేసింది. భారత్ లాంటి దేశాలు ఇంకా కరోనా వైరస్‌తో పోరాటాన్నికొనసాగిస్తునే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా, సుమారు 39 లక్షల మందిని వైరస్ పొట్టనపెట్టుకుంది. కాగా కరోనా వైరస్‌పై ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమారు 20 వేల సంవత్సరాల క్రితమే తూర్పు ఆసియా ప్రాంతం కరోనా మహమ్మారిని ఎదుర్కొందని పరిశోధనలో తేల్చారు. సుమారు 26 దేశాలకు సంబంధించిన 25 వందల మానవుల డిఎన్ఏలను ఈ బృందం పరిశీలించింది. వారి పరిశోధనల ప్రకారం 20 వేల సంవత్సరాల క్రితమే ఈస్ట్ ఆసియా ప్రాంతాలు కరోనా వైరస్‌తో బాధపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఆసియా ప్రాంతాల్లోని వారి డిఎన్ఏలో కరోనా వైరస్ జాడలు కనిపించాయని వెల్లడించారు. ముఖ్యంగా తూర్పు ఆసియా ప్రాంతాల్లోని చైనా, వియత్నాం, జపాన్ వంటి దేశాల వ్యక్తుల జన్యువుల్లో వైరస్ గుర్తులను గుర్తించారు. ఈ పరిశోధనతో గతంలో మానవులు కరోనా వైరస్‌కు గురయ్యారనే విషయం బల్లగుద్ది చెప్పవచ్చునని తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ తీవ్రత ఏలా ఉంటుందంటే.. మానవ శరీరం నుంచి వైరస్ తొలగిపోయినా, మానవుని డిఎన్ఏలో కొంతమేరకు వైరస్ గుర్తులుంటాయని పేర్కొన్నారు. వైరస్లు మ్యూటేషన్లకు గురై.. కొత్త వేరియంట్లు పుడతాయని ఇది కేవలం వైరస్ ఇతర ప్రాణుల్లోకి వెళ్తేనే జరుగుతుందని అధ్యయన సహ రచయిత యాస్సిన్ సౌయిల్మి పేర్కొన్నారు. చదవండి: UFO Report; పెంటగాన్ ప్రకటన.. కొత్త పాయింట్లు ఉన్నాయన్న రీసెర్చర్లు -
ఇంట్లో మాస్కు ధరించకపోతే కరోనా రిస్కు
వాషింగ్టన్: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఆరుబయటి కంటే ఇంట్లో, ఆఫీసుల్లో, సమావేశపు గదుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని చెబు తున్నారు. మాస్కు ధరించకుండా ఇంట్లో ఇతరుల తో మాట్లాడితే సార్స్–కోవ్–2 వైరస్ ముప్పు ఎన్నోరెట్లు ఎక్కువగా పొంచి ఉంటుందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో (ఇన్డోర్) ఉన్నప్పుడు కూడా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా ఉత్తమమని వెల్లడయ్యింది. మాట్లాడుతునప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తుంటాయి. ఇందులో కంటికి కనిపించని వివిధ పరిమాణాల్లోని సూక్ష్మమైన వైరస్ రేణువులు ఉంటాయి. చిన్న పరిమాణంలోని రేణువులు గాలిలో ఎక్కువ సేపు ఉండలేవు. కాస్త పెద్ద పరిమాణంలోని వైరస్ డ్రాప్లెట్స్ జీవిత కాలం ఎక్కువేనని, ఇవి గాలిలో చెప్పుకోదగ్గ దూరం వరకూ త్వరగా వ్యాప్తి చెందుతా యని అధ్యయనంలో గుర్తించారు. మాట్లాడుతున్నప్పుడు నోటిలోంచి వెలువడే వైరస్ రేణువులు కొన్ని నిమిషాలపాటు గాల్లోనే ఎగురుతూ ఉంటాయని, పొగలాగే ఇవి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్, డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రతినిధి, అధ్యయనకర్త అడ్రియాన్ బాక్స్ చెప్పారు. భవనాల్లో(ఇండోర్) గాలి త్వరగా బయటకు వెళ్లదు కాబట్టి కరోనా రిస్కు అధికంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు. అమెరికాలో బార్లు, రెస్టారెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రాలు మారాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్నప్పుడు కచి్చతంగా మాస్కు ధరించాలని చెప్పారు. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా, బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే శుభవార్తే!
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులకు కోవిడ్ టీకాలు ఇస్తే అవి వారిలో సహజసిద్ధ వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరగడానికి దోహదపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు తీసుకున్న వారు భవిష్యత్‌లో దాడిచేసే ఇతర వేరియంట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలరని అధ్యయనం పేర్కొంది. గత ఏడాది కరోనా బారినపడి తర్వాత కోలుకున్న బాధితుల రక్త నమూనాల్లో యాంటీబాడీలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కొనుగొన్నట్లు అమెరికాలోని రాకీఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరిగాక సార్స్– కోవ్–2 వైరస్‌లను ఇమ్యూనిటీకి సంబంధించిన మెమొరీ బి–సెల్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పరిశోధకులు చెప్పారు. మానవ శరీరంపై దాడి చేసే వేర్వేరు రకాల వైరస్‌లను అంతమొందించేందుకు మన వ్యాధినిరోధక వ్యవస్థ తయారుచేసే వేర్వేరు రకాల యాంటీబాడీల నిధే మెమొరీ బి–సెల్స్. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ రికవరీ వ్యక్తుల్లో మరింత శక్తివంతమైన, ఎక్కువకాలం నిలిచే రక్షణవ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు. కనీసం ఒక డోస్ మోడెర్నా / ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు గణనీయంగా పెరిగాయన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో, బ్రిటన్‌లో, దక్షిణాఫ్రి కాలలో తొలిసారిగా కనుగొన్న వేర్వేరు వేరియంట్లనూ నాశనంచేసే యాంటీబాడీలు వీరిలో అభివృద్ధి చెందాయి. మెమొరీ బి–సెల్స్ వల్లే ఈ యాంటీబాడీల ఉత్పత్తిసాధ్యమైందని పరిశోధకులు చెప్పారు. ఇంతవరకు కరోనా బారినపడని వ్యక్తులకూ ప్రస్తుత డోస్‌లతోపాటు బూస్టర్ డోస్ ఇస్తే వారికి మరింత రక్షణ లభిస్తుందని అధ్యయనం సూచించింది. అయితే, ఈ అధ్యయనం ఫలితాల ఖచ్చితత్వాన్ని ఇదే రంగంలోని వేరే సంస్థలకు చెందిన నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది. -
Survey: కోవిడ్‌తో ధనికులు, పేదల నడుమ పెరిగిన అంతరాలు
కరోనా పేదల జీవితాల్లో కల్లోలం రేపింది. వారి బతుకులను ఆగమాగం చేసింది. కరోనా కట్టడికిగాను గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వారిని అగాధంలోకి నెట్టింది. దీని మూలంగా పేదలు, ధనికుల నడుమ సామాజిక, ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయి. లాక్డౌన్, తదనంతర పరిస్థితులపై అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఇటీవల ’కోవిడ్ 19– జీవన ప్రమాణాలు’అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఇలాంటి అంశాలు వెల్లడయ్యాయి. తాజాగా విడుదలైన ఈ సర్వే నివేదిక ప్రకారం.. కరోనా సంక్షోభంతో దేశంలో శ్రామికవర్గం ఆదా యం గణనీయంగా తగ్గడంతో అకస్మాత్తుగా పేదరికం పెరిగింది. లాక్డౌన్ వలన దేశవ్యాప్తంగా పది కోట్లమంది ఉపాధి కోల్పోగా, 2020 జూన్ చివరి నాటికి సుమారు కోటిన్నర మంది గతంలో తాము చేసిన పనులకు దూరంగా ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు 2020 జనవరి నాటికి కుటుంబ తలసరి ఆదాయం సగటున రూ.5,989 ఉండగా, అక్టోబర్ నాటికి రూ.4,979కి పడిపోయింది. లాక్డౌన్ మూలంగా ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించి చాలామంది ఆదాయాన్ని కోల్పోయారు. – సాక్షి, హైదరాబాద్ యువత, మహిళలపైనే ఎక్కువ ప్రభావం భద్రత ఉన్న ఉద్యోగాలను కోల్పోయిన వారిలో మహిళలతోపాటు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతే ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌కు ముందు క్రమం తప్పకుండా వేతనాలు పొందిన వారిలో సగం మంది ఆ తర్వాత అసంఘటిత రంగంలో చేరారు. లాక్‌డౌన్‌కు ముందు ఉద్యోగ భద్రతతోపాటు క్రమం తప్పకుండా వేతనాలు పొందినవారిలో 30 శాతం మంది లాక్డౌన్ తర్వాత స్వయం ఉపాధి వెతుక్కోగా, మరో 9 శాతం మంది నామమాత్ర వేతనం లభించే ఉద్యోగాల్లో చేరారు. పూర్తిగా ఆదాయం కోల్పోయిన పేదలు గత ఏడాది ఏప్రిల్, మే నెలలో 20 శాతం నిరుపేదలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారు. గత ఏడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు ఎనిమిది నెలల కాలంలో మధ్య తరగతివారు రెండు నెలల వేతనం నష్టపోగా, ధనికులు తమ ఆదాయంలో పావు వంతును కోల్పోయారు. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే కనీస వేతనాలు (రోజుకు రూ.375) కంటే తక్కువగా పొందే వారి సంఖ్య లాక్డౌన్ తర్వాత 23 కోట్లకు చేరింది. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం పేదరికం పెరిగేందుకు దారి తీశాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే లబ్ధి.. లాక్డౌన్ సమయంలో జన్‌ధన్ ఖాతాల కంటే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారానే ఎక్కువ మందికి లబ్ధి జరిగింది. 90% కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, 50% కుటుంబాల్లోని మహిళల పేరు మీద మాత్రమే జన్‌ధన్ ఖాతాలున్నాయి. లాక్డౌన్ లో వీరిలో 77% కుటుంబాలకు పీడీఎస్ బియ్యం, 49% కుటుంబాలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ జరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ నివేదిక సూచిం చింది. 2021 జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ, ఈజీఎస్ పనిదినాలు 150 రోజులకు పెంపు, ఈజీ ఎస్ వేతనాల పెంపు, వృద్ధాప్య పింఛన్లలో కేంద్రం వాటా రూ.500కు పెంపు, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు 6 నెలలకు అదనంగా రూ. 30 వేలు చెల్లింపు వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అధ్యయన నివేదిక ప్రధానాంశాలు.. 66% మంది లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయారు. 64% మంది ఆదాయాల్లో మార్పు చోటుచేసుకుంది.. 77% కుటుంబాలు గతంలో కంటే తిండిపై చేసే ఖర్చును తగ్గించాయి.. 47% కుటుంబాలకు వారానికి సరిపడా సరుకులు కొనే శక్తి లేదు.. 87% పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేవారు, లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయారు 88% పట్టణ ప్రాంత కుటుంబాలకు తరువాతి నెల అద్దె చెల్లించే పరిస్థితి లేదు... 81% వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయారు -
ఐటీ కంపెనీలకు తాజా సవాల్ ఏంటంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత పరిస్థితి. డీల్స్ స్థాయితో సిబ్బంది నైపుణ్యతను పోలిస్తే అసమతుల్యత ఏర్పడుతోంది. అట్రిషన్ కోవిడ్ ముందస్తు స్థాయికి 17-20 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. సిబ్బంది ఉద్యోగాలు మారుతుండడమే ఇందుకు కారణం. మహమ్మారి నేపథ్యంలో ఆధునీకరణ, డిజిటల్ వైపు మార్కెట్ దూసుకెళ్తుండడంతో కంపెనీల వ్యయాలు పెరిగాయి. కోవిడ్ కారణంగా మందగించిన డిమాండ్‌ను అందుకోవడానికి సంస్థలు మరింత విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్ నైపుణ్యాలు ఉన్న మానవ వనరుల కొరత యూఎస్, ఈయూతోపాటు ఇటీవల భారత్‌లోనూ చూస్తున్నట్టు రిసర్చ్ కంపెనీ ఎవరెస్ట్ గ్రూప్ చెబుతోంది. నిపుణుల వేట మొదలైంది.. కోవిడ్ సమయంలో సేవా సంస్థలు ఫ్రెషర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగుల కోతల కారణంగా కొరత మరింత తీవ్రంగా మారింది. అయితే ఉద్యోగులకు నైపుణ్య శిక్షణపై ఐటీ కంపెనీలు ఇప్పటికే దృష్టిసారించాయి. సిబ్బందిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేట మొదలు పెట్టాయి. రానున్న రోజుల్లో డిజిటల్ నైపుణ్యాలతోపాటు ఇతర విభాగాల్లోనూ కొరత ఏర్పడుతుందని ఎవరెస్ట్ గ్రూప్ సీఈవో పీటర్ బెండోర్ సామ్యూల్ తెలిపారు. కొద్ది రోజుల్లో డిజిటల్ విభాగంలో అట్రిషన్ 7–8 శాతం ఉండొచ్చని టీమ్‌లీజ్ అంటోంది. నియామకాలు 15–16 శాతముంటాయని జోస్యం చెబుతోంది. భారీ డీల్స్ చేతుల్లోకి రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా నిపుణులు ఉండడం కంపెనీల పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి: అక్టోబరు నుంచి నియామకాలు పెరిగాయి. రిక్రూట్మెంట్ అంత క్రితంతో పోలిస్తే తక్కువే. ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రం గతంలో లేనంతగా ఉంది. అయితే ఇది స్థిరమైన విధానం కాదని అందరూ గుర్తించారని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్త వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు వ్యాపారం తిరిగి పుంజుకుంటుండడంతో ప్రస్తుత, రాబోయే ప్రాజెక్టుల కోసం ప్రతి కంపెనీ నియామకాలను చేపట్టాలని చూస్తున్నాయి. దీంతో నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడతాయి. ప్రధానంగా డిజిటల్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. డిజిటల్ నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ ఉంది. ఉత్తమ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మార్చి త్రైమాసికంలో అట్రిషన్ పెరుగుతుంది’ అని వివరించారు. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్స్ ఉన్న 500 మందిని రెండేళ్లలో నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. నైపుణ్యం పొందేందుకు మార్కెట్లో వనరులు ఉన్నాయని ఎడ్వెన్సాఫ్ట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి రామ్మూర్తి రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిదేనని అన్నారు. బలమైన వృద్ధి వైపు మార్కెట్: ఐటీ సేవల కంపెనీల 3వ త్రైమాసికం ఫలితాలతో తక్కువ వృద్ధి నుంచి రికవరీ అయిన సంకేతాలు కనపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో తదితర సంస్థలు పెద్ద డీల్స్‌ను అందుకునే పనిలో ఉన్నాయి. యాక్సెంచర్ గణాంకాలు, ముందున్న డీల్స్ వెరశి 2021–22లో బలమైన వృద్ధి ఉండొచ్చని మార్కెట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జీతాల పెంపుపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. 2021–22 సంవత్సరా నికి వేతనాలు పెంపును ఇప్పటికే టీసీఎస్ ప్రకటించింది. ఆరు నెలల్లో ఇది రెండవసారి కావడం గమనార్హం. ఉత్తమ పనితీరు కనబరిచేవారు సంస్థలో కొనసాగేలా కాగ్నిజెంట్ ప్రత్యేక బోనస్ ఇస్తోంది. ఒక వారం వేతనానికి సమానమైన బోనస్‌ను యాక్సెంచర్ ఆఫర్ చేసింది. -
గబ్బిలాల నుంచి కరోనా: చాలా తక్కువ మార్పులతో..
లండన్: కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనాన్ని పీఎల్ఓఎస్ బయోలజీ జర్నల్ ప్రచురించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కలిగించే సార్స్-కోవ్-2 వైరస్‌లో కూడా అనేక జన్యు రూపాలు ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాపించడం కంటే 11 నెలల ముందే సార్స్-కోవ్-2 వైరస్ ప్రత్యేక జన్యు రూపాన్ని గుర్తించినట్లు తెలిపారు. డీ614జీ మ్యూటేషన్ వైరస్‌లోని మార్పులను ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మిగతా వైరస్ వలే సార్స్-కోవ్-2 వైరస్ కూడా కొన్ని మార్పులతో వ్యాపిస్తుందని స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్ వైరస్ రీసెర్చ్ శాస్త్రవేత్త ఆస్కార్ మాక్లీన్ తెలిపారు. కానీ, ఈ వైరస్ వ్యాప్తి చెందే విధానంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో దాని లక్షణాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని, సార్స్-కోవ్-2 వైరస్ కూడా అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్‌లోని టెంపుల్ యూనీవర్సీటి రచయిత సెర్గిపోండ్ తెలిపారు. సార్స్-కోవ్-2 వైరస్ మానవులకు సోకే సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే ఈ వైరస్ లక్షణాలు ముందుగా గబ్బిలాల్లో అభివృద్ధి చెందుతాయిని ఈ అధ్యయనంలో తెలిపారు. ఇది ప్రధానంగా మానవునిలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. అయితే దేశంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అభివృద్ది చేసి ప్రజలకు అందించాలని గ్లాస్గో యూనివర్సీటి పరిశోధకుడు డేవిడ్ ఎల్ రాబర్గ్సస్ పేర్కొన్నారు. చదవండి: పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి.. -
ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే..
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు జీవరాశులే కాదు ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు విశ్వరూపం దాల్చి భూమి కూడా ఆవిరైపోతుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ స్టడీ మాత్రం జీవరాశులకు అంత టైంలేదని అంటోంది ఉన్నది కేవలం వంద కోట్ల ఏళ్లే అని హెచ్చరిస్తోంది! హమ్మయ్య.. వందకోట్ల ఏళ్లు ఉంది కదా.. ఫర్వాలేదులే అనుకుంటున్నారా? మరి ఇదంతా ఎలా జరగబోతోందనేది తెలుసా?.. విశ్వంలోని అన్ని గ్రహాలతో పోలిస్తే భూమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మనం బతికి ఉండటానికి అత్యవసరమైన ఆక్సిజన్ వాయువుతో కూడిన వాతావరణమే. గాలిలో ఆక్సిజన్ ఉండేది 20 శాతమే అయినా.. అది లేకుంటే ప్రాణకోటి మనుగడ సాగించలేదు. అలాంటి ఆక్సిజన్ పరిస్థితిపై జార్జియా టెక్, టోహో యూనివర్సిటీలు సంయుక్తంగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. భూమ్మీది ఆక్సిజన్ వంద కోట్ల ఏళ్లలో మాయమైపోతుంది. ఈ శాస్త్రవేత్తలు భూవాతావరణం, జీవ, భౌగోళిక పరిస్థితులన్నింటినీ సిమ్యులేట్ చేసి భూమి భవిష్యత్తును చూసే ప్రయత్నం చేశారు. సూర్యుడి వెలుగులో వచ్చే మార్పులు.. గాల్లోంచి నీటిలోకి, ఆ తరువాత రాయిలోకి చేరే క్రమంలో ఆక్సిజన్‌లో వచ్చే మార్పులు వంటివి పరిశీలించి ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాల్లో కొన్నింటిపై ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిగినా.. తాజా పరిశోధన మరింత స్పష్టంగా జరిగింది, సంక్లిష్టమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. మొత్తంగా సుమారు 110 కోట్ల ఏళ్ల తరువాత భూ వాతావరణంలోని ఆక్సిజన్ శరవేగంగా తగ్గిపోవడం మొదలవుతుందీ అని శాస్త్రవేత్తలు తేల్చారు. వయసు పెరుగుతున్న కొద్దీ సూర్యుడిలోని ఇంధనం ఖర్చవడం ఎక్కువై, ప్రకాశం పెరిగిపోవడం దీనికి కారణమవుతుందని అంచనా వేశారు. భూ ఉపరితలం బాగా వేడెక్కి, వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ముక్కలు చేస్తుందని, దానివల్ల భూమ్మీద పచ్చదనం అన్నది లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. పచ్చదనం లేకుంటే మొక్కలు, చెట్లు వదిలే ఆక్సిజన్ తగ్గిపోతుందని గుర్తు చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే.. భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతుండగా.. దాదాపు 240 కోట్ల ఏళ్ల క్రితమే వాతావరణంలోకి ఆక్సిజన్ వచ్చి చేరింది. మొక్కల మాదిరిగా అప్పట్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు కిరణ జన్య సంయోగ క్రియ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేశాయని.. తరువాత మొక్కలు పుట్టుకొచ్చి వాతావరణంలో ప్రాణవాయువు మోతాదు పెరిగిందని అంచనా. ఆక్సిజన్ పెరిగిన తర్వాతే ఏకకణ జీవుల స్థానంలో బహుకణ జీవులు, తర్వాత ఇతర ప్రాణులు ఆవిర్భవించాయి. సౌర కుటుంబానికి ఆవల జీవం ఆనవాళ్లు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. సూర్యుడి లాంటి నక్షత్రం నుంచి తగినంత దూరంలో (మరీ చల్లగాగానీ.. మరీ వేడిగా కానీ లేని) ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. ఈ సమయంలో పలు కీలక అంశాలను పరిశీలించాలని తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆక్సిజన్ మొత్తం నశించిన తర్వాత వాతావరణంలో పేరుకుపోయే మిథేన్ వాయువు కీలక ఆధారాల్లో ఒకటని అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. శనిగ్రహానికి ఉన్న ఉపగ్రహం టైటాన్లో ఇప్పుడు కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ లెక్కన అక్కడ ఎప్పుడో ప్రాణికోటి ఉండే ఉంటుందన్న అంచనాలూ ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త చెబుతున్న దాని ప్రకారం సగం సిగరెట్ కూడా చాలా ప్రమాదకారి అంటున్నారామె. ఆ అధ్యయనవేత్త ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అసలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు పఫ్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్నర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. -
వీస్కీ టేస్ట్ వెనుక ఏముందంటే?
విస్కీ బ్రాండ్లు పలురకాలు. వాటిలో ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఇష్టం. ఎందుకంటే వాటి ఫ్లేవర్లు దానికి కారణం. అసలు విస్కీకి ఫ్లేవర్ ఎలా వస్తుంది. దానిని గుర్తించడానికి ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డస్టిన్ హెర్బ్ నేతృత్వంలోని బృందం పలు అధ్యయనాలు చేసింది. వాటిల్లో తెలిసిందేమిటంటే.. విస్కీని తయారు చేయడానికి ఉపయోగించే బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లేవర్ మార్పులు సంభవిస్తాయని. ఈ కారణంగానే వైన్‌లాగా విస్కీలో కూడా రుచులు మారతాయని. అయితే విస్కీ రుచుల్లో తేడా కనుగొనడానికి వాతావరణ పరిస్థితులపై చేసిన ఈ అధ్యయనమే తొలిదని చెబుతున్నారు. ఈ విషయంపై డస్టిన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చాలా పెద్ద పరిశోధన అవసరం. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే అంకిత భావం కూడా అవసరం. బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విస్కీ రుచుల్లో తేడా వస్తుందని మా పరిశోధనల్లో తేలింది’’ అని చెప్పారు. ఎలా కనుగొన్నారు.? పరిశోధన బృందం ముందు బీర్లు తయారీకి ఉపయోగించే బార్లీ, వాటి ఫ్లేవర్లపై పరిశోధనలు చేశారు. బార్లీలో రకాలను బట్టి బీర్ల ఫ్లేవర్లలో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఇదే సూత్రం విస్కీకి కూడా వర్తిస్తుందా అనే కోణంలో ఆలోచించారు. దీంతో ఐర్లాండ్‌లోని రెండు కమర్షియల్ బార్లీ వెరైటీలైన ఒలంపస్, లారియేట్లపై పరిశోధనలు ప్రారంభించారు. బన్క్లోడీ అనే తీర ప్రాంతంలో పండించే ఒక వెరైటీని, అతీ అనే మైదాన ప్రాంతంలో పండించే మరో వెరైటీని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయి. అలాగే మట్టిలో కూడా తేడా స్పష్టంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో వీటిని మాల్ట్లా మార్చారు. బార్లీ మాల్ట్ డిస్టిల్డ్ అయిన తర్వాత దానిని ‘న్యూ మేక్ స్పిరిట్’ అంటారు. ఈ స్పిరిట్‌ను మూడేళ్లు చెక్క పీపాలో ఉంచాక అది విస్కీగా మారుతుంది. వివిధ పరిశోధనల ద్వారా స్పిరిట్లోని ఫ్లేవర్లును వర్గీకరించారు. బార్లీ పండించిన ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు విస్కీ అరోమాకు కారణంగా గుర్తించారు. అతీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి తీయని, పుల్లని, తృణ ధాన్యాల వాసనతో కూడిన అరోమా రాగా, బన్క్లోడీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి ఎండు ఫలాల వాసనతో కూడిన అరోమా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. విస్కీని వాసన చూసి ప్లేవర్లు చెప్పే నిపుణుల ప్రకారం సాధారణ ఫ్లేవర్లు ఇవీ వైనీ, ఫీన్టీ, సల్ఫరి, వుడీ, సిరియల్, ఫ్రూటీ ఫ్లోరల్, పీటీ -
వారిలోనే అధిక రక్తపోటు..
సాక్షి, అమరావతి: కార్యాలయాల్లో సాధారణ పని గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో అధిక రక్తపోటు (హైబీపీ) ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. తమకు హైబీపీ ఉన్న విషయం, దానివల్ల కలిగే అనర్థాలను వీరు కనిపెట్టలేరని ఆ అధ్యయనంలో స్పష్టమైంది. బీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏదో తెలియని ఇబ్బంది అనిపించి వైద్యులకు చూపించుకున్నా.. ఇలాంటి వారిలో హైబీపీ ఉన్న విషయం అంత సులభంగా బయటపడటం లేదు. వారానికి 49 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ►కెనడియన్ పరిశోధనా బృందం భారతదేశం తోపాటు వివిధ దేశాల్లో దీనిపై అధ్యయనం జరిపింది. ►వారానికి 35 గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే.. 49 కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 70 శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది. ►వీరిలో పెరిగిన రక్తపోటు రీడింగ్‌లను తెలుసుకోవడం కష్టమవుతుందని, అందువల్ల వారికి రక్తపోటు లేదనే అభిప్రాయం కలుగుతోందని అధ్యయనం తేల్చింది. ►శరీరంలో మార్పులు తీవ్రమైన తర్వాత ఒకేసారి ఇది బయటపడుతుందని గుర్తించింది. అది ముసుగు రక్తపోటు ►ప్రతి వారం 41 నుంచి 48 గంటలు పనిచేసే వ్యక్తులు తెలియని రక్తపోటు (ముసుగు రక్తపోటు) బారిన పడటానికి 54 శాతం ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో స్పష్టమైంది. ►ఉద్యోగుల్లో తెలియని విధంగా ఉండే రక్తపోటు వల్ల వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ►ఈ అధ్యయనంలో ఉద్యోగులను బృందాలుగా విభజించి కొన్నేళ్లపాటు పదేపదే పరీక్షలు జరిపారు. ►ఎక్కువ పని గంటలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఉద్యోగులు చాలామందికి ముందే తెలుసని అధ్యయనంలో తేలింది. ►అయితే దీన్ని నియంత్రించుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉండడం లేదని గుర్తించారు. -
ఆరు రెట్లు అధికంగా కరోనా వైరస్ వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా అతలకుతలం చేస్తూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన వాస్తవ సంఖ్య కంటే ఆరు రెట్లు అధికంగా సంక్రమిస్తుందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ), మెల్బోర్న్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం, 15 దేశాలలో మార్చి 2020 నుంచి ఆగస్టు 2020 మధ్య కరోనా వైరస్ వ్యాప్తి నివేదించిన కేసుల కంటే సగటున 6.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’లో ప్రచురించారు. ఇది యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రేటు నివేదించిన దానికంటే చాలా ఎక్కువ. ఇటలీ విషయంలో 17 రెట్లు ఎక్కువని తెలిసింది. డేటా ప్రకారం, 15 దేశాలలో ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఆస్ట్రేలియాల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే వ్యాధి వ్యాప్తి రేటు ఆగస్టు చివరిలో అధికారికంగా నివేదించిన దానికంటే ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పీటీఐ తెలిపింది. 800 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 11 యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలో వాస్తవ సంఖ్య కంటే వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో పరిశోధకులు అంచనా వేశారు. (చదవండి: కోవిషీల్డ్‌తో మెరుగైన ఫలితాలు) ధ్రువీకరించబడిన కేసుల కంటే అధికం... ‘అనేక దేశాలలో ధ్రువీకరించబడిన కేసుల కంటే కోవిడ్-19 వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిని నియంత్రించడంలో, వ్యాప్తి సంభావ్యత రెండింటికీ అడ్డుగా మారింది. ఉదాహరణకు, ఒక విశ్లేషణలో 5.4 మిలియన్లకు పైగా జనాభా ఉన్నా యూకేలో సుమారు 8 శాతం జనాభాకు కరోనావైరస్ సంక్రమించింద’ని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ క్వెంటిన్ గ్రాఫ్టన్ తెలిపిన విషయాన్ని పిటిఐ వెల్లడించింది. ‘ఈ పరిశోధనలు కరోనావైరస్ మహమ్మారిపై మనం ఎలా వ్యవహరించాం, ప్రస్తుతం కరోనా బారినపడే వ్యక్తుల అనారోగ్యం, జీవితకాలంలో వారి ఆరోగ్యంపై ఏర్పడే ప్రభావాలతో పాటు, లాక్డౌన్లను ఎలా అమలు చేశాం, ఉపయోగించుకున్నాం. ఈ మహమ్మారిని నియంత్రించడంలో ఎంతవరకు ముందున్నామ’నే విషయాలను తెలుపుతుందని గ్రాఫ్టన్ చెప్పారు. కరోనావైరస్ మరణాలను పరిశీలించేందుకు "బ్యాక్కాస్టింగ్" అనే ప్రక్రియను పరిశోధకులు ఉపయోగించారు. దీనిని వ్యాధి వ్యాప్తి నుంచి లక్షణాల వరకు, వ్యాధి లక్షణాల నుంచి మరణం వరకు ఉన్న సమయంతో పోల్చారు. ఈ ప్రక్రియతో వ్యాధి వ్యాప్తి రేటును సుమారు 95 శాతం వరకు కచ్చితంగా నిర్థారించినట్టు గ్రాఫ్టన్ తెలిపారు. "సరళంగా చెప్పాలంటే, ఒక దేశంలో కోవిడ్-19తో ఎంత మంది మరణించారనే దానిపై మేము గణాంకాలను విశ్లేషించాం. ఎంత మందికి వ్యాధి సోకి చనిపోయారో అనే విషయాన్ని గత వివరాలు ఆధారంగా కనుగొన్నాం. కరోనా మరణాల సంఖ్యపై, వాస్తవ వ్యాప్తి రేటును అంచనా వేయడానికి సులభమైన పద్ధతి ఇద"ని ఇకిగై రీసెర్చ్ స్టీవెన్ ఫిప్స్ ను పీటీఐ ఉటంకించింది. -
డెమోక్రసీ పట్ల పడిపోయిన విశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల యువతకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. తాజాగా ప్రపంచంలోని 160 దేశాల నుంచి 35 ఏళ్ల లోపు యువత నుంచి అభిప్రాయాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేకరించగా కేవలం 48 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. 1990, 2000 దశకాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై మూడింట రెండు వంతుల మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి శాతం యాభైకన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల 62 శాతం యువత విశ్వాసం వ్యక్తం చేయగా ఇప్పుడు కేవలం 48 శాతం యువత మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 54 శాతం ఉండగా, అది 1950వ దశకానిని 57 శాతానికి పెరిగింది. 1990, రెండువేల సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరం భారీగా పెరగడంతో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 62 శాతానికి పెరిగింది. అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో మే 25వ తేదీన ఓ నల్లజాతీయుడు, ఓ తెల్లజాతి పోలీసు చేతిలో చనిపోవడం, ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ సిటీలో ప్రజా ఉద్యమంలో భాగంగా జూన్ ఏడవ తేదీన ఎడ్వర్డ్ కొలస్టన్ విగ్రహాన్ని విధ్వసం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో యువతలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. 160 దేశాల నుంచి 50 లక్షల మంది యువతను శాంపిల్‌గా తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది. -
బతకలేం, తిరిగి పనిలోకి వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగొచ్చేందుకు వలసకార్మికులు సంసిద్ధులవుతున్నారు. వివిధ రాష్ట్రా ల్లోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసిన చోట్లకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్నిరోజుల పాటు అనేక కష్టాలు ఎదుర్కొని వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకున్న సం గతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక కోటి 4 లక్షల మంది వలసకార్మికులు తమ ఊళ్లకు చేరుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది. తాము పనిచేస్తున్న చోట్ల ఉపాధి దొరకక, ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను పోషించలేక, ఇళ్ల అద్దెలు కట్టలేక సొంత గ్రామాలకు వెళ్లిపోయినవారికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు పనిదొరకక, ఇంకా కొందరికి సరైన పనులు లభించక లాక్డౌన్ సమయంలోనే 94% ఆదాయాలు తగ్గిపోయినట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో దాదాపు 70% వలసకార్మికులు తిరిగి పాత పనిప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తల ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్ వర్కర్స్: ఏ స్టడీ ఆన్ దెర్ లైవ్లీహుడ్ ఆఫ్టర్ రివర్స్ మైగ్రేషన్ డ్యూటు లాక్డౌన్’శీర్షికతో నిర్వహించిన ఇన్ఫెరెన్షియల్ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనంలో ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఫౌండేషన్‌ను నేషనల్ శాంపిల్‌సర్వే ఆఫీస్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బి.బి.సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ ఆర్థిక సలహాదారు ఎన్కే సాహు తదితరులు స్థాపించారు. కోవిడ్ ప్రభావం వారిపై తీవ్రం వలస కార్మికులపై కోవిడ్ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా పడినట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచే ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల్లోనే ఈ అధ్యయనం నిర్వహించారు. సొంతూ ళ్లకు వెళ్లిన వారిలో నెల లేదా రోజువారీ వేతనం పొందేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, వ్యవసాయేతర రంగాల్లోని క్యాజువల్ కార్మికులపై ఇది తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. సొంతూళ్లకు చేరుకున్న వారి ఆదాయాలను గతంలో పనిచేసిన చోట్ల ఆదాయంతో పోలిస్తే సగటున 85% తగ్గిపోయాయి. ఇక జార్ఖండ్,యూపీల్లో అయితే 94% మేర ఆదాయం తగ్గిపోయింది. గతంలో వివిధ మార్గాల్లో స్వయం ఉపాధి పొందే వలసకార్మికుల్లో ప్రస్తుతం 86% మేర ఆదాయం (ఆరు రాష్ట్రాల్లో కలిపి)కోల్పోయారు. గ్రామాల్లో ఆదాయమార్గాలు లేక పట్టణాలకు వెళితే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే ఆశాభావంతో 41 శాతం మంది ఉన్నారు. గతంలో పనిచేసిన యజమానుల నుంచి వస్తున్న వేతనం పెంపుదలకు స్పందించి 33 శాతం మంది తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. జార్ఖండ్, యూపీల నుంచే ఎక్కువ నగరాలు, గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు 70% వలసకార్మికులు సుముఖంగా ఉండగా, వారిలో జార్ఖండ్ నుంచి 92.31%, యూపీ నుంచి 89.31%, ఒడిశా నుంచి 59 శాతంమంది సిద్ధమౌతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి మాత్రం 35 శాతంమందే మళ్లీ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. -
మనకు కరోనా రిస్క్ తక్కువే..!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేగం కాస్త అటూఇటుగా ఉన్నప్పటికీ మరణాన్ని జయిస్తున్నవారే అధికం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండడమే. దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అతి తక్కువగా ఉంది’అని ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) నివేదిక వెల్లడించింది. జూలై 2017 నుంచి జూన్ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్ అధ్యయనం చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారి గృహాలను ప్రామాణికంగా తీసుకుంటూ గణాంకాలను విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. రాష్ట్రంలో రిస్క్ 6.12 శాతమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించిన ఐఐపీఎస్.. రాష్ట్రాల వారీగా జాతీయ సగటును పోల్చుతూ పరిశీలన చేసింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో సగటున 9.38 శాతం గృహాలు రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే రిస్క్ కేవలం 6.12 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా రిస్క్ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్ 14.49 శాతంతో రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇక రిస్క్ జాబితాలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 11వ స్థానంలో ఉంది. ఈ లెక్కన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే కోవిడ్–19 మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు తేల్చింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్–19 మరణాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 55.04 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 44.96 శాతం మరణాల్లో అత్యధికులు సకాలంలో వైద్యం తీసుకోకపోవడం వల్లే చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అరవై దాటిన వారే ఎక్కువ వయసు రీత్యా పరిశీలిస్తే అరవై సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది. -
భవిష్యత్‌పై బెంగ.. ఆరోగ్యంపై శ్రద్ధ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పుడు అధిక శాతం మందిని ‘భవిష్యత్ భయాలు’ వెంటాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇది అన్నిచోట్లా విభిన్న రంగాలు, వృత్తుల వారిపై ప్రభావం చూపుతోంది. వృత్తి నిపుణులు మొదలు విద్యార్థులు, సామాన్యుల్లోనూ కోవిడ్ కారణంగా తలెత్తిన అనిశ్చితి, కొనసాగుతున్న సందేహాస్పద పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనుండడంతో ఖర్చుల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కరోనా, సుదీర్ఘ లాక్డౌన్, ఆపై దశలవారీ అన్‌లాక్ సమయంలో కోవిడ్ కేసుల ఉధృతి పెరగడం వంటివి దేశ ప్రజల జీవితాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రభావితం చేశాయని, వినియోగదారుల మనస్తత్వం, కొనుగోళ్ల తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి వాటితో ప్రయోజనాలున్నా, కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయని పట్టణ ప్రాంత ప్రజలు ఈ అధ్యయనంలో అభిప్రాయపడ్డారు. (చదవండి: విద్వేషంపై ఉదాసీనత) కరోనా ప్రభావంతో ఉద్యోగం, ఆఫీసు, షాపింగ్, ఫుడ్, రోజువారీ కార్యకలాపాలన్నింటా గణనీయ మార్పులు సంభవించడంతో అందుకు తగ్గట్టు అభిరుచులు, మనస్తత్వాలను మార్చుకునేందుకు, ఈ పరిస్థితికి అలవాటు పడేందుకు వివిధ రంగాల వృత్తి నిపుణులు మొదలు సామాన్యుల వరకు తంటాలు పడుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వత్రా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమైంది. -
గబ్బిల్లాల్లో ఎప్పటి నుంచో కరోనా వైరస్..
వాషింగ్టన్ : గబ్బిలాల్లో ఎన్నో దశాబ్దాలుగా గుర్తించకుండా కరోనా వైరస్ ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్ షూ గబ్బిలాలు సార్స్ కోవ్-2 వైరస్‌లకు మూలమని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఈ వైరస్లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (కరోనా : భారత్‌లో మరో రికార్డు ) దీంతో శాస్త్రవేత్తలు వైరస్ మూలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. అసలు ఈ కరోనా ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏంటని చాలా మంది శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. గబ్బిలాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని యూఎస్ ప్రభుత్వ అధికారులు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ నెలలో దీనిని అధ్యయనం చేసేందుకు నిపుణులను చైనాకు పంపింది. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. (గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?) అయితే, ఇంతకుముందు భావించినట్లు గబ్బిలాలనుంచి పాంగోలిన్ల(అలుగు)కు వైరస్ సోకి, వాటి నుంచి మానవులకు వ్యాపించిందనే దానికి ఆధారాలు లభించలేవని తెలిపారు. అలుగులు వైరస్‌కు వాహకంగా పనిచేయడం లేదని కనుగొన్నట్లు చెప్పారు. ఈ పాంగోలిన్లకు మాత్రం గబ్బిలాల ద్వారా వైరస్ సోకి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీలో 23 శాతంపైగా కోవిడ్-19 బాధితులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 23 శాతం మందికి పైగా కోవిడ్-19 బారినపడ్డారని ఓ అథ్యయనం వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించిన సెరో సర్వే ఫలితాలను మంగళవారం ప్రకటించారు. ఈ అథ్యయనం ప్రకారం 23.48 శాతం మంది ఢిల్లీ వాసుల్లో కోవిడ్-19 యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది. కరోనా మహమ్మారి ఆరు నెలల నుంచి ఢిల్లీ నగరంలో అన్ని ప్రాంతాలకూ, విస్తృత జనాభాకూ విస్తరించినా కేవలం 23.48 శాతం ఢిల్లీ ప్రజలే దీని బారినపడ్డారని, ప్రభుత్వం..పౌరుల సహకారంతో కోవిడ్-19 కట్టడి సాధ్యమైందని ఈ అథ్యయనంపై ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కరోనా సోకిన వారిలో అత్యధిక మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అథ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ జనాభాలో అత్యధికులు ఇప్పటికీ వ్యాధి సోకే ముప్పున్న వారేనని, వ్యాధి కట్టడికి కఠిన చర్యలను ఇలాగే కొనసాగించాలని పేర్కొంది. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాలని సూచించింది. జూన్ 27 నుంచి జులై 10 వరకూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వ్యాధి నివారణ జాతీయ కేంద్రం (ఎన్సీడీసీ) ఈ అథ్యయనాన్ని చేపట్టింది. చదవండి : ‘అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా’ -
‘ఇలా చేస్తే వారి ప్రాణాలు దక్కుతాయి’
లండన్: కోవిడ్ చికిత్సకు ఉపకరించే కీలక విషయాలు తమ పరిశోధనలో వెల్లడయ్యాయని యునైటెడ్ కింగ్డమ్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ బాధితుల రక్త నమూనాలను పరిశీలించగా వారి ప్లాస్మాలోని ప్రొటీన్స్ స్థాయుల్లో తేడాలున్నట్టు తెలిసిందన్నారు. బాధితుల ప్రొటీన్ స్థాయుల్లో మార్పులకు కారణమయ్యే బయోమేకర్స్‌ను పరిశీలించడం ద్వారా.. బాధితుల్లో వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చన్నారు. కోవిడ్ బాధితుల్లో కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే. మరికొందరు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణిస్తున్నారని అధ్యయనంలో భాగమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్) ప్లాస్మాలో ప్రోటీన్ స్థాయులను బట్టి ఎవరికి అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఎందరో ప్రాణాలకు కాపాడుకోవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు. త్వరగా రక్త నమూనాలను పరీక్షించి ప్రోటీన్లలో తేడాలను గమనిస్తే.. ఆ వ్యక్తిలో కోవిడ్ తీవ్రత ఎలా ఉండనుందో తెలిసిపోతుందన్నారు. తమ స్టడీలో వెల్లడైన విషయాలు రోగి పరిస్థితి అంచనా వేసేందకు ఉపయోగపడతాయని అధ్యయనానికి నేత్వత్వం వహించిన ఫ్రాన్సిక్ క్రిక్ యూనివర్సిటీకి చెందిన మార్కస్ రాల్సర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణ కోసం ఇవే కీలకం కానున్నాయని తెలిపారు. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వివిధ దశలకు చెందిన 31 మందిపై తమ అధ్యయనం జరిగిందని రాల్సర్ వెల్లడించారు. వారిలో వ్యాధి తీవ్రతను బట్టి 27 రకాల ప్రొటీన్ స్థాయుల్లో వైవిధ్యతలు గుర్తించినట్టు చెప్పారు. మరో 17 మంది కోవిడ్ రోగులను, 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ప్రొటీన్ స్థాయులను కూడా పరిశీలించి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ నియమాల ప్రకారం.. రోగులను వర్గీకరించామని తెలిపారు. కాగా, సెల్ సిస్టమ్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో) -
కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన చనిపోతున్న వారిలో నల్లజాతీయులే అధికంగా ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 బాధితుల్లో శ్వేత జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్టు తేలింది. కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా నల్లజాతీయులు ఉన్నారని, మరణాల్లోనూ దాదాపు 60 శాతం మంది వీరేనని ఆంఫర్ అనే అమెరికా ఎయిడ్స్ పరిశోధన సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. సామాజిక-ఆర్థిక అంశాలే ఇందుకు కారణమని వివరించింది. ఆరోగ్య సంరక్షణ విషయంలో బాగా వెనుకబడి ఉంటడం కూడా ప్రధాన కారణమని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా నల్లజాతీయుల జనాభా అధికంగా, తక్కువగా ఉన్న కౌంటీల్లోని కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను పరిశీలించారు. (కరోనా: మూడో రోజుకు ఇలా అవుతుంది) దేశవ్యాప్తంగా నమోదైన గణాంకాలను పరిశీలిస్తే నల్లజాతీయుల జనాభా అధికంగా ఉన్న కౌంటీల్లో 52 శాతం మంది కరోనా బారిన పడగా, 58 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధ్యయకర్తలు గుర్తించారు. 3 వేలకు పైగా కౌంటీల్లో జనవరి నుంచి ఏప్రిల్ 13 వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న కౌంటీల్లో నల్లజాతీయుల మరణాలు అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. నిరుద్యోగం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక నల్లజాతీయులు అధికంగా కరోనా బారినపడినట్టు పరిశోధకులు గుర్తించారు. నల్లజాతీయులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: ‘నమస్తే ట్రంప్’తో కరోనా వ్యాప్తి! -
కరోనా: షాకింగ్ విషయాలు బయటపెట్టిన స్టడీ!
బీజింగ్: లాక్డౌన్ పటిష్ట అమలు, కోవిడ్ భయాలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు చైనాకు చెందిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. రెస్టారెంట్లలోని ఎయిర్ కండీషర్లతో కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన ఎమర్జింగ్ ఇన్ఫెక్చువస్ డీసీజెస్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఒకే రెస్టారెంట్లో.. మూడు కుటుంబాలకు చెందిన 10 మంది కోవిడ్ పేషంట్లపై ఈ అధ్యయనం జరిగింది. వుహాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చైనాలోని గ్వాంజౌ పట్టణంలో ఉన్న రెస్టారెంట్లో జనవరి 24న భోజనం చేశాడు. ఐదు అంతస్థులు ఉన్న ఆ రెస్టారెంట్లో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ఉంది. అయితే, వెంటిలేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేదు. అతని పక్క టేబుళ్లపై మరో రెండు కుటుంబాలు కూడా లంచ్ చేశాయి. ఫిబ్రవరి 5న సదరు వ్యక్తికి జ్వరం, జలుబు వచ్చింది. అతనికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అతని పక్క టేబుళ్లపై భోజనం చేసిన ఇరు కుటుంబాల వారికి అదే రోజు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. అందరికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. (చదవండి: వారి వేతనం ముందు ప్రధాని పే ప్యాకేజ్ దిగదుడుపే..) తుంపర్ల ద్వారానే.. కానీ కోవిడ్-19 వ్యాప్తికి ప్రధాన కారణం వైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడిన తుంపర్లే. కోట్లాది వైరస్ క్రిములు ఉండే ఆ తుంపర్ల ద్వారానే కోవిడ్ ఇతరులకు సోకుతుంది. అయితే, బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటికొచ్చే తుంపర్లు గాల్లో కొద్ది క్షణాలే ఉంటాయని, అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవని స్టడీ స్పష్టం చేసింది. కానీ, ఏసీ ద్వారా గాలి వేగంగా పయనించినప్పుడు తుంపర్లు కొద్ది దూరం ముందుకు సాగి ఇతరులకు వైరస్ అంటించే అవకాశాలుంటాయని తెలిపింది. రెస్టారెంట్లలోనే ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దానికోసం.. టేబుళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం.. తగిన విధంగా వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఏసీ గాలి ద్వారానే పైన తెలిపిన ఇరు కుంటుంబాల సభ్యులకు వైరస్ సోకినట్టు అంచనాకొచ్చినట్టు పేర్కొంది. (చదవండి: అమెజాన్‌లో కరోనా అలజడి) కాగా, గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ విజృంభణ ఫిబ్రవరి నెల నుంచి మరింత వృద్ధి చెంది దాదాపు అన్ని దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లక్షా 28 వేలకు పైగా ప్రజలు మరణించారు. 4 లక్షల 92 వేల మంది కోలుకున్నారు. ఇక కోవిడ్ కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో చైనాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 82, 295 కాగా.. 3,342 మంది ప్రాణాలు విడిచారు. 77,816 మంది కోలుకున్నారు. -
ఎన్నిసార్లు ముఖాన్ని తాకుతామో తెలిస్తే..
యావత్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) నివారణకు ప్రస్తుతానికి కచ్చితమైన మందు ఏదీ అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే మాస్క్ లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వుంటూ ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలని కోరుతున్నారు. ముఖంలోని ముక్కు, కళ్లు, చెవులు, నోటిని తాకడం ద్వారా మాత్రమే ప్రాణాంతకమైన ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందని, అప్రతమత్తంగా వుండాలని చెబుతున్నారు. అయితే మనం రోజులో ఎన్నిసార్లు మన ముఖాన్ని చేతితో తాకుతామో తెలుసా? పోనీ గంటలో ఎన్నిసార్లు ముఖాన్ని, ముఖంలో ఇతర భాగాలను ముట్టుకుంటామో తెలుసా? కొన్ని అధ్యయనాలు తేల్చిన విషయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అంశంపై పరిమితమైన రచనలు, చాలా తక్కువ పరిశోధనలు ఉన్న క్రమంలో, సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నపుడు, ఇతర సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నిరోధించే క్రమంలో దీనిపై గతంలో జరిగిన అధ్యయన ఫలితాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 2015లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 26 మంది వైద్య విద్యార్థులపై ఈ స్టడీ నిర్వహించారు. వీడియో టేప్ రికార్డింగ్ ద్వారా ముఖాన్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారనే దాన్ని విశ్లేషించారు. 26 మంది విద్యార్థులలో అందరూ ప్రతి గంటకు సగటున 23 సార్లు వారి ముఖాన్ని తాకారు. ఇందులో దాదాపు సగానికిపైగా సార్లు ముక్కు, కళ్లు, నోటిని తాకారట. 2008లో నిర్వహించిన మరో స్టడీలో ఇంకోఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆఫీసు వాతావరణంలో ఉద్యోగులు గంటకు 16 సార్లు ముఖాన్ని టచ్ చేస్తారని హ్యాండ్ టూ ఫేస్ సంబంధంపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10 మందిని మూడు గంటలపై నిర్వహించిన స్టడీలో గంటకు సగటున 16 సార్లు ముఖంలోని భాగాలను తాకారని అధ్యయనం తెలిపింది. 2014లో నిర్వహించిన మరో అధ్యయనం ఏం చెబుతోంటే.. వైద్య వృత్తిలో ఉన్నవారు గంటకు 19 సార్లు ముఖాన్ని ముట్టుకున్నారట. అంటే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారో ఆయా భాగాలనే ఎక్కువగా తాకారన్న మాట. అందుకే ముఖాన్ని, ముఖంలోని ఈ ముఖ్య భాగాలను స్పర్శించే ముందు తప్పకుండా చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ పరిశుభ్రత, నియంత్రణ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే సైకిల్ ను విచ్ఛిన్నం చేయాలి. ఇదే అతి సులువైన, చవకైన నివారణ పద్ధతి. లేదంటే భారీ మూల్యం తప్పదు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం గంటకు మూడుసార్లు కంటిని, ఒకసారి చెవిని, నోటిని నాలుగుసార్లు తాకుతాం. ప్రతీ గంటకు నాలుగుసార్లు జుట్టుని ముట్టుకుంటాం. అలాగే బుగ్గల్ని నాలుగుసార్లు, మెడను ఒకసారి, గడ్డాన్ని నాలుగు సార్లు తాకుతాం. ఈ విషయాలను నమ్మబుద్ధి కావడంలేదా.. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ఉన్న మీలో ఎవరైనా సరదాకా ఈ స్టడీ చేయండి. మీ అమ్మా నాన్న, తోబుట్టువులు, లేదంటే పెద్ద, చిన్న, ఇలా వారు గంటలో ఎన్నిసార్లు, ముక్కును తాకుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.. కళ్లను నులుముకుంటున్నారో పరిశీలించండి. -
ఇలాంటి మగాళ్లు ఒట్టి మోసగాళ్లు!!
ఫేసు చూసి వారి క్యారెక్టర్ చెప్పేయటం మనలో చాలా మందికి అలవాటు. అయితే ‘డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అన్నట్లు కొందరి విషయంలో మన అంచనాలు తప్పొచ్చు. కానీ, కొంతమంది మగాళ్ల ముఖతీరును బట్టి వారి స్వభావాన్ని చెప్పేయొచ్చని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా బలమైన దవడలు, చిన్న పెదాలు ఉన్నవారు భాగస్వాములను ఎక్కువగా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారని వెల్లడైంది. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్సెస్‌లో ఈ సర్వే ప్రచురితమైంది. కొంతమంది పరిశోధకుల బృందం దాదాపు 1500 మంది మగ,ఆడవారిపై ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీరంతా 18నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన వారే. 299 మంది మగవారి ఫొటోలను 452 మంది ఆడవారికి చూపించి వారెలాంటి వారో చెప్పాలని కోరారు. అంతేకాకుండా ఆ మగవారు ఎంత తరచుగా మోసాలకు పాల్పడతారో రేటింగ్ ఇవ్వమన్నారు. ‘మీరు ఎంత తరచుగా ఇతరుల భాగస్వాములను లోబర్చుకోవటానికి చూస్తారు’ అంటూ ఆ 299 మంది మగవారినే అడిగారు. మగవారు చెప్పిన వివరాలు ఆడవారు చెప్పిన వివరాలతో సరిపోలాయి. దీంతో మగవారి ముఖతీరును బట్టే వారి స్వభావాన్ని అంచనా వేయొచ్చని తేలింది. అయితే ఇదే సర్వేను ఆడవారిపై నిర్వహించినపుడు వారి ముఖతీరును బట్టి ఓ అంచనాకు రాలేమని తేలింది. కాగా, వ్యక్తుల స్వరాన్ని బట్టి వారు మంచివారా కాదా అన్నది అంచనా వేయొచ్చని మరో సర్వేలో తేలింది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కస్టమర్లకు స్నాప్‌డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
రక్తపోటుకు చెక్ పెట్టే సూపర్ పిల్
లండన్ : రక్తపోటును సాధారణ స్ధాయికి తీసుకువచ్చే అద్భుత పిల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటును నియంత్రించే మూడు మందుల కాంబినేషన్‌తో రూపొందే ఈ ట్యాబ్లెట్ బీపీ రోగులకు వరంగా మారుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీపీ మందులతో కేవలం 50 శాతం ప్రజలకే బీపీ నియంత్రణలో ఉంటోంది. అయితే నూతన కాంబినేషన్ పిల్‌తో ఆరు నెలల్లో 70 శాతం మందికి బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటుకు వాడే టెల్మిసర్టాన్, అమ్లోడిపైన్, క్లోరోతాలిడోన్ కాంబినేషన్‌తో రూపొందిన ఈ పిల్‌ను రోగులకు ఇవ్వగా 70 శాతం మంది రోగుల్లో బీపీ సాధారణ స్ధాయికి వచ్చిందని వెల్లడైంది. తమ అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రక్తపోటు నియంత్రణలో ఉంచడంతో పాటు, వారికి గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును తగ్గిస్తాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రూత్ వెబ్‌స్టర్ వెల్లడించారు. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఈ అథ్యయనాన్ని చేపట్టింది. -
ఒంటరితనం కబళిస్తోంది..
న్యూయార్క్ : జనజీవితాల్లోకి సోషల్ మీడియా చొచ్చుకువచ్చిన ఫలితంగా మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకూ సమూహంలోనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా చేపట్టిన సర్వే నివేదిక దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించింది. అమెరికా జనాభాలో దాదాపు సగం మంది ఒంటరితనంతో డీలాపడ్డారని వెల్లడైంది. సోషల్ మీడియా ప్రభావంతో యువతపై ఒంటరితనం ప్రభావం ఉండదన్న అంచనాలు తలకిందులయ్యాయి. 22 ఏళ్ల లోపు యువత వృద్ధుల కన్నా ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. తమ జీవితంలో తమను అర్థం చేసుకునే వారే లేరని అమెరికన్లలో నాలుగింట ఓ వంతు జనాభా అభిప్రాయపడింది. తమ సంబంధాలు అర్థవంతంగా లేవని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక అమెరికన్లలో అన్ని వయసుల వారిలో కుంగుబాటు, ఆందోళనలతో సతమతమయ్యే వారు అత్యధికంగా ఉన్నారు. తక్కువ ఒంటరితనం అనుభవిస్తూ వ్యక్తిగతంగా చురుకైన సంబంధాలు కలిగిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అథ్యయనంలో వెల్లడైంది. అమెరికన్లలో కేవలం సంగం మందే అర్థవంతమైన సామాజిక సంబంధాలను కలిగిఉన్నారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో నిత్యం మెరుగైన సమయాన్ని గడపడం వంటి సామాజిక సంబంధాలను కేవలం 53 శాతం మందే నెరుపుతున్నారని సర్వేలో తేలింది. కాగా, ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని సర్వే చేపట్టిన సిగ్నా పేర్కొంది. ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తి తమకు సన్నిహితంగా ఎవరూ లేరని, ఆప్యాయంగా మాట్లాడేందుకు ఆత్మీయులే కరవయ్యారని భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. -
‘క్యాన్సర్ ముప్పుతిప్పలు’
లండన్ : జీవనశైలి మార్పులతో మూడోవంతు క్యాన్సర్లను నిరోధించే అవకాశం ఉన్నా ఆయా ముప్పులపై ప్రజల్లో సరైన అవగాహన కొరవడిందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వాలు భారీగా ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నా క్యాన్సర్ ముప్పు కారకాలపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదని యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం తేల్చింది. క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం కిందిస్థాయికి చేరడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 1300 మంది పెద్దలపై జరిగిన ఈ అథ్యయనంలో క్యాన్సర్ ముప్పు కారకాలపై అత్యధికుల్లో అవగాహన లేదని తేలింది. శాస్త్రీయ ఆధారాలున్న ముప్పు కారకాలను అంచనా వేయడంలో ప్రజలు గందరగోళంలో ఉన్నారని పేర్కొంది. ఊబకాయంతో క్యాన్సర్ రిస్క్ పొంచి ఉందా అనే దానిపై పలువురు సరిగ్గా బదులివ్వలేకపోయారని తెలిపింది. ముప్పు కారకాలను కొందరు సరిగ్గా గుర్తించలేకుంటే..మరికొందరు శాస్త్రీయ ఆధారాలు లేని ముప్పు కారకాలను నమ్ముతుండటం విస్తుగొలిపింది. ఒత్తిడితో క్యాన్సర్ ముప్పు పొంచిఉందని సగం మంది అభిప్రాయపడితే..నాలుగో వంతు మంది మొబైల్ ఫోన్లతో ముప్పు తప్పదని చెప్పుకొచ్చారు. ఐదుగురిలో ఒకరు మైక్రోవేవ్ ఓవెన్ వాడకం క్యాన్సర్ ముప్పును పెంచుతుందని నమ్ముతున్నారు. -
మద్యంతో నోటిక్యాన్సర్ ముప్పు
లండన్ : రోజుకు కేవలం కొద్దిపాటి మద్యం తీసుకున్నా చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజూ పరిమితంగా మద్యం సేవిస్తే పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఇప్పటివరకూ వచ్చిన పలు అథ్యయనాలను తాజా సర్వే తోసిపుచ్చింది. పరిమితంగా తీసుకునే మద్యంలోనూ ఉండే నిర్థిష్ట బ్యాక్టీరియాతో పలు తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయని తేల్చింది. మద్యం అసలే ముట్టుకోని వారితో పోలిస్తే రోజుకు ఒకసారి అంతకంటే ఎక్కువ సార్లు మద్యం తీసుకునే వారి నోటిలో హానికారక బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. హానికారక క్రిములతో పోరాడే ఆరోగ్యకర బ్యాక్టీరియా సైతం మద్యం సేవించే వారిలో అతితక్కువగా ఉంటుందని పేర్కొంది. మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తి బలహీనపడకుండా, తల, మెడ, నోటి క్యాన్సర్ల బారినపడకుండా ఉండవచ్చని అథ్యయన రచయిత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు జియోంగ్ ఆన్ చెప్పారు. -
ఆన్లైన్ చెకప్‌లతో చేటు
లండన్ : బిజీ లైఫ్‌లో వైద్యుల వద్దకు వెళ్లే తీరికలేని వారు ఆన్లైన్ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు, వైద్యుల్లో 43 శాతం సురక్షితం కాదని కేర్ క్వాలిటీ కమిషన్ నివేదిక హెచ్చరించింది. వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్స్ను ఆఫర్ చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఆన్లైన్ వైద్య సేవల సంస్ధల్లో సగానికి సగం సంస్ధల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోగిని సరిగ్గా పరీక్షించకుండానే ఆన్లైన్ వైద్యులు పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులకు మందులను సూచిస్తున్నారని పేర్కొంది. మరికొన్ని సంస్థలు ప్రమాదకర మందులను సైతం సిఫార్సు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంపెనీలు వెబ్‌క్యామ్, లేదా స్కైప్ ద్వారా వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఆన్లైన్లో ఫాంను పూర్తిచేసిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తుంటారు. రెండు గంటల పాటు పరీక్షించాల్సిన అనారోగ్య సమస్యలను సైతం పదినిమిషాల వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్తో తేల్చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి భారీ మొత్తం గుంజుతున్నారని ఆ సంస్థ తెలిపింది. రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోకుండా, పూర్తిగా పరీక్షలు నిర్వహించకుండానే ఆన్లైన్ డాక్టర్లు హై డోసేజ్ మందులను సిఫార్సు చేయడం ఆందోళనకరమని పేర్కొంది. -
సోడాతో గుండెకు ముప్పు
లండన్ : సోడా తాగితే అరుగుదల బాగుంటుందని భావిస్తే పొరపాటే అంటున్నారు నిపుణులు..రోజుకు రెండు సోడా క్యాన్లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. అధిక చక్కెర కలిగిన పానీయాలు సేవించే వారు గుండె పోటు, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధిత వ్యాధులతో మరణించినట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రెండు సోడా క్యాన్లతో సమానమైన 24 ఔన్సుల సోడాను రోజూ సేవించిన వారు వీటిని తీసుకోని వారితో పోలిస్తే రెండింతలు అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణించే రిస్క్ రెండింతలుగా ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. తీపిపదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో మరణాల ముప్పు పెరిగినట్టు తాము గుర్తించలేదని తెలిపారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు.వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని 45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్ వెల్ష్ వెల్లడించారు. -
వీటితో అకాల మరణానికి చెక్..
లండన్ : గింజ ధాన్యాలు, సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చని..అకాల మరణం ముప్పును ఇవి దాదాపు సగం తగ్గిస్తాయని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిన్‌ల్యాండ్‌లో పరిశోధకులు 2500 మంది పురుషుల ఆరోగ్యాన్ని 22 ఏళ్ల పాటు పర్యవేక్షించడం ద్వారా ఈ వివరాలు రాబట్టారు. వీరిలో బాదం వంటి గింజ ధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్, ఒమెగా 6 పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకున్న వారు నివారించదగ్గ వ్యాధుల కారణంగా అకాల మృత్యువాతన పడటం 43 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. గింజధాన్యాల్లో ఉండే లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ కారక వాపులకు దారితీస్తుందనే ఆందోళనలకూ తమ పరిశోధనలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. రక్తంలో ఎంత ఎక్కువగా లినోలిక్ యాసిడ్ స్ధాయి ఉంటే అకాల మృత్యువు రిస్క్ అంత తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని చెప్పారు. రక్తంలో కొలెస్ర్టాల్ స్ధాయిలను మెరుగ్గా నిర్వహించడంలో ఒమెగా 6 ఆమ్లాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరోవైపు ఒమెగా 6 స్ధాయిలకు, క్యాన్సర్ కారక మృతులకు మధ్య నిర్థిష్టంగా ఎలాంటి సంబంధం లేదని ఈ అథ్యయనంలో వెల్లడైంది. -
డెంటల్ కేర్ లేకుంటే మధుమేహ ముప్పు
లండన్ : దంత ఆరోగ్యం మెరుగ్గా సంరక్షించుకోకుంటే డయాబెటిస్ ముప్పు ముంచుకొస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. మధుమేహం నియంత్రణలో లేనివారికి చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు పెరిగే ప్రమాదం తెలిసిందే. అయినా తాజా అథ్యయనంలో నోటి పరిశుభ్రత లేకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం అధికమని వెల్లడైంది. రోగుల దంత పరీక్ష ద్వారా వారికి డయాబెటిస్ ముప్పు ఏ మేరకు ఉందనేది అంచనా వేయవచ్చని ప్రస్తుత అథ్యయనానికి నేతృత్వం వహించిన సిటీ ఆఫ్ హోప్ నేషనల్ మెడికల్ సెంటర్ పరిశోధకులు పేర్కొన్నారు. 20 ఏళ్లు అంతకుపైబడిన 9670 మంది వైద్య రికార్డులు, బాడీమాస్ ఇండెక్స, గ్లూకోజ్ టాలరెన్స్ స్థాయిలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని డయాబెటిస్, ఎండోక్రినాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెనాల్డ్ సమోవ చెప్పారు. డెంటల్ చెకప్‌కు తమ వద్దకు వచ్చే రోగుల డయాబెటిక్ ముప్పును దంత వైద్యులు సులభంగా అంచనా వేసే అవకాశం ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. -
ఒక్కో మరణంపై రూ .6 లక్షలు..
వాషింగ్టన్ : ప్రపంచంలో అతిపెద్ద టొబాకో కంపెనీలు ఒక్కో స్మోకర్ మరణంపై 9730 డాలర్లు ( రూ 6లక్షలకు పైగా) లాభం పిండేస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని పొగరాయుళ్లను ఈ కంపెనీలు పీల్చిపిప్పిచేస్తున్నాయని వెల్లడించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న పొగాకు పర్యవసానాలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రేటజీస్ సంస్ధలు టొబాకో అట్లాస్ నివేదికను రూపొందించాయి. పొగాకు పరిశ్రమ తమ లాభాలు పెంచుకునేందుకు అనుసరిస్తున్న తాజా ఉత్పత్తులు, ఎత్తుగడలతో పాటు పొగాకు నియంత్రణ చర్యలను ఇవి ఎలా నీరుగారుస్తున్నాయో నివేదిక వెల్లడించింది. కేవలం 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పొగాకు సేవనంతో 71 లక్షల మంది మృత్యువాత పడ్డారని, వీటిలో అత్యధిక మరణాలు సిగరెట్ స్మోకింగ్ వల్ల కాగా, 8,84,000 మరణాలు సెకండ్‌హ్యాండ్ స్మోక్ కారణంగా సంభవించాయి. అదే సమయంలో పొగాకు కంపెనీల లాభాలు 6200 కోట్ల డాలర్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇది పొగతాగడం వల్ల చోటుచేసుకున్న ఒక్కో మరణానికి 9730 డాలర్లతో సమానమని గతంలో ఇది 7000 డాలర్లుగా ఉందని ఈ నివేదిక లెక్కగట్టింది. -
రోజుకు రెండు గంటలు ఒత్తిడితో చిత్తు
లండన్ : ఆధునిక జీవితంలో ఒత్తిడి రొటీన్‌గా మారింది. తాజా అథ్యయనం ప్రకారం బ్రిటన్వాసులు ఏడాదిలో దాదాపు 27 రోజులు ఒత్తిడిలో మునిగితేలుతారని తేలింది. చిన్న చిన్న విషయాలకూ వీరు ఒత్తిడితో చిత్తవుతారని పేర్కొంది. వాలెట్, బ్యాగ్, కీస్ పోయినందుకో..సమయానికి ట్రైన్‌ను అందుకుంటామా లేదా..వంటి చిన్నకారణాలతోనూ ఒత్తిడితో సతమతమవుతుంటారని తెలిపింది. రోజులో రెండు గంటల పాటు బ్రిటిషర్లు టెన్షన్ పడుతుంటారని 2000 మంది పురుషులు, మహిళలను పలకరించిన ఈ సర్వేలో వెల్లడైంది. రోజువారీ బిజీ జీవితం వల్లే ఒత్తిడి ఎదుర్కొంటున్నామని రెండు వంతుల మంది చెప్పగా...సమయం లేకపోవడంతో టెన్షన్ పడుతున్నామని 38 శాతం మంది చెప్పుకొచ్చారు. ఏటా 3676 సార్లు స్ట్రెస్‌కు గురవుతున్నామని పెద్దలు చెప్పగా..చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో చిన్న విషయాలకూ టెన్షన్ పడుతుండటం దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని బ్రిటన్‌లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లూయిస్ హెచ్చరించారు. -
అవన్నీ భయాలే...
న్యూఢిల్లీః దేశంలో నిరుద్యోగంపై లేనిపోని భయాలు నెలకొన్నాయని, వాస్తవంగా సంఘటిత రంగంలో ఉపాథి కల్పన పెద్దగా తగ్గలేదని ఓ అథ్యయనంలో వెల్లడైంది. నమోదిత కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని బీఎస్ఈ టాప్ 500 కంపెనీల్లోని 206 కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించిన పెట్టుబడి సంస్థ సీఎల్ఎస్ఏ స్పష్టం చేసింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ వృద్ధి 4.2 శాతం ఉండగా, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.4 శాతంగా ఉందని, ఉద్యోగాల కల్పనలో భారీగా తగ్గుదల నమోదు కాలేదని పేర్కొంది. భారత్‌లో మెరుగైన ఉద్యోగాల డేటా అందుబాటులో ఉండటం సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో నమోదిత కంపెనీల వార్షిక నివేదికలు ఉద్యోగుల సమాచారం సేకరించేందుకు మంచి వనరని సీఎల్ఎస్ఏ తెలిపింది. కార్పొరేట్ ప్రపంచంలో ఐటీ, ఫైనాన్స్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తుండగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రంఊహించినట్టే పెద్దగా ఉద్యోగాలు అందుబాటులో లేవని పేర్కొంది.ఇక ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉండగా, ఆటోమొబైల్, మెటీరియల్ రంగాల్లో అతితక్కువగా నమోదైంది. సీఈవో సగటు వయసు ప్రయివేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉండగా, మీడియా, రియల్ఎస్టేట్ రంగాల్లో తక్కువగా ఉండటం గమనార్హం. -
ఆ పిచ్చితో చనిపోవడంలో మనమే టాప్
స్వీయ చిత్రం(సెల్ఫీ) అనే మాటను రోజులో కనీసం ఒక్కసారైనా అనుకోకుండా ఉండం. అంతగా మనం రోజూ ఉపయోగించే పదాల్లో చేరిపోయిందీ పదం. 2012లో అడుగుపెట్టిన ఈ నయాట్రెండ్ ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతోంది. ఎందుకంటే సెల్ఫీ కాస్త ఇప్పుడు సెల్ఫ్ కిల్లింగ్‌కు దారి తీయడమే అందుకు కారణం అవుతోంది. తన చిత్రాన్ని తానే తీసుకుంటూ మృత్యువును కౌగిలించుకోవాల్సి వస్తున్న ఈ రోజుల్లో అసలు సెల్ఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది, సెల్ఫీని ఇష్టపడేవారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, సెల్ఫీలు దిగుతూ వారు ఏ కారణాలతో చనిపోయారు అనే వివరాలను అధ్యయనం చేసిన స్టాటిస్తా అనే సంస్థ దాని వివరాలను పొందుపరిచింది. ఈ వివరాల్లో ఎక్కువగా భారతీయులను అవాక్కయ్యేలా చేసే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో కూడా సెల్ఫీల కారణంగా భారతీయులే అధికంగా చనిపోతున్నట్లు ఆ అధ్యయనం తెలిపింది. ప్రపంచం మొత్తంగా 2012 నుంచి 2014 మధ్యకాలంలో సెల్ఫీల కారణంగా మొత్తం 49 మంది చనిపోగా వారిలో 36మంది అబ్బాయిలు, 13 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరంతా కూడా 21 సంవత్సరాల లోపే ఉండటం మరో విశేషం. ఇక వీరిలో ఏ దేశానికి చెందిన వారు అధికంగా ఉన్నారని పరిశీలిస్తే... భారత్‌లో సెల్ఫీల కారణంగా చనిపోయినవారు 19 రష్యా 7 అమెరికా 5 స్పెయిన్ 4 పిలిప్పీన్స్ 4 పోర్చుగల్ 2 ఇండోనేసియా 2 సౌతాఫ్రికా 1 రోమానియా 1 పాకిస్థాన్ 1 మెక్సికో 1 ఇటలీ 1 చైనా ఒకరు చనిపోయారు. కాగా, వీరిలో సెల్ఫీలు దిగుతుండగా ఏ కారణంతో చనిపోయారనే అంశం పరిశీలిస్తే.. ఎత్తులో నుంచి పడిపోయి 16 మంది చనిపోగా.. నీటిలో మునిగిపోయి 14 రైలు ప్రమాదంలో 8 తుపాకీ కారణంగా 4 విమాన ప్రమాదంలో 2 కారు ప్రమాదంలో 2 జంతువు దాడి కారణంగా ఒకరు సెల్ఫీ దిగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.