అవన్నీ భయాలే...
న్యూఢిల్లీః దేశంలో నిరుద్యోగంపై లేనిపోని భయాలు నెలకొన్నాయని, వాస్తవంగా సంఘటిత రంగంలో ఉపాథి కల్పన పెద్దగా తగ్గలేదని ఓ అథ్యయనంలో వెల్లడైంది. నమోదిత కంపెనీల్లో ఉద్యోగాల కల్పనలో చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని బీఎస్‌ఈ టాప్ 500 కంపెనీల్లోని 206 కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించిన పెట్టుబడి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ స్పష్టం చేసింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ వృద్ధి 4.2 శాతం ఉండగా, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.4 శాతంగా ఉందని, ఉద్యోగాల కల్పనలో భారీగా తగ్గుదల నమోదు కాలేదని పేర్కొంది. భారత్‌లో మెరుగైన ఉద్యోగాల డేటా అందుబాటులో ఉండటం సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో నమోదిత కంపెనీల వార్షిక నివేదికలు ఉద్యోగుల సమాచారం సేకరించేందుకు మంచి వనరని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.
కార్పొరేట్ ప్రపంచంలో ఐటీ, ఫైనాన్స్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తుండగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రంఊహించినట్టే పెద్దగా ఉద్యోగాలు అందుబాటులో లేవని పేర్కొంది.ఇక ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉండగా, ఆటోమొబైల్, మెటీరియల్ రంగాల్లో అతితక్కువగా నమోదైంది. సీఈవో సగటు వయసు ప్రయివేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉండగా, మీడియా, రియల్‌ఎస్టేట్ రంగాల్లో తక్కువగా ఉండటం గమనార్హం.