
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇప్పుడు అధిక శాతం మందిని ‘భవిష్యత్ భయాలు’ వెంటాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇది అన్నిచోట్లా విభిన్న రంగాలు, వృత్తుల వారిపై ప్రభావం చూపుతోంది. వృత్తి నిపుణులు మొదలు విద్యార్థులు, సామాన్యుల్లోనూ కోవిడ్ కారణంగా తలెత్తిన అనిశ్చితి, కొనసాగుతున్న సందేహాస్పద పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగనుండడంతో ఖర్చుల విషయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
కరోనా, సుదీర్ఘ లాక్‌డౌన్, ఆపై దశలవారీ అన్‌లాక్ సమయంలో కోవిడ్ కేసుల ఉధృతి పెరగడం వంటివి దేశ ప్రజల జీవితాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రభావితం చేశాయని, వినియోగదారుల మనస్తత్వం, కొనుగోళ్ల తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వంటి వాటితో ప్రయోజనాలున్నా, కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయని పట్టణ ప్రాంత ప్రజలు ఈ అధ్యయనంలో అభిప్రాయపడ్డారు.
(చదవండి: విద్వేషంపై ఉదాసీనత)
కరోనా ప్రభావంతో ఉద్యోగం, ఆఫీసు, షాపింగ్, ఫుడ్, రోజువారీ కార్యకలాపాలన్నింటా గణనీయ మార్పులు సంభవించడంతో అందుకు తగ్గట్టు అభిరుచులు, మనస్తత్వాలను మార్చుకునేందుకు, ఈ పరిస్థితికి అలవాటు పడేందుకు వివిధ రంగాల వృత్తి నిపుణులు మొదలు సామాన్యుల వరకు తంటాలు పడుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వత్రా అనిశ్చితి కొనసాగుతుండడంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment