కరోనా బారినపడ్డ వారిలో చాలావరకు కోలుకున్నా కొందరు మాత్రం పరిస్థితి సీరియస్ అయి చనిపోయారు. పొద్దున్నే బాగున్నవారు కూడా సాయంత్రానికో, రాత్రికో కన్నుమూశారు. ఇలా కొద్దిగంటల్లోనే ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మన శరీరాన్ని కాపాడే ఓ ఎంజైమ్.. మనకు ప్రాణాపాయంగా మారుతోందని తేల్చారు. ఏమిటీ ఎంజైమ్, ఎందుకు ప్రమాదకరంగా మారుతోందన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్
శత్రు కణాలను.. చంపడం కోసం..
మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను సంహరించడానికి విడుదలయ్యే ఎంజైమ్‌లలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్ ఫాస్ఫోలిపేస్ ఏ2 గ్రూప్ ఐఐఏ)’ ఎంజైమ్ చాలా కీలకం. ఇది మన రోగనిరోధక శక్తికి అనుబంధంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండి శరీరమంతా తిరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు కనిపిస్తే.. వాటిని చుట్టుముట్టి ముక్కలు ముక్కలు చేసేస్తుంది.
- సాధారణంగా సూక్ష్మజీవుల పైపొర ప్రత్యేకమైన కొవ్వు పదార్థంతో కూడి ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆ పొర ఆధారంగానే గుర్తించి దాడి చేస్తుంది.
- మానవ కణాల్లోనూ ఈ కొవ్వుపదార్థం ఉంటుంది. కానీ పూర్తిగా ఉపరితలంపై ఉండదు. ఈ కొవ్వుపొరకుపైన ఇతర పదార్థాల పొర (త్వచం) ఉండి.. కణాన్ని రక్షిస్తూ ఉంటుంది.
మన కణాలపై దాడితోనే..
సాధారణంగా మన కణాలపై ఉన్న త్వచం ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మన శరీర కణాలు ఎంజైమ్ దాడికి గురవుతున్నాయి. అవయవాల్లో కణాలు నశించి, వాటి పనితీరు దెబ్బతింటోంది. ఇది మరణానికి దారితీస్తోంది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయినవారిపై, మృతులపై.. ఫ్లాయిడ్ చిల్టన్ నేతృత్వంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ గుట్టు విప్పారు.
ఎంజైమ్ ఏం చేస్తుంది?
తీవ్రంగా దెబ్బతినడం, గాయపడటం వంటివి జరిగినప్పుడు.. వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. మన శరీర కణాలు బలహీనం అవుతాయి. వాటి త్వచం దెబ్బతిని, లోపలి కొవ్వుపొరలు బహిర్గతం అవుతాయి. దీనితో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనవుతాయి. ఈ ఎంజైమ్ అలాంటి కణాలపై దాడిచేసి ముక్కలు చేస్తుంది. దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాల వల్ల.. ఇతర కణాలకు ప్రమాదం లేకుండా శరీరంలో ఉండే ఏర్పాటు ఇది.
- ఇక దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాలు.. వాటిలోని మైటోకాండ్రియా (కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగం)ను విడుదల చేస్తాయి. మైటోకాండ్రియాలు కొవ్వుపొరతో కూడుకుని వైరస్, బ్యాక్టీరియాను తలపించేలా ఉండటంతో.. ఎంజైమ్ వాటిపైనా దాడి చేసి ముక్కలు ముక్కలు చేస్తుంది.
కరోనా సోకినప్పుడు ఏం జరుగుతోంది?
సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా అయినా ఇన్ఫెక్షన్ కొంతమేరకే ఉంటుంది. ఆ సూక్ష్మజీవులను రోగనిరోధక శక్తి చంపేయడం, అవి సోకిన కణాలను ఎంజైమ్ నాశనం చేయడంతో శరీరంలో వాటి విస్తరణ ఆగిపోతుంది. బాధితులు సదరు వ్యాధి నుంచి కోలుకుంటారు. కానీ కరోనాలో మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంటోందని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ చెప్తున్నారు.
- కరోనా తీవ్రస్థాయిలో సోకినవారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందని.. ఊపిరితిత్తులు, కిడ్నీలు సహా చాలా అవయవాల్లో పెద్ద సంఖ్యలో కణాలు ఇన్ఫెక్ట్ అవుతున్నాయని వివరించారు. ఇలా ఇన్ఫెక్ట్ అయిన కణాలన్నీ కూడా ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనుకావడంతో సదరు అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
- ‘‘కణాలపై ఎంజైమ్ దాడి, రోగనిరోధకశక్తి విపరీత స్పందన, దాని వెంట ఇన్‌ఫ్లమేషన్ శరవేగంగా జ రుగుతాయి.అది మనం జారుడుబండపై జారుతూ పోతున్నట్టే. మనకు అర్థమయ్యేలోగానే చాలావే గంగా పరిస్థితిక్షీణిస్తుంది..’అని ఫ్లాయిడ్ తెలిపారు.
127 మంది.. వెయ్యి ఎంజైమ్, రసాయనాలు
శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 127 మందిని ఎంపిక చేశారు. అందులో కోవిడ్‌తో మరణించినవారు 30 మంది, ప్రాణాపాయస్థితికి వెళ్లి బయటపడ్డవారు మరో 30 మంది, మధ్యస్థాయి లక్షణాలున్న ఇంకో 30 మంది ఉండగా.. మిగతా 37 మంది కోవిడ్ సోకనివారు.
- రక్తంలో ఉండే వెయ్యి ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల స్థాయిలు, పనితీరు.. ఈ 127 మందిలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ కీలకమని గుర్తించారు.
- ఆరోగ్యవంతుల్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ స్థాయి లు ఒక్కో మి.మీ. రక్తంలో 10–20 నానోగ్రామ్‌ల వరకు ఉంటాయి. కానీ కరోనా మృతులు, సీరియస్ అయినవారిలో వెయ్యి నానోగ్రామ్‌లకుపైగా ఉన్నట్టు గుర్తించారు.
‘బ్లడ్ యూరియా నైట్రోజన్’ కూడా..
కరోనా మృతుల్లో ‘బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్)’ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. శరీరంలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థంగా ‘బీయూఎన్’ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు దీనిని రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపేస్తాయి. అయితే తీవ్రస్థాయి కరోనా సోకినవారిలో కిడ్నీలు వైరస్ దాడికి గురవుతున్నాయని.. ఇన్ఫెక్ట్ కణాలను ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ముక్క లు చేయడంతో కిడ్నీలు దెబ్బతింటున్నట్లు తేల్చారు. దీనివల్లే వారి రక్తంలో ‘బీయూఎన్’ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
ముందుజాగ్రత్తలు.. ఔషధాలకు లైన్‌క్లియర్
కరోనా సోకినవారిలో కొందరి పరిస్థితి వేగంగా విషమించి మరణించడానికి కారణమేంటో తేలినందున.. దీనికి ఔషధాలు రూపొందించడం సులువని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ తెలిపారు. అంతేకాదు.. కరోనా పేషెంట్ల రక్తంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్, మూత్రంలో ‘బీయూఎన్’ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా ఆరోగ్యం విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని వివరించారు. తగిన చికిత్స చేయడం ద్వారా పేషెంట్లను కాపాడుకోవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment