Enzymes
-
ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్‌న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్‌ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్‌పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్‌డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్‌తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్‌ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్‌లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
కరోనా: కాపాడాల్సిన ఎంజైమ్.. ప్రాణం మీదకు తెస్తోంది!
కరోనా బారినపడ్డ వారిలో చాలావరకు కోలుకున్నా కొందరు మాత్రం పరిస్థితి సీరియస్ అయి చనిపోయారు. పొద్దున్నే బాగున్నవారు కూడా సాయంత్రానికో, రాత్రికో కన్నుమూశారు. ఇలా కొద్దిగంటల్లోనే ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మన శరీరాన్ని కాపాడే ఓ ఎంజైమ్.. మనకు ప్రాణాపాయంగా మారుతోందని తేల్చారు. ఏమిటీ ఎంజైమ్, ఎందుకు ప్రమాదకరంగా మారుతోందన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ శత్రు కణాలను.. చంపడం కోసం.. మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను సంహరించడానికి విడుదలయ్యే ఎంజైమ్‌లలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్ ఫాస్ఫోలిపేస్ ఏ2 గ్రూప్ ఐఐఏ)’ ఎంజైమ్ చాలా కీలకం. ఇది మన రోగనిరోధక శక్తికి అనుబంధంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండి శరీరమంతా తిరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు కనిపిస్తే.. వాటిని చుట్టుముట్టి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. సాధారణంగా సూక్ష్మజీవుల పైపొర ప్రత్యేకమైన కొవ్వు పదార్థంతో కూడి ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆ పొర ఆధారంగానే గుర్తించి దాడి చేస్తుంది. మానవ కణాల్లోనూ ఈ కొవ్వుపదార్థం ఉంటుంది. కానీ పూర్తిగా ఉపరితలంపై ఉండదు. ఈ కొవ్వుపొరకుపైన ఇతర పదార్థాల పొర (త్వచం) ఉండి.. కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన కణాలపై దాడితోనే.. సాధారణంగా మన కణాలపై ఉన్న త్వచం ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మన శరీర కణాలు ఎంజైమ్ దాడికి గురవుతున్నాయి. అవయవాల్లో కణాలు నశించి, వాటి పనితీరు దెబ్బతింటోంది. ఇది మరణానికి దారితీస్తోంది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయినవారిపై, మృతులపై.. ఫ్లాయిడ్ చిల్టన్ నేతృత్వంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ గుట్టు విప్పారు. ఎంజైమ్ ఏం చేస్తుంది? తీవ్రంగా దెబ్బతినడం, గాయపడటం వంటివి జరిగినప్పుడు.. వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. మన శరీర కణాలు బలహీనం అవుతాయి. వాటి త్వచం దెబ్బతిని, లోపలి కొవ్వుపొరలు బహిర్గతం అవుతాయి. దీనితో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనవుతాయి. ఈ ఎంజైమ్ అలాంటి కణాలపై దాడిచేసి ముక్కలు చేస్తుంది. దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాల వల్ల.. ఇతర కణాలకు ప్రమాదం లేకుండా శరీరంలో ఉండే ఏర్పాటు ఇది. ఇక దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాలు.. వాటిలోని మైటోకాండ్రియా (కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగం)ను విడుదల చేస్తాయి. మైటోకాండ్రియాలు కొవ్వుపొరతో కూడుకుని వైరస్, బ్యాక్టీరియాను తలపించేలా ఉండటంతో.. ఎంజైమ్ వాటిపైనా దాడి చేసి ముక్కలు ముక్కలు చేస్తుంది. కరోనా సోకినప్పుడు ఏం జరుగుతోంది? సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా అయినా ఇన్ఫెక్షన్ కొంతమేరకే ఉంటుంది. ఆ సూక్ష్మజీవులను రోగనిరోధక శక్తి చంపేయడం, అవి సోకిన కణాలను ఎంజైమ్ నాశనం చేయడంతో శరీరంలో వాటి విస్తరణ ఆగిపోతుంది. బాధితులు సదరు వ్యాధి నుంచి కోలుకుంటారు. కానీ కరోనాలో మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంటోందని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ చెప్తున్నారు. కరోనా తీవ్రస్థాయిలో సోకినవారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందని.. ఊపిరితిత్తులు, కిడ్నీలు సహా చాలా అవయవాల్లో పెద్ద సంఖ్యలో కణాలు ఇన్ఫెక్ట్ అవుతున్నాయని వివరించారు. ఇలా ఇన్ఫెక్ట్ అయిన కణాలన్నీ కూడా ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనుకావడంతో సదరు అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ‘‘కణాలపై ఎంజైమ్ దాడి, రోగనిరోధకశక్తి విపరీత స్పందన, దాని వెంట ఇన్ఫ్లమేషన్ శరవేగంగా జ రుగుతాయి.అది మనం జారుడుబండపై జారుతూ పోతున్నట్టే. మనకు అర్థమయ్యేలోగానే చాలావే గంగా పరిస్థితిక్షీణిస్తుంది..’అని ఫ్లాయిడ్ తెలిపారు. 127 మంది.. వెయ్యి ఎంజైమ్, రసాయనాలు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 127 మందిని ఎంపిక చేశారు. అందులో కోవిడ్‌తో మరణించినవారు 30 మంది, ప్రాణాపాయస్థితికి వెళ్లి బయటపడ్డవారు మరో 30 మంది, మధ్యస్థాయి లక్షణాలున్న ఇంకో 30 మంది ఉండగా.. మిగతా 37 మంది కోవిడ్ సోకనివారు. రక్తంలో ఉండే వెయ్యి ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల స్థాయిలు, పనితీరు.. ఈ 127 మందిలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ కీలకమని గుర్తించారు. ఆరోగ్యవంతుల్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ స్థాయి లు ఒక్కో మి.మీ. రక్తంలో 10–20 నానోగ్రామ్‌ల వరకు ఉంటాయి. కానీ కరోనా మృతులు, సీరియస్ అయినవారిలో వెయ్యి నానోగ్రామ్లకుపైగా ఉన్నట్టు గుర్తించారు. ‘బ్లడ్ యూరియా నైట్రోజన్’ కూడా.. కరోనా మృతుల్లో ‘బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్)’ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. శరీరంలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థంగా ‘బీయూఎన్’ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు దీనిని రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపేస్తాయి. అయితే తీవ్రస్థాయి కరోనా సోకినవారిలో కిడ్నీలు వైరస్ దాడికి గురవుతున్నాయని.. ఇన్ఫెక్ట్ కణాలను ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ముక్క లు చేయడంతో కిడ్నీలు దెబ్బతింటున్నట్లు తేల్చారు. దీనివల్లే వారి రక్తంలో ‘బీయూఎన్’ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుజాగ్రత్తలు.. ఔషధాలకు లైన్‌క్లియర్ కరోనా సోకినవారిలో కొందరి పరిస్థితి వేగంగా విషమించి మరణించడానికి కారణమేంటో తేలినందున.. దీనికి ఔషధాలు రూపొందించడం సులువని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ తెలిపారు. అంతేకాదు.. కరోనా పేషెంట్ల రక్తంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్, మూత్రంలో ‘బీయూఎన్’ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా ఆరోగ్యం విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని వివరించారు. తగిన చికిత్స చేయడం ద్వారా పేషెంట్లను కాపాడుకోవచ్చని వెల్లడించారు. -
ఊసరవెల్లి కరోనా వైరస్
వాషింగ్టన్: శత్రువుల కంట పడకుండా ఉండేందుకు ఊసరవెల్లి తన రంగులు మార్చుకుంటుందని, పరిసరాల్లోకి ఒదిగిపోతుందని మనకు తెలుసు. కరోనా వైరస్ కూడా ఇంతే. ఇది మన రోగ నిరోధక వ్యవస్థ దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎన్ఎస్పీ16 అనే ఎంజైమ్‌ను వాడుకుంటుందని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది. ఎన్ఎస్పీ16 ఎంజైమ్ ఉన్న వైరస్‌ను రోగనిరోధక వ్య వస్థ గుర్తించడం లేదని, అది కణంలో భాగంగానే భావించేందుకు ఆ ఎంజైమ్ ఉపయోగపడుతుం దని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా తెలిపారు. ఈ కొత్త విషయం కారణంగా ఆ ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేసుకుపోయేలా చేయవచ్చు. అంటే.. పరిస్థితి చేయి దాటక ముందే వైరస్‌ను మట్టుబెట్టవచ్చన్నమాట. -
పొగ మాన్పించేందుకు కొత్త ఎంజైమ్!
పొగతాగడం మానేయాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఏటా 50 నుంచి 60 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ అలవాటును మాన్పించేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పొగతాగిన వెంటనే రక్తంలోకి చేరే నికోటిన్‌ను అక్కడికక్కడే నాశనం చేయగల ఎంజైమ్‌ను వీరు అభివృద్ధి చేశారు. పొగాకు పొలం నేలలో ఉండే సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా స్రవించే ఎంజైమ్ నిక్–ఏ2ను మూడేళ్ల క్రితమే స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది. అప్పటి నుంచి దీన్ని కృత్రిమంగా తయారు చేయడంతో పాటు.. నికోటిన్‌ను నాశనం చేయగల దాని శక్తిని మరింత వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వీరు అభివృద్ధి చేసిన నిక్–ఏ2–జే1 ఎంజైమ్‌ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు అది చాలా సమర్థంగా రక్తంలోని నికోటిన్ మోతాదులను తగ్గించినట్లు తెలిసింది. మెదడును చేరేలోపు రక్తంలోని నికోటిన్ నాశనమవుతోంది కాబట్టి పొగ తాగడం ఒక వ్యసనంగా మారదని అంచనా. ఇప్పటివరకూ ఈ ప్రయోగాలు ఎలుకలకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలను రాబట్టగలిగితే ఈ ఎంజైమ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. -
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియకు ఊతం..
సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఇంధనంగా మార్చుకోవడంలో చెట్ల ఆకులకు మించినవి ఇప్పటివరకు లేవు. సోలార్ ప్యానెల్స్ కూడా ఆకుల స్థాయిలో సూర్యుడి కిరణాలను విద్యుత్తుగా మార్చగలిగితే విద్యుచ్ఛక్తి ఫ్యాక్టరీల అవసరం అస్సలు ఉండదు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిత్రమే మొక్కల్లో నిద్రాణమైపోయిన కొన్ని ఎంజైమ్‌లను మళ్లీ చైతన్యవంతం చేయడం ద్వారా ఆకుల నుంచి మరింత ఎక్కువ ఇంధనాన్ని తయారుచేయవచ్చునని వీరు గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ఆకుల్లా పనిచేసే ఒక యంత్రాన్ని తయారుచేశామని సూర్యుడి వెలుతురులోని ఎరుపు, నీలి రంగులను మాత్రమే శోషించుకునే హైడ్రోజనేస్ ఎంజైమ్‌ను వాడటం ద్వారా తాము మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కటర్జైనా సోక్ చెబుతున్నారు. నాచుమొక్కల్లో ఉండే ఈ హైడ్రోజనేస్ ఎంజైమ్ కాంతి కిరణాల్లోని ప్రోటాన్లను హైడ్రోజన్‌గా మారుస్తుందని ఆమె వివరించారు. ఈ ఎంజైమ్‌ను యంత్రంలో ఉపయోగించినప్పుడు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టడం చాలా సులువైందన్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ యంత్రం పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశముందని, అన్ని రకాల కాంతులతోనూ పనిచేసేలా చేస్తే ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్‌ను మరింత ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. భవిష్యత్తులో దీన్ని సోలార్ ప్యానెల్స్‌లోనూ వాడవచ్చునని అన్నారు. -
మొక్కల వ్యర్థాలతో ప్లాస్టిక్, నైలాన్!
వృధాగా పడేసే మొక్కల వ్యర్థాల నుంచి విలువైన ప్లాస్టిక్, నైలాన్, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే ఎంజైమ్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. యునైటెడ్ కింగ్డమ్తో పాటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మొక్కల్లో ప్రధాన భాగమైన లిగ్నెన్లపై పరిశోధనలు చేస్తున్నారు. కేవలం కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్ల ద్వారా మాత్రమే నాశనమయ్యే ఈ లిగ్నెన్లలో మనకు ఉపయోగపడే అనేక రసాయనాలు ఉన్నాయి కాని వీటిని సమర్థంగా విడగొట్టడం మాత్రం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. తాజాగా ఓ వినూత్నమైన పద్ధతి సాయంతో ప్రొఫెసర్ మెక్‌గీహన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని సాధ్యం చేసింది. ఈ క్రమంలో లిగ్నెన్లో ఉండే కొన్ని ఎంజైమ్లతో జీవ సంబంధిత పాలిమర్లు అంటే నైలాన్, ప్లాస్టిక్ వంటివి తయారు చేసేందుకు పనికొస్తాయని వీరు గుర్తించారు. దీంతో ఇప్పటివరకూ వ్యర్థంగా పడేస్తున్న లిగ్నెన్లతో విలువైన పదార్థాలను తయారు చేయవచ్చునని స్పష్టమైంది. ముడిచమురుపై ఆధారపడకుండా సహజసిద్ధంగా నశించిపోగల ఈ తరహా ప్లాస్టిక్, నైలాన్లతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని మెక్‌గీహన్ అంటున్నారు. సైటోక్రోమ్ పీ450 అనే ఈ ఎంజైమ్‌లు చాలారకాల మూలకాలతో సులువుగా కలిసిపోగలవని, ఫలితంగా కొన్ని కొత్త కొత్త పదార్థాలను తయారుచేయడం వీలవుతుందని అంచనా. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఎంజైమ్‌తో మరింత వేగంగా చర్యలు జరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఒక్క ఎంజైమ్ లేకుంటే.. ఎంత తిన్నా... స్లిమ్ అండ్ ట్రిమ్!
జంక్ ఫుడ్ తింటే లావెక్కుతారు... వైద్యులతోపాటు దాదాపు అందరూ అంగీకరించే విషయం ఇది. అయితే కోపెన్‌హేగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన దీనికి భిన్నమైన ఫలితాలిచ్చింది. ఎలుకల కణజాలం నుంచి ఎన్‌ఏఎంపీటీ అనే ఎంజైమ్‌ను తొలగించినప్పుడు అవి ఎంతటి కొవ్వు పదార్థాలు తిన్నా నాజుకుగానే ఉండిపోయాయని ఈ పరిశోధన చెబుతోంది. పిజ్జా బర్గర్లతో నిత్యం కడుపు నింపుకునే రకం ఆహారమిచ్చినా ఆ ఎలుకలు పిసరంత కూడా లావు కాలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కారెన్ ఎన్గార్డ్ నీల్సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. రక్తంలో, కడుపు ప్రాంతంలోని కొవ్వులో ఎన్‌ఏఎంపీటీ ఎంజైమ్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఊబకాయంతో బాధపడుతున్నట్లు గతంలోనే గుర్తించినా రెండింటి మధ్య సంబంధం మాత్రం ఈ ప్రయోగం ద్వారా తెలిసిందని చెప్పారు. ఎన్‌ఏఎంపీటీ ఎంజైమ్లేని ఎలుకల రక్తంలో చక్కెర మోతాదులు కూడా చక్కగా ఉన్నాయని వివరించారు. అయితే ఎంజైమ్ ఒకప్పుడు అంటే ఆహారం తక్కువ అందుబాటులో ఉన్న కాలంలో కొవ్వు శరీరంలో నిల్వ ఉండేందుకు ఉపయోగపడిందని అయితే ప్రస్తుతం కొవ్వు అధికంగా ఉన్న ఈకాలంలో దీని పాత్ర ఏమిటన్నది మరింత నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉందని నీల్సన్ వివరించారు. -
బరువు తగ్గేందుకు కొత్త ఐడియా..
శరీరం బరువు తగ్గే విషయంలో ఒక ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌ను నియంత్రించడం ద్వారా ఊబకాయులు సులువుగా బరువు తగ్గేలా చేయవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. టీబీకే1 అని పిలిచే ఈ ఎంజైమ్ శరీరంలో కొవ్వును వేగంగా కరిగించేందుకు ఉపయోగపడే ఏఎంపీకే అనే ఇంకో ఎంజైమ్‌ను నియంత్రిస్తున్నట్లు తాము తెలుసుకున్నామని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సాలిటెల్. ఏఎంపీకే ఎంజైమ్ పనిచేస్తున్నప్పుడు కణాలన్నీ శక్తి కోసం కొవ్వులను వాడుకుంటాయని.. టీబీకే1 ఎంజైమ్ విడుదలైతే మాత్రం ఈ ప్రక్రియ నిలిచిపోయి.. కణాలు కొవ్వును నిల్వ చేసుకోవడం మొదలుపెడతాయని సాలిటెల్ వివరించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒళ్లు తగ్గించుకోవాలని మనం ఉపవాసం చేస్తే.. ఏఎంపీకే ఎంజైమ్ చైతన్యవంతమవుతుంది. సరే.. కొవ్వు కరుగుతుందనుకునేంతలోపే ఈ ప్రక్రియ కాస్తా టీబీకే1 ఎంజైమ్ రంగంలోకి దిగుతుందని సాలిటెల్ వివరించారు. బరువు తగ్గేందుకు చేసే ఉపవాసాలు కొన్నిసార్లు ఫలితమివ్వకపోయేందుకు ఇదే కారణమని అంచనా. ఈ నేపథ్యంలో టీబీకే1 ఎంజైమ్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ఇంకో ఎంజైమ్ తన పని తాను చేసుకునేలా చేయవచ్చునని.. కొవ్వులు వేగంగా కరిగిపోతే ఒళ్లు సులువుగా తగ్గుతుందని సాలిటెల్ వివరించారు. -
రోగ నివారిణి గోధుమ గడ్డి రసం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ప్రాముఖ్యత... గోధుమ గడ్డి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది. దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్మొర్. ఐతే ఎల్బీ నగర్‌కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్ర యిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు రూ.20. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు చెబుతున్నారు. రసంతో కలిగే లాభాలు... కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు. గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది. శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. తయారీ విధానం... గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది..ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్‌లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి బాగాపనిచేస్తుంది. -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు మంచి ఫలితాలను ఇస్తుంది గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. -శ్రీహరి, చిక్కడపలి నాకు నరాల బలహీనత తగ్గింది.... నేను 1959 మొదటి బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్‌కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్ -
అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి ఏది?
జీర్ణనాళంలోని ఏయే భాగాల్లో ఏ జీర్ణక్రియలు జరుగుతాయి? జీర్ణరసాల్లోని ఏ ఎంజైమ్‌లు ఈ చర్యలను నిర్వహిస్తాయి? జీర్ణ గ్రంథులు ఏమిటి? జీర్ణనాళాల క్రమం, నిర్మాణం మొదలైవాటి నుంచి దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. సి. హరికృష్ణ సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జీర్ణ వ్యవస్థ మనం తీసుకునే ఆహారంలో శోషణ చెందని సంక్లిష్ట అణువులను, శోషణ చెందే సరళ అణువులుగా మార్చే ప్రక్రియను ‘జీర్ణక్రియ’ అంటారు. ఇది జీర్ణవ్యవస్థలో జరుగుతుంది. జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం, దాని అనుబంధ గ్రంథులు ఉం టాయి. జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాల్లోని ఎంజైమ్‌లు జీర్ణ క్రియను నిర్వహిస్తాయి. జీర్ణనాళం: మానవునిలో జీర్ణనాళం నోటితో మొదలై పాయువుతో అంతమౌతుంది. నోరు నోటికుహరంలోకి తెరుచుకుంటుంది. ఇది మళ్లీ గ్రసనిలోకి, తర్వాత ఆహారవాహికలోకి; ఆహారవాహిక జీర్ణాశయంలోకి; జీర్ణాశయం చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. చిన్నపేగులో ఆంత్రమూలం, జెజునం, ఇలియం అనే మూడు భాగాలు ఉంటాయి. చిన్నపేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. చిన్నపేగు, పెద్దపేగు మధ్య ఉండూకం (అపెండిక్స్) అనే అవశేష అవయవం ఉంటుంది. పెద్దపేగులో కోలన్, పురుషనాళం అనే భాగాలుంటాయి. చివర్లో ఇది పాయువు అనే రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ జీర్ణనాళంలోని నోటి కుహరం జీర్ణాశయం, ఆంత్రమూలం, జెజునంలలో జీర్ణక్రియ లు జరుగుతాయి. ఇలియం అనే భాగంలో జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణం చెందుతుంది. జీర్ణంకాని వ్యర్థమంతా పెద్దపేగు ద్వారా సాగుతూ మలంగా మారి విసర్జితమవుతుంది. నోటి కుహరంలో జీర్ణక్రియ: నోటి కుహరంలో మూడు జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని విడుదల చేస్తాయి. లాలాజలం స్వల్ప ఆమ్లస్థితిలో ఉంటుంది. దీంట్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలోని స్టార్చ్‌ను మాల్టోజ్‌గా మారుస్తుంది. క్షీరదాల్లో నాలుగు జతల లాలాజల గ్రంథు లు ఉంటాయి. నోటిలోని ఆహారం బోలస్ అనే ముద్దగా ఆహారవాహికలో చేరుతుంది. ఆహారవాహిక ప్రదర్శించే పెరిస్టాలిసిస్ అనే కదలికల ద్వారా ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయంలో జీర్ణక్రియ: జీర్ణాశయం లోపలి తలంలో ఉన్న జఠర గ్రంథుల నుంచి జఠర రసం విడుదలవుతుంది. ఈ జీర్ణరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ ఉంటాయి. పెప్సిన్ అనే ఎంజైమ్ ఆహారంలోని ప్రోటీన్లను ప్రోటియేజెస్, పెప్టోన్స్గా విచ్ఛిన్నం చెందిస్తుంది. జెజునంలో జీర్ణక్రియ: జెజునం అనే చిన్నపేగు రెండో భాగంలో జీర్ణక్రియ పూర్తవుతుంది. జెజునం లోపలి తలంలో ఆంత్రగ్రంథులు విడుదల చేసే ఆంత్రరసంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను పూర్తిచేస్తాయి. ఆంత్రరసంలోని మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్‌ను రెండు గ్లూకోజ్లుగా విచ్ఛిన్నం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్‌ను ఒక గ్లూకోజ్, ఒక గాలక్టోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా సుక్రేజ్ సమక్షంలో సుక్రోజ్, ఒక గ్లూకోజ్, ఒక ఫ్రక్టోజ్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఎరిప్సిన్ ఎంజైమ్ సమక్షంలో పెప్టైడ్లు, అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం అవుతాయి. ఆంత్రలైపేజ్ సమక్షంలో డైగ్లిసరైడ్స్ అన్నీ కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్గా విచ్ఛిన్నమవుతాయి. ఈవిధంగా జీర్ణమైన ఆహారమంతా చిన్నపేగు మూడో భాగమైన ఇలియంలో రక్తంలోకి శోషణం చెందుతుంది. ఇందుకోసం ఇలియం ఉపరితలమంతా సూక్ష్మ చూషకాలు అనే వేళ్లాకార నిర్మాణాల్లోకి మడతలు పడి ఉంటుంది. ఇవి ఆహార శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. జీర్ణం కాని వ్యర్థమంతా పాయువు ద్వారా విసర్జితమవుతుంది. ఆంత్రమూలంలో జీర్ణక్రియ: జీర్ణాశయంలో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత ఆహారం ఆమ్లయుతంగా మారడానికి ఆంత్రమూలంలోకి చేరుతుంది. వెంటనే కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం ఆంత్రమూలంలోకి విడుదలవుతాయి. పైత్యరసంలో ఎంజైమ్‌లు ఉండవు. పైత్యరస వర్ణదాలు, పైత్యరస లవణాలు ఉంటాయి. బైలీరూబిన్, బైలీవర్దిన్ అనే విషరసాయనాలు మలం నుంచి విసర్జితమవుతాయి. సోడియం, పొటాషియంల టారోక్లొరేట్లు, గ్లైకోక్లొరేట్లు అనేవి పైత్యరస లవణాలు. ఆహారంలోని కొవ్వుల ఎమల్సిఫికేషన్ను నిర్వహిస్తుంది. క్లోమరసంలోని ఎంజైమ్‌లు ఆంత్రమూలంలో జీర్ణక్రియను నిర్వహిస్తాయి. నోటి కుహరంలో జీర్ణంకాని స్టార్చ్‌ను అమిలోప్సిన్ అనే ఎంజైమ్ మాల్టోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్‌లు ప్రోటియేజ్‌లు, పెప్టోన్లను పెప్టైడ్‌లుగా విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా కొవ్వులను క్లోమరస లైపేజ్ (స్టియాప్సిన్) డైగ్లిజరైట్స్, కొవ్వు ఆమ్లంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈవిధంగా ఆహారం ఆంత్రమూలంలో జీర్ణమవుతూ క్లోమ, పైత్యరసాలతో కలిసి క్షారయుతంగా మారుతుంది. దంతాలు: దవడ ఎముకల్లోని ప్రత్యేక సంచుల లాంటి నిర్మాణాల్లో దంతాలు అమరి ఉంటాయి. క్షీరదాల్లో ఎక్కువగా అసమదంతాలు.. ముఖ్యంగా నాలుగు రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు కొరికే దంతాలు. రదనికలు చీల్చే దంతాలు. ఇవి మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందుతాయి. అగ్రచర్వణకాలు నమిలే దంతాలు. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత వచ్చేవి పాలదంతాలు. ఇవి 20 ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు చర్వణకాలు ఉంటాయి. ఇవన్నీ ఊడిపోయి మళ్లీ వస్తాయి. ఇలా రెండు సార్లు ఏర్పడే దంతాల సంఖ్య 20. ఆ తర్వాత ఒకేసారి ఏర్పడేవి 12. ఇవన్నీ చర్వణకాలు. ఇవి ప్రతి దవడ అర్ధభాగంలో మూడు ఉంటాయి. ఇలా శాశ్వత దంతాలు 32 ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్రచర్వణకాలు, మూడు చర్వణకాలు ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలోని చివరి చర్వణం జ్ఞానదంతం. ఇవి మొత్తం నాలుగు ఉంటాయి. 18 నుంచి 31 ఏళ్ల మధ్య ఇవి వస్తాయి. సాధారణంగా దంత నిర్మాణంలో వేరు, మెడ, కిరీటం అనే మూడు భాగాలు ఉంటాయి. బయటకు కన్పించే భాగం కిరీటం. మొత్తం దంతం డెంటిన్ అనే అస్థి పదార్థంతో తయారవుతుంది. కిరీటంపై మెరిసే పింగాణి ((ఎనామిల్) ఉంటుంది. ఇది శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దంత విన్యాసాన్ని భిన్నం రూపంలో తెలియజేస్తారు. పైదవడ అర్ధ భాగంలోని దంతాలను కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాల క్రమంలో లవంలో, కింది దవడలోని దంతాలను అదే క్రమంలో హారంలో చూపించడాన్నే ‘దంతవిన్యాసం’ అంటారు. కాలేయం * శరీరంలోని వైవిధ్యమైన విధులను నిర్వహించే అవయవం కాలేయం. * ఇది శరీరంలో అతి పెద్ద గ్రంథి. * దీని బరువు 1560 గ్రాములు. * ఇది విషనిర్మూలన అవయవంగా పనిచేస్తుంది. * ప్రోథ్రాంబిన్, ఫెబ్రినోజన్ అనే రక్త స్కంధన కారకాలు, హెపారిన్ అనే రక్తస్కంధన నివారిణి కాలేయంలోనే ఉత్పత్తి అవుతాయి. * మూత్రంలో విసర్జించే యూరియా కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. * గ్లూకోనియోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనోలైసిస్ ప్రక్రియలు కాలేయంలో జరుగుతాయి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఎఫ్, కెలతోపాటు మరికొన్ని బి-కాంప్లెక్స్ విటమిన్లు కాలేయంలో నిల్వ ఉంటాయి. * మానవ కాలేయంలో నాలుగు లంబికలు ఉంటాయి. క్షీరదాల కాలేయంలో ఐదు లంబికలు ఉంటాయి. * కాలేయానికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాన్ని ‘హెపటాలజీ’ అంటారు. * ఏకారణం వల్లనైనా కాలేయ విధులకు అవరోధం ఏర్పడితే కామర్లు (జాండిస్) సంభవించే ప్రమాదం ఉంటుంది. * పిండాభివృద్ధి సమయంలో కాలేయం నుంచి రక్తం, రక్తకణాలు ఏర్పడతాయి. మాదిరి ప్రశ్నలు 1. శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం? 1) క్లోమం 2) కాలేయం 3) ఉండూకం 4) ప్లీహం 2. చిన్నపేగులోని పొడవైన భాగం? 1) ఇలియం 2) జెజునం 3) ఆంత్రమూలం 4) కోలన్ 3. పొడవైన రదనికలు ఉన్న జీవి? 1) సీల్ 2) ఆటర్ 3) వాల్స్ 4) బీవర్ 4. కిందివాటిలో అవశేష అవయవం ఏది? 1) ఉండూకం 2) బాహ్య చెవి 3) అనుత్రికం 4) పైవన్నీ 5. లాలాజలం ఞఏ విలువ? 1) 5.2 2) 6.7 3) 7.4 4) 8.0 6. అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి? 1) ఆవు 2) గేదె 3) మేక 4) ఒంటె 7. పసి పిల్లల జఠర రసంలో ప్రత్యేకంగా కన్పించే ఎంజైమ్? 1) కెసిన్ 2) రెనిన్ 3) పారాకెసిన్ 4) గ్యాస్ట్రిన్ 8. కిందివాటిలో హార్మోన్‌ను గుర్తించండి. 1) గ్యాస్ట్రిన్ 2) సెక్రిటిన్ 3) ప్యాంక్రియోజైమిన్ 4) పైవన్నీ 9. మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థమేది? 1) సెల్యూలోజ్ 2) సుక్రోజ్ 3) స్టార్చ్ 4) పైవన్నీ 10. ఏ గ్రంథులను Krypts of Leber-kuhn అంటారు? 1) లాలా జల గ్రంథులు 2) క్లోమం 3) జఠర గ్రంథులు 4) ఆంత్ర గ్రంథులు 11. కిందివాటిలో టేబుల్ షుగర్ ఏది? 1) మాల్టోజ్ 2) సుక్రోజ్ 3) లాక్టోజ్ 4) స్టార్చ్ 12. చిన్న పేగు పొడవు ఎంత? 1) 6.5 మీ. 2) 8.5 మీ. 3) 12 మీ. 4) 2 మీ. 13. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్? 1) ప్రోటియేజెస్ 2) లైపేజెస్ 3) అమైలేజెస్ 4) ఏదీకాదు 14. పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హార్మోన్? 1) సెక్రిటిన్ 2) గ్యాస్ట్రిన్ 3) ఎంటిరో గ్యాస్ట్రిన్4) కొలిసిస్టో కైనిన్ సమాధానాలు 1) 2; 2) 1; 3) 3; 4) 4; 5) 2 6) 4; 7) 2; 8) 4; 9) 1; 10) 4 11) 2; 12) 1; 13) 3; 14) 4.