
జంక్ ఫుడ్ తింటే లావెక్కుతారు... వైద్యులతోపాటు దాదాపు అందరూ అంగీకరించే విషయం ఇది. అయితే కోపెన్‌హేగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన దీనికి భిన్నమైన ఫలితాలిచ్చింది. ఎలుకల కణజాలం నుంచి ఎన్‌ఏఎంపీటీ అనే ఎంజైమ్‌ను తొలగించినప్పుడు అవి ఎంతటి కొవ్వు పదార్థాలు తిన్నా నాజుకుగానే ఉండిపోయాయని ఈ పరిశోధన చెబుతోంది. పిజ్జా బర్గర్లతో నిత్యం కడుపు నింపుకునే రకం ఆహారమిచ్చినా ఆ ఎలుకలు పిసరంత కూడా లావు కాలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కారెన్ ఎన్‌గార్డ్ నీల్సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు.
రక్తంలో, కడుపు ప్రాంతంలోని కొవ్వులో ఎన్‌ఏఎంపీటీ ఎంజైమ్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఊబకాయంతో బాధపడుతున్నట్లు గతంలోనే గుర్తించినా రెండింటి మధ్య సంబంధం మాత్రం ఈ ప్రయోగం ద్వారా తెలిసిందని చెప్పారు. ఎన్‌ఏఎంపీటీ ఎంజైమ్‌లేని ఎలుకల రక్తంలో చక్కెర మోతాదులు కూడా చక్కగా ఉన్నాయని వివరించారు. అయితే ఎంజైమ్ ఒకప్పుడు అంటే ఆహారం తక్కువ అందుబాటులో ఉన్న కాలంలో కొవ్వు శరీరంలో నిల్వ ఉండేందుకు ఉపయోగపడిందని అయితే ప్రస్తుతం కొవ్వు అధికంగా ఉన్న ఈకాలంలో దీని పాత్ర ఏమిటన్నది మరింత నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉందని నీల్సన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment