తళుకుల మాటున కల్తీమాయ! | Sakshi
Sakshi News home page

తళుకుల మాటున కల్తీమాయ!

Published Fri, May 24 2024 10:00 AM

High Tech Hotels In Hyderabad Have Rampant Adulteration Of Food Items

గ్రేటర్‌ను వెంటాడుతున్న కల్తీ కాటు

అపరిశుభ్రతకు ఆనవాళ్లు.. ఆ హోటళ్లు

నగర రెస్టారెంట్‌లు, బేకరీలలో డొల్లతనం

ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ

మసాలా దినుసుల్లో సైతం ఇదే తీరు

పరిశుభ్రత నాస్తి.. నిబంధనలకు స్వస్తి

హైటెక్కుల హోటళ్లలోనూ నిర్లక్ష్యమే..

ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్‌ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్‌ఫాత్‌ బండ్ల నుంచి స్టార్‌హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ  జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా,  లంచాలకు మరిగిన అధికారులపై  చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్‌ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్‌లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.  

వీటిలో కల్తీ ఎక్కువ.. 
కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో  ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్‌ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని  కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని  గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి  కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.

కల్తీ ఇలా.. మచ్చుకు..
– తేనె పేరిట గ్లూకోజ్‌వాటర్‌లో పంచదార పాకం, వార్నిష్‌, డ్రైఫ్రూట్స్‌ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో  వాడే సల్ఫ్యూరిక్‌ యాసిడ్, వార్నిష్‌, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్‌.
– ఓల్డ్‌సిటీలోని చావ్‌నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు.  ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్‌ ,మైలార్‌దేవ్‌పల్లి, టాటానగర్‌ , మల్లాపూర్, జల్‌పల్లి, శంకర్‌నగర్‌  తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.

నిబంధనలకు నీళ్లు.. 
– ఫుడ్‌ సేఫ్టీ  అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు,  ఉత్పత్తి కేంద్రాలు, వాటి  లైసెన్సుల  వివరాలు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు  ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే  నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.

కాగితాల్లోనే యాప్‌..  
– హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే  వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు.  స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి  ఆన్‌లైన్‌ ఆర్డర్లపై, క్లౌడ్‌ కిచెన్‌లు, హోటళ్ల  టేక్‌అవే విండోల ద్వారా  తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. 
– ప్రతి  హోటల్‌లోనూ ట్రేడ్‌ లైసెన్సు ఫుడ్‌ లైసెన్సు సర్టిఫికెట్‌లు కనిపించేలా ఉంచడంతో పాటు  స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ మేరకు జరిమానాలు విధించాలి.

పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. 
తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా,  కిచెన్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్‌ శుభ్రంగా లేకున్నా,  సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో  హెల్త్‌ చెకప్‌లు  చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.

పేరు గొప్ప.. తీరు దయనీయం..
దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో  ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్‌ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్‌స్టోన్, నేచురల్స్‌ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ, హౌస్‌ రాయలసీమ, రుచుల షా, గౌస్‌ కామత్‌ హోటల్, 36 డౌన్‌టౌన్‌ బ్య్రూ పబ్, మకావ్‌ కిచెన్‌ అండ్‌ బార్, ఏయిర్‌ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్‌ జోయ్, ఖాన్‌సాబ్, సుఖ్‌సాగర్‌ రెస్టారెంట్, జంబోకింగ్‌ బర్గర్స్, రత్నదీప్‌ రిటైల్‌ స్టోర్, అట్లూరి ఫుడ్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌(చట్నీస్‌ కాఫీహౌస్‌ అండ్‌ వెజ్‌ రెస్టారెంట్‌),షాన్‌బాగ్‌ హోటల్‌ డీలక్స్, గౌరంగ్‌ డిజైన్స్‌ ఇండియా ప్రై వేట్‌ లిమిటెడ్, కృతుంగ  పాలేగార్స్‌ క్విజి, హెడ్‌క్వార్టర్స్‌ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

 

ఆరోగ్యం ఖతం.. 
కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది.  తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ,  కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్‌ డయోరియల్‌ డిసీజెన్‌ వస్తాయని ఫీవర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు తెలిపారు.

రంగంలోకి టాస్‌్కఫోర్స్‌..
వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్‌ ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌ టీమ్స్‌ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్‌రూమ్స్‌ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్‌పైర్డ్‌ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్‌ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్‌

జరిమానాలు ఇలా (రూపాయలో)..
ట్రేడ్‌ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 
తాగునీరు  ఉచితంగా ఇవ్వకుంటే - 1000 
వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 
టాయ్‌లెట్లు  శుభ్రంగా లేకుంటే - 5000 
టాయ్‌లెట్లు లేకుంటే - 2000 
మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 
భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 
ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 
భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 
పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 
50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్స్‌ వాడితే - 10,000 
కోల్డ్‌ చాంబర్‌లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 
వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 500

2023లో.. 
అందిన  ఫిర్యాదులు :    2885 
తనిఖీలు చేసినవి : 1685 
జీహెచ్‌ఎంసీ పరిధిలో లేనివి : 1047 
ఇతర కేటగిరీవి : 165 
పెండింగ్‌ : 15 
జీహెచ్‌ఎంసీలో ఉండాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు : 31 
పనిచేస్తున్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు : 23

గత మూడేళ్లలో..
లైసెన్సుల జారీ : 33251 
వసూలైన ఫీజు : రూ.9,71,02,700 
స్ట్రీట్‌ వెండర్స్‌ ‘రిజిస్ట్రేషన్లు : 36334 
వచ్చిన ఫీజు : రూ.59,48,270 
ఫేడ్‌సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 

ఫిర్యాదు చేసేందుకు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 

దెబ్బతింటున్న కిడ్నీలు..
పెచ్చుమీరుతున్న  కల్తీ ఆహారంతో క్యాన్సర్‌ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా  రా మెటీరియల్‌ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో  మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్‌ కలర్స్,  కెమికల్స్‌ అన్నీ  అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్‌ అయిన ఆయిల్‌తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. 

– హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్‌

కఠిన చర్యలుండాలి!
తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు.  కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్‌ ఉండాలి.

– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

నిబంధనలు పాటించాలి..
హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ, జీహెచ్‌ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే  రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.

– కె. బాలాజీరాజు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

శిక్షణ ఉండాలి..
ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్‌ ఉండాలి.   ఇటీవలి కాలంలో జీహెచ్‌ఎంసీ శిక్షణ  కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్‌లైన్‌పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.

– తుమ్మల సంపత్‌ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement