ఆరోగ్యకర ఆహారంవైపు మళ్లించేందుకు ప్రయత్నం
డెన్మార్క్, మెక్సికో, ఫ్రాన్స్, యూకే, హంగేరీ, కొలంబియాలో అమలు
మన దేశంలో కేరళలో అమలు...గుజరాత్‌లో అమలుకు యత్నం
జీఎస్టీ అమల్లోకి రావడంతో ఆగిపోయిన వైనం
అదనపు పన్ను బాదుడుతో ఇతర ఆహారపదార్థాల వైపు మొగ్గు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారమే ప్రధానం. అయితే, అటువంటి ఆహారమే ఆనారోగ్యాల బారిన పడేలా చేస్తుంటే.. అదనపు బరువుకు కారణమవుతుంటే...అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వచ్చిన ఆలోచనే ఫ్యాట్ ట్యాక్స్. నోరూరించేలా... మంచి రుచి, రంగుతో ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీసే జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ ట్యాక్స్ పేరుతో ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫ్యాట్ ట్యాక్స్... మరికొన్ని దేశాల్లో షుగర్ ట్యాక్స్ ఇలా వేర్వేరు పేర్లతో దీన్ని అమలు చేస్తున్నాయి.
అదనపు పన్ను విధించడం వల్ల జంక్ ఫుడ్ ధర పెరిగి... వాటిని తినడం తగ్గుతుందనేది ఆయా ప్రభుత్వాల ఆలోచన. డెన్మార్క్, హంగేరి, మెక్సికో, కొలంబియా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు స్విట్జర్లాండ్ వంటి దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కొన్ని దేశాల్లో మంచి ఫలితాలు ఇవ్వగా... మరికొన్ని దేశాల్లో పెద్దగా ప్రభావం చూపించడంలేదు. ఇక మన దేశంలో ఫ్యాట్ ట్యాక్స్‌ను మొదటిసారిగా కేరళ ప్రభుత్వం అమలు చేసింది. అయితే, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017 నుంచి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. కేరళ స్ఫూర్తితో గుజరాత్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ... జీఎస్టీ విధానం రాకతో అమలు కాకుండా ఆగిపోయింది.
డెన్మార్క్‌తో షురూ...!
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, జంక్ ఫుడ్ వినియోగం తగ్గించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధించడం ప్రారంభించాయి. ముందుగా డెన్మార్క్ దీనికి పునాది వేసింది.శ్యాచురేటెడ్ ఫ్యాట్ (అనారోగ్య కొవ్వు) 2.3 శాతం కంటే ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్‌పై 2011 నుంచి అదనపు పన్ను విధిస్తూ డెన్మార్క్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు కొవ్వు ఉన్న పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాల వినియోగం తగ్గించి పండ్లు, పాలు వంటి ఆహారపదార్థాల వైపునకు మళ్లించాలనేది ఆ ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ విధానం అక్కడ సంతృప్తికర ఫలితాలేవీ ఇవ్వలేదన్నది ఆ తర్వాత కాలంలో తేలింది. ఇక హంగేరిలో అధిక మోతాదులో చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలపై అదనపు పన్ను విధించారు.
నాలుగేళ్ల తర్వాత ఈ పన్ను విధానం ఫలితాలపై సర్వే కూడా చేసింది. సుమారు 73 శాతం మంది వినియోగదారులు జంక్ ఫుడ్ నుంచి ఇతర ఆరోగ్య ఆహారం... పండ్లు వగైరాలవైపు మళ్లినట్టు తేల్చింది. ‘‘బార్బడోస్ దేశంలో 2016 అక్టోబర్‌లో జంక్ ఫుడ్, శీతల పానీయాలపై అదనంగా 10 శాతం పన్నునువిధించారు. ఏడాది తర్వాత పరిశీలిస్తే... షుగర్ అధికంగా ఉండే శీతల పానీయాల వినియోగం 4.3 శాతం తగ్గగా... ఇతర ఫ్రూట్ జ్యూస్‌ల వినియోగం 5.2 శాతం పెరిగింది’అని పరిశోధన చేసిన రెడ్‌పాపజ్ అనే ఎన్‌జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరోలినా పైనరోస్ ఓస్పియానా తెలిపారు.
అదేవిధంగా అమెరికాలోని బెర్కెలీ నగరంలో కూడా ఈ అదనపు పన్ను విధింపుతో 9.6 శాతం మేర షుగర్ అధికంగా ఉండే పానీయాల కొనుగోలు తగ్గిందని ఆయన పేర్కొంటున్నారు. ‘కొలంబియాలో 56.4 శాతం మంది జనాభా అదనపు బరువుతో బాదపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జంక్ ఫుడ్ ట్యాక్స్‌ను తప్పకుండా విధించాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా 2022 డిసెంబర్‌లో కొలంబియా చట్టం తెచ్చి అమలు ప్రారంభించింది. ఈ పన్ను 10 శాతంతో ప్రారంభించి... 2025 నాటికి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
అయితే, దీనిని ఎన్‌జీవో సంస్థలు స్వాగతించగా... పలు వ్యాపార సంస్థలు కోర్టుకెక్కాయి. వ్యాపార సంస్థల పిటిషన్లను 2023 అక్టోబర్‌లో కోర్టు కొట్టేసింది. ఫ్రాన్స్‌లోనూ మొత్తం జనాభాలో 15 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ దేశం కూడా 20 శాతం అదనపు పన్ను వసూలు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లో షుగర్ ట్యాక్స్ పేరుతో షుగర్ ఎక్కువగా ఉండే శీతల పానీయాలపై అదనపు పన్ను విధించారు. అంతేకాకుండా నార్వే, చీలి, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ అదనపు పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి.
జీఎస్టీ రాకతో....!
వాస్తవానికి భారతదేశంలో కూడా జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించాయి. ప్రధానంగా కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా 2016 ఆగస్టులో జంక్‌ఫుడ్‌పై 14.5 శాతం అదనపు పన్ను విధించింది. ప్రధానంగా పిజ్జాలు, బర్గర్లపై ఈ అదనపు పన్ను వసూలును ప్రారంభించింది. కేరళలో ఈ విధానం అమలును పరిశీలించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం కూడా 2017 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయిచింది. అయితే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017లో అమల్లోకి రావడంతో భారతదేశంలో ఫ్యాట్ ట్యాక్స్ అమలు కాస్తా కేరళలో నిలిచిపోయింది.
ఆగస్టు 2016 నుంచి జూన్ 2017 వరకూ అంటే మొత్తం 11 నెలల పాటు ఈ అదనపు ఫ్యాట్ ట్యాక్స్ విధానం కేరళలో అమలుకాగా... 2017 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన గుజరాత్ కాస్తా జీఎస్టీ రాకతో అమలు చేయకుండానే వెనుదిరగాల్సి వచి్చంది. భారతదేశంలో తాజాగా 3 కోట్ల మంది యువత అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారని లాన్‌సెట్ సర్వే తెలియజేస్తోంది. మొత్తానికి ప్రపంచ జనాభాలో అధిక బరువు (స్థూలకాయం) ఉన్న వారి శాతం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో ఈ విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment