సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం కోసం కొవ్వు పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొవ్వు పన్ను విధించడంపై రాష్ట్రాలూ ఈ మేరకు ఆలోచనలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించింది. అయితే దేశంలో మొదటిసారిగా కొవ్వు పన్ను విధించిన రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం తన బడ్జెట్‌లో కొవ్వు పన్ను 14.5 శాతం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
బ్రాండెడ్ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్లలో బర్గర్లు, పిజ్జాలు తదితర జంక్ ఫుడ్‌లపై కొవ్వు పన్ను విధిస్తారు. దీనివల్ల కొవ్వు సంబంధిత పదార్థాలు, షుగర్‌తో తయారయ్యే స్వీట్లపైనా పన్ను పడుతుందన్న మాట. కొవ్వు పన్ను వేయడం వల్ల అనారోగ్యకరమైన ఆయా పదార్థాలను వినియోగదారులు తగ్గిస్తారన్నది సర్కారు ఆలోచన. అయితే ఇందులో సర్కారు ఉద్దేశం ఆదాయాన్ని సమకూర్చు కోవడమన్న ఆలోచన కూడా అంతర్లీనంగా ఉందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే కొవ్వు పన్ను ద్వారా కేరళ అదనంగా రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కొవ్వు పన్ను విధింపుపై ఇతర రాష్ట్రాలూ తర్జనభర్జన పడుతున్నాయి.
కొంప ముంచుతోంది స్థూలకాయమే
ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది పెద్దవాళ్లు డయాబెటిక్‌కు గురవుతుంటే, ఆ సంఖ్య భారత్‌లో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్ వ్యాధి దరి చేరుతుంది. 1990లో మన దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 కోట్ల మంది డయాబెటిక్ రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం విస్మయం కలిగిస్తుంది. అంటే తెలంగాణ జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులన్నమాట. ఈ స్థూలకాయమే కొంప ముంచుతుంది.
25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్ రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్, గుండె, కేన్సర్ తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందుకే కొవ్వును తగ్గించాల్సిన అవసరాన్ని అనేక దేశాలు గుర్తించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్‌లోని కొన్ని రాష్ట్రాలు కొవ్వు పన్ను విధించాయి. కొవ్వు పన్ను ప్రధాన లక్ష్యం స్థూలకాయం, తద్వారా సంభవించే డయాబెటిక్, గుండె వ్యాధులను తగ్గించడమేనని కేంద్రం ప్రకటించింది.
ప్రభావం ఉంటుందా?
కొవ్వు పన్ను వల్ల ఆ ప్రభావం వినియోగదారులపై ఉంటుందా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కొవ్వు పన్నును నిర్ధారించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, దానివల్ల ప్రజలకు అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు, పన్ను వల్ల జేబుకు పడే చిల్లును కూడా వివరించాలనేది తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే కొవ్వు పన్ను వల్ల లక్ష్యం నెరవేరుతుందా? ప్రజలు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారా అన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. ధనిక వర్గాలకు చెందిన పిల్లలు,వారి తల్లిదండ్రులు మెక్‌డోనాల్డ్, కేఎఫ్‌సీ వంటి వాటికి పంపించకుండా ఉంటారా అన్నది అనుమానమే. కేవలం పన్నుతో తమ అలవాటును మానుకునే పరిస్థితి ఉండదంటున్నారు. అయితే ఇది దిగువ మధ్యతరగతి ప్రజలపై మాత్రం కొంతమేర ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే స్వీట్లనేవి ధనిక, అత్యధిక ఆదాయ వర్గాల్లో తమ హోదాను చూపించుకునే ఒక రకమైన అంశం. కాబట్టి వారు ఏ మేరకు దాన్ని తగ్గించుకుంటారో చెప్పలేమని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment