fat tax
-
జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ ట్యాక్స్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారమే ప్రధానం. అయితే, అటువంటి ఆహారమే ఆనారోగ్యాల బారిన పడేలా చేస్తుంటే.. అదనపు బరువుకు కారణమవుతుంటే...అటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వచ్చిన ఆలోచనే ఫ్యాట్ ట్యాక్స్. నోరూరించేలా... మంచి రుచి, రంగుతో ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీసే జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ ట్యాక్స్ పేరుతో ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫ్యాట్ ట్యాక్స్... మరికొన్ని దేశాల్లో షుగర్ ట్యాక్స్ ఇలా వేర్వేరు పేర్లతో దీన్ని అమలు చేస్తున్నాయి.అదనపు పన్ను విధించడం వల్ల జంక్ ఫుడ్ ధర పెరిగి... వాటిని తినడం తగ్గుతుందనేది ఆయా ప్రభుత్వాల ఆలోచన. డెన్మార్క్, హంగేరి, మెక్సికో, కొలంబియా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు స్విట్జర్లాండ్ వంటి దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కొన్ని దేశాల్లో మంచి ఫలితాలు ఇవ్వగా... మరికొన్ని దేశాల్లో పెద్దగా ప్రభావం చూపించడంలేదు. ఇక మన దేశంలో ఫ్యాట్ ట్యాక్స్‌ను మొదటిసారిగా కేరళ ప్రభుత్వం అమలు చేసింది. అయితే, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017 నుంచి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. కేరళ స్ఫూర్తితో గుజరాత్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ... జీఎస్టీ విధానం రాకతో అమలు కాకుండా ఆగిపోయింది. డెన్మార్క్‌తో షురూ...!ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు, జంక్ ఫుడ్ వినియోగం తగ్గించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు అదనపు పన్ను విధించడం ప్రారంభించాయి. ముందుగా డెన్మార్క్ దీనికి పునాది వేసింది.శ్యాచురేటెడ్ ఫ్యాట్ (అనారోగ్య కొవ్వు) 2.3 శాతం కంటే ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్‌పై 2011 నుంచి అదనపు పన్ను విధిస్తూ డెన్మార్క్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనపు కొవ్వు ఉన్న పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాల వినియోగం తగ్గించి పండ్లు, పాలు వంటి ఆహారపదార్థాల వైపునకు మళ్లించాలనేది ఆ ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ విధానం అక్కడ సంతృప్తికర ఫలితాలేవీ ఇవ్వలేదన్నది ఆ తర్వాత కాలంలో తేలింది. ఇక హంగేరిలో అధిక మోతాదులో చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలపై అదనపు పన్ను విధించారు. నాలుగేళ్ల తర్వాత ఈ పన్ను విధానం ఫలితాలపై సర్వే కూడా చేసింది. సుమారు 73 శాతం మంది వినియోగదారులు జంక్ ఫుడ్ నుంచి ఇతర ఆరోగ్య ఆహారం... పండ్లు వగైరాలవైపు మళ్లినట్టు తేల్చింది. ‘‘బార్బడోస్ దేశంలో 2016 అక్టోబర్‌లో జంక్ ఫుడ్, శీతల పానీయాలపై అదనంగా 10 శాతం పన్నునువిధించారు. ఏడాది తర్వాత పరిశీలిస్తే... షుగర్ అధికంగా ఉండే శీతల పానీయాల వినియోగం 4.3 శాతం తగ్గగా... ఇతర ఫ్రూట్ జ్యూస్‌ల వినియోగం 5.2 శాతం పెరిగింది’అని పరిశోధన చేసిన రెడ్పాపజ్ అనే ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరోలినా పైనరోస్ ఓస్పియానా తెలిపారు.అదేవిధంగా అమెరికాలోని బెర్కెలీ నగరంలో కూడా ఈ అదనపు పన్ను విధింపుతో 9.6 శాతం మేర షుగర్ అధికంగా ఉండే పానీయాల కొనుగోలు తగ్గిందని ఆయన పేర్కొంటున్నారు. ‘కొలంబియాలో 56.4 శాతం మంది జనాభా అదనపు బరువుతో బాదపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జంక్ ఫుడ్ ట్యాక్స్‌ను తప్పకుండా విధించాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా 2022 డిసెంబర్లో కొలంబియా చట్టం తెచ్చి అమలు ప్రారంభించింది. ఈ పన్ను 10 శాతంతో ప్రారంభించి... 2025 నాటికి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.అయితే, దీనిని ఎన్జీవో సంస్థలు స్వాగతించగా... పలు వ్యాపార సంస్థలు కోర్టుకెక్కాయి. వ్యాపార సంస్థల పిటిషన్లను 2023 అక్టోబర్‌లో కోర్టు కొట్టేసింది. ఫ్రాన్స్‌లోనూ మొత్తం జనాభాలో 15 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ దేశం కూడా 20 శాతం అదనపు పన్ను వసూలు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లో షుగర్ ట్యాక్స్ పేరుతో షుగర్ ఎక్కువగా ఉండే శీతల పానీయాలపై అదనపు పన్ను విధించారు. అంతేకాకుండా నార్వే, చీలి, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ అదనపు పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాయి.జీఎస్టీ రాకతో....!వాస్తవానికి భారతదేశంలో కూడా జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించాయి. ప్రధానంగా కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా 2016 ఆగస్టులో జంక్‌ఫుడ్‌పై 14.5 శాతం అదనపు పన్ను విధించింది. ప్రధానంగా పిజ్జాలు, బర్గర్లపై ఈ అదనపు పన్ను వసూలును ప్రారంభించింది. కేరళలో ఈ విధానం అమలును పరిశీలించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం కూడా 2017 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయిచింది. అయితే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం 2017లో అమల్లోకి రావడంతో భారతదేశంలో ఫ్యాట్ ట్యాక్స్ అమలు కాస్తా కేరళలో నిలిచిపోయింది.ఆగస్టు 2016 నుంచి జూన్ 2017 వరకూ అంటే మొత్తం 11 నెలల పాటు ఈ అదనపు ఫ్యాట్ ట్యాక్స్ విధానం కేరళలో అమలుకాగా... 2017 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన గుజరాత్ కాస్తా జీఎస్టీ రాకతో అమలు చేయకుండానే వెనుదిరగాల్సి వచి్చంది. భారతదేశంలో తాజాగా 3 కోట్ల మంది యువత అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారని లాన్సెట్ సర్వే తెలియజేస్తోంది. మొత్తానికి ప్రపంచ జనాభాలో అధిక బరువు (స్థూలకాయం) ఉన్న వారి శాతం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో ఈ విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కొవ్వుపై వద్దు లవ్వు
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం కోసం కొవ్వు పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొవ్వు పన్ను విధించడంపై రాష్ట్రాలూ ఈ మేరకు ఆలోచనలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించింది. అయితే దేశంలో మొదటిసారిగా కొవ్వు పన్ను విధించిన రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం తన బడ్జెట్లో కొవ్వు పన్ను 14.5 శాతం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రాండెడ్ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్లలో బర్గర్లు, పిజ్జాలు తదితర జంక్ ఫుడ్లపై కొవ్వు పన్ను విధిస్తారు. దీనివల్ల కొవ్వు సంబంధిత పదార్థాలు, షుగర్‌తో తయారయ్యే స్వీట్లపైనా పన్ను పడుతుందన్న మాట. కొవ్వు పన్ను వేయడం వల్ల అనారోగ్యకరమైన ఆయా పదార్థాలను వినియోగదారులు తగ్గిస్తారన్నది సర్కారు ఆలోచన. అయితే ఇందులో సర్కారు ఉద్దేశం ఆదాయాన్ని సమకూర్చు కోవడమన్న ఆలోచన కూడా అంతర్లీనంగా ఉందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే కొవ్వు పన్ను ద్వారా కేరళ అదనంగా రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కొవ్వు పన్ను విధింపుపై ఇతర రాష్ట్రాలూ తర్జనభర్జన పడుతున్నాయి. కొంప ముంచుతోంది స్థూలకాయమే ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది పెద్దవాళ్లు డయాబెటిక్కు గురవుతుంటే, ఆ సంఖ్య భారత్‌లో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్ వ్యాధి దరి చేరుతుంది. 1990లో మన దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 కోట్ల మంది డయాబెటిక్ రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం విస్మయం కలిగిస్తుంది. అంటే తెలంగాణ జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులన్నమాట. ఈ స్థూలకాయమే కొంప ముంచుతుంది. 25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్ రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్, గుండె, కేన్సర్ తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందుకే కొవ్వును తగ్గించాల్సిన అవసరాన్ని అనేక దేశాలు గుర్తించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్‌లోని కొన్ని రాష్ట్రాలు కొవ్వు పన్ను విధించాయి. కొవ్వు పన్ను ప్రధాన లక్ష్యం స్థూలకాయం, తద్వారా సంభవించే డయాబెటిక్, గుండె వ్యాధులను తగ్గించడమేనని కేంద్రం ప్రకటించింది. ప్రభావం ఉంటుందా? కొవ్వు పన్ను వల్ల ఆ ప్రభావం వినియోగదారులపై ఉంటుందా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కొవ్వు పన్నును నిర్ధారించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, దానివల్ల ప్రజలకు అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు, పన్ను వల్ల జేబుకు పడే చిల్లును కూడా వివరించాలనేది తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే కొవ్వు పన్ను వల్ల లక్ష్యం నెరవేరుతుందా? ప్రజలు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారా అన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. ధనిక వర్గాలకు చెందిన పిల్లలు,వారి తల్లిదండ్రులు మెక్‌డోనాల్డ్, కేఎఫ్‌సీ వంటి వాటికి పంపించకుండా ఉంటారా అన్నది అనుమానమే. కేవలం పన్నుతో తమ అలవాటును మానుకునే పరిస్థితి ఉండదంటున్నారు. అయితే ఇది దిగువ మధ్యతరగతి ప్రజలపై మాత్రం కొంతమేర ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే స్వీట్లనేవి ధనిక, అత్యధిక ఆదాయ వర్గాల్లో తమ హోదాను చూపించుకునే ఒక రకమైన అంశం. కాబట్టి వారు ఏ మేరకు దాన్ని తగ్గించుకుంటారో చెప్పలేమని అంటున్నారు. -
కేరళలో జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ ట్యాక్స్
తిరువనంతపురం: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు కనీవిని ఎరుగని సరికొత్త పన్నును కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం విధించింది. బ్రాండెడ్ రెస్టారెంట్లలో విక్రయించే పిజ్జా, బర్గర్, శాండివిచ్, డాగ్నట్స్, పాస్ట, టాకూస్, బర్గర్ ప్యాటీ, బ్రెడ్ ఫిల్లింగ్ లాంటి జంక్ ఫుడ్‌పై 14.5 శాతం ఫ్యాట్ టాక్స్ (కొవ్వు పన్ను)ను విధించింది. మెక్‌డొనాల్డ్, డొమినోస్, పిజ్జా హట్, సబ్ వే లాంటి బ్రాండెడ్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లకు ఈ పన్ను వర్తిస్తుంది. కేరళ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఎల్డీఎఫ్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ కొత్త పన్నును విధించడం ద్వారా పది కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని ప్రకటించిన ఆయన ఎందుకు ఈ పన్నును విధించారో మాత్రం వివరించలేదు. స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు డెన్మార్క్, హంగరీ లాంటి దేశాల్లో ఫ్యాట్ పన్ను అమల్లో ఉంది. కేరళ విద్యార్థుల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్యను దృష్టిలు పెట్టుకొని ఈ పన్నును విధించారా అన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. కేరళ పాఠశాల విద్యార్థుల్లో స్థూలకాయ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన రెండు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సిటీ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న తిరువనంతపురం హైస్కూల్ విద్యార్థుల్లో 12 శాతం మంది అధిక బరువు ఉన్నారని, వారిలో 6.3 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. అల్లపూజ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులో స్థూలకాయ సమస్య ఎక్కువుందని కూడా తేలింది. పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ టాక్స్‌ను విధించాలనే అంశంపై పలు దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న పౌరులు ఎప్పుడోగానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్లరని, అలాంటి వారిపైనా ఈ పన్ను భారం పడుతుందన్నది వ్యతిరేకుల వాదన. ప్యాక్ చేసిన గోధుమ, మైదా, రవ్వ ఉత్పత్తులపై కూడా కేరళ ఆర్థిక మంత్రి ఐదు శాతం పన్ను విధించారు. కేరళ వంటల్లో విశేషంగా వాడే కొబ్బరి నూనెపై కూడా ఐదు శాతం పన్ను విధించారు.