కేరళలో జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ ట్యాక్స్
తిరువనంతపురం: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు కనీవిని ఎరుగని సరికొత్త పన్నును కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం విధించింది. బ్రాండెడ్ రెస్టారెంట్లలో విక్రయించే పిజ్జా, బర్గర్, శాండివిచ్, డాగ్‌నట్స్, పాస్ట, టాకూస్, బర్గర్ ప్యాటీ, బ్రెడ్ ఫిల్లింగ్ లాంటి జంక్ ఫుడ్‌పై 14.5 శాతం ఫ్యాట్ టాక్స్ (కొవ్వు పన్ను)ను విధించింది. మెక్‌డొనాల్డ్, డొమినోస్, పిజ్జా హట్, సబ్ వే లాంటి బ్రాండెడ్ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లకు ఈ పన్ను వర్తిస్తుంది.
కేరళ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ కొత్త పన్నును విధించడం ద్వారా పది కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందని ప్రకటించిన ఆయన ఎందుకు ఈ పన్నును విధించారో మాత్రం వివరించలేదు. స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు డెన్మార్క్, హంగరీ లాంటి దేశాల్లో ఫ్యాట్ పన్ను అమల్లో ఉంది.
కేరళ విద్యార్థుల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్యను దృష్టిలు పెట్టుకొని ఈ పన్నును విధించారా అన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. కేరళ పాఠశాల విద్యార్థుల్లో స్థూలకాయ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన రెండు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సిటీ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న తిరువనంతపురం హైస్కూల్ విద్యార్థుల్లో 12 శాతం మంది అధిక బరువు ఉన్నారని, వారిలో 6.3 శాతం మంది స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది. అల్లపూజ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులో స్థూలకాయ సమస్య ఎక్కువుందని కూడా తేలింది.
పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు జంక్ ఫుడ్‌పై ఫ్యాట్ టాక్స్‌ను విధించాలనే అంశంపై పలు దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న పౌరులు ఎప్పుడోగానీ జంక్ ఫుడ్ జోలికి వెళ్లరని, అలాంటి వారిపైనా ఈ పన్ను భారం పడుతుందన్నది వ్యతిరేకుల వాదన. ప్యాక్ చేసిన గోధుమ, మైదా, రవ్వ ఉత్పత్తులపై కూడా కేరళ ఆర్థిక మంత్రి ఐదు శాతం పన్ను విధించారు. కేరళ వంటల్లో విశేషంగా వాడే కొబ్బరి నూనెపై కూడా ఐదు శాతం పన్ను విధించారు.