Union Health Welfare Department
-
సమానత్వంలో ఆరోగ్యమూ కీలకమే!
2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవి కానంతగా పెరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లయ్యే సువర్ణ ఘడియలపైనే ఉంది. భారతదేశం అప్పటికి ఎలా తయారవ్వాలి? నా దృష్టిలో అందరికీ సమాన అవకాశాలున్న దేశంగా; విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉన్న దేశంగా ఉండాలి! కులమతాలకు అతీతంగా... వ్యవ సాయం, పాడి పరిశ్రమలు పుష్టిగా సాగుతుండాలి. నాణ్యతే ప్రధానంగా పరిశ్రమలు వస్తువులను అందించాలి. ఇవన్నీ కూడా అందరికీ సమాన అవకాశాలు అన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేవే. ప్రతి సమాజానికి విద్య, ఆరోగ్యం పునాదుల్లాంటివి. ఈ రెండు విషయాల్లోనూ దేశం సాధించిన ప్రగతికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. భారతీయ విద్యావిధానం అంతర్జాతీయ స్థాయి సీఈవోలను సిద్ధం చేస్తూంటే... భారతీయ ప్రైవేట్ రంగ ఆరోగ్య వ్యవస్థలు ప్రపంచం నలుమూలల్లోని వారికి మెడికల్ టూరిజంతో వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే ఈ రెండు ఉదాహరణలను మినహాయిం పులుగానే చూడాలి. పైగా ఈ రెండింటిలో అవకాశాలు కొందరికే. పిల్లలు తమ మేధోశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు మొట్ట మొదటి పునాది ఇంట్లోనే పడుతుంది. పసివాళ్లతో తగురీతిలో మాటలు కలపడం, ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన పనులు చేయించడం వంటి పనుల ప్రాధాన్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే విద్యభ్యాసానికి గట్టి పునాది పడినట్లే. తల్లిదండ్రులిచ్చిన ఈ ప్రాథమిక విద్యకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నడిచే పాఠశాల కూడా తోడైతే బాలల వికాసం పెద్ద కష్టమేమీ కాదు. ఉమ్మడి కుటుం బమైనా... చిన్న కుటుంబమైనా సరే... సాంఘిక, ఆర్థిక పరిస్థితులే పిల్లలకు దక్కే విద్య నాణ్యతను నిర్ణయిస్తాయి. పాఠశాల వాతా వరణం సాంఘిక, ఆర్థిక లేమి ప్రభావాన్ని కొంతవరకూ తగ్గించ గలదు కానీ... ఇది జరగాలంటే పాఠశాలలు సక్రమంగా పనిచేస్తూం డాలి. దీనర్థం భవనాలు, పరిపాలన వ్యవస్థలు సరిగా ఉండాలని కాదు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు కావాలి. అణగారిన వర్గాల పిల్లల జీవితాలను మార్చడం మూకుమ్మడిగా జరగాల్సిన వ్యవహారం. ఈ మార్పు తీసుకు రావడం సాధ్యమనీ, అందుకోసం ఏమైనా చేయగలమనీ ఉపాధ్యాయులు సంకల్పించు కోవడం అవసరం. అయితే ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. ప్రభుత్వాల ఆదేశాలతో సాధ్యమయ్యేదీ కాదు. విద్యాబోధనలో గిరిజన సంస్కృతుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదా తర్క బద్ధమైన అభ్యాసాలను ప్రవేశపెట్టడమైనా సరే... పాఠశాలల్లో విద్యా ర్థుల మదింపు అనేది అందరికీ ఒకేలా ఉండటం సరికాదు. ఈ వాదనలకు ప్రతివాదనలూ లేకపోలేదు. భారత దేశం విశాలమైనదనీ, అన్ని రాష్ట్రాల్లోనూ ఏకరీతి విద్యాబోధన అవసరమనీ అనేవాళ్లూ ఉన్నారు. ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని ఇంకొందరు అంటారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావడం దశాబ్దాల దీర్ఘకాలిక ప్రక్రియ అని అంటారు. ఈ ప్రతివాదనలను విస్మరించాల్సిన అవసరమేమీ లేదు. కానీ విద్య ప్రాథమికమైన బాధ్యత సామాజిక వృద్ధి మాత్రమే కాదనీ, సమానతను సృష్టించేం దుకూ ఉపయోగపడాలనీ వీరు గుర్తించాలి. విద్య ద్వారా లింగవివక్షను తగ్గించడం వంటి అనేక లాభాలూ ఉన్నాయని తెలుసుకోవాలి. పాఠశాల విద్యను అభివృద్ధి చేస్తూనే... దీనికి సమాంతరంగా వృత్తి విద్య, పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఈ రెండు రకాల సంస్థలు ఉద్యోగాలు సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయి. అదే సమయంలో తక్కువ విద్యార్హతలతోనే అర్థవంతమైన ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిష్ణాతులు ఈ దేశానికి గతంలోనూ ఉన్నారు... భవిష్యత్తులోనూ పుట్టుకొస్తారు. ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియగానే చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అవకాశాలను సృష్టించడం... అవి అందరికీ నిత్యం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. ఈ క్రమంలోనే విద్యనభ్య సించేందుకు డబ్బు ఒక ప్రతిబంధకం కాకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఇరవై ఏళ్ల క్రితం నాటి మాట. ఆరోగ్యకరమైన సమాజానికి ఆడపిల్లలు విద్యావంతులై ఉండటం ఎంతో అవసరమని ప్రపంచబ్యాంకు నివేదిక ఒకటి విస్పష్టంగా పేర్కొంది. తక్కువమంది పిల్లల్ని కనడం, సురక్షిత కాన్పులు, పిల్లల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుదల, సమాజంలో స్థాయి పెరగడం వంటి సానుకూల అంశాలకూ ఆడపిల్లలు, మహిళల చదువుకు దగ్గర సంబంధం ఉందని అలవోకగా అనేస్తారు కానీ... ఆరోగ్యం విషయానికి వస్తే అది కాన్పులు, పిల్లల సంరక్షణ పరిధిని దాటి బహుముఖంగా విస్తరించాల్సి ఉంది. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చాలా వ్యాధులను మనం సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం. కాబట్టి ప్రజల ఆరోగ్య సంరక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ, రోగులకు మెరుగైన చికిత్స వంటివాటికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలని ప్రపంచదేశాలకు నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరడం 2047 నాటికి కానీ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆరోగ్య రంగాన్ని విస్మరిస్తే వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై పెట్టాల్సిన ఖర్చులు అలవికానంతగా పెరుగుతాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదే. అలాగే తొలి రెండు లక్ష్యాలైన అందరికీ ఆహారం, పేదరిక నిర్మూలనకూ ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఇంకోలా చెప్పాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీర్చకుండా ఈ రెండు లక్ష్యాలను సాధించడం కష్టం. 2047 నాటికి అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దేశంగా భారత్ ఎదగాలంటే ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంత సమర్థంగా పనిచేయించగలమో చూసుకోవాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు తగ్గించడం, వ్యాధుల నివారణలపై శ్రద్ధ పెట్టడం జరగాలి. చాలా వ్యాధుల చికిత్సకు ఆసుపత్రుల అవసర ముండదు. ఆరోగ్య కార్యకర్తలను రోగులకు అందుబాటులో ఉంచి, భౌతిక, డిజిటల్ సౌకర్యాలు తగినన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అలాగే అత్యవసర పరిస్థితులకు వేగంగా స్పందించగల, అందరికీ అందుబాటులో ఉండేలా రెఫరెల్ ఆసుపత్రుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. చికిత్స ఆలస్యం అవడం వల్ల రోగులకు అనవసరమైన ఇబ్బందులు ఎదురు కారాదు. ఇది సాధ్యం కావాలంటే తగిన వనరులు, సిబ్బంది మాత్రమే కాదు... ఇవన్నీ అవసరమైన చోట ఉండేలా చూడాలి. తగిన పద్ధతులను అమల్లోకి తేవడమూ అవ సరమే. ఇంకోలా చెప్పాలంటే వ్యక్తులు, వారి అవసరాలే కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరగాలి. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యవస్థ రోగుల అవసరాలను తీర్చగలగాలి. అయితే ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే.. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించక తప్పదు. సుశిక్షితులైన, చిత్తశుద్ధితో పనిచేసే సిబ్బందితో కేవలం చౌక మందులు, టీకాలతోనే మన వ్యవస్థను రోగి ప్రధానంగా పనిచేయించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో అక్కడక్కడ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న వారు ఉన్నారు. క్లిని కల్ సర్వీసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటిని సుస్థిర అమలు దిశగా మళ్లించాలి. 2047 అంటే ఇంకో పాతికేళ్లు కావచ్చు కానీ... స్వతంత్ర భారత చరిత్రలో ఇంకో శతాబ్దానికి బలమైన పునాది వేసేందుకు ఈ 25 ఏళ్లలో విద్య, ఆరోగ్యంపై మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడులు కూడా సమాజంలోని ఉన్నత వర్గాల కోసం కాదు. అందరికీ. అయితే ఈ పెట్టుబడుల రాబడులు మాత్రం కొన్ని తరాలవారు అందుకుంటారు. గగన్‌దీప్ కాంగ్, వ్యాసకర్త సీనియర్ వైరాలజిస్ట్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
8 రోజుల్లో లక్ష కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం ఒక్క రోజే 15,413 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 4,10,461కి చేరుకున్నాయి. 24 గంటల్లో 306 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,254కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. నాలుగైదు రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉండడంతో కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటేసింది. 3 నుంచి 4 లక్షలకు కేసులు చేరుకోవడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పట్టింది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 143 రోజుల్లో 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 75% కేసులు గత నెలరోజుల్లోనే అంటే, మే 19 నుంచి జూన్ 20 మధ్య నమోదయ్యాయి. రికవరీ రేటు ఒక్కటే భారత్‌కు భారీగా ఊరటనిస్తోంది. ఇప్పటికే 2.27 లక్షల మంది రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 55.48శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో భారత్ నాలుగోస్థానంలో ఉంటే, మృతుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. కేసులు పెరిగింది ఇలా.. భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న మొదలైన దగ్గర్నుంచి వంద కేసులు చేరుకోవడానికి 43 రోజులు పడితే వంద కేసుల నుంచి లక్ష చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. అప్పట్నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదైతే, 3 లక్షలు చేరుకోవడానికి ఇంకో 10 రోజులే పట్టింది. 3 నుంచి 4 లక్షలు కేవలం ఎనిమిది రోజుల్లోనే దాటేసింది. మూడు రాష్ట్రాల నుంచే 60% కేసులు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు కరోనా గుప్పిట్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో లక్షా 28 వేల 205 కేసులు నమోదైతే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (56,845), ఢిల్లీ (56,746), గుజరాత్ (26,680), ఉత్తరప్రదేశ్ (16,594) రాష్ట్రాలున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన 13,254 కోవిడ్ మృతుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 5,984 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (2,112), గుజరాత్ (1,638), తమిళనాడు (704) ఉన్నాయి. జూలై 1కి 6 లక్షల కేసులు ? భారత్‌లో మరో పది రోజుల్లోనే 2 లక్షల కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటేస్తుందని అమెరికాకు చెందిన మిషిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంచనా వేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత్ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడం లేదని భారత సంతతికి చెందిన మిషిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ తెలిపారు. భారత్‌లో మరిన్ని కోవిడ్–19 వైద్య పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భారత్ జనాభాలో 0.5 శాతానికే పరీక్షలు నిర్వహించారు. అదే మిగిలిన ప్రపంచ దేశాలు కరోనా విస్తృతి అధికంగా చేరుకున్న నాటికి జనాభాలో 4 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నాలుగైదు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతా యి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. జూలై 1 నాటికి కేసులు 6 లక్షలు దాటొచ్చు’ అని ఆమె అంచనా వేశారు. -
కొవ్వుపై వద్దు లవ్వు
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం కోసం కొవ్వు పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన 11 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొవ్వు పన్ను విధించడంపై రాష్ట్రాలూ ఈ మేరకు ఆలోచనలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సూచించింది. అయితే దేశంలో మొదటిసారిగా కొవ్వు పన్ను విధించిన రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం తన బడ్జెట్లో కొవ్వు పన్ను 14.5 శాతం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రాండెడ్ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్లలో బర్గర్లు, పిజ్జాలు తదితర జంక్ ఫుడ్లపై కొవ్వు పన్ను విధిస్తారు. దీనివల్ల కొవ్వు సంబంధిత పదార్థాలు, షుగర్‌తో తయారయ్యే స్వీట్లపైనా పన్ను పడుతుందన్న మాట. కొవ్వు పన్ను వేయడం వల్ల అనారోగ్యకరమైన ఆయా పదార్థాలను వినియోగదారులు తగ్గిస్తారన్నది సర్కారు ఆలోచన. అయితే ఇందులో సర్కారు ఉద్దేశం ఆదాయాన్ని సమకూర్చు కోవడమన్న ఆలోచన కూడా అంతర్లీనంగా ఉందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే కొవ్వు పన్ను ద్వారా కేరళ అదనంగా రూ.10 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కొవ్వు పన్ను విధింపుపై ఇతర రాష్ట్రాలూ తర్జనభర్జన పడుతున్నాయి. కొంప ముంచుతోంది స్థూలకాయమే ప్రపంచంలో ప్రతీ వంద మంది స్థూలకాయుల్లో 19 మంది పెద్దవాళ్లు డయాబెటిక్కు గురవుతుంటే, ఆ సంఖ్య భారత్‌లో వందకు 38 మంది ఉండటం గమనార్హం. ఎక్కువ మందిలో స్థూలకాయంతోనే షుగర్ వ్యాధి దరి చేరుతుంది. 1990లో మన దేశంలో 9 శాతం మంది స్థూలకాయులుంటే, 2016 నాటికి 20.4 శాతానికి చేరుకుంది. ఆ ప్రకారం 1990లో దేశంలో 2.60 కోట్ల మంది డయాబెటిక్ రోగులుంటే, ఆ సంఖ్య 2016 నాటికి 7 కోట్లకు చేరుకుంది. అదే తెలంగాణలో 1990లో స్థూలకాయులు 15 శాతం ఉంటే, 25 ఏళ్లలో అంటే 2016 నాటికి 30 శాతానికి చేరుకోవడం విస్మయం కలిగిస్తుంది. అంటే తెలంగాణ జనాభాలో ప్రతీ వంద మందిలో 30 మంది, ప్రతీ పది మందిలో ముగ్గురు స్థూలకాయులన్నమాట. ఈ స్థూలకాయమే కొంప ముంచుతుంది. 25 ఏళ్లలో స్థూలకాయులు రెట్టింపు కాగా, అదే స్థాయిలో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2040 నాటికి 12.3 కోట్ల మంది డయాబెటిక్ రోగులవుతారని వెల్లడించింది. దేశంలో డయాబెటిక్, గుండె, కేన్సర్ తదితర వ్యాధుల కారణంగానే 50 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అది 2030 నాటికి 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందుకే కొవ్వును తగ్గించాల్సిన అవసరాన్ని అనేక దేశాలు గుర్తించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఐర్లాండ్‌లోని కొన్ని రాష్ట్రాలు కొవ్వు పన్ను విధించాయి. కొవ్వు పన్ను ప్రధాన లక్ష్యం స్థూలకాయం, తద్వారా సంభవించే డయాబెటిక్, గుండె వ్యాధులను తగ్గించడమేనని కేంద్రం ప్రకటించింది. ప్రభావం ఉంటుందా? కొవ్వు పన్ను వల్ల ఆ ప్రభావం వినియోగదారులపై ఉంటుందా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కొవ్వు పన్నును నిర్ధారించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, దానివల్ల ప్రజలకు అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు, పన్ను వల్ల జేబుకు పడే చిల్లును కూడా వివరించాలనేది తమ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే కొవ్వు పన్ను వల్ల లక్ష్యం నెరవేరుతుందా? ప్రజలు అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారా అన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. ధనిక వర్గాలకు చెందిన పిల్లలు,వారి తల్లిదండ్రులు మెక్‌డోనాల్డ్, కేఎఫ్‌సీ వంటి వాటికి పంపించకుండా ఉంటారా అన్నది అనుమానమే. కేవలం పన్నుతో తమ అలవాటును మానుకునే పరిస్థితి ఉండదంటున్నారు. అయితే ఇది దిగువ మధ్యతరగతి ప్రజలపై మాత్రం కొంతమేర ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే స్వీట్లనేవి ధనిక, అత్యధిక ఆదాయ వర్గాల్లో తమ హోదాను చూపించుకునే ఒక రకమైన అంశం. కాబట్టి వారు ఏ మేరకు దాన్ని తగ్గించుకుంటారో చెప్పలేమని అంటున్నారు. -
మందులు కాదు.. రంగు బిళ్ళలే!
రాష్ట్రంలోని ఔషధాల్లో నాసిరకం ఉత్పత్తులు : 21% అన్ని రాష్ట్రాల్లో కలిపి నాణ్యతా పరీక్షలు చేసిన ఔషధాల నమూనాలు : 8,286 దేశవ్యాప్తంగా సగటున నాణ్యత లేని ఔషధాలు : 11% - 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకం - కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: జ్వరం దగ్గరి నుంచి తీవ్ర స్థాయి వ్యాధుల దాకా మనం నమ్ముకునేది ఔషధాలనే.. కానీ ఆ నమ్మకాన్ని ఔషధాల కంపెనీలు వమ్ము చేస్తున్నాయి. నాసిరకం మందులు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో అయితే ఏకంగా 21 శాతం నాసిరకం మందులే సరఫరా అవుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలోనే ఈ విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. అసలు దేశంలో ఔషధాల తయారీకి కేంద్రంగా భావించే హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం గమనార్హం. ఎన్డీఎస్ పేరుతో.. మార్కెట్లో నాసిరకం ఔషధాలు పెరిగిపోతున్నాయన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాది జూలైలో ప్రత్యేకంగా ‘నేషనల్ డ్రగ్ సర్వే (ఎన్డీఎస్)’పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 8,286 ఔషధాల నమూనాల (శాంపిల్స్)ను సేకరించింది. వాటిని కంపెనీలు, బ్యాచ్‌ల వారీగా జాబితాలు రూపొందించి కోల్‌కతాలోని జాతీయ డ్రగ్ లేబొరేటరీలో నాణ్యతా పరీక్షలు చేయించింది. నాసిరకంగా తేలిన ఉత్పత్తులు, కంపెనీలతో జాబితాను రూపొందించింది. ఇందులో 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. ఈ ఫలితాల్లో ఏకంగా 11.41 శాతం ఔషధాలు నాసిరకంగా తేలాయని, ఇది ఆందోళనకరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా.. నాసిరకం ఔషధాల్లో ఎక్కువ శాతం తెలంగాణలో సరఫరా అవుతున్నవే ఉన్నాయని ఎన్డీఎస్ సర్వే నివేదిక పేర్కొంది. ఇక్కడ సేకరించిన ఔషధాల్లోనే అత్యధికంగా 21 శాతం నాసిరకం ఉత్పత్తులను గుర్తించినట్లు తెలిపింది. ఔషధాల నాణ్యత నియంత్రణ పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని వైద్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీల్లో తయారయ్యే ఔషధాలకు సంబంధించి ముందస్తు నాణ్యత పరీక్షల పర్యవేక్షణ ఉండటం లేదని పేర్కొంటున్నాయి. ఔషధ నాణ్యత నియంత్రణ విభాగం పనితీరు మెరుగుపడితేనే ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుతాయని స్పష్టం చేస్తున్నాయి.