మందులు కాదు.. రంగు బిళ్ళలే! | Nationwide Non quality-medicines are 11% | Sakshi
Sakshi News home page

మందులు కాదు.. రంగు బిళ్ళలే!

Published Thu, Sep 14 2017 3:30 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

మందులు కాదు.. రంగు బిళ్ళలే!

మందులు కాదు.. రంగు బిళ్ళలే!

రాష్ట్రంలోని ఔషధాల్లో నాసిరకం ఉత్పత్తులు : 21%
అన్ని రాష్ట్రాల్లో కలిపి నాణ్యతా పరీక్షలు చేసిన ఔషధాల నమూనాలు : 8,286
దేశవ్యాప్తంగా సగటున నాణ్యత లేని ఔషధాలు : 11%
- 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకం  
- కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్‌: జ్వరం దగ్గరి నుంచి తీవ్ర స్థాయి వ్యాధుల దాకా మనం నమ్ముకునేది ఔషధాలనే.. కానీ ఆ నమ్మకాన్ని ఔషధాల కంపెనీలు వమ్ము చేస్తున్నాయి. నాసిరకం మందులు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో అయితే ఏకంగా 21 శాతం నాసిరకం మందులే సరఫరా అవుతున్నాయి. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలోనే ఈ విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. అసలు దేశంలో ఔషధాల తయారీకి కేంద్రంగా భావించే హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం గమనార్హం.  
 
ఎన్‌డీఎస్‌ పేరుతో.. 
మార్కెట్‌లో నాసిరకం ఔషధాలు పెరిగిపోతున్నాయన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాది జూలైలో ప్రత్యేకంగా ‘నేషనల్‌ డ్రగ్‌ సర్వే (ఎన్‌డీఎస్‌)’పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 8,286 ఔషధాల నమూనాల (శాంపిల్స్‌)ను సేకరించింది. వాటిని కంపెనీలు, బ్యాచ్‌ల వారీగా జాబితాలు రూపొందించి కోల్‌కతాలోని జాతీయ డ్రగ్‌ లేబొరేటరీలో నాణ్యతా పరీక్షలు చేయించింది. నాసిరకంగా తేలిన ఉత్పత్తులు, కంపెనీలతో జాబితాను రూపొందించింది. ఇందులో 66 కంపెనీలకు చెందిన 946 రకాల మందులు నాసిరకంగా ఉన్నట్లు నిర్ధారించింది. ఈ ఫలితాల్లో ఏకంగా 11.41 శాతం ఔషధాలు నాసిరకంగా తేలాయని, ఇది ఆందోళనకరమని స్పష్టం చేసింది.
 
రాష్ట్రంలో అత్యధికంగా..
నాసిరకం ఔషధాల్లో ఎక్కువ శాతం తెలంగాణలో సరఫరా అవుతున్నవే ఉన్నాయని ఎన్‌డీఎస్‌ సర్వే నివేదిక పేర్కొంది. ఇక్కడ సేకరించిన ఔషధాల్లోనే అత్యధికంగా 21 శాతం నాసిరకం ఉత్పత్తులను గుర్తించినట్లు తెలిపింది. ఔషధాల నాణ్యత నియంత్రణ పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని వైద్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీల్లో తయారయ్యే ఔషధాలకు సంబంధించి ముందస్తు నాణ్యత పరీక్షల పర్యవేక్షణ ఉండటం లేదని పేర్కొంటున్నాయి. ఔషధ నాణ్యత నియంత్రణ విభాగం పనితీరు మెరుగుపడితేనే ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుతాయని స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement