అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి ఏది? | Civils Prelims: which animal having low-fat? | Sakshi
Sakshi News home page

అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి ఏది?

Published Fri, Aug 8 2014 3:04 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Civils Prelims: which animal having low-fat?

జీర్ణనాళంలోని ఏయే భాగాల్లో ఏ జీర్ణక్రియలు జరుగుతాయి?
జీర్ణరసాల్లోని ఏ ఎంజైమ్‌లు ఈ చర్యలను నిర్వహిస్తాయి? జీర్ణ గ్రంథులు ఏమిటి?
జీర్ణనాళాల క్రమం, నిర్మాణం మొదలైవాటి నుంచి దాదాపు
అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు.
 
 సి. హరికృష్ణ
 సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ,
  హైదరాబాద్.

 
 జీర్ణ వ్యవస్థ
 మనం తీసుకునే ఆహారంలో శోషణ చెందని సంక్లిష్ట అణువులను, శోషణ చెందే సరళ అణువులుగా మార్చే ప్రక్రియను ‘జీర్ణక్రియ’ అంటారు. ఇది జీర్ణవ్యవస్థలో జరుగుతుంది. జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం, దాని అనుబంధ గ్రంథులు ఉం టాయి. జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాల్లోని ఎంజైమ్‌లు జీర్ణ క్రియను నిర్వహిస్తాయి.
 
జీర్ణనాళం:
 మానవునిలో జీర్ణనాళం నోటితో మొదలై పాయువుతో అంతమౌతుంది. నోరు నోటికుహరంలోకి తెరుచుకుంటుంది. ఇది మళ్లీ గ్రసనిలోకి, తర్వాత ఆహారవాహికలోకి; ఆహారవాహిక జీర్ణాశయంలోకి; జీర్ణాశయం చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. చిన్నపేగులో ఆంత్రమూలం, జెజునం, ఇలియం అనే మూడు భాగాలు ఉంటాయి. చిన్నపేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. చిన్నపేగు, పెద్దపేగు మధ్య ఉండూకం (అపెండిక్స్) అనే అవశేష అవయవం ఉంటుంది. పెద్దపేగులో కోలన్, పురుషనాళం అనే భాగాలుంటాయి. చివర్లో ఇది పాయువు అనే రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ జీర్ణనాళంలోని నోటి కుహరం జీర్ణాశయం, ఆంత్రమూలం, జెజునంలలో జీర్ణక్రియ లు జరుగుతాయి. ఇలియం అనే భాగంలో జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణం చెందుతుంది. జీర్ణంకాని వ్యర్థమంతా పెద్దపేగు ద్వారా సాగుతూ మలంగా మారి విసర్జితమవుతుంది.
 
నోటి కుహరంలో జీర్ణక్రియ:
నోటి కుహరంలో మూడు జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని విడుదల చేస్తాయి. లాలాజలం స్వల్ప ఆమ్లస్థితిలో ఉంటుంది. దీంట్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలోని స్టార్చ్‌ను మాల్టోజ్‌గా మారుస్తుంది. క్షీరదాల్లో నాలుగు జతల లాలాజల గ్రంథు లు ఉంటాయి. నోటిలోని ఆహారం బోలస్ అనే ముద్దగా ఆహారవాహికలో చేరుతుంది. ఆహారవాహిక ప్రదర్శించే పెరిస్టాలిసిస్ అనే కదలికల ద్వారా ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది.
 
 జీర్ణాశయంలో జీర్ణక్రియ:
 జీర్ణాశయం లోపలి తలంలో ఉన్న జఠర గ్రంథుల నుంచి జఠర రసం విడుదలవుతుంది. ఈ జీర్ణరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ ఉంటాయి. పెప్సిన్ అనే ఎంజైమ్ ఆహారంలోని ప్రోటీన్‌లను ప్రోటియేజెస్, పెప్టోన్స్‌గా విచ్ఛిన్నం చెందిస్తుంది.
 
 జెజునంలో జీర్ణక్రియ:
 జెజునం అనే చిన్నపేగు రెండో భాగంలో జీర్ణక్రియ పూర్తవుతుంది. జెజునం లోపలి తలంలో ఆంత్రగ్రంథులు విడుదల చేసే ఆంత్రరసంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను పూర్తిచేస్తాయి. ఆంత్రరసంలోని మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్‌ను రెండు గ్లూకోజ్‌లుగా విచ్ఛిన్నం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్‌ను ఒక గ్లూకోజ్, ఒక గాలక్టోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా సుక్రేజ్ సమక్షంలో సుక్రోజ్, ఒక గ్లూకోజ్, ఒక ఫ్రక్టోజ్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఎరిప్సిన్ ఎంజైమ్ సమక్షంలో పెప్టైడ్‌లు, అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం అవుతాయి. ఆంత్రలైపేజ్ సమక్షంలో డైగ్లిసరైడ్స్ అన్నీ కొవ్వు ఆమ్లాలు, గ్లిసరాల్‌గా విచ్ఛిన్నమవుతాయి. ఈవిధంగా జీర్ణమైన ఆహారమంతా చిన్నపేగు మూడో భాగమైన ఇలియంలో రక్తంలోకి శోషణం చెందుతుంది. ఇందుకోసం ఇలియం ఉపరితలమంతా సూక్ష్మ చూషకాలు అనే వేళ్లాకార నిర్మాణాల్లోకి మడతలు పడి ఉంటుంది. ఇవి ఆహార శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. జీర్ణం కాని వ్యర్థమంతా పాయువు ద్వారా విసర్జితమవుతుంది.
 
 ఆంత్రమూలంలో జీర్ణక్రియ:
 జీర్ణాశయంలో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత ఆహారం ఆమ్లయుతంగా మారడానికి ఆంత్రమూలంలోకి చేరుతుంది. వెంటనే కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం ఆంత్రమూలంలోకి విడుదలవుతాయి. పైత్యరసంలో ఎంజైమ్‌లు ఉండవు. పైత్యరస వర్ణదాలు, పైత్యరస లవణాలు ఉంటాయి. బైలీరూబిన్, బైలీవర్దిన్ అనే విషరసాయనాలు మలం నుంచి విసర్జితమవుతాయి. సోడియం, పొటాషియంల టారోక్లొరేట్‌లు, గ్లైకోక్లొరేట్‌లు అనేవి పైత్యరస లవణాలు.
 
 ఆహారంలోని కొవ్వుల ఎమల్సిఫికేషన్‌ను నిర్వహిస్తుంది.  క్లోమరసంలోని ఎంజైమ్‌లు ఆంత్రమూలంలో జీర్ణక్రియను నిర్వహిస్తాయి. నోటి కుహరంలో జీర్ణంకాని స్టార్చ్‌ను అమిలోప్సిన్ అనే ఎంజైమ్ మాల్టోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్‌లు ప్రోటియేజ్‌లు, పెప్టోన్‌లను పెప్టైడ్‌లుగా విచ్ఛిన్నం చేస్తుంది. అదేవిధంగా కొవ్వులను క్లోమరస లైపేజ్ (స్టియాప్సిన్) డైగ్లిజరైట్స్, కొవ్వు ఆమ్లంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈవిధంగా ఆహారం ఆంత్రమూలంలో జీర్ణమవుతూ క్లోమ, పైత్యరసాలతో కలిసి క్షారయుతంగా మారుతుంది.
 
 దంతాలు:
 దవడ ఎముకల్లోని ప్రత్యేక సంచుల లాంటి నిర్మాణాల్లో దంతాలు అమరి ఉంటాయి. క్షీరదాల్లో ఎక్కువగా అసమదంతాలు.. ముఖ్యంగా నాలుగు రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు కొరికే దంతాలు. రదనికలు చీల్చే దంతాలు. ఇవి మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందుతాయి. అగ్రచర్వణకాలు నమిలే దంతాలు. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత వచ్చేవి పాలదంతాలు. ఇవి 20 ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు చర్వణకాలు ఉంటాయి. ఇవన్నీ ఊడిపోయి మళ్లీ వస్తాయి. ఇలా రెండు సార్లు ఏర్పడే దంతాల సంఖ్య 20. ఆ తర్వాత ఒకేసారి ఏర్పడేవి 12. ఇవన్నీ చర్వణకాలు. ఇవి ప్రతి దవడ అర్ధభాగంలో మూడు ఉంటాయి. ఇలా శాశ్వత దంతాలు 32 ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్రచర్వణకాలు, మూడు చర్వణకాలు ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలోని చివరి చర్వణం జ్ఞానదంతం. ఇవి మొత్తం నాలుగు ఉంటాయి. 18 నుంచి 31 ఏళ్ల మధ్య ఇవి వస్తాయి. సాధారణంగా దంత నిర్మాణంలో వేరు, మెడ, కిరీటం అనే మూడు భాగాలు ఉంటాయి. బయటకు కన్పించే భాగం కిరీటం.
 
  మొత్తం దంతం డెంటిన్ అనే అస్థి పదార్థంతో తయారవుతుంది. కిరీటంపై మెరిసే పింగాణి  ((ఎనామిల్) ఉంటుంది. ఇది శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దంత విన్యాసాన్ని భిన్నం రూపంలో తెలియజేస్తారు. పైదవడ అర్ధ భాగంలోని దంతాలను కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాల క్రమంలో లవంలో, కింది దవడలోని దంతాలను అదే క్రమంలో హారంలో చూపించడాన్నే ‘దంతవిన్యాసం’ అంటారు.
 
 కాలేయం
* శరీరంలోని వైవిధ్యమైన విధులను నిర్వహించే అవయవం కాలేయం.
*  ఇది శరీరంలో అతి పెద్ద గ్రంథి.
*  దీని బరువు 1560 గ్రాములు.
*  ఇది విషనిర్మూలన అవయవంగా పనిచేస్తుంది.
*  ప్రోథ్రాంబిన్, ఫెబ్రినోజన్ అనే రక్త స్కంధన కారకాలు, హెపారిన్ అనే రక్తస్కంధన నివారిణి కాలేయంలోనే ఉత్పత్తి అవుతాయి.
*  మూత్రంలో విసర్జించే యూరియా కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది.
*  గ్లూకోనియోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, గ్లైకోజెనోలైసిస్ ప్రక్రియలు కాలేయంలో జరుగుతాయి. కొవ్వులో కరిగే విటమిన్‌లు ఎ, డి, ఎఫ్, కెలతోపాటు మరికొన్ని బి-కాంప్లెక్స్ విటమిన్‌లు కాలేయంలో నిల్వ ఉంటాయి.
*  మానవ కాలేయంలో  నాలుగు లంబికలు ఉంటాయి.  క్షీరదాల కాలేయంలో ఐదు లంబికలు ఉంటాయి.
*  కాలేయానికి సంబంధించిన  శాస్త్రీయ అధ్యయనాన్ని ‘హెపటాలజీ’ అంటారు.
*  ఏకారణం వల్లనైనా కాలేయ విధులకు అవరోధం ఏర్పడితే కామర్లు (జాండిస్) సంభవించే ప్రమాదం ఉంటుంది.
*  పిండాభివృద్ధి సమయంలో కాలేయం నుంచి రక్తం, రక్తకణాలు ఏర్పడతాయి.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం?
     1) క్లోమం    2) కాలేయం
     3) ఉండూకం    4) ప్లీహం
 
 2.    చిన్నపేగులోని పొడవైన భాగం?
     1) ఇలియం    2) జెజునం
     3) ఆంత్రమూలం    4) కోలన్
 
 3.    పొడవైన రదనికలు ఉన్న జీవి?
     1) సీల్     2) ఆటర్
     3) వాల్స్    4) బీవర్
 
 4.    కిందివాటిలో అవశేష అవయవం ఏది?
     1) ఉండూకం    2) బాహ్య చెవి
     3) అనుత్రికం    4) పైవన్నీ
 
 5.    లాలాజలం ఞఏ విలువ?
     1) 5.2     2) 6.7
     3) 7.4        4) 8.0
 
 6.    అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి?
     1) ఆవు     2) గేదె
     3) మేక    4) ఒంటె
 
 7.    పసి పిల్లల జఠర రసంలో ప్రత్యేకంగా కన్పించే ఎంజైమ్?
     1) కెసిన్    2) రెనిన్
     3) పారాకెసిన్    4) గ్యాస్ట్రిన్
 
 8.    కిందివాటిలో హార్మోన్‌ను గుర్తించండి.
     1) గ్యాస్ట్రిన్    2) సెక్రిటిన్
     3) ప్యాంక్రియోజైమిన్    4) పైవన్నీ
 
 9.     మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థమేది?
     1) సెల్యూలోజ్    2) సుక్రోజ్
     3) స్టార్చ్     4) పైవన్నీ
 
 10.    ఏ గ్రంథులను Krypts of Leber-kuhn అంటారు?
     1) లాలా జల గ్రంథులు    2) క్లోమం
     3) జఠర గ్రంథులు    4) ఆంత్ర గ్రంథులు
 
 11.    కిందివాటిలో టేబుల్ షుగర్ ఏది?
     1) మాల్టోజ్     2) సుక్రోజ్
     3) లాక్టోజ్     4) స్టార్చ్
 
 12.    చిన్న పేగు పొడవు ఎంత?
     1) 6.5 మీ.    2) 8.5 మీ.
     3) 12 మీ.    4) 2 మీ.
 
 13.    పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్?
     1) ప్రోటియేజెస్    2) లైపేజెస్
     3) అమైలేజెస్    4) ఏదీకాదు
 
 14.    పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హార్మోన్?
     1) సెక్రిటిన్    2) గ్యాస్ట్రిన్
     3) ఎంటిరో గ్యాస్ట్రిన్4) కొలిసిస్టో కైనిన్
 
 సమాధానాలు
     1) 2; 2) 1; 3) 3; 4) 4; 5) 2  
     6) 4; 7) 2; 8) 4; 9) 1; 10) 4  
     11) 2; 12) 1; 13) 3; 14) 4.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement