
సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఇంధనంగా మార్చుకోవడంలో చెట్ల ఆకులకు మించినవి ఇప్పటివరకు లేవు. సోలార్ ప్యానెల్స్ కూడా ఆకుల స్థాయిలో సూర్యుడి కిరణాలను విద్యుత్తుగా మార్చగలిగితే విద్యుచ్ఛక్తి ఫ్యాక్టరీల అవసరం అస్సలు ఉండదు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిత్రమే మొక్కల్లో నిద్రాణమైపోయిన కొన్ని ఎంజైమ్‌లను మళ్లీ చైతన్యవంతం చేయడం ద్వారా ఆకుల నుంచి మరింత ఎక్కువ ఇంధనాన్ని తయారుచేయవచ్చునని వీరు గుర్తించారు.
ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ఆకుల్లా పనిచేసే ఒక యంత్రాన్ని తయారుచేశామని సూర్యుడి వెలుతురులోని ఎరుపు, నీలి రంగులను మాత్రమే శోషించుకునే హైడ్రోజనేస్ ఎంజైమ్‌ను వాడటం ద్వారా తాము మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కటర్‌జైనా సోక్ చెబుతున్నారు. నాచుమొక్కల్లో ఉండే ఈ హైడ్రోజనేస్ ఎంజైమ్ కాంతి కిరణాల్లోని ప్రోటాన్లను హైడ్రోజన్‌గా మారుస్తుందని ఆమె వివరించారు. ఈ ఎంజైమ్‌ను యంత్రంలో ఉపయోగించినప్పుడు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టడం చాలా సులువైందన్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ యంత్రం పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశముందని, అన్ని రకాల కాంతులతోనూ పనిచేసేలా చేస్తే ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్‌ను మరింత ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. భవిష్యత్తులో దీన్ని సోలార్ ప్యానెల్స్‌లోనూ వాడవచ్చునని అన్నారు.