యావత్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) నివారణకు ప్రస్తుతానికి కచ్చితమైన మందు ఏదీ అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే మాస్క్ లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వుంటూ ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలని కోరుతున్నారు. ముఖంలోని ముక్కు, కళ్లు, చెవులు, నోటిని తాకడం ద్వారా మాత్రమే ప్రాణాంతకమైన ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందని, అప్రతమత్తంగా వుండాలని చెబుతున్నారు. అయితే మనం రోజులో ఎన్నిసార్లు మన ముఖాన్ని చేతితో తాకుతామో తెలుసా? పోనీ గంటలో ఎన్నిసార్లు ముఖాన్ని, ముఖంలో ఇతర భాగాలను ముట్టుకుంటామో తెలుసా? కొన్ని అధ్యయనాలు తేల్చిన విషయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ అంశంపై పరిమితమైన రచనలు, చాలా తక్కువ పరిశోధనలు ఉన్న క్రమంలో, సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నపుడు, ఇతర సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నిరోధించే క్రమంలో దీనిపై గతంలో జరిగిన అధ్యయన ఫలితాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 2015లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 26 మంది వైద్య విద్యార్థులపై ఈ స్టడీ నిర్వహించారు. వీడియో టేప్ రికార్డింగ్ ద్వారా ముఖాన్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారనే దాన్ని విశ్లేషించారు. 26 మంది విద్యార్థులలో అందరూ ప్రతి గంటకు సగటున 23 సార్లు వారి ముఖాన్ని తాకారు. ఇందులో దాదాపు సగానికిపైగా సార్లు ముక్కు, కళ్లు, నోటిని తాకారట.
2008లో నిర్వహించిన మరో స్టడీలో ఇంకోఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆఫీసు వాతావరణంలో ఉద్యోగులు గంటకు 16 సార్లు ముఖాన్ని టచ్ చేస్తారని హ్యాండ్ టూ ఫేస్ సంబంధంపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10 మందిని మూడు గంటలపై నిర్వహించిన స్టడీలో గంటకు సగటున 16 సార్లు ముఖంలోని భాగాలను తాకారని అధ్యయనం తెలిపింది. 2014లో నిర్వహించిన మరో అధ్యయనం ఏం చెబుతోంటే.. వైద్య వృత్తిలో ఉన్నవారు గంటకు 19 సార్లు ముఖాన్ని ముట్టుకున్నారట. అంటే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారో ఆయా భాగాలనే ఎక్కువగా తాకారన్న మాట. అందుకే ముఖాన్ని, ముఖంలోని ఈ ముఖ్య భాగాలను స్పర్శించే ముందు తప్పకుండా చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ పరిశుభ్రత, నియంత్రణ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే సైకిల్ ను విచ్ఛిన్నం చేయాలి. ఇదే అతి సులువైన, చవకైన నివారణ పద్ధతి. లేదంటే భారీ మూల్యం తప్పదు.
వరల్డ్ ఎకానమిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం గంటకు మూడుసార్లు కంటిని, ఒకసారి చెవిని, నోటిని నాలుగుసార్లు తాకుతాం. ప్రతీ గంటకు నాలుగుసార్లు జుట్టుని ముట్టుకుంటాం. అలాగే బుగ్గల్ని నాలుగుసార్లు, మెడను ఒకసారి, గడ్డాన్ని నాలుగు సార్లు తాకుతాం.
ఈ విషయాలను నమ్మబుద్ధి కావడంలేదా.. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ఉన్న మీలో ఎవరైనా సరదాకా ఈ స్టడీ చేయండి. మీ అమ్మా నాన్న, తోబుట్టువులు, లేదంటే పెద్ద, చిన్న, ఇలా వారు గంటలో ఎన్నిసార్లు, ముక్కును తాకుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.. కళ్లను నులుముకుంటున్నారో పరిశీలించండి.
Comments
Please login to add a commentAdd a comment