ఇంట్లో మాస్కు ధరించకపోతే కరోనా రిస్కు | Mask Wearing And Control Of SARS-CoV-2 Transmission In USA | Sakshi
Sakshi News home page

ఇంట్లో మాస్కు ధరించకపోతే కరోనా రిస్కు

Published Thu, Jun 10 2021 2:01 AM | Last Updated on Thu, Jun 10 2021 4:29 AM

Mask Wearing And Control Of SARS-CoV-2 Transmission In USA - Sakshi

వాషింగ్టన్‌: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఆరుబయటి కంటే ఇంట్లో, ఆఫీసుల్లో, సమావేశపు గదుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని చెబు తున్నారు. మాస్కు ధరించకుండా ఇంట్లో ఇతరుల తో మాట్లాడితే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ ముప్పు ఎన్నోరెట్లు ఎక్కువగా పొంచి ఉంటుందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ వివరాలను జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో (ఇన్‌డోర్‌) ఉన్నప్పుడు కూడా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా ఉత్తమమని వెల్లడయ్యింది. మాట్లాడుతునప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తుంటాయి. ఇందులో కంటికి కనిపించని వివిధ పరిమాణాల్లోని సూక్ష్మమైన వైరస్‌ రేణువులు ఉంటాయి. చిన్న పరిమాణంలోని రేణువులు గాలిలో ఎక్కువ సేపు ఉండలేవు. కాస్త పెద్ద పరిమాణంలోని వైరస్‌ డ్రాప్‌లెట్స్‌ జీవిత కాలం ఎక్కువేనని, ఇవి గాలిలో చెప్పుకోదగ్గ దూరం వరకూ త్వరగా వ్యాప్తి చెందుతా యని అధ్యయనంలో గుర్తించారు.

మాట్లాడుతున్నప్పుడు నోటిలోంచి వెలువడే వైరస్‌ రేణువులు కొన్ని నిమిషాలపాటు గాల్లోనే ఎగురుతూ ఉంటాయని, పొగలాగే ఇవి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయని యూఎస్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటీస్, డైజెస్టివ్‌ అండ్‌ కిడ్నీ డిసీజెస్‌ ప్రతినిధి, అధ్యయనకర్త అడ్రియాన్‌ బాక్స్‌ చెప్పారు. భవనాల్లో(ఇండోర్‌) గాలి త్వరగా బయటకు వెళ్లదు కాబట్టి కరోనా రిస్కు అధికంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు. అమెరికాలో బార్లు, రెస్టారెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రాలు మారాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్నప్పుడు కచి్చతంగా మాస్కు ధరించాలని చెప్పారు. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా, బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement