పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు జీవరాశులే కాదు ఇంకో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు విశ్వరూపం దాల్చి భూమి కూడా ఆవిరైపోతుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ స్టడీ మాత్రం జీవరాశులకు అంత టైంలేదని అంటోంది ఉన్నది కేవలం వంద కోట్ల ఏళ్లే అని హెచ్చరిస్తోంది!
హమ్మయ్య.. వందకోట్ల ఏళ్లు ఉంది కదా.. ఫర్వాలేదులే అనుకుంటున్నారా? మరి ఇదంతా ఎలా జరగబోతోందనేది తెలుసా?.. విశ్వంలోని అన్ని గ్రహాలతో పోలిస్తే భూమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మనం బతికి ఉండటానికి అత్యవసరమైన ఆక్సిజన్ వాయువుతో కూడిన వాతావరణమే. గాలిలో ఆక్సిజన్ ఉండేది 20 శాతమే అయినా.. అది లేకుంటే ప్రాణకోటి మనుగడ సాగించలేదు. అలాంటి ఆక్సిజన్ పరిస్థితిపై జార్జియా టెక్, టోహో యూనివర్సిటీలు సంయుక్తంగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. భూమ్మీది ఆక్సిజన్ వంద కోట్ల ఏళ్లలో మాయమైపోతుంది.
ఈ శాస్త్రవేత్తలు భూవాతావరణం, జీవ, భౌగోళిక పరిస్థితులన్నింటినీ సిమ్యులేట్ చేసి భూమి భవిష్యత్తును చూసే ప్రయత్నం చేశారు. సూర్యుడి వెలుగులో వచ్చే మార్పులు.. గాల్లోంచి నీటిలోకి, ఆ తరువాత రాయిలోకి చేరే క్రమంలో ఆక్సిజన్‌లో వచ్చే మార్పులు వంటివి పరిశీలించి ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాల్లో కొన్నింటిపై ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిగినా.. తాజా పరిశోధన మరింత స్పష్టంగా జరిగింది, సంక్లిష్టమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది.
మొత్తంగా సుమారు 110 కోట్ల ఏళ్ల తరువాత భూ వాతావరణంలోని ఆక్సిజన్ శరవేగంగా తగ్గిపోవడం మొదలవుతుందీ అని శాస్త్రవేత్తలు తేల్చారు. వయసు పెరుగుతున్న కొద్దీ సూర్యుడిలోని ఇంధనం ఖర్చవడం ఎక్కువై, ప్రకాశం పెరిగిపోవడం దీనికి కారణమవుతుందని అంచనా వేశారు. భూ ఉపరితలం బాగా వేడెక్కి, వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ముక్కలు చేస్తుందని, దానివల్ల భూమ్మీద పచ్చదనం అన్నది లేకుండా పోతుందని వారు చెబుతున్నారు. పచ్చదనం లేకుంటే మొక్కలు, చెట్లు వదిలే ఆక్సిజన్ తగ్గిపోతుందని గుర్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాగే..
భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతుండగా.. దాదాపు 240 కోట్ల ఏళ్ల క్రితమే వాతావరణంలోకి ఆక్సిజన్ వచ్చి చేరింది. మొక్కల మాదిరిగా అప్పట్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు కిరణ జన్య సంయోగ క్రియ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేశాయని.. తరువాత మొక్కలు పుట్టుకొచ్చి వాతావరణంలో ప్రాణవాయువు మోతాదు పెరిగిందని అంచనా. ఆక్సిజన్ పెరిగిన తర్వాతే ఏకకణ జీవుల స్థానంలో బహుకణ జీవులు, తర్వాత ఇతర ప్రాణులు ఆవిర్భవించాయి. సౌర కుటుంబానికి ఆవల జీవం ఆనవాళ్లు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యత ఏర్పడుతోంది.
సూర్యుడి లాంటి నక్షత్రం నుంచి తగినంత దూరంలో (మరీ చల్లగాగానీ.. మరీ వేడిగా కానీ లేని) ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. ఈ సమయంలో పలు కీలక అంశాలను పరిశీలించాలని తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆక్సిజన్ మొత్తం నశించిన తర్వాత వాతావరణంలో పేరుకుపోయే మిథేన్ వాయువు కీలక ఆధారాల్లో ఒకటని అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. శనిగ్రహానికి ఉన్న ఉపగ్రహం టైటాన్‌లో ఇప్పుడు కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ లెక్కన అక్కడ ఎప్పుడో ప్రాణికోటి ఉండే ఉంటుందన్న అంచనాలూ ఉన్నాయి.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment