బీజింగ్: లాక్‌డౌన్ పటిష్ట అమలు, కోవిడ్ భయాలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు చైనాకు చెందిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. రెస్టారెంట్లలోని ఎయిర్ కండీషర్లతో కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన ఎమర్జింగ్ ఇన్‌ఫెక్చువస్ డీసీజెస్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
ఒకే రెస్టారెంట్‌లో..
మూడు కుటుంబాలకు చెందిన 10 మంది కోవిడ్ పేషంట్లపై ఈ అధ్యయనం జరిగింది. వుహాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చైనాలోని గ్వాంజౌ పట్టణంలో ఉన్న రెస్టారెంట్‌లో జనవరి 24న భోజనం చేశాడు. ఐదు అంతస్థులు ఉన్న ఆ రెస్టారెంట్‌లో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ఉంది. అయితే, వెంటిలేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేదు. అతని పక్క టేబుళ్లపై మరో రెండు కుటుంబాలు కూడా లంచ్ చేశాయి. ఫిబ్రవరి 5న సదరు వ్యక్తికి జ్వరం, జలుబు వచ్చింది. అతనికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అతని పక్క టేబుళ్లపై భోజనం చేసిన ఇరు కుటుంబాల వారికి అదే రోజు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. అందరికీ పాజిటివ్ నిర్ధారణ అయింది.
(చదవండి: వారి వేతనం ముందు ప్రధాని పే ప్యాకేజ్ దిగదుడుపే..)
తుంపర్ల ద్వారానే.. కానీ
కోవిడ్-19 వ్యాప్తికి ప్రధాన కారణం వైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడిన తుంపర్లే. కోట్లాది వైరస్ క్రిములు ఉండే ఆ తుంపర్ల ద్వారానే కోవిడ్ ఇతరులకు సోకుతుంది. అయితే, బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటికొచ్చే తుంపర్లు గాల్లో కొద్ది క్షణాలే ఉంటాయని, అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవని స్టడీ స్పష్టం చేసింది. కానీ, ఏసీ ద్వారా గాలి వేగంగా పయనించినప్పుడు తుంపర్లు కొద్ది దూరం ముందుకు సాగి ఇతరులకు వైరస్ అంటించే అవకాశాలుంటాయని తెలిపింది. రెస్టారెంట్లలోనే ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దానికోసం.. టేబుళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం.. తగిన విధంగా వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఏసీ గాలి ద్వారానే పైన తెలిపిన ఇరు కుంటుంబాల సభ్యులకు వైరస్ సోకినట్టు అంచనాకొచ్చినట్టు పేర్కొంది.
(చదవండి: అమెజాన్‌లో కరోనా అలజడి)
కాగా, గతేడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ విజృంభణ ఫిబ్రవరి నెల నుంచి మరింత వృద్ధి చెంది దాదాపు అన్ని దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లక్షా 28 వేలకు పైగా ప్రజలు మరణించారు. 4 లక్షల 92 వేల మంది కోలుకున్నారు. ఇక కోవిడ్ కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో చైనాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 82, 295 కాగా.. 3,342 మంది ప్రాణాలు విడిచారు. 77,816 మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment