లండన్: పగటి కలలు.. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. మనసుకు ఉల్లాసం కలిగించడంతోపాటు విసుగు, ఒంటరితనం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి కలలను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. పగటి కలలతో మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని గతంలో పరిశోధనల్లో తేలింది.
పేదవాడు క్షణాల్లో ధనవంతుడిగా మారిపోవడం పగటి కలల్లోనే సాధ్యం. అయితే, ఇలాంటి కలలు ఒక పరిమితి వరకు అయితే ఫర్వాలేదు. మితిమీరితే అనర్థాలు తప్పవని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. మేల్కొని ఉన్నప్పుడు సగం సమయం కలల్లోనే గడిపితే వాటిని మితిమీరిన పగటికలలు అంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరగొచ్చు.అయితే..
ఇలాంటి వాటితో పలు మానసిక రుగ్మతలు తలెత్తుతాయట. ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్(ఓసీడీ) వంటి ముప్పు ఎదురవుతుందని సైంటిస్టులు గుర్తించారు. జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.5 శాతం మంది మితిమీరిన కలలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్(ఫాంటసీ డిజార్డర్) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందట.
ఇజ్రాయెల్ హైఫా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎలి సోమర్.. బ్రిటన్ సహాకారంతో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ డిజార్డర్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. ఇలాంటి కలల ద్వారా సానుకూలత కంటే.. ప్రతికూల ధోరణే మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ధ్యానం ద్వారా పగటి కలలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment