ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా! | World Suicide Prevention Day 2024: 64 percent of women commit suicide due to domestic violence | Sakshi
Sakshi News home page

World Suicide Prevention Day 2024: ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!

Published Tue, Sep 10 2024 1:00 AM | Last Updated on Tue, Sep 10 2024 9:43 AM

World Suicide Prevention Day 2024: 64 percent of women commit suicide due to domestic violence

నేడు వరల్డ్‌ సూయిసైడ్‌ ప్రివెన్షన్‌ డే

సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.

గృహహింసలో ప్రధానంగా...
గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.

మానసిక రుగ్మతలు
ఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్‌వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మద్యపానం వల్ల..
ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.

చేయూత అవసరం..
→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. 
→ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. 
→ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. 
→ ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.
→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.


– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

గమనిక:
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement