న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బురారీ ప్రాంతం లో ఉన్న ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకూ ‘ఉమ్మడి భ్రమ’ (షేర్డ్ సైకోసిస్) వంటి మానసిక వ్యాధి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ ‘ఉమ్మడి భ్రమ అంటే అది ముందు ఒక వ్యక్తికి మొదలై ఆ తర్వాత ఇతరులకు కూడా పాకుతుంది.
ఈ కుటుంబం విషయానికి వస్తే లలిత్ భాటియా తండ్రి చనిపోయినప్పటికీ.. తాను తన తండ్రితో మాట్లాడుతున్నట్లు భ్రమపడేవాడనీ, ఆ తర్వాత కుటుంబలోని మిగతా సభ్యులు కూడా ఆయనను నమ్మి, అందరూ కలిసి భ్రమపడేవారని మేం అనుమానిస్తున్నాం’ అని చెప్పారు.
మరోవైపు భాటియా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారితో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, కుటుంబ, వ్యక్తిగత విష యాలను ఎవరికీ తెలియనిచ్చే వారు కాదనీ, ఎవ్వరినీ తమ ఇంట్లోకి కూడా పిలిచేవారు కాదని ఇరుగుపొరుగువారు చెప్పారు. బురారీ ప్రాంతంలోని ఇంట్లో జూలై 1న ఒకే కుటుంబానికి చెందిన 11 మృతదేహాలు కనిపించి సంచలనంగా మారడం తెలిసిందే. 10 మృతదేహాలు పై కప్పుకు వేలాడుతుండగా, ఒక ముసలావిడ శవం మాత్రం నేలపై పడి ఉంది. ఇవి హత్యలా, లేక తాంత్రిక పూజలతో మోక్షం కోసం అందరూ ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
11 పైపుల కథేంటి?
మృతదేహాలు కనిపించిన ఇంటి గోడకు 11 పైపులు అమర్చి, వాటికి ఎలాంటి కనెక్షన్ ఇవ్వకపోవడం తమకు కూడా వింతగా అనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. పైపులను నాలుగు నెలల క్రితమే అమర్చారని తెలిపారు. లోపలికి గాలి రావడం కోసం, ప్లైవుడ్ రసాయనాల నుంచి వచ్చే విషవాయువులను బయటకు పంపడం కోసం ఆ పైపులను ఏర్పాటుచేసినట్లు భాటియా కుటుంబసభ్యులు అప్పట్లో చెప్పారని స్థానికులు వెల్లడించారు.
అయితే ఆ 11 పైపులు అమర్చిన విధానం చూస్తుంటే కూడా వింతగా ఉంది. చనిపోయాక గాలితో కలిసి ఆత్మలు బయటకు వెళ్లేందుకే వారు ఆ పైపులను ఏర్పాటు చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. 11లో 7 పైపులు ఒక పరిమాణంలో, 4 పైపులు మరో పరిమాణంలో ఉన్నాయి. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
ఏడు పైపులను కొంచెం వంచి రంధ్రాలు నేలవైపుకు ఉండేలా అమర్చగా, నాలుగు పైపులు మాత్రం వంపు లేకుండా గోడ నుంచి చొచ్చుకొచ్చి అలాగే ఉండిపోయాయి. రెండు పైపులు మాత్రం దూరంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు వితంతువులున్నందునే ఇలా దూరంగా అమర్చి ఉంటారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment