ఇటీవల ఢిల్లీలో జరిగిన బురారీ కాండలో ఒకరి భ్రాంతి 11 మంది ప్రాణాలను బలితీసుకున్న ఘటనకు కళాచిత్రం.
మోక్షం ఇక్కడే ఉంది. అందమైన ప్రపంచం ఇదే. మన కుటుంబాలకు ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ పంచుకుంటే సగమవుతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపవుతుంది. కల పంచుకుంటే క్రాంతి అవుతుంది. కానీ భ్రాంతి పంచుకుంటే అశాంతి మిగులుతుంది. ఢిల్లీలో జరిగిన బురారీ కాండను మరచిపోలేం. ఒకరి ఉన్మాదం పదకొండు ప్రాణాలు తీసింది. అది పైశాచికత్వం కాదు... ఒక భ్రాంతి రోగం. ఒక మానసిక అంటువ్యాధి. ఇది ఒక పంచుకున్న భ్రమ..షేర్‌డ్ సైకోసిస్ వల్ల జరిగిందంటున్నారు నిపుణులు. మోక్షానికి తలుపు తెరవబోయి నరకాన్ని చూశారు. వ్యాధుల్లో రెండు రకాలుంటాయి. మామూలువి. అంటుకునేవి. మరి మానసిక సమస్యల్లో అంటువ్యాధులుంటాయా? ఉంటాయి. అరె... అదెలా సాధ్యం అనిపిస్తోందా? ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇది అంటువ్యాధి కానే కాదు. కానీ అంటువ్యాధే. అదెలాగో చూద్దాం.
ఒక కేస్ స్టడీ: ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతోకాలం కిందట నారాయణి దేవి భర్త చనిపోయాడు. మరణించినాయన కుటుంబపెద్ద కావడంతో ఆయన మృతి తర్వాత ఆ కుటుంబం అష్టకష్టాలు పడింది. కుటుంబ పెద్ద రెండో కొడుకైన లలిత్ భాటియా తరచూ ఓ మాట అంటుండేవాడు. నాన్న తనతో మాట్లాడుతున్నాడనీ, బిజినెస్ విషయంలో సలహాలు ఇస్తున్నాడని చెప్పేవాడు. ఆ సలహాలను తాము పాటిస్తూ ఉండటం వల్ల బిజినెస్ పుంజుకొని తమ కష్టాలు గట్టెక్కాయని ఆయన నమ్ముతుండేవాడు.
ఈ నమ్మకం మరింత పెరిగింది. దాంతో 2015 నుంచి అతడు తాంత్రిక పూజల్లో నిమగ్నం కావడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో అతడి పూజలు మరింత ముమ్మరమయ్యాయి. అందులో వటవృక్ష పూజ అనే ఓ తంతును నిర్వహిస్తే... తమకు మోక్షం తప్పదని అతడు నమ్మాడు. అతడే కాదు... గతంలో బిజినెస్ బాగుపడటం, తమ జీవనశైలి మెరుగుపడటంతో లలిత్‌భాటియా తండ్రే అతడితో మాట్లాడుతున్నాడని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలు పెట్టారు. దాంతో లలిత్ చెప్పే వటవృక్షపూజ కాన్సెప్ట్‌నూ అందరూ విశ్వసించారు. కుటుంబ సభ్యులందరికీ మోక్షం కోసం ఈ వటవృక్షపూజలో భాగంగా... చెట్టుకు ఉండే ఊడల్లాగా ఉరి వేసుకొని వేలాడాలనీ, దాంతో ఇప్పుడు తాము మరణించబోమనీ, అయితే వాస్తవంగా చనిపోయినప్పుడు తమకు మోక్షం తప్పదంటూ లలిత్ చెప్పిన దాన్ని అందరూ గుడ్డిగా నమ్మారు. పూజలో భాగంగా తమ నవరంధ్రాలనూ మూసిపెట్టాలని కళ్లకు గంతలు కట్టుకున్నారు. నోట్లో గుడ్డలు, చెవుల్లో దూది కుక్కుకున్నారు. పూజలో భాగంగా అందరూ ఉరేసుకున్నారు. తమ ఆత్మలు గాలిలో కలిసి, మళ్లీ తమ శరీరంలోకి ప్రవేశించడానికి 11 మంది కోసమంటూ పదకొండు గొట్టాలనూ ఏర్పాటు చేసుకున్నారు.ఇంతాచేసి ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు.
అయితే ఈ వటపూజను ఎంతగా నమ్మారంటే... తమ పూజాక్రతువు పూర్తయ్యాక, తమలాగే కష్టాలు పడుతున్న మరో కుటుంబంతోనూ ఈ వ్రతం చేయించాలని వారనుకున్నారు. అంత మూఢంగా, గాఢంగా వారీ తాంత్రిక తంతును విశ్వసించారన్నమాట. లలిత్ భాటియా నమ్మాడు సరే... మరి మిగతావారి విచక్షణ ఏమైంది? ఏమైందంటే... సైంటిఫిక్‌గా చెప్పాలంటే తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేశాడు. అలా తన సైకోసిస్‌ను మిగతావారికీ షేర్ చేసిన ఈ వ్యాధి పేరే ‘‘షేర్‌డ్ సైకోసిస్’’. మానసిక వైద్యశాస్త్రంలో ఒకింత అరుదైన వ్యాధే. కానీ ఎంతో ప్రమాదకరం. ఎంతగానంటే... ఏ డిప్రెషన్‌లోనో కూరుకుపోతే... అలా దానికి గురైనవాడే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ‘షేర్‌డ్ సైకోసిస్’లో అతడితో పాటు మరో సమూహం సమూహమే బలయిపోతుంది. అలా బలిచేసిన ఆ ‘షేర్‌డ్ సైకోసిక్’ రుగ్మత గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
అసలు ‘షేర్‌డ్ సైకోసిస్’ అంటే ఏమిటీ?
ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్‌డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన ఒక ఫ్రెంచ్ పేరు ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ (జౌ జ్ఛీ ్చ ఛ్ఛీu్ఠ) అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. బురారీ ఆత్మహత్యల సంఘటనలో అది ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ వరకు వచ్చి ఆగింది. అదే వారు సంకల్పించినట్టుగా మరో కుటుంబాన్నీ ప్రభావితం చేసి పూజకు ఉసిగొలిపి, ఆ కుటుంబం మరణానికీ కారణమయ్యుంటే అప్పుడది ‘ఫోలీ ఎ ప్యాసియర్స్’ అయి ఉండేది. దీన్ని ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్‌ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. మొట్టమొదట భ్రాంతులకు గురయ్యే రోగిని ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ఇండ్యూసర్’ అని అంటారు. అంటే పై కేస్‌స్టడీలో లలిత్ భాటియా ‘ద ప్రైమరీ కేస్’ లేదా ఇండ్యూసర్ అన్నమాట. ఆ తర్వాత అతడి భ్రాంతులకు పొరుగు ఉన్న ఆరోగ్యవంతులూ ప్రభావితులైపోతారు. ఇలా తర్వాత ప్రభావితులయ్యే వారిని ‘ద సెకండరీ’ లేదా ‘యాక్సెప్టార్’ లేదా ‘అసోసియేట్’ అంటారు. ఇక్కడ మరో విచిత్రం ఉంది. ఒకరిపై ఒకిరికి ఎలాంటి ప్రభావాలూ లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకేలాంటి భ్రాంతులకు లోనైతే ఆ కండిషన్‌ను ‘ఫోలీ సైమల్టేనీ’ అంటారు.
ఏదైనా కారణాల వల్ల ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ద ఇండ్యూసర్’ భ్రాంతులకు గురికావడం లేదనుకోండి. క్రమంగా సెకండరీ/యాక్సెప్టార్/అసోసియేట్స్ కూడా భ్రాంతుల నుంచి ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేసి పూర్తిగా నార్మల్ అయిపోతారు. ఏదైనా కారణం చేత ఈ తరహా సైకోసిస్‌కు గురైనవారు భ్రాంతుల వల్ల వేర్వేరుగా హాస్పిటల్‌లో చేరారనుకోండి. అప్పటివరకూ ‘ద ఇండ్యూస్‌డ్’ తాలూకు ప్రభావం లేకపోవడంతో... ‘ద అసోసియేట్’కు ఎలాంటి వైద్య చికిత్సా అవసరం లేకుండానే ఆటోమేటిగ్గా నయమైపోతుంది.
ఎవరెవరిలోనంటే...?
నిజజీవితంలో దీనితో బాధపడ్డవారి కేసులు చూస్తే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి. స్వీడన్‌కు చెందిన ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు ఇంగ్లాండ్‌కు వచ్చారు. వాళ్ల పేర్లే ఉర్సులా ఎరిక్సన్, సబీనా ఎరిక్సన్. లండన్ వెళ్లడం కోసం లివర్‌పూల్‌లో బస్ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా... వారి ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో బస్‌డ్రైవర్ వాళ్లను బస్ ఎక్కనివ్వలేదు. అక్కడి ‘హైవేస్ ఇంగ్లాడ్ ట్రాఫిక్ ఆఫీసర్లు’ వాళ్లను ఆ తర్వాతి బస్‌లో ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా... తొలుత ఉర్సులా ఉన్నట్టుండి విపరీతమైన ట్రాఫిక్ ఉన్న రోడ్డుపైకి అకస్మాత్తుగా పరుగెత్తి లారీని ఢీకొనబోయింది. అంతలోనే ఆమె చెల్లి సబీనా కూడా రోడ్డు మీదికి పెరుగెత్తింది. వీళ్లలో ఉర్సులా ‘ద ప్రైమరీ కేస్’ అని, సబీనా ‘సెకండరీ’ అని.. వాళ్లిద్దరూ ‘ఫోలీ ఎ డ్యూయో’కు లోనయ్యారని ఆ తర్వాత తేలింది. ఇలా అనేక కేసులను పరిశీలించనప్పుడు బంధువర్గంలోని వారు, అన్నదమ్ముల లేదా అక్కచెల్లెళ్ల పిల్లలు (కజిన్స్) ఈ ‘షేర్‌డ్ సైకోసిస్’కు ఎక్కువగా గురవుతారని తేలింది.
ఎందుకు, ఎలా...?
ఈ ‘షేర్‌డ్ సైకోసిస్’కు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు ‘సైకోసిక్’కు ఎలా గురవుతారో అర్థం చేసుకుందాం. మన మెదడులో సుమారు పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని నాడీకణాలు ఉంటాయి. సన్నటి వైర్లలాంటి వాటితో ఒక్కో కణానికి మళ్లీ పక్కనున్న కణాలతో పదివేల నుంచి లక్ష వరకు కనెక్షన్లు ఉంటాయి. ఒక్కో కనెక్షన్‌ను ఒక్కో వైర్ అనుకుంటే మెదడులో మొత్తం పది పక్కన 16 సున్నాలు పెడితే ఎంత విలువ వస్తుందో... వైర్లలాంటి అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఈ వైర్ల మధ్య కొన్ని చోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. అలాగే కణాల్లోనూ కొన్ని రసాయనాలు స్రవిస్తుంటాయి. కణాల మధ్యన ఉండే రసాయనాలను ఫస్ట్ మెసెంజర్స్ అనీ, కణాల్లోపలి రసాయనాలను సెకండ్ మెసెంజర్స్ అని అంటారు. ఈ రసాయనాలు, వైర్ల ద్వారా ఒక్కోకణానికి మరో కణంతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. వాటి ద్వారానే మన ఆలోచనలు పుడుతుంటాయి. మారుతుంటాయి. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి.
మెదడు రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడులో ఈ రసాయనాల మార్పులు జరిగిన వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. నార్మల్ వ్యక్తికి ఏమీ జరగకపోవడం ఎంత వాస్తవమో... తమ రసాయన మార్పుల అనుభూతుల వల్ల వాళ్లకు ఏదో జరగడం కూడా అంతే వాస్తవం. అందుకే వాళ్ల భ్రాంతులను మనం కొట్టిపారేయకూడదు. అలా జ్ఞానేంద్రియాలు చూడకపోయినా సంఘటనను జరిగిన అనుభూతి పొందడాన్ని ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఇక సైకోటిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరగకపోయినా అది జరిగిందంటూ మనసులో దృఢంగా నమ్మడాన్ని ‘డెల్యూషన్’ అంటారు.
ఇలాంటి భ్రాంతులు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా జరుగుతాయి. అయితే వ్యాధికి లోనైనవారిలో అలాంటివేవీ తీసుకోకపోయినా ఈ భ్రాంతులు కలుగుతాయి. ఇలా సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితం చేస్తే పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్‌డ్ సైకోసిస్’ అంటారు. ఈ విధంగా షేర్‌డ్ సైకోసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుందన్నమాట. ఈ వ్యాప్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒక కుటుంబంలోని డామినెంట్ పర్సనాలిటీ... అదే కుటుంబలో సబ్మిసివ్ పర్సనాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఆ సబ్మిసివ్ పర్సనాలిటీ, డామినెంట్ పర్సనాటిటీపై ఆధారపడి చాలాకాలం జీవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సబ్మిసివ్ పర్సనాలిటీ... తన డామినెంట్ పర్సనాలిటీతో తేలిగ్గా ప్రభావితమవుతుంది. ఉగ్రవాదుల నేతలు తమ ప్రయోజనాల కోసం సబ్మిసివ్ పర్సనాటిటీ ఉన్న అనుచరులను కూడా ఇలాగే ప్రభావితం చేస్తుంటారు.
ఈ జబ్బుపైన ఒక సినిమా కూడా...
షేర్‌డ్ సైకోసిస్ అంశంగా ఆరోన్ రాటింగాస్ అనే అమెరికన్ డైరెక్టర్ 2011లో ‘అపార్ట్’ అనే సినిమా కూడా తీశాడు. దీని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోలీ ఎ డ్యూయోతో బాధపడుతున్న ఇద్దరి నిజజీవిత సంఘటన ఆధారంగా సినిమా తీసినట్లు చెప్పాడు.
లక్షణాలు ఏమిటి / గుర్తించడం ఎలా:
మద్యం, మాదకద్రవ్యాలు ఏమీ లేకుండానే ఒకరు తమకు ఏవేవో వినిపిస్తున్నాయనీ, ఎవరెవరో కనిపిస్తున్నారని చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ప్రైమరీలో కనిపిస్తాయి. వాటితో కుటుంబ సభ్యులూ ప్రభావితమవుతుంటారు. ఉదాహరణకు తాము పేదరికంలో బాధపడుతున్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తే... తమకు కలిసి వస్తుందనీ, దాంతో స్విమ్మింగ్‌పూల్ వంటి ఇంట్లో తాము ఉండబోతామని అనిపిస్తుంది. వ్యాపారంలో యాదృచ్చికంగా కలిసి వచ్చాక... తాము స్విమ్మింగ్‌పూల్ ఉన్న ఇంట్లోనే చేరారనుకోండి. ఇక అప్పట్నుంచి ప్రైమరీ తనకు ఏవేవో మాటలు వినిపిస్తుంటాయనీ, తనకు ఎవరెవరో కనిపిస్తుంటారనీ, తనకు వినిపించే ఆదేశాలను పాటిస్తే.. అంతా విజయమేనని నమ్ముతుంటారు.
నిర్ధారణ : షేర్‌డ్ సైకోసిస్ నిర్ధారణకు ఇదమిత్థంగా వైద్య పరీక్షలేమీ అందుబాటులో లేవు. అయితే ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధారణ చేయడం కోసం ఒక్కోసారి రోగులకు బ్రెయిన్ ఎమ్మారై, ఇతర రక్తపరీక్షలు చేయిస్తుంటారు. అవన్నీ నార్మల్‌గా ఉండి కూడా రోగి వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ), ధోరణి, ప్రవర్తలను సైకియాట్రిస్టులు పరిశీలిస్తారు. వారు ఇతరులను ప్రభావితం చేసేలా భ్రాంతులకు లోనవుతున్నట్లు తెలుసుకున్నప్పుడు దాన్ని షేర్‌డ్ సైకోసిస్‌గా సైకియాట్రిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు.
నివారణ / చికిత్స : కుటుంబంలో ఒకరు ఇలా భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు గ్రహిస్తే దీన్ని పసిగట్టడం తేలికే. అయితే వారు కూడా ప్రైమరీతో పాటు ప్రభావితమైతేనే సమస్య. దీనికి కౌన్సెలింగ్‌తోనూ, కుటుంబానికి ఇవ్వాల్సిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. అలాగే యాంగై్జటీని తగ్గించే మందులు, యాంటీసైకోటిక్ మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేస్తారు. సామాజిక సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు ఈ తరహా భ్రాంతులకు గురికావడం చాలా తక్కువని సైకియాట్రిస్టులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment