World Suicide Prevention Day
-
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
పరువు కంటే ఎప్పుడూ ప్రాణమే ఎక్కువ..
ఇష్టమైన దుస్తుల మీద మరక పడితే ఏం చేస్తాం?మొదట సబ్బుతో రుద్దుతాం. ఆ తర్వాత నిమ్మకాయతో రుద్దుతాం.ఆపై పెట్రోల్‌తో రుద్దుతాం. ఇంకా ఏవైనా మరకలు పోగొట్టేలిక్విడ్లు దొరికితే వాటితోనూ రుద్ది రుద్ది దూరం చేస్తాం.అంతే తప్ప ఆ దుస్తులను దూరం చేసుకుంటామా?ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా మెదడులో మరకలాంటిది.దానిని రుద్ది రుద్దీ దూరం చేసుకోవాలి. ధైర్యంతో, స్థైర్యంతో, ఓర్పుతో, స్నేహితుల సాయంతో, బంధువుల బలంతో, కుటుంబల సభ్యుల భరోసాతో.ఉన్నది ఒక్కటే జన్మ. జీవించాలి. పోరాడాలి.ఆశను విడువక ఆవలి తీరం చేరుతూనే ఉండాలి. లైఫ్‌కు ఎస్. డెత్‌కు నో. సరిగ్గా వారం క్రితం బాలీవుడ్లో ఒక సినిమా విడుదలైంది.పేరు ‘చిచోరే’.అందులో ఇంటర్ పాసైన కొడుకుపై తండ్రి జె.ఇ.ఇలో ర్యాంకు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పెడతాడు. ఆ కొడుకుకు అదో పెద్ద భారం అవుతుంది. చదువుకునే సమయంలో తండ్రి ఒక ర్యాంకర్. కనుక తాను కూడా ర్యాంకర్ కావాలేమో, లేకుంటే తండ్రి పరువు పోతుందేమోనని ఆ కుర్రాడు భయపడతాడు. అతడు భయపడినట్టే ర్యాంకు రాదు. ఇంకేముంది... జీవితమే ముగిసిపోయింది అనుకుని ఎనిమిదో అంతస్తు నుంచి ఒక్క దూకు దూకేస్తాడు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న కొడుకు దగ్గర కూచున్న తండ్రి, తన తప్పును తెలుసుకొని ‘ఓడిపోవడం నేరం కాదు. నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను. కాకపోతే నీకు చెప్పలేదంతే’ అని తన ఫెయిల్యూర్స్‌ను చెప్పడం మొదలుపెడతాడు. ఆ ఫెయిల్యూర్స్‌ను తాను ఎలా ఫేస్ చేశాడో చెప్తాడు. అవి వింటూ కొడుకు గిల్ట్ నుంచి బయటపడి బతకాలన్న ఇచ్ఛ పొందుతాడు.ఈ సినిమాలో తండ్రి ఒక మాట అంటాడు. ‘మన పిల్లలు గెలిచాక ఏమేం చేయాలో మనందరి దగ్గరా ప్లాన్స్ ఉంటాయి. కాని ఒకవేళ ఓడితే ఏం చేయాలో ఏ ఒక్కరి దగ్గరా ఆలోచన ఉండదు’ అని.ఈ ఆలోచన అందరూ చేస్తే మొన్న జరిగిన ఇంటర్ పిల్లల ఆత్మహత్యల్లాంటివి జరగనే జరగవు. ‘త్రీ ఇడియట్స్’ కూడా ఈ పాయింట్‌నే డిస్కస్ చేస్తుంది. అందులో ప్రాజెక్ట్ పూర్తి కాని ఐఐటి కుర్రాడు ప్రొఫెసర్ తొందరపెడుతున్నాడని ఆత్మహత్య చేసుకుంటాడు.‘ఇది మన విద్యా వ్యవస్థ చేసిన హత్య’ అని మరో స్టూడెంట్ ఆమిర్ ఖాన్ అంటాడు.పిల్లలను ఆత్మహత్యలకు పురిగొల్పడంలో మన పాత్ర ఎంత అనేది ఆలోచించాలి.చచ్చిపోతే తప్ప ముగింపు లేదు అనే మూలకు నెట్టడం గురించి చర్చించాలి.ఒకటో తేది జీతం వచ్చే ఉద్యోగం చేస్తే తప్ప, అందుకు అనువైన చదువు చదివితే తప్ప, అందుకు అనువైన ర్యాంకు తెచ్చుకుంటే తప్ప బతకలేవు, బతకనివ్వము అని చెప్పడం ఎంత అన్యాయమైన విషయమో ఆత్మవిమర్శ చేసుకొని చర్చించాల్సిన సంగతి. తెలుగు సినిమా ప్రేక్షకుడు తొలిసారి ఉలిక్కిపడింది ఒక కన్నతల్లి ఆత్మహత్యాయత్నానికి. ఆమె తానొక్కతే మరణించడానికి ప్రయత్నించదు. చనిపోయే ముందు కడుపున పుట్టిన, బంగారం లాంటి ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోబోయింది. పిల్లలు చనిపోయారు. తాను బతికింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు, పిల్లలకు విషం ఇచ్చినందుకు విచారణ ఎదుర్కొంది. ఆ సినిమా పేరు ‘మనుషులు మారాలి’. అప్పట్లో ఒక విమర్శ ఎదురైంది. ఆ సినిమాలో హీరోయిన్ శారద చదువుకున్న స్త్రీ. కష్టాలు చుట్టుముట్టినప్పుడు, భర్త తోడు లేకుండా పోయినప్పుడు, ట్యూషన్లు అయినా చెప్పుకొని బతకవచ్చు. ఆ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్లకు ఏదో ఒక ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయకుండా చావును పరిష్కారంగా వెతకడం ఏమిటా అని?శారద తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు సానుభూతి చూపించి ఉండవచ్చు. కాని మెచ్చరు. లోలోపల దానిని స్వీకరించరు. శారద పోరాడి ఉంటే ఒక్క ఎనిమిది పదేళ్లు కష్టపడి ఉంటే ముగ్గురు పిల్లలే ఆమె ఆస్తి అయి ఉండేవారు. ఇలాంటి పరిస్థితే ‘మాతృదేవోభవ’లో వచ్చినప్పుడు హీరోయిన్ మాధవి ఎటువంటి పరిస్థితిలోనూ ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకోదు. భర్త చనిపోతే, తాను కేన్సర్ బారిన పడి మృత్యువుకు దగ్గర అవుతుంటే వారిని దత్తత ఇద్దామనుకుంటుందే తప్ప, వాళ్ల ప్రాణం నిలబెడుతుందే తప్ప చంపి చచ్చిపోవాలనుకోదు. సమాజం ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలను అక్కున చేర్చుకుందన్న విషయం, అక్కున చేర్చుకుంటుందన్న ఆశ ఈ సినిమా నుంచి తప్పిపోదు. ‘మరో చరిత్ర’ విడుదలైనప్పుడు తెలుగులో, తమిళంలో విశేషంగా హిట్ అయ్యింది. అందులో ప్రేమికులైన కమల్ హాసన్, సరిత ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఇదే సినిమా హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా విడుదలైనప్పుడు ఒక విమర్శ వినిపించింది. ‘దర్శకుడు బాలచందర్ తన హీరోకు ఇచ్చే క్యారెక్టర్ ఇదా? అతన్ని దుండగులు కొట్టారు. కత్తితో పొడవ లేదు. ఆమె అత్యాచారానికి గురైంది. శక్తి కూడదీసుకొని వారు రోడ్డు మీదకు వెళ్లి ఉంటే సహాయం అంది ఉండేది. అత్యాచారానికి గురైన ఆమెను స్వీకరించి ఆమెకు ప్రాణం పోసే ప్రయత్నం హీరో ఎందుకు చేయలేదు? అత్యాచారం జరిగింది అనగానే అంతా ముగిసిపోయినట్టే అని ఆత్మహత్యకు ఎందుకు పురిగొల్పాడు’ అని. బాలచందరే తీసిన ‘డాన్స్‌మాస్టర్’ సినిమాలో కమల్ హాసన్, రేఖ పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించలేదని సినిమా ప్రారంభంలోనే ఒక జలపాతంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆమె చనిపోతుంది. అతడు బతకుతాడు. ఆమె చనిపోయినా తాను బతికి ఉన్నానన్న గిల్ట్ అతణ్ణి కాలుస్తూ ఉంటుంది. ఇవన్నీ తొందరపాటు నిర్ణయాల తలనొప్పులు. ప్రేమికుల కోసం చావు రెడీగా టేబుల్ మీద పెట్టబడి ఉంటుంది అని చెప్పడం కొన్ని సినిమాలలో చూపారు. కాని ప్రేమకు సంబంధించిన అన్ని పర్యవసానాలకు సిద్ధమయ్యి అందులో దిగాలి, దిగి ఎదుర్కోవాలి అని చెప్పడంలో సినిమా చాలాసార్లు సక్సెస్ అయ్యింది కూడా. చచ్చిపోతామని తెలిసినా కేన్సర్ పేషెంట్లైన నాగార్జున, గిరిజ ‘గీతాంజలి’లో ప్రేమించుకోవడం మానరు. స్ఫూర్తి పొందాల్సింది అలాంటి సినిమాల నుంచే. టీనేజ్ క్రష్లను, తెలిసీ తెలియని వయసులో కలిగే శారీరక ఆకర్షణల పట్ల యువత ఎంత ఎరుకతో ఉంది? వారికి ఎరుక కలిగించాల్సింది ఎవరు? వారి ఇన్నోసెన్స్‌ను వాడుకోవాలని చూస్తున్నది ఎవరు? ‘గుప్పెడు మనసు’ సినిమాలో వివాహితుడైన శరత్‌బాబుతో, టీనేజ్ అమ్మాయి సరిత ఆకర్షణలో పడుతుంది. దాని వల్ల ఆమె మనసు డిస్ట్రబ్ అవుతుంది. అతని కాపురం ప్రమాదంలో పడుతుంది. చివరకు ఎలాగోలా అతడు కాపురం నిలబెట్టుకుంటాడు. కాని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అతడు బానే ఉన్నాడు. నష్టపోయింది ఆ అమ్మాయి. దాని బదులు కష్టమైనా సరే ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని కొంతకాలం దిక్కుతోచని ప్రయాణాలు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.సమస్య వచ్చినప్పుడు సమస్యకు సమీపంగా తచ్చాడి లాభం లేదు. దూరం జరిగి పై నుంచి, బయటి వ్యక్తిగా చూస్తే పరిష్కారం కనపడుతుంది.పరిష్కాలు ఎప్పుడూ వంద ఉంటాయి.చావు మాత్రం ఒక్కటే.ఆత్మహత్య అంటే ఒకటిని వందతో సమానం చేయడం. చాలా మామూలు లెక్కలు తెలిసినవాళ్లు కూడా ఈ తప్పు చేయరు. మరి ఎందుకు చేస్తున్నట్టు? పూరి జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో సినిమా మొదట్లోనే హీరో రవితేజా, హీరోయిన్ తనూ రాయ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది. ఆ తర్వాత వాళ్లు జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక్కటవుతారు. చనిపోయి ఉంటే ఆ క్షణానే సమాధి రాళ్లుగా మారి ఉండే ఆ యువతీ యువకులు నూరేళ్ల జీవితం పట్ల ఆశ పెంచుకోవడంతో ఆ ఆశ కొద్దో గొప్పో ప్రేక్షకులకు కూడా అందుతుంది.అయితే ఒక సదుద్దేశంతో, కేవలం ఆత్మహత్యల నివారణ ఎంత అవసరమో చెప్పడానికి, ఆత్మహత్యల ఆలోచనల్లో ఉన్నవారిని ఓదార్చి, ధైర్యం చెప్పే ఒక శ్రేయోభిలాషి అవసరం చూపడానికి తీసిన సినిమా ‘మీ శ్రేయోభిలాషి’. ఈ సినిమాలో రకరకాల సమస్యలతో బాధ పడుతున్న పదిమందిని కొండ మీదకు తీసుకెళ్లి అక్కడి నుంచి చచ్చిపోయే ఏర్పాటు చేస్తాడు ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్. గృహ హింస ఎదుర్కొనే గృహిణి, టెన్త్ పాస్ కాలేనేమోనని భయం ఉన్న కుర్రాడు, జబ్బు పడ్డానని నిరాశ పెంచుకున్న ఒక దురదృష్టవంతుడు, కొడుకు సరిగ్గా చూడట్లేదని వైరాగ్యం తెచ్చుకున్న ముసలి దంపతులు... వీరంతా ఈ సినిమాలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని రాజేంద్రప్రసాద్ వారికి ధైర్యం చెబుతాడు. వారిలో స్థైర్యం నింపుతాడు. సమస్యలను అర్థం చేసుకుంటే సగం బరువు తొలిగి పోతుందని తెలియచేస్తాడు. బతుకు మీద తీపి కలిగించడం కూడా అవసరం. ఆత్మహత్యల ఆలోచనల నుంచి బలంగా బయటపడేయగల సినిమా ఇది. జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు జీవితం మీద ఇచ్ఛను కలిగించే పాటలు తెలుగు సినిమాల్లో అనేకం ఉన్నాయి. డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ఈ పాట వాటిలో ఒకటిగా ఎన్నదగినది. ‘గోరంత దీపం’ సినిమాలో కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వంలో బాల సుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట అర్థవంతంగా రసస్ఫోరకంగా ఉండి మనసును తాకుతుంది. స్ఫూర్తి నింపుతుంది. ‘నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి’ అంటాడు కవి. ఉప్పదనం అనుభవిస్తేనే కదా బతుకు చేరువైనప్పుడు అదెంత తీపో అర్థమయ్యేది. ఆ పాట పూర్తి సాహిత్యం: పల్లవి: గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు చరణం: కరిమబ్బులు కమ్మే వేళ మెరుపుతీగే వెలుగు కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు దహియించే బాధల మధ్య సహనమే వెలుగు చరణం: కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు చిగురంత ఆశ జగమంత వెలుగు. స్వాతంత్య్రం ఇవ్వలేదని గాంధీజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఆమరణ దీక్షకు దిగి తన ప్రాణాలు నిలబెట్టి తీరవలసిన అగత్యాన్ని బ్రిటిష్‌వారికి కలిగించాడు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు, మానసిక కల్లోలాలు చెలరేగినప్పుడు, అస్సలు వెలుతురు కనిపించనప్పుడు, కనీస ప్రయత్నం చేయడానికి కూడా శక్తి సన్నగిల్లినప్పుడు మన ప్రాణాలు నిలిపే అగత్యాన్ని సమాజానికి ఇవ్వాలి. గోల చేయాలి. బంధువులకు చెప్పాలి. స్నేహితులకు మొరపెట్టుకోవాలి. వారే ఏదో ఒక మార్గం చూస్తారు. పరువు కంటే ఎప్పుడూ ప్రాణమే ఎక్కువ. ఇవాళ్టి అవమానం రేపటి సన్మానంతో తొలగిపోతుంది. కాకుంటే ఆ సన్మానం పొందేందుకు ప్రాణాలతో ఉండాలి.సమాజం పెట్టే వొత్తిడి, విలువలు, లక్ష్యాలు, బాధ్యతలు, బలహీనతలు, భావోద్వేగాలు ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు సమస్యలు తెచ్చిపెడతాయి. విరమించుకుంటే బాగుండు అనే ఆలోచన కలిగిస్తాయి.ఆ క్షణాన్ని దాటేయడమే చేయవలసింది. ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం’ అని పాట. పోరాటం ముగియదు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని మరో పాట. పశువులు ఆత్మహత్య చేసుకోవు. మనిషెందుకు చేసుకోవడం? బతుకుదాం. బతుకునిద్దాం.– కె -
జీవితం నీది ప్రాణం మాది
పొద్దున్నే పేపర్ తీయగానే రెండో పేజీలోనే ఒక వార్త. ఆత్మహత్య. టీవీ ఆన్ చేస్తే స్క్రోలింగ్‌లో ఒక వార్త. ఆత్మహత్య. హెడ్‌లైన్స్‌లో ఒక వార్త. ఆత్మహత్య. సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ పోస్ట్. ఆత్మహత్య. ప్రేమ విఫలమైందని ఒకరు, అమ్మ తిట్టిందని ఒకరు, ఉద్యోగం రాలేదని ఒకరు, అప్పుల బాధతో ఒకరు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో కూడా తెలీకుండా ఒకరు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే 8 లక్షల జీవితాల చుట్టూ ఉన్న లక్షల ప్రపంచాలు కన్నీళ్లు పెడుతున్నాయి. జీవితం ఆ జీవిస్తున్న వాళ్లదే. కాదని అనలేం. తమ చుట్టూ ఉండే ప్రపంచాలనిలా ఏడిపించే హక్కు ఎవరిచ్చారు?‘బతకాలి’ అన్న చిన్న ధైర్యం చాలదూ.. బతకడానికి! ‘వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే’ (సెప్టెంబర్ 10) సందర్భంగా..పరిస్థితులేవైనా, కారణాలేవైనా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో నూటికి తొంభై శాతం మంది మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురై, ‘డిప్రెషన్’ వల్లే చనిపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘ఈ కారణానికే ఆత్మహత్య చేసుకున్నారా?’’ అన్నవి కూడా రోజూ కనిపిస్తూనే ఉంటాయి. బ్లూ వేల్ గేమ్, వీడియో గేమ్ ఆడుతూ ఉద్రేకం చెంది చేసుకునే ఆత్మహత్యలు, టీవీ షోలతో ప్రభావితమై చేసేవి కొన్ని ఇలాంటివే! చావు బతుకులొక ఆట ‘చావు బతుకులొక ఆట’ అన్న మాట వేదాంతంలా చెప్పుకుంటారేమో కానీ, బతకడం, చావడం అన్నవి ఎప్పటికీ ఆటలు కాదు; కాకూడదు. అలా బతుకును ఒక ఆటలా మార్చేసుకొని, చావుతో సావాసం చేసే ఒక ఆట ‘బ్లూ వేల్ గేమ్’. రష్యాలో 2013లో మొదలైంది ఈ ఆట. ఫిలిప్ బుడెకిన్ అనే ఓ సైకాలజీ స్టూడెంట్ మొదలుపెట్టాడు. ఆటలో మొత్తం యాభై దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో రకమైన పని చేయమంటారు. అది చేస్తూ పోవాలి. ఆర్డర్స్ అన్నీ సోషల్ మీడియా ద్వారానే వస్తూంటాయి. పొద్దున్నే లేవమంటారు. కొండలు ఎక్కమంటారు. చేతిపై బ్లేడ్‌తో కోసుకొని తిమింగలం బొమ్మలను గీయమంటారు. అలా అలా ఒక్కో దశ దాటొచ్చాక, చివరి దశలో ఆత్మహత్య చేసుకోమంటారు. టెర్రస్ మీదకెక్కి దూకమనో, ఊపిరాడకుండా చేసుకోమనో, ఉరేసుకోమనో చెప్తూంటారు. అలా చాలా మంది చేశారు. ఇప్పటికే దీని మాయలో పడి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొదట్లో దీన్ని ఒక ఆట అని, అంటే చివరిదశలో ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని తెలియని వారే మొదలుపెట్టారు. అసలు విషయం అర్థమయ్యాక కొంతమంది బయటకు వచ్చినా ఇంకొందరు మాత్రం అదే భ్రాంతిలో ఉండిపోయి ప్రాణాలు తీసుకున్నారు. ఇండియాలో ఈ ఏడాదే బ్లూ వేల్ గేమ్ ఆత్మహత్య బయటకు వచ్చింది. జూలై 31, 2017న ముంబైలోని అంధేరీలో ఓ 14 ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ గేమ్ వల్లనే కేరళలో ఓ టీనేజ్ యువకుడు, మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బ్లూ వేల్‌కి సంబంధించి కొన్ని ఉదంతాలు బయటకు వచ్చాకే ఈ అత్మహత్యలు జరిగాయి. ఈ ఆట ఆడేవారికి ఉన్న డిప్రెషన్‌ను మరింత పెంచేందుకు, ఆత్మహత్య దాకా ప్రేరేపించేందుకు వేదికే బ్లూ వేల్ గేమ్. చావాలన్న ఆలోచన మొదట్నుంచీ ఉన్నవారినే ఈ గేమ్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియాకు విపరీతంగా అడిక్ట్ అయిపోవడం కూడా ఈ గేమ్‌కు ఆకర్షితులవ్వడానికి ఓ కారణంగా చెబుతున్నారు. అలా ఆకర్షితుడైన కోల్‌కతాకు చెందిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ చివరి దశకు వచ్చి, ఆత్మహత్య చేసుకునే సమయానికి స్నేహితుల సహాయంతో బయటపడ్డాడు. తమిళనాడులో విఘ్నేశ్ అనే పంతొమ్మిదేళ్ల కుర్రాడు బ్లూవేల్ గేమ్‌లోనే చిక్కుకొని చనిపోయాడు. అతడి సూసైడ్ నోట్లో ‘‘ఇదొక గేమ్ కాదు, డిజాస్టర్. ఇందులోకి వెళ్లడం వరకే. బయటపడేది జరగని పని.’’ అని రాశాడు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆలోచనలు మనిషిని బలహీనపరిస్తే ఎక్కడికి చేరుకుంటాడో! తల్లిదండ్రులు పిల్లల సోషల్ మీడియా ఎకౌంట్స్ పైన, వారు తరచూ ఎలాంటి ఆటలకు ఆకర్షితులు అవుతున్నారన్న విషయంపైనా శ్రద్ధ పెడితే ఇలాంటివి కాస్త తగ్గించవచ్చు. ఆటలో క్యారెక్టర్ చనిపోయిందని.. సోషల్ మీడియాకు అడిక్ట్ అయి, అక్కడి డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఇలా ఉంటే, వీడియో గేమ్స్ బారిన పడి ఆత్మహత్య చేసుకునే వారు కూడా చాలామందే ఉన్నారు. బశ్కోర్టోస్తాన్కు చెందిన రుస్తమ్ అనే పద్నాలుగేళ్ల బాలుడికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. తల్లిదండ్రులు వారించినా గేమ్స్ ఆడటం మాత్రం వదిలిపెట్టలేదు. ‘డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్’ అన్న వీడియో గేమ్‌ను నిరంతరం ఆడేవాడు. ఒక దశలో తానే ఆ ఆటలో ఉన్న క్యారెక్టర్‌ను అని పూర్తిగా నమ్మేశాడు. తల్లిదండ్రులు ఊళ్లో లేని రోజుల్లో 22 రోజుల పాటు వీడియో గేమ్ ఆడుతూనే కూర్చున్నాడు. గేమ్‌లో తన క్యారెక్టర్ చనిపోయింది. ఇది రుస్తమ్‌ను విపరీతంగా కలచివేసింది. అప్పటికే గేమ్‌లో తన క్యారెక్టర్‌కు దెబ్బ తగిలినప్పుడల్లా తనూ గాయం చేసుకున్నాడు. చివరగా ఆ క్యారెక్టర్ చనిపోయిందని తెలిసి, ఇంకేం ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతూ కూడా ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు ఇలాగే తమ ప్రాణాలు తీసుకున్నారు. మితిమీరిన హింస, అందులో ఉండే క్యారెక్టర్‌ను పూర్తిగా ఓన్ చేసుకోవడం వంటివి ఇలాంటి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వీడియో గేమ్స్ ప్రభావంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 12–17ఏళ్ల వయసున్న వారే ఎక్కువ. హింసను ప్రేరేపించే ఆటలను పిల్లలకు దూరంగా ఉంచడం ద్వారా ఇలాంటి ఆత్మహత్యలను నివారించవచ్చని నిపుణుల మాట. ఫోన్ కొనివ్వలేదని.. కరీంనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు లింగమూర్తి స్మార్ట్‌ఫోన్ కావాలని ఇంట్లో వాళ్లతో ఒకటే గొడవ పడ్డాడు. ఆ గొడవ ఏ స్థాయికి చేరిందంటే కొనివ్వకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇప్పుడే ఫోన్ కొనివ్వలేమని తల్లిదండ్రులు చెబితే, ఇంట్లో నుంచి కోపంగా పారిపోయి, తర్వాతి రోజు ఊళ్లోని ప్రభుత్వ పాఠశాల ముందు ఉరి వేసుకొని కనిపించాడు. చాలా సిల్లీగా కనిపించే ఇదొక్కటనే కాదు ఫోన్ పోయిందని, అక్క రిమోట్ లాక్కుందని, అమ్మ కొట్టిందని, ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యారని.. ఇలా ప్రతి చిన్నదానికీ ఆత్మహత్య చేసుకునే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిపోయి... డ్రగ్స్ మత్తు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ మత్తులో మునిగి తేలుతున్న వారిలో చాలామందికి ఒక దశకు వచ్చాక కనిపించే ఒకే ఒక్క ఆప్షన్ ఆత్మహత్య. ఒక్క ఇండియాలో రోజుకు సగటున పది మంది డ్రగ్స్ బారిన పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. యుక్త వయసులో ఉన్న వారే ఈ తరహా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. జీవితానికి అర్థమే లేదంటూ.. ఇంత పెద్ద ప్రపంచంలో నేనేంటీ? జీవితానికి అసలు అర్థమనేది ఉందా? బతకడం ఎందుకు? బతికి సాధించగలిగేది ఏముంటుంది? సమాజం ఇంకా మారలేదు, అదెప్పటికీ మారదు, ఎప్పటికైనా మారుతుందా? మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు? మనిషి ఎవరసలు? పేద, ధనిక భేదాలేంటి? ఇలా ఒక్కటనేంటీ బతకడం ఒక అర్థం లేని చర్యని భావించే వారెందరో! దీన్నే ఎక్సిస్టెన్షియల్ డిప్రెషన్‌గా పేర్కొంటారు. బాగా చదువుకున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఎక్సిస్టెన్షియల్ డిప్రెషన్ సోషల్ మీడియాను బాగా వాడుతోన్న యువతరానికి పాకిందన్నది కూడా సైకాలజీ స్టడీస్ చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలియని వ్యక్తుల నుంచి గుర్తింపు కోరుకోవడం, అవి దక్కకపోతే జీవితానికి అర్థం లేదనుకోవడం, ఆ తర్వాత డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కొద్దికాలంగా బాగా కనిపిస్తోంది. చెన్నైలోని ఓ 19 ఏళ్ల అమ్మాయి ఫేస్బుక్లో ఇలా గుర్తింపు కోసం ఎదురుచూసి తాను కోరుకున్నది దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. మియామిలో మరో అమ్మాయి ఇలాగే గుర్తింపు రాలేదని డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోను లైవ్‌లో ఓ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసింది. ఆత్మహత్య ఆలోచన చేస్తున్నవారిని ఇలా గుర్తించొచ్చు మనకేదైనా కష్టమొచ్చినప్పుడు తోడుగా ఉన్న వారితో ఒక్కసారి మాట్లాడితే మనసు కుదుటపడుతుంది. అమ్మను తల్చుకుంటేనో, నాన్నను పలకరిస్తేనో, స్నేహితుడితో కబుర్లు చెప్పుకుంటేనో తీరిపోయే కష్టాలే చాలా ఉంటాయి మనకు. మనుషులతో కలిసిపోతే డిప్రెషన్ అన్న ఆలోచనే రాదు. ఆత్మహత్యలకు ప్రధాన కారణం డిప్రెషనే! డిప్రెషన్‌ను జయిస్తే, చావాలన్న ఆలోచనను చంపేసినట్టే! అలాంటి డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ‘వన్ లైఫ్’ అలాంటిదే! ఎవ్వరికీ చెప్పుకోలేని, ఎవరికైనా చెప్పుకుంటే ఏమనుకుంటారోనన్న భయాలేవీ లేకుండా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి కష్టాలను చెప్పుకోవచ్చు. మాట్లాడితేనే కదా, మనసు కుదుటపడేదీ!! ‘వన్ లైఫ్’ హెల్ప్‌లైన్ నంబర్: 78930 78930 డిప్రెషన్ లక్షణాలు ఇవీ.. ♦ జనాలతో కలవడానికి ఇష్టపడకపోవడం. గ్రూపులకు దూరంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉండడం. ♦ డల్‌గా, జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉండడం. ♦ ఏదో ఒకవిధంగా ఇదే విషయాన్ని చెప్తూ ఉండడం. సోషల్ మీడియాలో ఎక్కువగా డిప్రెషన్ సంబంధిత పోస్ట్‌లు పెడుతూ ఉండడం. ♦ ఒంటరితనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. కొన్ని భయంకర నిజాలు... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన ఆత్మహత్యల లెక్కలు.. ప్రపంచవ్యాప్తంగా ఏటా జరుగుతున్న ఆత్మహత్యలు: 8 లక్షలు 2020కల్లా ఇది 15 లక్షలకు చేరుతుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా. సగటున ప్రతి నలభై సెకండ్లకు ఓ ఆత్మహత్య జరుగుతోంది. ♦ 15–29 వయసున్న వారి మరణాల్లో రెండో అతిపెద్ద కారణం ఆత్మహత్య. ♦ ఆత్మహత్యకు ఎక్కువగా కనిపిస్తోన్న కారణాలు: మానసిక రుగ్మత (ప్రధానంగా డిప్రెషన్, డ్రగ్స్, మద్యం వాడకంతో మారే మానసిక స్థితి), కుటుంబ సమస్యలు, అప్పులు, ప్రేమ, పెళ్లి గొడవలు, నిరుద్యోగం, పేదరికం. ♦ ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో ఆడవారి కంటే మగవారే ఎక్కువ. -
ఆత్మహత్యల్లో పోటీపదుతున్న రైతులు యువకులు
-
ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా...
ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా బంగారు మయమే... కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వైపు వెళుతుండడంతో దేశంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఆత్మహత్యల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతోందని, మూడు ఆత్మహత్యల్లో ఒకటి భారత్ దేశంలో నమోదవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ప్రతీ రెండు నిముషాలకొక ఆత్మహత్య జరుగుతోంది. కేవలం 2012 సంవత్సరంలోనే 2.5 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడినట్టు లెక్కలు తేలాయి. ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా 15 నుంచి 29 ఏళ్ల లోపువారే కావటం విశేషం. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే స్త్రీల కంటే మగవారే ముందు ఉన్నారు. ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఎక్కువగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణాలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటే భవిష్యత్ అంతా బంగారు భవితగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. చట్టప్రకారం ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, అందుకు ప్రోత్సహించడం నేరం. భారతీయ శిక్షా స్మృతి విభాగంలో 309 ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించినవారికి ఏడాది సాధారణ శిక్షతో పాటు జరిమానా విధింపబడుతుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఏ న్యాయవాది కూడా వాదించబోరు. అంతేగాక బెయిల్ కూడా మంజూరు కాదు. రాజీకూడా కుదుర్చుకోవడానికి అవకాశం లేనిది. *నేడు అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం -
ఒక్క క్షణం ఆలోచించండి
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అనంతపురం కల్చరల్: కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం అంటాడు ఓ కవి. జీవిత ప్రయాణాన్ని ముగించే మరణం సహజంగా ఉంటేనే ఆ జీవితానికి సార్థకత. అయితే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక, చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూస్తూ భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితులో అధికమవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, న్యూనతా భావం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశానికి గురైన వ్యక్తుల ఆలోచనలను కొద్ది సేపు మళ్లించగలిగితే మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయరని చెబుతున్నారు. ఇలాంటి మానసిక బలహీనుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిని మంచి మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ ఆత్మహత్యలను నివారించే మార్గాలను తెలియజేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ఆత్మహత్యలు చేసుకునేవారిలో చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్తత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభం. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆత్మహత్య భావన మదిలో కదలినపుడు ఒకసారి అలా బయటకు వెళ్లి ఏకాంతంగా గడపడం, శ్వాసపై ధ్యాస ఉంచి ఓ పది నిముషాలు నెమ్మదిగా ఉండడం ఉపయోగపడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు సైతం బలహీన మనస్తత్వమున్న వారిని ఒంటరిగా వదలడం మంచిది కాదు. జీవితం పట్ల అనురక్తిని పెంచేలా మాట్లాడడం ఉదాహరణలుగా ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలే కాదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనల్ని నమ్ముకున్న వారికి కడుపు కోత పెట్టడం ఎంతటి పాపమో ఆలోచిస్తే తప్పకుండా మనసు మారుతుంది. కళ్లు పోగొట్టుకున్న లూయీ బ్రెయిల్, కాళ్లు పోగొట్టుకున్న సుధాచంద్రన్ , అవిటి వాడైన సినీనటుడు నూతన్‌ప్రసాద్.. వీరందరూ సాధించిన చిరస్మరణీయ విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మళ్లీ బతకాలనే ఆశను చిగురింపజేస్తుంది.