జీవితం నీది ప్రాణం మాది | World Suicide Prevention Day - 10th Sep, 2017 | Sakshi
Sakshi News home page

జీవితం నీది ప్రాణం మాది

Published Sun, Sep 10 2017 12:34 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

జీవితం నీది ప్రాణం మాది - Sakshi

జీవితం నీది ప్రాణం మాది

పొద్దున్నే పేపర్‌ తీయగానే రెండో పేజీలోనే ఒక వార్త. ఆత్మహత్య. టీవీ ఆన్‌ చేస్తే స్క్రోలింగ్‌లో ఒక వార్త. ఆత్మహత్య. హెడ్‌లైన్స్‌లో ఒక వార్త. ఆత్మహత్య. సోషల్‌ మీడియాలో ఒక ట్రెండింగ్‌ పోస్ట్‌. ఆత్మహత్య. ప్రేమ విఫలమైందని ఒకరు, అమ్మ తిట్టిందని ఒకరు, ఉద్యోగం రాలేదని ఒకరు, అప్పుల బాధతో ఒకరు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో కూడా తెలీకుండా ఒకరు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే 8 లక్షల జీవితాల చుట్టూ ఉన్న లక్షల ప్రపంచాలు కన్నీళ్లు పెడుతున్నాయి.

జీవితం ఆ జీవిస్తున్న వాళ్లదే. కాదని అనలేం. తమ చుట్టూ ఉండే ప్రపంచాలనిలా ఏడిపించే హక్కు ఎవరిచ్చారు?‘బతకాలి’ అన్న చిన్న ధైర్యం చాలదూ.. బతకడానికి! ‘వరల్డ్‌ సూసైడ్‌ ప్రివెన్షన్‌ డే’ (సెప్టెంబర్‌ 10) సందర్భంగా..పరిస్థితులేవైనా, కారణాలేవైనా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో నూటికి తొంభై శాతం మంది మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురై, ‘డిప్రెషన్‌’ వల్లే చనిపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ‘‘ఈ కారణానికే ఆత్మహత్య చేసుకున్నారా?’’ అన్నవి కూడా రోజూ కనిపిస్తూనే ఉంటాయి. బ్లూ వేల్‌ గేమ్, వీడియో గేమ్‌ ఆడుతూ ఉద్రేకం చెంది చేసుకునే ఆత్మహత్యలు, టీవీ షోలతో ప్రభావితమై చేసేవి కొన్ని ఇలాంటివే!

చావు బతుకులొక ఆట
‘చావు బతుకులొక ఆట’ అన్న మాట వేదాంతంలా చెప్పుకుంటారేమో కానీ, బతకడం, చావడం అన్నవి ఎప్పటికీ ఆటలు కాదు; కాకూడదు. అలా బతుకును ఒక ఆటలా మార్చేసుకొని, చావుతో సావాసం చేసే ఒక ఆట ‘బ్లూ వేల్‌ గేమ్‌’. రష్యాలో 2013లో మొదలైంది ఈ ఆట. ఫిలిప్‌ బుడెకిన్‌ అనే ఓ సైకాలజీ స్టూడెంట్‌ మొదలుపెట్టాడు. ఆటలో మొత్తం యాభై దశలు ఉంటాయి. ఒక్కో దశలో ఒక్కో రకమైన పని చేయమంటారు. అది చేస్తూ పోవాలి. ఆర్డర్స్‌ అన్నీ సోషల్‌ మీడియా ద్వారానే వస్తూంటాయి. పొద్దున్నే లేవమంటారు. కొండలు ఎక్కమంటారు.

చేతిపై బ్లేడ్‌తో కోసుకొని తిమింగలం బొమ్మలను  గీయమంటారు. అలా అలా ఒక్కో దశ దాటొచ్చాక, చివరి దశలో ఆత్మహత్య చేసుకోమంటారు. టెర్రస్‌ మీదకెక్కి దూకమనో, ఊపిరాడకుండా చేసుకోమనో, ఉరేసుకోమనో చెప్తూంటారు. అలా చాలా మంది చేశారు. ఇప్పటికే  దీని మాయలో పడి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొదట్లో దీన్ని ఒక ఆట అని, అంటే చివరిదశలో ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని తెలియని వారే మొదలుపెట్టారు. అసలు విషయం అర్థమయ్యాక కొంతమంది బయటకు వచ్చినా ఇంకొందరు మాత్రం అదే భ్రాంతిలో ఉండిపోయి ప్రాణాలు తీసుకున్నారు. ఇండియాలో ఈ ఏడాదే బ్లూ వేల్‌ గేమ్‌ ఆత్మహత్య బయటకు వచ్చింది. జూలై 31, 2017న ముంబైలోని అంధేరీలో ఓ 14 ఏళ్ల బాలుడు అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ గేమ్‌ వల్లనే కేరళలో ఓ టీనేజ్‌ యువకుడు, మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బ్లూ వేల్‌కి సంబంధించి కొన్ని ఉదంతాలు బయటకు వచ్చాకే ఈ అత్మహత్యలు జరిగాయి. ఈ ఆట ఆడేవారికి ఉన్న డిప్రెషన్‌ను మరింత పెంచేందుకు, ఆత్మహత్య దాకా ప్రేరేపించేందుకు వేదికే బ్లూ వేల్‌ గేమ్‌. చావాలన్న ఆలోచన మొదట్నుంచీ ఉన్నవారినే ఈ గేమ్‌ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

సోషల్‌ మీడియాకు విపరీతంగా అడిక్ట్‌ అయిపోవడం కూడా ఈ గేమ్‌కు ఆకర్షితులవ్వడానికి ఓ కారణంగా చెబుతున్నారు. అలా ఆకర్షితుడైన కోల్‌కతాకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ చివరి దశకు వచ్చి, ఆత్మహత్య చేసుకునే సమయానికి స్నేహితుల సహాయంతో బయటపడ్డాడు. తమిళనాడులో విఘ్నేశ్‌ అనే పంతొమ్మిదేళ్ల కుర్రాడు బ్లూవేల్‌ గేమ్‌లోనే చిక్కుకొని చనిపోయాడు. అతడి సూసైడ్‌ నోట్‌లో ‘‘ఇదొక గేమ్‌ కాదు, డిజాస్టర్‌. ఇందులోకి వెళ్లడం వరకే. బయటపడేది జరగని పని.’’ అని రాశాడు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆలోచనలు మనిషిని బలహీనపరిస్తే ఎక్కడికి చేరుకుంటాడో! తల్లిదండ్రులు పిల్లల సోషల్‌ మీడియా ఎకౌంట్స్‌ పైన, వారు తరచూ ఎలాంటి ఆటలకు ఆకర్షితులు అవుతున్నారన్న విషయంపైనా శ్రద్ధ పెడితే ఇలాంటివి కాస్త తగ్గించవచ్చు.

ఆటలో క్యారెక్టర్‌ చనిపోయిందని..
సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయి, అక్కడి డిప్రెషన్‌ వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఇలా ఉంటే, వీడియో గేమ్స్‌ బారిన పడి ఆత్మహత్య చేసుకునే వారు కూడా చాలామందే ఉన్నారు. బశ్కోర్టోస్తాన్‌కు చెందిన రుస్తమ్‌ అనే పద్నాలుగేళ్ల బాలుడికి వీడియో గేమ్స్‌ అంటే పిచ్చి. తల్లిదండ్రులు వారించినా గేమ్స్‌ ఆడటం మాత్రం వదిలిపెట్టలేదు. ‘డిఫెన్స్‌ ఆఫ్‌ ది ఏన్షియంట్‌’ అన్న వీడియో గేమ్‌ను నిరంతరం ఆడేవాడు. ఒక దశలో తానే ఆ ఆటలో ఉన్న క్యారెక్టర్‌ను అని పూర్తిగా నమ్మేశాడు. తల్లిదండ్రులు ఊళ్లో లేని రోజుల్లో 22 రోజుల పాటు వీడియో గేమ్‌ ఆడుతూనే కూర్చున్నాడు. గేమ్‌లో తన క్యారెక్టర్‌ చనిపోయింది. ఇది రుస్తమ్‌ను విపరీతంగా కలచివేసింది.

అప్పటికే గేమ్‌లో తన క్యారెక్టర్‌కు దెబ్బ తగిలినప్పుడల్లా తనూ గాయం చేసుకున్నాడు. చివరగా ఆ క్యారెక్టర్‌ చనిపోయిందని తెలిసి, ఇంకేం ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గేమ్‌ కాల్‌ ఆఫ్‌ డ్యూటీ ఆడుతూ కూడా ముగ్గురు టీనేజ్‌ కుర్రాళ్లు ఇలాగే తమ ప్రాణాలు తీసుకున్నారు. మితిమీరిన హింస, అందులో ఉండే క్యారెక్టర్‌ను పూర్తిగా ఓన్‌ చేసుకోవడం వంటివి ఇలాంటి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వీడియో గేమ్స్‌ ప్రభావంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 12–17ఏళ్ల వయసున్న వారే ఎక్కువ. హింసను ప్రేరేపించే ఆటలను పిల్లలకు దూరంగా ఉంచడం ద్వారా ఇలాంటి ఆత్మహత్యలను నివారించవచ్చని నిపుణుల మాట.

ఫోన్‌ కొనివ్వలేదని..
కరీంనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు లింగమూర్తి స్మార్ట్‌ఫోన్‌ కావాలని ఇంట్లో వాళ్లతో ఒకటే గొడవ పడ్డాడు. ఆ గొడవ ఏ స్థాయికి చేరిందంటే కొనివ్వకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇప్పుడే ఫోన్‌ కొనివ్వలేమని తల్లిదండ్రులు చెబితే, ఇంట్లో నుంచి కోపంగా పారిపోయి, తర్వాతి రోజు ఊళ్లోని ప్రభుత్వ పాఠశాల ముందు ఉరి వేసుకొని కనిపించాడు. చాలా సిల్లీగా కనిపించే ఇదొక్కటనే కాదు ఫోన్‌ పోయిందని, అక్క రిమోట్‌ లాక్కుందని, అమ్మ కొట్టిందని, ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయ్యారని.. ఇలా ప్రతి చిన్నదానికీ ఆత్మహత్య చేసుకునే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.

డ్రగ్స్‌కు అలవాటు పడిపోయి...
డ్రగ్స్‌ మత్తు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ మత్తులో మునిగి తేలుతున్న వారిలో చాలామందికి ఒక దశకు వచ్చాక కనిపించే ఒకే ఒక్క ఆప్షన్‌ ఆత్మహత్య. ఒక్క ఇండియాలో రోజుకు సగటున పది మంది డ్రగ్స్‌ బారిన పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. యుక్త వయసులో ఉన్న వారే ఈ తరహా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

జీవితానికి అర్థమే లేదంటూ..
ఇంత పెద్ద ప్రపంచంలో నేనేంటీ? జీవితానికి అసలు అర్థమనేది ఉందా? బతకడం ఎందుకు? బతికి సాధించగలిగేది ఏముంటుంది? సమాజం ఇంకా మారలేదు, అదెప్పటికీ మారదు, ఎప్పటికైనా మారుతుందా? మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు? మనిషి ఎవరసలు? పేద, ధనిక భేదాలేంటి? ఇలా ఒక్కటనేంటీ బతకడం ఒక అర్థం లేని చర్యని భావించే వారెందరో! దీన్నే ఎక్సిస్టెన్షియల్‌ డిప్రెషన్‌గా పేర్కొంటారు. బాగా చదువుకున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక ఈ మధ్య కాలంలో ఎక్సిస్టెన్షియల్‌ డిప్రెషన్‌ సోషల్‌ మీడియాను బాగా వాడుతోన్న యువతరానికి పాకిందన్నది కూడా సైకాలజీ స్టడీస్‌ చెబుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తెలియని వ్యక్తుల నుంచి గుర్తింపు కోరుకోవడం, అవి దక్కకపోతే జీవితానికి అర్థం లేదనుకోవడం, ఆ తర్వాత డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కొద్దికాలంగా బాగా కనిపిస్తోంది. చెన్నైలోని ఓ 19 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఇలా గుర్తింపు కోసం ఎదురుచూసి తాను కోరుకున్నది దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. మియామిలో మరో అమ్మాయి ఇలాగే గుర్తింపు రాలేదని డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోను లైవ్‌లో ఓ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లో పోస్ట్‌ చేసింది.

ఆత్మహత్య ఆలోచన చేస్తున్నవారిని ఇలా గుర్తించొచ్చు
మనకేదైనా కష్టమొచ్చినప్పుడు తోడుగా ఉన్న వారితో ఒక్కసారి మాట్లాడితే మనసు కుదుటపడుతుంది. అమ్మను తల్చుకుంటేనో, నాన్నను పలకరిస్తేనో, స్నేహితుడితో కబుర్లు చెప్పుకుంటేనో తీరిపోయే కష్టాలే చాలా ఉంటాయి మనకు. మనుషులతో కలిసిపోతే డిప్రెషన్‌ అన్న ఆలోచనే రాదు. ఆత్మహత్యలకు ప్రధాన కారణం డిప్రెషనే!

డిప్రెషన్‌ను జయిస్తే, చావాలన్న ఆలోచనను చంపేసినట్టే!
అలాంటి డిప్రెషన్‌ నుంచి బయటపడేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ‘వన్‌ లైఫ్‌’ అలాంటిదే! ఎవ్వరికీ చెప్పుకోలేని, ఎవరికైనా చెప్పుకుంటే ఏమనుకుంటారోనన్న భయాలేవీ లేకుండా హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి కష్టాలను చెప్పుకోవచ్చు. మాట్లాడితేనే కదా, మనసు కుదుటపడేదీ!!
‘వన్‌ లైఫ్‌’ హెల్ప్‌లైన్‌ నంబర్‌: 78930 78930

డిప్రెషన్‌ లక్షణాలు ఇవీ..
♦ జనాలతో కలవడానికి ఇష్టపడకపోవడం. గ్రూపులకు దూరంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతూ ఉండడం.

♦ డల్‌గా, జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉండడం.

♦ ఏదో ఒకవిధంగా ఇదే విషయాన్ని చెప్తూ ఉండడం. సోషల్‌ మీడియాలో ఎక్కువగా డిప్రెషన్‌ సంబంధిత పోస్ట్‌లు పెడుతూ ఉండడం.

♦ ఒంటరితనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం.

కొన్ని భయంకర నిజాలు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ఆత్మహత్యల లెక్కలు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా జరుగుతున్న ఆత్మహత్యలు: 8 లక్షలు
 2020కల్లా ఇది 15 లక్షలకు చేరుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా.
 సగటున ప్రతి నలభై సెకండ్లకు ఓ ఆత్మహత్య జరుగుతోంది.


15–29 వయసున్న వారి మరణాల్లో రెండో అతిపెద్ద కారణం ఆత్మహత్య.

ఆత్మహత్యకు ఎక్కువగా కనిపిస్తోన్న కారణాలు: మానసిక రుగ్మత (ప్రధానంగా డిప్రెషన్, డ్రగ్స్, మద్యం వాడకంతో మారే మానసిక స్థితి), కుటుంబ సమస్యలు, అప్పులు, ప్రేమ, పెళ్లి గొడవలు, నిరుద్యోగం, పేదరికం.

ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో ఆడవారి కంటే మగవారే ఎక్కువ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement