ర్యాంకు రాలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన కుమారుడికి తన జీవితంలోని వైఫల్యాలు చెప్పి స్థైర్యం నింపుతున్న తండ్రి. తాజా బాలీవుడ్ సినిమా: చిచోరే
ఇష్టమైన దుస్తుల మీద మరక పడితే ఏం చేస్తాం?మొదట సబ్బుతో రుద్దుతాం. ఆ తర్వాత నిమ్మకాయతో రుద్దుతాం.ఆపై పెట్రోల్‌తో రుద్దుతాం. ఇంకా ఏవైనా మరకలు పోగొట్టేలిక్విడ్‌లు దొరికితే వాటితోనూ రుద్ది రుద్ది దూరం చేస్తాం.అంతే తప్ప ఆ దుస్తులను దూరం చేసుకుంటామా?ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా మెదడులో మరకలాంటిది.దానిని రుద్ది రుద్దీ దూరం చేసుకోవాలి. ధైర్యంతో, స్థైర్యంతో, ఓర్పుతో,
స్నేహితుల సాయంతో, బంధువుల బలంతో, కుటుంబల సభ్యుల భరోసాతో.ఉన్నది ఒక్కటే జన్మ. జీవించాలి. పోరాడాలి.ఆశను విడువక ఆవలి తీరం చేరుతూనే ఉండాలి. లైఫ్‌కు ఎస్. డెత్‌కు నో.
సరిగ్గా వారం క్రితం బాలీవుడ్‌లో ఒక సినిమా విడుదలైంది.పేరు ‘చిచోరే’.అందులో ఇంటర్ పాసైన కొడుకుపై తండ్రి జె.ఇ.ఇలో ర్యాంకు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పెడతాడు. ఆ కొడుకుకు అదో పెద్ద భారం అవుతుంది. చదువుకునే సమయంలో తండ్రి ఒక ర్యాంకర్. కనుక తాను కూడా ర్యాంకర్ కావాలేమో, లేకుంటే తండ్రి పరువు పోతుందేమోనని ఆ కుర్రాడు భయపడతాడు. అతడు భయపడినట్టే ర్యాంకు రాదు. ఇంకేముంది... జీవితమే ముగిసిపోయింది అనుకుని ఎనిమిదో అంతస్తు నుంచి ఒక్క దూకు దూకేస్తాడు.
ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న కొడుకు దగ్గర కూచున్న తండ్రి, తన తప్పును తెలుసుకొని ‘ఓడిపోవడం నేరం కాదు. నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను. కాకపోతే నీకు చెప్పలేదంతే’ అని తన ఫెయిల్యూర్స్‌ను చెప్పడం మొదలుపెడతాడు. ఆ ఫెయిల్యూర్స్‌ను తాను ఎలా ఫేస్ చేశాడో చెప్తాడు. అవి వింటూ కొడుకు గిల్ట్ నుంచి బయటపడి బతకాలన్న ఇచ్ఛ పొందుతాడు.ఈ సినిమాలో తండ్రి ఒక మాట అంటాడు. ‘మన పిల్లలు గెలిచాక ఏమేం చేయాలో మనందరి దగ్గరా ప్లాన్స్ ఉంటాయి. కాని ఒకవేళ ఓడితే ఏం చేయాలో ఏ ఒక్కరి దగ్గరా ఆలోచన ఉండదు’ అని.ఈ ఆలోచన అందరూ చేస్తే మొన్న జరిగిన ఇంటర్ పిల్లల ఆత్మహత్యల్లాంటివి జరగనే జరగవు.
‘త్రీ ఇడియట్స్’ కూడా ఈ పాయింట్‌నే డిస్కస్ చేస్తుంది. అందులో ప్రాజెక్ట్ పూర్తి కాని ఐఐటి కుర్రాడు ప్రొఫెసర్ తొందరపెడుతున్నాడని ఆత్మహత్య చేసుకుంటాడు.‘ఇది మన విద్యా వ్యవస్థ చేసిన హత్య’ అని మరో స్టూడెంట్ ఆమిర్ ఖాన్ అంటాడు.పిల్లలను ఆత్మహత్యలకు పురిగొల్పడంలో మన పాత్ర ఎంత అనేది ఆలోచించాలి.చచ్చిపోతే తప్ప ముగింపు లేదు అనే మూలకు నెట్టడం గురించి చర్చించాలి.ఒకటో తేది జీతం వచ్చే ఉద్యోగం చేస్తే తప్ప, అందుకు అనువైన చదువు చదివితే తప్ప, అందుకు అనువైన ర్యాంకు తెచ్చుకుంటే తప్ప బతకలేవు, బతకనివ్వము అని చెప్పడం ఎంత అన్యాయమైన విషయమో ఆత్మవిమర్శ చేసుకొని చర్చించాల్సిన సంగతి.
తెలుగు సినిమా ప్రేక్షకుడు తొలిసారి ఉలిక్కిపడింది ఒక కన్నతల్లి ఆత్మహత్యాయత్నానికి. ఆమె తానొక్కతే మరణించడానికి ప్రయత్నించదు. చనిపోయే ముందు కడుపున పుట్టిన, బంగారం లాంటి ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోబోయింది. పిల్లలు చనిపోయారు. తాను బతికింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు, పిల్లలకు విషం ఇచ్చినందుకు విచారణ ఎదుర్కొంది.
ఆ సినిమా పేరు ‘మనుషులు మారాలి’.
అప్పట్లో ఒక విమర్శ ఎదురైంది. ఆ సినిమాలో హీరోయిన్ శారద చదువుకున్న స్త్రీ. కష్టాలు చుట్టుముట్టినప్పుడు, భర్త తోడు లేకుండా పోయినప్పుడు, ట్యూషన్లు అయినా చెప్పుకొని బతకవచ్చు. ఆ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్లకు ఏదో ఒక ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయకుండా చావును పరిష్కారంగా వెతకడం ఏమిటా అని?శారద తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు సానుభూతి చూపించి ఉండవచ్చు.
కాని మెచ్చరు. లోలోపల దానిని స్వీకరించరు. శారద పోరాడి ఉంటే ఒక్క ఎనిమిది పదేళ్లు కష్టపడి ఉంటే ముగ్గురు పిల్లలే ఆమె ఆస్తి అయి ఉండేవారు. ఇలాంటి పరిస్థితే ‘మాతృదేవోభవ’లో వచ్చినప్పుడు హీరోయిన్ మాధవి ఎటువంటి పరిస్థితిలోనూ ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకోదు. భర్త చనిపోతే, తాను కేన్సర్ బారిన పడి మృత్యువుకు దగ్గర అవుతుంటే వారిని దత్తత ఇద్దామనుకుంటుందే తప్ప, వాళ్ల ప్రాణం నిలబెడుతుందే తప్ప చంపి చచ్చిపోవాలనుకోదు. సమాజం ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలను అక్కున చేర్చుకుందన్న విషయం, అక్కున చేర్చుకుంటుందన్న ఆశ ఈ సినిమా నుంచి తప్పిపోదు.
‘మరో చరిత్ర’ విడుదలైనప్పుడు తెలుగులో, తమిళంలో విశేషంగా హిట్ అయ్యింది. అందులో ప్రేమికులైన కమల్ హాసన్, సరిత ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఇదే సినిమా హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా విడుదలైనప్పుడు ఒక విమర్శ వినిపించింది. ‘దర్శకుడు బాలచందర్ తన హీరోకు ఇచ్చే క్యారెక్టర్ ఇదా? అతన్ని దుండగులు కొట్టారు. కత్తితో పొడవ లేదు. ఆమె అత్యాచారానికి గురైంది. శక్తి కూడదీసుకొని వారు రోడ్డు మీదకు వెళ్లి ఉంటే సహాయం అంది ఉండేది. అత్యాచారానికి గురైన ఆమెను స్వీకరించి ఆమెకు ప్రాణం పోసే ప్రయత్నం హీరో ఎందుకు చేయలేదు? అత్యాచారం జరిగింది అనగానే అంతా ముగిసిపోయినట్టే అని ఆత్మహత్యకు ఎందుకు పురిగొల్పాడు’ అని.
బాలచందరే తీసిన ‘డాన్స్‌మాస్టర్’ సినిమాలో కమల్ హాసన్, రేఖ పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించలేదని సినిమా ప్రారంభంలోనే ఒక జలపాతంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆమె చనిపోతుంది. అతడు బతకుతాడు. ఆమె చనిపోయినా తాను బతికి ఉన్నానన్న గిల్ట్ అతణ్ణి కాలుస్తూ ఉంటుంది. ఇవన్నీ తొందరపాటు నిర్ణయాల తలనొప్పులు.
ప్రేమికుల కోసం చావు రెడీగా టేబుల్ మీద పెట్టబడి ఉంటుంది అని చెప్పడం కొన్ని సినిమాలలో చూపారు.
కాని ప్రేమకు సంబంధించిన అన్ని పర్యవసానాలకు సిద్ధమయ్యి అందులో దిగాలి, దిగి ఎదుర్కోవాలి అని చెప్పడంలో సినిమా చాలాసార్లు సక్సెస్ అయ్యింది కూడా.
చచ్చిపోతామని తెలిసినా కేన్సర్ పేషెంట్లైన నాగార్జున, గిరిజ ‘గీతాంజలి’లో ప్రేమించుకోవడం మానరు.
స్ఫూర్తి పొందాల్సింది అలాంటి సినిమాల నుంచే.
టీనేజ్ క్రష్‌లను, తెలిసీ తెలియని వయసులో కలిగే శారీరక ఆకర్షణల పట్ల యువత ఎంత ఎరుకతో ఉంది? వారికి ఎరుక కలిగించాల్సింది ఎవరు? వారి ఇన్నోసెన్స్‌ను వాడుకోవాలని చూస్తున్నది ఎవరు? ‘గుప్పెడు మనసు’ సినిమాలో వివాహితుడైన శరత్‌బాబుతో, టీనేజ్ అమ్మాయి సరిత ఆకర్షణలో పడుతుంది. దాని వల్ల ఆమె మనసు డిస్ట్రబ్ అవుతుంది. అతని కాపురం ప్రమాదంలో పడుతుంది. చివరకు ఎలాగోలా అతడు కాపురం నిలబెట్టుకుంటాడు. కాని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అతడు బానే ఉన్నాడు. నష్టపోయింది ఆ అమ్మాయి. దాని బదులు కష్టమైనా సరే ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని కొంతకాలం దిక్కుతోచని ప్రయాణాలు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.సమస్య వచ్చినప్పుడు సమస్యకు సమీపంగా తచ్చాడి లాభం లేదు. దూరం జరిగి పై నుంచి, బయటి వ్యక్తిగా చూస్తే పరిష్కారం కనపడుతుంది.పరిష్కాలు ఎప్పుడూ వంద ఉంటాయి.చావు మాత్రం ఒక్కటే.ఆత్మహత్య అంటే ఒకటిని వందతో సమానం చేయడం. చాలా మామూలు లెక్కలు తెలిసినవాళ్లు కూడా ఈ తప్పు చేయరు. మరి ఎందుకు చేస్తున్నట్టు?
పూరి జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో సినిమా మొదట్లోనే హీరో రవితేజా, హీరోయిన్ తనూ రాయ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది. ఆ తర్వాత వాళ్లు జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక్కటవుతారు. చనిపోయి ఉంటే ఆ క్షణానే సమాధి రాళ్లుగా మారి ఉండే ఆ యువతీ యువకులు నూరేళ్ల జీవితం పట్ల ఆశ పెంచుకోవడంతో ఆ ఆశ కొద్దో గొప్పో ప్రేక్షకులకు కూడా అందుతుంది.అయితే ఒక సదుద్దేశంతో, కేవలం ఆత్మహత్యల నివారణ ఎంత అవసరమో చెప్పడానికి, ఆత్మహత్యల ఆలోచనల్లో ఉన్నవారిని ఓదార్చి, ధైర్యం చెప్పే ఒక శ్రేయోభిలాషి అవసరం చూపడానికి తీసిన సినిమా ‘మీ శ్రేయోభిలాషి’. ఈ సినిమాలో రకరకాల సమస్యలతో బాధ పడుతున్న పదిమందిని కొండ మీదకు తీసుకెళ్లి అక్కడి నుంచి చచ్చిపోయే ఏర్పాటు చేస్తాడు ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్. గృహ హింస ఎదుర్కొనే గృహిణి, టెన్త్ పాస్ కాలేనేమోనని భయం ఉన్న కుర్రాడు, జబ్బు పడ్డానని నిరాశ పెంచుకున్న ఒక దురదృష్టవంతుడు, కొడుకు సరిగ్గా చూడట్లేదని వైరాగ్యం తెచ్చుకున్న ముసలి దంపతులు... వీరంతా ఈ సినిమాలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కాని రాజేంద్రప్రసాద్ వారికి ధైర్యం చెబుతాడు. వారిలో స్థైర్యం నింపుతాడు. సమస్యలను అర్థం చేసుకుంటే సగం బరువు తొలిగి పోతుందని తెలియచేస్తాడు. బతుకు మీద తీపి కలిగించడం కూడా అవసరం. ఆత్మహత్యల ఆలోచనల నుంచి బలంగా బయటపడేయగల సినిమా ఇది.
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
జీవితం మీద ఇచ్ఛను కలిగించే పాటలు తెలుగు సినిమాల్లో అనేకం ఉన్నాయి. డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ఈ పాట వాటిలో ఒకటిగా ఎన్నదగినది. ‘గోరంత దీపం’ సినిమాలో కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వంలో బాల సుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట అర్థవంతంగా రసస్ఫోరకంగా ఉండి మనసును తాకుతుంది. స్ఫూర్తి నింపుతుంది. ‘నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి’ అంటాడు కవి. ఉప్పదనం అనుభవిస్తేనే కదా బతుకు చేరువైనప్పుడు అదెంత తీపో అర్థమయ్యేది. ఆ పాట పూర్తి సాహిత్యం:
పల్లవి:
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
చరణం:
కరిమబ్బులు కమ్మే వేళ మెరుపుతీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగుచుక్కే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్య సహనమే వెలుగు
చరణం:
కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి
నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి
ఏ తోడు లేనినాడు నీ నీడే నీకు తోడు
జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు
చిగురంత ఆశ జగమంత వెలుగు.
స్వాతంత్య్రం ఇవ్వలేదని గాంధీజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఆమరణ దీక్షకు దిగి తన ప్రాణాలు నిలబెట్టి తీరవలసిన అగత్యాన్ని బ్రిటిష్‌వారికి కలిగించాడు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు, మానసిక కల్లోలాలు చెలరేగినప్పుడు, అస్సలు వెలుతురు కనిపించనప్పుడు, కనీస ప్రయత్నం చేయడానికి కూడా శక్తి సన్నగిల్లినప్పుడు మన ప్రాణాలు నిలిపే అగత్యాన్ని సమాజానికి ఇవ్వాలి. గోల చేయాలి. బంధువులకు చెప్పాలి. స్నేహితులకు మొరపెట్టుకోవాలి. వారే ఏదో ఒక మార్గం చూస్తారు.
పరువు కంటే ఎప్పుడూ ప్రాణమే ఎక్కువ.
ఇవాళ్టి అవమానం రేపటి సన్మానంతో తొలగిపోతుంది. కాకుంటే ఆ సన్మానం పొందేందుకు ప్రాణాలతో ఉండాలి.సమాజం పెట్టే వొత్తిడి, విలువలు, లక్ష్యాలు, బాధ్యతలు, బలహీనతలు, భావోద్వేగాలు ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనకు సమస్యలు తెచ్చిపెడతాయి. విరమించుకుంటే బాగుండు అనే ఆలోచన కలిగిస్తాయి.ఆ క్షణాన్ని దాటేయడమే చేయవలసింది. ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం’ అని పాట. పోరాటం ముగియదు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని మరో పాట. పశువులు ఆత్మహత్య చేసుకోవు. మనిషెందుకు చేసుకోవడం? బతుకుదాం. బతుకునిద్దాం.– కె
Comments
Please login to add a commentAdd a comment