ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా...
ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా బంగారు మయమే... కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వైపు వెళుతుండడంతో దేశంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఆత్మహత్యల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతోందని, మూడు ఆత్మహత్యల్లో ఒకటి భారత్ దేశంలో నమోదవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ప్రతీ రెండు నిముషాలకొక ఆత్మహత్య జరుగుతోంది. కేవలం 2012 సంవత్సరంలోనే 2.5 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడినట్టు లెక్కలు తేలాయి. ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా 15 నుంచి 29 ఏళ్ల లోపువారే కావటం విశేషం. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే స్త్రీల కంటే మగవారే ముందు ఉన్నారు.
ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఎక్కువగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణాలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటే భవిష్యత్ అంతా బంగారు భవితగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. చట్టప్రకారం ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, అందుకు ప్రోత్సహించడం నేరం. భారతీయ శిక్షా స్మృతి విభాగంలో 309 ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించినవారికి ఏడాది సాధారణ శిక్షతో పాటు జరిమానా విధింపబడుతుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఏ న్యాయవాది కూడా వాదించబోరు. అంతేగాక బెయిల్ కూడా మంజూరు కాదు. రాజీకూడా కుదుర్చుకోవడానికి అవకాశం లేనిది.
*నేడు అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం