‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు.
కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు.
డెస్టినేషన్ ఎన్‌ఎస్‌డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు.
వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment