ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.
సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.
సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.
చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!
అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment