కాల్పుల అనంతరం వియన్నా వీధుల్లో గస్తీ కాస్తున్న భద్రతా బలగాలు
వియన్నా: ఆస్ట్రియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. సెంట్రల్ వియన్నాలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన దుండగుడు కుజ్‌తిమ్ ఫెజ్‌జులాయి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిపరుడని ఆ్రస్టియా అంతర్గత వ్యవహారాల మంత్రి కార్ల్ నెహమ్మార్ తెలిపారు. కుజ్‌తిమ్‌కి ఆస్ట్రియా, నార్త్ మేస్‌డోనియన్ ద్వంద్వ పౌరసత్వం ఉంది. గతంలో అతను ఐఎస్‌లో చేరడానికి సిరియా వెళుతుండగా నిర్బంధించి జైలు శిక్ష విధించారు. అయితే జువైనల్ చట్టం ప్రకారం గత డిసెంబర్‌లోనే విడుదలై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుజ్‌తిమ్ ఆటోమేటిక్ రైఫిల్స్, గన్స్, కత్తి ధరించి పౌరులపై దాడికి దిగాడు. ఒక ప్రాంతంలో రాత్రి 8 గంటలకు కాల్పులు జరుపుతున్న కుజ్‌తిమ్‌పై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 8:09 గంటలకు దుండగుడు హతం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ వియన్నాలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే కాల్పులు
ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో ఏకంగా 20 వేల వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వ్యక్తి కత్తితో పొడుస్తూ, రైఫిల్‌తో కాలుస్తూ వీధుల్లో స్వైరవిహారం చేసిన దృశ్యాలు భీకరంగా ఉన్నాయి. జనం ఎక్కువుండే∙బార్లు ఉండే ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు ఆ వీడియోల్లో తెలుస్తోంది.
ఆ్రస్టియాకు అండగా ఉంటాం: మోదీ
దాడిపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆస్ట్రియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంగళవారం ట్వీట్ చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో మూడు సార్లు ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఆస్ట్రియాలో జరిగిన దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దాడిని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment