విశ్లేషణ
‘తేడా సుస్పష్టం’ అంటూ మన ప్రధాని మోదీ పేరిట సోషల్ మీడియాలో ఒక గణాంక విన్యాసం జరుగుతోంది. దాని ప్రకారంగా మోదీ ‘విజయాలు’ అనే శీర్షిక కింద 2014 నాటికీ, అంటే మోదీ అధికారం చేపట్టిన నాటికీ, నేటికీ (2024) ఈ పదేళ్లలో దేశం ఎంతగా ‘పురోగమించిందో’ చెబుతూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఇక్కడి ప్రశ్న ఈ గణాంకాల వాస్తవికత గురించినది కాదు. కొన్ని విషయాలలో సందేహాలూ, అవాస్తవాలూ ఉన్నా వాటిల్లోని సింహభాగం నిజమే కావచ్చు. కాకుంటే ప్రశ్నల్లా 2014–2024 నడుమ కాలంలోని ఈ సోకాల్డ్ విజయాలలో మోదీ గారి పాలన ప్రభావం ఎంత? మోదీ ప్రధానిగా ఉన్నా లేకున్నా వీటిలోని కొన్ని వాటికవే జరిగి ఉండేవి కావా?
ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల పాలన ‘విజయ గాథ’ అంటూ ప్రచారం చేస్తున్న వాటిల్లో ఒక్కో గణాంకాన్ని పరిశీలిద్దాం. మొదటగా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ (జీడీపీ) చూద్దాం. భారత జీడీపీ 2014 నాటికి 1.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. అది 2024 నాటికి 3.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అది నిజమే. రెట్టింపయ్యింది. ఇక్కడ గమనించ వలసింది, భారత జీడీపీ 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని చేరేందుకు 1947 నుంచీ 2010 వరకూ అంటే, 63 సంవత్సరాలు పట్టింది.
అక్కడి నుంచి 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడం కేవలం ఏడేళ్లు,అంటే 2017 నాటికి జరిగింది. ఆ స్థితి నుంచి 2020 నాటికి ఈ గణాంకం 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే, కేవలం 2017–20 మధ్యన మూడేళ్లలో మరో లక్ష కోట్ల డాలర్ల మేర దేశ జీడీపీకి జతకూడింది.
ఇటువంటి పరిణామం, అన్ని రంగాలలోనూ జరిగేదే. ఉదా హరణకు, సాంకేతిక పురోగతినే తీసుకుంటే 300 ఏళ్ల క్రితం ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. తరువాతి 100 సంవత్సరాల కాలంలో మరింత సాంకేతిక పురోగతి జరిగింది. ఈ మొత్తం కాలంతో సరితూగగల సాంకేతిక పురోగమనం, ఆ తరువాతి 50 ఏళ్ల కాలంలోనే జరిగింది. దీనంతటినీ తలదన్ని తరువాతి 2–3 దశాబ్దాల కాలంలోనే, పెద్ద గంతులలో సాంకేతిక పరిజ్ఞానం పురోగమించింది.
ప్రస్తుతం చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలు లేకుంటే అంతకంటే తక్కువ కాలంలో కూడా సాంకేతిక రంగంలో ఊహించనలవి కాని మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి, ఒక వస్తువు లేదా అంశం దాని ఆరంభ స్థానం నుంచి దూరంగా వెడుతున్న కొద్దీ దాని ప్రయాణ వేగం మరింతగా పుంజుకుంటుందన్నది సహజ సూత్రం. అదే సహజ సూత్రం ప్రకారంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎదిగిందన్నది పై గణాంకాలను చూస్తే అర్థం అవుతుంది.
కాబట్టి, ఇదంతా అత్యంత సాధారణ పరిణామ క్రమం. దీనిలో మోదీ జోడించిన అదనపు శక్తి యుక్తులూ ఏమీ లేవన్నది నిజం! మించి, స్వయంగా మోదీ గారి వాగ్దానాల ప్రకారంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవలసివుంది. ఇప్పటికే 2024 అక్టోబర్ మాసంలో వున్నాం. అంటే, మరో 6 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది.
ఈలోగా, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక స్థాయిని చేరుకోగలమా? లేదనేదే జవాబు. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారమే, భారత్ 2027–28 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించగలదు. అదీ కథ! నిజానికి దేశ ఆర్థిక పురోగతికి మోదీ విధానాలైన పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వినాశకరంగా పరిణమించాయి. ఈ అవాంతరాలు లేకుంటే సాధారణ స్థితిలోనే మన జీడీపీ బహుశా 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని చేరి ఉండేది!
గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను
ఆ ప్రచారం ప్రకారం, రెండవ గణాంకం ప్రపంచంలో భారత దేశ ర్యాంకు గురించినది. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో వున్న మన ర్యాంకు (జీడీపీ పరంగా) ప్రస్తుతం 5వ స్థానానికి చేరింది. దీనిలోనూ, అనేక తిరకాసులు ఉన్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచంలోని ధనిక దేశాల అన్నింటి స్థితిగతులూ దిగజారి పోతున్నాయి. ఫలితంగా, వాటి జీడీపీలు దిగజారుతున్నాయి. కాగా, ఈ ఆర్థిక సంక్షోభం భారత్‌ను అంతగా ప్రభావితం చేయలేదు.
దేశంలోని జాతీయ బ్యాంకులు రుణాల మంజూరులో, పాశ్చాత్య దేశాల బ్యాంకుల్లా దురాశకు పోకుండా హేతుబద్ధంగా, క్రమబద్ధంగా వ్యవ హరించడం దీనికి ఒక ప్రధాన కారణం. అప్పటికే దేశంలో అమలులో వున్న జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది.
మరి ఈ స్థితిలో జీడీపీ పరంగా మనం వున్న చోటునే మిగిలిపోయినా, లేకుంటే సాధారణ సరళ రేఖలో సాదాగానే ముందుకు పురోగమించినా ఇతర దేశాలతో పోలిస్తే మన ర్యాంకు మెరుగుపడి తీరుతుంది. ఇటువంటి స్థితి గురించే, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ‘(మన దేశ ఆర్థిక స్థితి) గుడ్డి వాళ్ళ రాజ్యంలో, ఒంటి కన్ను రాజును పోలి వుంది’ అని వ్యాఖ్యానించారు.
ఇక మూడవ గణాంకం, ఎగుమతులకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న మన ఎగుమతులు 2024 నాటికి 700 బిలియన్ డాలర్లను దాటాయి. ఇది నిజం. కానీ, పూర్తి నిజం కాదు. వాస్తవంలో, నేడు మన ఎగుమతుల పెరుగుదల వేగం దిగజారుతోంది. అనేక మాసాల పాటు, ఎగు మతుల గణాంకాలు పతనాన్ని సూచించాయి.
తగిన స్థాయిలో ఎగుమతులు లేక దేశంలోని వస్త్రాలు, బంగారు ఆభరణాలు వంటి ప్రధాన ఉపాధి కల్పనా రంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి. పారి శ్రామిక ఉత్పత్తి రంగాలకు ప్రోత్సాహం పేరిట 14 రంగాలకు అందిస్తోన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కేవలం 2–3 రంగాల లోనే విజయవంతం అవుతున్నాయి.
నిజానికి, ఒక దేశం తాలూకు వాణిజ్య సమతుల్యత లేదా లోటు అనేది అటు ఎగుమతులు, ఇటు దిగుమతులు రెండింటికీ సంబంధించిన అంశం. ఎగుమతి, దిగుమ తుల మధ్య సమతుల్యత లేకుంటే, అంటే, మన ఎగుమతుల కంటే, దిగుమతుల స్థాయే అధికంగా ఉంటే, అది వాణిజ్య లోటుకు దారి తీస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితి అదే.
ఇక తరువాతి గణాంకం, దేశంలోని మెట్రో నగరాల గురించినది. 2014 లోని 5 మెట్రో నగరాల నుంచి నేడు మనం 20 మెట్రో నగరాల స్థాయికి ఎదిగామంటూ ఈ ప్రచారపత్రం చెబుతోంది. ఈ అంశంలో కూడా గమనించవలసింది, ప్రపంచ వ్యాప్తంగా నగరీకరణ నేడు వేగం పుంజుకుందనేది. మన దేశంలో 2023 నాటికి నగర జనాభా కేవలం 36.36% గానే ఉంది.
ప్రపంచ స్థాయిలో చూస్తే 56% జనాభా నగర ప్రాంతాలలో ఉంది. బీజేపీ పాలనలో నగర ప్రాంత జనాభా పెరుగు దల వేగం బహుశా అధికంగా ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ, ఈ పెరుగుదల వెనుక గ్రామీణ ప్రాంతాలనూ, రైతాంగాన్నీ నిర్లక్ష్యం చేయడం వంటి ప్రతికూల ధోరణులు కూడా దాగి ఉన్నాయి.
గణాంకాల గారడీ
ఇక తరువాతి గణాంకం, వివాదాస్పదమైన 2014లో కేవలం 40%గానే ఉన్న దేశంలోని విద్యుత్ ఉన్న గ్రామాల సంఖ్య 2024లో 95 శాతానికి పెరిగిందన్నది. దీనికి సంబంధించి ఒకే అంశాన్ని ప్రస్తావించదలిచాను. ద్రౌపదీ ముర్ము గ్రామానికి కూడా 2022లో ఆమె రాష్ట్ర పతి అయ్యేనాటికి సరైన విద్యుత్ వసతి లేదు.
తరువాతి కీలక గణాంకం హైవేలకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 25,700 కిలోమీటర్ల పొడవున్న జాతీయ హైవేలు 2024 నాటికి 53,700 కిలో మీటర్లకు పెరిగాయి. మోదీ మంత్రివర్గంలో తన వంతు పాత్రను సాధ్యమైనంత సమర్థవంతంగా నిర్వహించిన, రోడ్లు రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ సమర్థతను అంతగా శంకించలేను.
మరో గణాంకం యూనికార్న్‌లకు సంబంధించినది. అంటే, వంద కోట్ల డాలర్ల స్థాయిని చేరుకున్న అంకుర సంస్థల గురించినది. దేశంలో 2014లో ఒకే ఒక్క యూనికార్న్ ఉంటే, అది 2024 నాటికి 114కు పెరిగింది. మంచిదే. కానీ, దేశంలోని వేలాది స్టార్టప్‌లలో ఈ విజయవంతమైన యూనికార్న్‌లు కొద్దిపాటివే. నిజానికి పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు విఫలం అవుతున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం, దేశంలోని అంకుర సంస్థలలో 90% మేర మొదటి ఐదేళ్ల కాలంలోనే మూతపడిపోతున్నాయి. స్థూలంగా మోదీ విజయగాథ ప్రచారం గురించి చెప్పాలంటే, ‘తేడా స్పష్టంగా’ కనబడుతూనే ఉంది. ఆ తేడా కనికట్టులో ఉంది. గణాంకాల గారడీలో ఉంది.
డి. పాపారావు
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment