Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్‌ అయ్యింది: ప్రధాని మోదీ | PM Narendra modi Shares Picture with Nasa Sunita Williams said Welcome Back | Sakshi
Sakshi News home page

Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్‌ అయ్యింది: ప్రధాని మోదీ

Published Wed, Mar 19 2025 12:33 PM | Last Updated on Wed, Mar 19 2025 1:32 PM

PM Narendra modi Shares Picture with Nasa Sunita Williams said Welcome Back

న్యూఢిల్లీ: తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన  నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష నౌకలో లోపం కారణంగా, వారు  తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగివచ్చిన వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు స్వాగతం పలుకుతూ ‘భూమి ఇన్నాళ్లూ మిమ్మల్ని మిస్‌ అయ్యింది’ అని పేర్కొన్నారు.  

ప్రధాని మోదీ(Prime Minister Modi).. తాను సునీతా విలియమ్స్‌తో పాటు ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ఇలా రాశారు ‘స్వాగతం, #Crew9! భూమి మిమ్మల్ని మిస్ అయింది. ఇది సహనం, ధైర్యం, అపరిమిత మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏమిటో మనకు మరోసారి చూపించారు. వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్య సరిహద్దులను అధిగమించడం. కలలు కనే ధైర్యం.. ఆ కలలను నిజం చేసే ధైర్యం కలిగి ఉండటం. సునీతా విలియమ్స్ ఒక ట్రైల్‌బ్లేజర్(ఆవిష్కర్త).. తన కెరీర్  మొత్తంలో ఈ స్ఫూర్తిని ప్రదర్శించిన ఐకాన్. ఆమె సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితత్వం, అభిరుచిని కలగలిస్తే.. సాంకేతికత పట్టుదలను కలబోస్తే ఏమి జరుగుతుందో ఆమె నిరూపించారు’ అని ​ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి. ఆమెకు ఇది మూడవ అంతరిక్ష ప్రయాణం. సునీత ఇప్పటివరకు మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. సునీత 1965, సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్‌లో జన్మించారు. అతని తండ్రి దీపక్ పాండ్య గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని ఝులసన్‌కు చెందినవారు. అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన మహిళగా విలియమ్స్ రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ 2007,2013లలో భారతదేశాన్ని సందర్శించారు. 2008లో సునీతకు పద్మభూషణ్ అవార్డు  లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సునీతా విలియమ్స్ కు ఒక లేఖ రాస్తూ, ఆమెను భారత పుత్రిక అని అభివర్ణించారు. ప్రధాని మోదీ సునీతను ఈ లేఖలో భారత్‌కు రావాలంటూ ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement