న్యూయార్క్‌లో కరోనాతో మృతి చెందిన వారిని సామూహిక ఖననం చేస్తున్న సిబ్బంది
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు.
ప్రపంచ శాంతికి భంగకరం
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు.
కోలుకుంటున్న జాన్సన్
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి
స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు.
ఇటలీలో మాఫియా కదలికలు
కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు.
యెమన్‌లో తొలి కరోనా కేసు
యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ
న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment