న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వ్యాప్తి, మహమ్మారి కదలికలు వైద్య నిపుణులకే అంతుచిక్కని క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్ పీటర్ కోల్చిన్స్కీ ఈ వైరస్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సార్స్-కోవిడ్-2 వైరస్‌ను చతురత కలిగిన దుష్టశక్తిగా ఆయన అభివర్ణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది పెద్దసంఖ్యలో ప్రజలకు వ్యాపించి సైలెంట్ కిల్లర్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు. సార్స్ వైరస్ కంటే ఇది ప్రమాదకరమైందని, కోవిడ్-19, సార్స్ వైరస్‌ల మధ్య కొంత సారూప్యత ఉందని చెప్పారు. సార్స్ కుటుంబానికే కోవిడ్-19 వైరస్ చెందినప్పటికీ దీని దూకుడు భిన్నంగా ఉంటుందని, సార్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించి బాధిత వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంటుందని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.
గొంతు ద్వారా వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే కోవిడ్-19 లక్షణాలు మాత్రం పెద్దగా కనిపించవని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నోటి తుంపరల ద్వారా మరొకరి శరీరంలోకి గొంతు ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని అన్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవని, జలుబు చేసి ఉంటుందనే భ్రమలో ఉంటారని అన్నారు. లక్షణాలు కనిపించి ఆస్పత్రికి తరలించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందని చెప్పారు. తనకు కోవిడ్-19 సోకిందని తెలియని బాధితుడు అప్పటివరకూ సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఈ వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉందని ఆందోళణ వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, ఇతర రక్షణ పరికరాలతో మహమ్మారికి దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment