Virology
-
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
కోవిడ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న సీనియర్ వైరాలజిస్ట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ తప్పుకున్నారు. కోవిడ్ రెండో దశను అరికట్టే విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జమీల్ ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) లో సభ్యుడిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా.. కానీ దీనిపై మాట్లాడటానికి ఇంకేం లేదు. రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కాగా ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ స్పందించడానికి విముఖత చూపారు. ఇక ఇటీవల ‘భారత్‌లోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి వైఖరితో కూడిన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నారని డాక్టర్ జమీల్ న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ నిర్వహణ ముఖ్యంగా తక్కువ సంఖ్యలో టెస్టింగ్, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కొరత, హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ అతి తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాలే భారత్‌లో కోవిడ్ వ్యాప్తికి దోహదపడుతున్నాయని విమర్శించారు. ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని తన తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారుని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమేనని, మహమ్మారిని అదుపు చేయలేకపోతే శాశ్వత మచ్చగా మిగిలిపోతుందన్నారు. తమ పరిశోధనల ఫలితాలపై ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్ ఫంగసా? -
'సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది'
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించినట్లు కనిపిస్తోందని, అయితే, పూర్తిగా కిందకు దిగిరావడానికి మరింత సమయం పడుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ పేర్కొన్నారు. రెండో వేవ్ ప్రభావం జూలై వరకు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొంతవరకు కొత్త వేరియంట్లు కారణం కావచ్చన్నారు. కానీ, ఈ అనువర్తిత వేరియంట్లు మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లేవన్నారు. జమీల్ ప్రస్తుతం అశోక యూనివర్సిటీలో త్రివేదీ స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్‌గా ఉన్నారు. రెండో వేవ్ అత్యంత తీవ్ర స్థాయికి చేరిందని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని జమీల్ పేర్కొన్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంస్థ మంగళవారం నిర్వ హించిన ఒక ఆన్లైన్ కార్యక్రమంలో వైరాలజిస్ట్ జమీల్ పాల్గొన్నారు. రెండో వేవ్‌లో కేసుల సంఖ్యలో తగ్గుదల కూడా మొదటి వేవ్ తరహాలో క్రమ పద్దతిలో ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కోవిడ్ మరణాల డేటా కూడా తప్పేనని, అది ఎవరో కావాలని చేస్తోంది కాదని, మరణాలను గణించే విధానమే లోపభూయిష్టంగా ఉందని వివరించారు. డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య భారీగా తగ్గిందని, దాంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని వివరించారు. పెళ్లిళ్లు, ఎన్నికల ర్యాలీ లు, మత కార్యక్రమాలు వైరస్ వ్యాప్తిని పెంచాయన్నారు. టీకాల వల్ల దుష్పరిమాణాలు వస్తాయన్న వార్తలు ప్రజలను భయపెట్టాయని, వ్యాక్సిన్లు సురక్షితమైనవని స్పష్టం చేశారు. చాలా దేశాలు చాలా ముందుగానే, ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను బుక్ చేసుకోగా.. భారత్ ఆ విషయంలో వెనుకబడిందన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేందుకు జనాభాలో కనీసం 75% మందికి ఇన్ఫెక్షన్ రావడం కానీ, వ్యాక్సిన్ ఇవ్వడం కానీ జరగాలన్నారు. -
అదృశ్యమైన చైనా జర్నలిస్ట్ ప్రత్యక్షం
వుహాన్: చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వార్తలను కవర్ చేస్తోన్న జర్నలిస్ట్ లీ జహువా అదృశ్యమై, దాదాపు రెండు నెలల అనంతరం మళ్లీ వుహాన్ పట్టణంలో ప్రత్యక్షమయ్యారు. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన లీ గత ఫిబ్రవరి 26వ తేదీన అదృశ్యమయ్యారు. అదే రోజు తనను ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీలో వెంటాడుతున్నారంటూ వారు వెంటాడుతున్న వీడియోను లీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భయానక కరోనా వైరస్ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిదంటూ అంతర్జాతీయంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ల్యాబ్‌ను లీ సందర్శించడంతో లీ అదృశ్యానికి ప్రాధాన్యత చేకూరింది. ఆ రోజు తనను ఎస్‌యూవీలో కొందరు వెంట పడ్డారని, తన కారు ముందుకు ఎస్‌యువీలో దూసుకొచ్చిన వారు, కారును ఆపాలంటూ అరిచారని, తాను భయపడి పోయి స్పీడ్‌గా తన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నానని లీ చెప్పారు. ఇంట్లోకి వెళ్లాక లెట్లు ఆర్పేసి సిస్టమ్ మీద కూర్చున్నానని, అలా కొంత సేపయ్యాక ముగ్గురు వ్యక్తులు తన ఇంట్లోకి వచ్చి తమను తాము ‘పబ్లిక్ సేఫ్టీ’ ఆఫీసర్లుగా పరిచేయం చేసుకున్నారని చెప్పారు. వైరాలజీ ల్యాబ్‌తో పాటు కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను కూడా సందర్శించినందున తమతో రావాల్సిందిగా కోరిన వారు, తనను తీసుకెళ్లి క్వారెంటైన్లో ఉంచారని, మార్చి 28వ తేదీన విడుదల చేశారని లీ వివరించారు. క్వారెంటైన్లో అందరు తనను బాగా చూసుకున్నారని, మూడు పూటలా మంచి భోజనం పెట్టారని, టీవీ చూసుకునే అవకాశం కూడా ఇచ్చారని గతంలో సీసీటీవీలో జర్నలిస్ట్‌గా పని చేసిన లీ పేర్కొన్నారు. మార్చి 28వ తేదీన తనను విడుదల చేశాక, తాను తన సొంతూరుకు వెళ్లి నిన్ననే తిరిగొచ్చానని ఆయన చెప్పారు. అదే నెల ఫిబ్రవరి నెలలో కనిపించకుండా పోయిన చెన్ కియుషి, ఫ్యాంగ్ బింగ్‌ల జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. ఓ బస్సులోకి కరానోతో చనిపోయిన మృత దేహాలను కుక్కుతున్న దృశ్యాలను వీడియో తీసి ఫ్యాంగ్ బింగ్ పోస్ట్ చేయడంతో ఆయన సీక్రెట్ పోలీసులకు టార్గెట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఓ ఆస్పత్రిలో మృతదేహం పక్కన నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఓ యువతితోపాటు మరికొన్ని అలాంటి దృశ్యాలను వీడియో తీసి చెన్ కియుషి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. ‘వుహాన్’ డైరీలో సంచలన విషయాలు -
మహమ్మారి కట్టడికి మార్గమిదే..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు. కోవిడ్-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 24,99,723కు చేరగా మృతుల సంఖ్య 1,71,718కి పెరిగింది. 6,59,589 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. చదవండి : కోవిడ్ 19: ఆ కేసులు పెరగడంపై గుబులు.. -
మహమ్మారిని గుర్తించేలోపే..
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వ్యాప్తి, మహమ్మారి కదలికలు వైద్య నిపుణులకే అంతుచిక్కని క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్ పీటర్ కోల్చిన్స్కీ ఈ వైరస్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సార్స్-కోవిడ్-2 వైరస్‌ను చతురత కలిగిన దుష్టశక్తిగా ఆయన అభివర్ణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది పెద్దసంఖ్యలో ప్రజలకు వ్యాపించి సైలెంట్ కిల్లర్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు. సార్స్ వైరస్ కంటే ఇది ప్రమాదకరమైందని, కోవిడ్-19, సార్స్ వైరస్ల మధ్య కొంత సారూప్యత ఉందని చెప్పారు. సార్స్ కుటుంబానికే కోవిడ్-19 వైరస్ చెందినప్పటికీ దీని దూకుడు భిన్నంగా ఉంటుందని, సార్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించి బాధిత వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంటుందని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. గొంతు ద్వారా వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే కోవిడ్-19 లక్షణాలు మాత్రం పెద్దగా కనిపించవని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నోటి తుంపరల ద్వారా మరొకరి శరీరంలోకి గొంతు ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని అన్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవని, జలుబు చేసి ఉంటుందనే భ్రమలో ఉంటారని అన్నారు. లక్షణాలు కనిపించి ఆస్పత్రికి తరలించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందని చెప్పారు. తనకు కోవిడ్-19 సోకిందని తెలియని బాధితుడు అప్పటివరకూ సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఈ వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉందని ఆందోళణ వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, ఇతర రక్షణ పరికరాలతో మహమ్మారికి దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి : లాక్డౌన్: పోలీసులతో కలబడ్డారు -
గబ్బిలాలతో వైరస్.. నిజమేనా?
సాక్షి, హైదరాబాద్: గబ్బిలాలతో కరోనా వ్యాపిస్తుందా? ప్రస్తుత ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది, దానికి దోహదపడుతున్న మార్గాలేమిటో బోధపడక ఇంకా సందేహాలు వెంటాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిబారిన పడకుండా తప్పించుకోవచ్చుననేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణవ్వగా 50 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇక కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌లకు, గబ్బిలాలకు ఉన్న సంబంధాలు, వైరస్ల వ్యాప్తిలో ఇవి పోషిస్తున్న పాత్ర ఏమిటనేది కీలకంగా మారింది. ‘పుణే వైరాలజీ’ పరిశోధనలు షురూ.. గబ్బిలాల నుంచి వైరస్లు వస్తున్నాయా లేక వాటి ద్వారా వైరస్లు వ్యాపిస్తున్నాయా అన్న దానిపై వివిధ దేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, ప్రాణాంతక వ్యాధులతో ముడిపడిన ఈ అంశానికి శాస్త్ర, సాంకేతిక పరంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పుణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా గబ్బిలాలు–వైరస్ల వ్యాప్తిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోనూ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పర్యటించి వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పరిశీలనలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు రకాల గబ్బిలాల రక్త, లాలాజల శాంపిల్స్‌ను సేకరించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ, ఇతర భవనాలు, హైకోర్టు భవన సముదాయం, చిలుకూరు బాలాజీ దేవాలయం, జనగామ, మంజీరా నదీ పరీవాహక ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో వందలాది గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇలా దేశవ్యాప్తంగా గబ్బిలాల రకాల నుంచి సేకరించిన శాంపిళ్లపై పరిశోధనలు నిర్వహించి వాటి ద్వారా ఎలాంటి వైరస్ ఎలా ఉద్భవించి, ఏ రూపంలో ఎలా వ్యాప్తి చెందుతున్నాయనే దానిపై పుణే ఇన్స్టిట్యూట్లో అధ్యయనం సాగుతోంది. వివిధ రకాల వైరస్ల సృష్టికి, వాటికి వాహకంగానూ గబ్బిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయనే అనుమానాల నివృత్తికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయనే నమ్మకం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. నిఫా వైరస్ వ్యాప్తికి కారణమవే.. కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమని శాస్త్రీయంగా పరిశోధనలతో ఇంకా నిరూపితం కాకున్నా నిపా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని పుణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధనల్లో తేల్చింది. 2018లో కేరళలో నిఫా వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై పరిశోధన సందర్భంగా ఈ ఇన్స్టిట్యూట్ నిర్ధారించింది. సార్స్, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి వాటికి దారితీసే వైరస్‌లకు కూడా గబ్బిలాలే కారణమనే అనుమానాలను పరిశోధనల ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం కాగా ఇప్పుడు మరింత తీవ్ర స్థాయికి చేరిన కరోనా వైరస్ కూడా ఇందులో వచ్చి చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని గట్టిగా నమ్ముతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. గబ్బిలాల నుంచి ఎలా? గబ్బిలాలకు సంబంధించినంత వరకు భారత్‌లో 12 రకాల జాతులుండగా, వాటిలో 3 రకాలు వైరస్ల వ్యాప్తికి ప్రమాదకారిగా అంచనా వేస్తున్నారు. వీటిలో పండ్లను సగం తిని వదిలేశాక ఆ పండ్లను తిన్న పందులు, ఇతర పక్షుల నుంచి, క్రిమికీటకాలు, పశువుల కళేబరాల మాంసం తిన్న గబ్బిలాల నుంచి, జంతువుల రక్తం పీల్చే ‘వ్యాంపెయిర్’బ్యాట్ల నుంచి వైరస్లు విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైనట్టు సమాచారం. కోవిడ్ వైరస్ వ్యాప్తిలోనూ గబ్బిలాల పాత్ర ఉందా అన్నది పరిశోధనల్లో తేలితే విశ్వ మానవాళికి సవాల్‌గా మారిన ఉపద్రవానికి విరుగుడు వ్యాక్సిన్‌ను కనుక్కోవడంలో సమాధానం దొరికినట్టు అవుతుందనే విశ్వాసాన్ని సైంటిస్ట్‌లు వ్యక్తం చేస్తున్నారు. -
తొలి గెలుపు
కరోనా.. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో దాన్ని అరికట్టే వైజ్ఞానిక ప్రయోగాలూ అంతే త్వరితంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో మన దేశం వెనకబడిపోయిందనే కామెంట్‌ను మోస్తూ వచ్చాం ఇన్నాళ్లూ. ఇప్పుడు ఆ మాటకు చెక్ పెట్టారు వైరాలజిస్ట్ మినల్ దఖావె భోశాలే పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ అనే డయాగ్నస్టిక్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆమె కేవలం ఆరు వారాల్లోనే ‘కరోనా’ వ్యాధి నిర్ధారణ కిట్‌ను కనిపెట్టారు. దానిపేరు ‘పాథో డిటెక్ట్’. వ్యాధి నిర్ధారణా పరికరాన్ని కనుగొనే వరకు వైరస్ ఆగదు కదా.. ‘అందుకే ఆరువారాలు రికార్డ్ టైమ్. ఆ ఘనత మినల్‌కే దక్కుతుంది’ అన్నారు ‘మైల్యాబ్ డిస్కవరీ’ డైరెక్టర్ డాక్టర్ గౌతమ్ వాంఖడే. మన దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేత ఆమోదం పొందిన మొట్టమొదటి కరోనా నిర్ధారణా పరీక్షా పరికరం ఇదే. అయితే.. ఇది దేశానికే కాదు... మినల్‌కూ కష్టకాలమే. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆమె నిండు చూలాలు. పైగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురై ఆసుపత్రిలో చేరింది కూడా. అప్పుడే మైల్యాబ్స్ డిస్కవరీ కరోనా టెస్టింగ్ కిట్స్ ప్రాజెక్ట్‌ను మినల్‌కు అప్పగించింది. క్లిష్టపరిస్థితుల్లో తనకు చేతనైన దేశసేవ చేయడానికి ఇంతకు మించిన అవకాశం ఏం ఉంటుంది అని ఈ ప్రయోగాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది మినల్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పదిమంది టీమ్‌తో టెస్టింగ్ కిట్ ప్రయోగం మొదలుపెట్టింది. కేవలం నెలా పదిహేనురోజుల్లో విజయం సాధించింది. ఈ కిట్‌కు సంబంధించిన ఫార్ములాను మొన్న పద్దెనిమిదో తేదీన (మార్చి నెల) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమర్పించింది. ఆ తర్వాత రోజే అంటే మార్చి 19న పండంటి పాపాయికి జన్మనిచ్చింది మినల్. ప్రస్తుతం ఈ రెండు శుభసందర్భాలనూ ఆమె ఆస్వాదిస్తోంది. ఈ కిట్ సామర్ధ్యం.. ఇప్పటి వరకు మనం ఈ కిట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరినీ పరీక్షించే వీలు లేకపోయింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వాళ్లను.. వాళ్లతో కలిసి వాళ్లను, దగ్గు, జలుబు, జ్వరం మొదలైన లక్షణాలు కలిగిన వాళ్లను మాత్రమే పరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ కిట్‌తో ఆ సమస్య తీరిపోనుంది. ఇప్పటిదాకా మనం దిగుమతి చేసుకుంటున్న వ్యాధి నిర్ధారణా విదేశీ కిట్స్ ఒక్కోటి 4,500 రూపాయలు. పాథో డిటెక్ట్ కిట్ వెల పన్నెండు వందల రూపాయలు మాత్రమే. అదీగాక విదేశీ కిట్‌లో ఫలితం రావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడితే ఈ స్వదేశీ కిట్‌తో కేవలం రెండున్నర గంటల్లోనే ఫలితం వస్తుంది. ఒక్కో కిట్‌తో వంద శాంపుల్స్‌ను పరీక్షించొచ్చు అని చెప్తున్నారు నిపుణులు. ► తొలి విడతగా 150 ‘పాథో డిటెక్ట్’ కిట్లను తయారు చేశారు. వీటిని పుణెతోపాటు ముంబై. ఢిల్లీ, గోవా, బెంగళూరు నగరాలకు పంపుతున్నారు. తర్వాత మరిన్నిటిని మిగిలిన నగరాలకు సరఫరా చేస్తారు. ► దీన్ని మన దేశంలో కరోనా మీద తొలి గెలుపుగా భావించొచ్చు. ఈ యుద్ధంలో మహిళ మేధోశక్తి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణమే! ► ‘ఈ అత్యవసర పరిస్థితి దేశానికే కాదు నాకూ సవాలుగానే అనిపించింది. అందుకే ఈ అసైన్మెంట్ తీసుకున్నాను’ అంటుంది మినల్. ► మినల్ ఈ ప్రయత్నం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. వాళ్లలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా , బయోకాన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా కూడా ఉన్నారు. -
కరోనా వ్యాక్సిన్‌కి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..
న్యూఢిల్లీ : రోజురోజుకూ విస్తృతమవుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు వచ్చే ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అప్పటివరకూ ఈ వైరస్‌తో పోరాడుతూనే ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ వైరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో ఎపిడెమాలజీ ప్రొఫెసర్ అయిన లిప్కిన్కు వైరస్‌లను గుర్తించడం వాటి వ్యాప్తిని పసిగట్టడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్లలో ఇది ఒకటని, వ్యాధి లక్షణాలు పెద్దగా పైకి కనిపించకపోవడంతో గుర్తించడం కష్టమని ఆయన చెప్పారు. ఏటా లక్షలాది మందికి సోకే ఇతర వైరస్ల మాదిరిగానే కొవిడ్-19 కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలకు సోకే అవకాశం ఉందని ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన అంచనా వేశారు. ఈ వైరస్ వచ్చే సీజన్లోనూ తిరిగి వ్యాపించవచ్చని, అయితే అప్పటికి మనం ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది సమయం ఉందని, అప్పటివరకూ దీంతో మనం సహజీవనం సాగించాల్సిందే అన్నారు. కరోనా వైరస్ అనుమానితులు ఎవరైనా తమకు వ్యాధి సోకిందని భావిస్తే బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్ధ ద్వారా ప్రయాణించే వారు గ్లోవ్స్ ధరించాలని అన్నారు. వైరస్లు వాతావరణానికి తగినట్టు స్వభావం మార్చుకుంటాయని చెప్పారు. కొవిడ్-19 కేసుల్లో ఒక శాతం లోపు మరణాలు సంభవించే అవకాశం ఉందని, సరైన జాగ్రత్తలు తీసుకోవడమే మార్గమని..భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ లిప్కిన్ చెప్పారు. కరోనాపై పోరాటంలో మనం ఓడిపోకూడదని పిలుపు ఇచ్చారు. చదవండి : మైండ్ స్పేస్ ఖాళీ కాలేదు : సజ్జనార్ -
రిమ్స్‌కు వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్
రిమ్స్ (కడప అర్బన్): కడప రిమ్స్‌కు త్వరలో వైరాలజీ రీసెర్చి ల్యాబ్ అందుబాటులోకి రానుంది. డెంగీ, మలేరియా లాంటి భయంకరమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏ వ్యాధి కారక క్రిముల నుంచి వస్తాయో, ఏ విధంగా వ్యాపిస్తాయో సమగ్ర పరిశోధన జరగనుంది. ఇలా పరిశోధనలు సమగ్రంగా జరిగితే సదరు వ్యాధి కారక క్రిములను రానీయకుండా, వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వైద్య బృందం అప్రమత్తం అవుతుంది. రాష్ట్రంలోని రిమ్స్‌లలో కడప రిమ్స్‌కు మైక్రో బయాలజీలోని వైరాలజీ విభాగంలో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఇందుకోసం వైరాలజీ విభాగం పరిశీలనకు ఢిల్లీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తరుపున ప్రత్యేక వైద్య బృందం సోమవారం కడప రిమ్స్‌కు వచ్చింది. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్‌సిద్దప్ప గౌరవ్‌ను కలిసిన బృందం వైరాలజీ డిపార్టుమెంటును పరిశీలించారు. మైక్రో బయాలజీ హెచ్ఓడీ డాక్టర్ శశిధర్, వైద్య సిబ్బంది ఈ బృందానికి సహకరించారు. తరగతి గదులు, ఎగ్జిబిషన్ హాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ల్యాబ్, పరికరాలు అన్నింటినీ పరిశీలించారు. ఈ బృందంలో వేలూరులోని నారాయణి వైద్య కళాశాల తరుపున వచ్చిన డాక్టర్లు శ్రీధర్, సతీష్, మహేష్ ఉన్నారు. అన్ని సంతృప్తిగా ఉన్నాయని, ఆ మేరకు నివేదిక పంపనున్నట్లు సమాచారం. త్వరలో రూ.6.2 కోట్లు మంజూరు కడప రిమ్స్‌లో మైక్రో బయాలజీ డిపార్టుమెంటు పరిధిలోని వైరాలజీ విభాగం రీసెర్చి ల్యాబ్‌కు ప్రభుత్వం రూ.6.2 కోట్లు మంజూరు చేయనుంది. ప్రాథమిక దశగా ఐసీఎంఆర్ బృందం విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌మాట్లాడుతూ మైక్రో బయాలజీలోని వైరాలజీ రీసెర్చి ల్యాబ్ త్వరలో కడప రిమ్స్‌కు అందుబాటులోకి రానుందన్నారు. బృందం నివేదిక మేరకు త్వరలోనే నిధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో రిమ్స్ వైద్య బృందం పాల్గొన్నారు.