న్యూఢిల్లీ : రోజురోజుకూ విస్తృతమవుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు వచ్చే ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అప్పటివరకూ ఈ వైరస్‌తో పోరాడుతూనే ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ వైరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో ఎపిడెమాలజీ ప్రొఫెసర్ అయిన లిప్కిన్‌కు వైరస్‌లను గుర్తించడం వాటి వ్యాప్తిని పసిగట్టడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్‌లలో ఇది ఒకటని, వ్యాధి లక్షణాలు పెద్దగా పైకి కనిపించకపోవడంతో గుర్తించడం కష్టమని ఆయన చెప్పారు. ఏటా లక్షలాది మందికి సోకే ఇతర వైరస్‌ల మాదిరిగానే కొవిడ్-19 కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలకు సోకే అవకాశం ఉందని ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన అంచనా వేశారు.
ఈ వైరస్ వచ్చే సీజన్‌లోనూ తిరిగి వ్యాపించవచ్చని, అయితే అప్పటికి మనం ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాది సమయం ఉందని, అప్పటివరకూ దీంతో మనం సహజీవనం సాగించాల్సిందే అన్నారు. కరోనా వైరస్ అనుమానితులు ఎవరైనా తమకు వ్యాధి సోకిందని భావిస్తే బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్ధ ద్వారా ప్రయాణించే వారు గ్లోవ్స్ ధరించాలని అన్నారు. వైరస్‌లు వాతావరణానికి తగినట్టు స్వభావం మార్చుకుంటాయని చెప్పారు. కొవిడ్-19 కేసుల్లో ఒక శాతం లోపు మరణాలు సంభవించే అవకాశం ఉందని, సరైన జాగ్రత్తలు తీసుకోవడమే మార్గమని..భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ లిప్కిన్ చెప్పారు. కరోనాపై పోరాటంలో మనం ఓడిపోకూడదని పిలుపు ఇచ్చారు.
చదవండి : మైండ్ స్పేస్ ఖాళీ కాలేదు : సజ్జనార్
Comments
Please login to add a commentAdd a comment