సాక్షి, హైదరాబాద్: గబ్బిలాలతో కరోనా వ్యాపిస్తుందా? ప్రస్తుత ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది, దానికి దోహదపడుతున్న మార్గాలేమిటో బోధపడక ఇంకా సందేహాలు వెంటాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిబారిన పడకుండా తప్పించుకోవచ్చుననేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణవ్వగా 50 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇక కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌లకు, గబ్బిలాలకు ఉన్న సంబంధాలు, వైరస్‌ల వ్యాప్తిలో ఇవి పోషిస్తున్న పాత్ర ఏమిటనేది కీలకంగా మారింది.
‘పుణే వైరాలజీ’ పరిశోధనలు షురూ..
గబ్బిలాల నుంచి వైరస్‌లు వస్తున్నాయా లేక వాటి ద్వారా వైరస్‌లు వ్యాపిస్తున్నాయా అన్న దానిపై వివిధ దేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, ప్రాణాంతక వ్యాధులతో ముడిపడిన ఈ అంశానికి శాస్త్ర, సాంకేతిక పరంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పుణే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా గబ్బిలాలు–వైరస్‌ల వ్యాప్తిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోనూ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పర్యటించి వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పరిశీలనలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు రకాల గబ్బిలాల రక్త, లాలాజల శాంపిల్స్‌ను సేకరించారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ, ఇతర భవనాలు, హైకోర్టు భవన సముదాయం, చిలుకూరు బాలాజీ దేవాలయం, జనగామ, మంజీరా నదీ పరీవాహక ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో వందలాది గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇలా దేశవ్యాప్తంగా గబ్బిలాల రకాల నుంచి సేకరించిన శాంపిళ్లపై పరిశోధనలు నిర్వహించి వాటి ద్వారా ఎలాంటి వైరస్ ఎలా ఉద్భవించి, ఏ రూపంలో ఎలా వ్యాప్తి చెందుతున్నాయనే దానిపై పుణే ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యయనం సాగుతోంది. వివిధ రకాల వైరస్‌ల సృష్టికి, వాటికి వాహకంగానూ గబ్బిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయనే అనుమానాల నివృత్తికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయనే నమ్మకం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది.
నిఫా వైరస్ వ్యాప్తికి కారణమవే..
కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమని శాస్త్రీయంగా పరిశోధనలతో ఇంకా నిరూపితం కాకున్నా నిపా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని పుణే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల్లో తేల్చింది. 2018లో కేరళలో నిఫా వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై పరిశోధన సందర్భంగా ఈ ఇన్‌స్టిట్యూట్ నిర్ధారించింది. సార్స్, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి వాటికి దారితీసే వైరస్‌లకు కూడా గబ్బిలాలే కారణమనే అనుమానాలను పరిశోధనల ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం కాగా ఇప్పుడు మరింత తీవ్ర స్థాయికి చేరిన కరోనా వైరస్ కూడా ఇందులో వచ్చి చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని గట్టిగా నమ్ముతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
గబ్బిలాల నుంచి ఎలా?
గబ్బిలాలకు సంబంధించినంత వరకు భారత్‌లో 12 రకాల జాతులుండగా, వాటిలో 3 రకాలు వైరస్‌ల వ్యాప్తికి ప్రమాదకారిగా అంచనా వేస్తున్నారు. వీటిలో పండ్లను సగం తిని వదిలేశాక ఆ పండ్లను తిన్న పందులు, ఇతర పక్షుల నుంచి, క్రిమికీటకాలు, పశువుల కళేబరాల మాంసం తిన్న గబ్బిలాల నుంచి, జంతువుల రక్తం పీల్చే ‘వ్యాంపెయిర్’బ్యాట్‌ల నుంచి వైరస్‌లు విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైనట్టు సమాచారం. కోవిడ్ వైరస్ వ్యాప్తిలోనూ గబ్బిలాల పాత్ర ఉందా అన్నది పరిశోధనల్లో తేలితే విశ్వ మానవాళికి సవాల్‌గా మారిన ఉపద్రవానికి విరుగుడు వ్యాక్సిన్‌ను కనుక్కోవడంలో సమాధానం దొరికినట్టు అవుతుందనే విశ్వాసాన్ని సైంటిస్ట్‌లు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment