వుహాన్: చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వార్తలను కవర్ చేస్తోన్న జర్నలిస్ట్ లీ జహువా అదృశ్యమై, దాదాపు రెండు నెలల అనంతరం మళ్లీ వుహాన్ పట్టణంలో ప్రత్యక్షమయ్యారు. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన లీ గత ఫిబ్రవరి 26వ తేదీన అదృశ్యమయ్యారు. అదే రోజు తనను ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీలో వెంటాడుతున్నారంటూ వారు వెంటాడుతున్న వీడియోను లీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భయానక కరోనా వైరస్ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిదంటూ అంతర్జాతీయంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ల్యాబ్‌ను లీ సందర్శించడంతో లీ అదృశ్యానికి ప్రాధాన్యత చేకూరింది.
ఆ రోజు తనను ఎస్‌యూవీలో కొందరు వెంట పడ్డారని, తన కారు ముందుకు ఎస్‌యువీలో దూసుకొచ్చిన వారు, కారును ఆపాలంటూ అరిచారని, తాను భయపడి పోయి స్పీడ్‌గా తన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నానని లీ చెప్పారు. ఇంట్లోకి వెళ్లాక లెట్లు ఆర్పేసి సిస్టమ్ మీద కూర్చున్నానని, అలా కొంత సేపయ్యాక ముగ్గురు వ్యక్తులు తన ఇంట్లోకి వచ్చి తమను తాము ‘పబ్లిక్ సేఫ్టీ’ ఆఫీసర్లుగా పరిచేయం చేసుకున్నారని చెప్పారు. వైరాలజీ ల్యాబ్‌తో పాటు కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను కూడా సందర్శించినందున తమతో రావాల్సిందిగా కోరిన వారు, తనను తీసుకెళ్లి క్వారెంటైన్‌లో ఉంచారని, మార్చి 28వ తేదీన విడుదల చేశారని లీ వివరించారు.
క్వారెంటైన్‌లో అందరు తనను బాగా చూసుకున్నారని, మూడు పూటలా మంచి భోజనం పెట్టారని, టీవీ చూసుకునే అవకాశం కూడా ఇచ్చారని గతంలో సీసీటీవీలో జర్నలిస్ట్‌గా పని చేసిన లీ పేర్కొన్నారు. మార్చి 28వ తేదీన తనను విడుదల చేశాక, తాను తన సొంతూరుకు వెళ్లి నిన్ననే తిరిగొచ్చానని ఆయన చెప్పారు. అదే నెల ఫిబ్రవరి నెలలో కనిపించకుండా పోయిన చెన్ కియుషి, ఫ్యాంగ్ బింగ్‌ల జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. ఓ బస్సులోకి కరానోతో చనిపోయిన మృత దేహాలను కుక్కుతున్న దృశ్యాలను వీడియో తీసి ఫ్యాంగ్ బింగ్ పోస్ట్ చేయడంతో ఆయన సీక్రెట్ పోలీసులకు టార్గెట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఓ ఆస్పత్రిలో మృతదేహం పక్కన నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఓ యువతితోపాటు మరికొన్ని అలాంటి దృశ్యాలను వీడియో తీసి చెన్ కియుషి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి కనిపించకుండా పోయారు.
Comments
Please login to add a commentAdd a comment