బీజింగ్ : కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేసిన విలేకరికి ఐదేళ్ల జైలుశిక్షను బహుమానంగా ఇచ్చింది చైనా ప్రభుత్వం. ఝాంగ్ ఝాన్ అనే 37 ఏళ్ల మాజీ న్యాయవాది.. సిటిజన్ జర్నలిస్ట్. ఈ ఏడాది ఫిబ్రవరిలో వూహాన్‌కు వెళ్లి అక్కడి నుంచి వైరస్ కేసులకు సంబంధించి పలు కథనాలు రాసి, ప్రచురించింది. కరోనా వైరస్ మరణాలకు కారణమెవరని ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు వేధించారని, కొంతమంది స్వతంత్ర విలేకరులను కనిపించకుండా చేశారని ఝాన్ కథనాలు రాశారని చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్‌ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ క్రమంలో కొట్లాటకు దిగుతున్నారని, సమస్యలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఝాన్‌ను మేలో అరెస్ట్ చేశారు.
నెలలుగా అజ్ఞాతంలో..
ఝాంగ్ ఝాన్ మే 14 నుంచి కనిపించకుండా పోయిందని సీహెచ్‌ఆర్‌డీ తెలిపింది. ఒకరోజు తరువాత ఝాన్ తమ కస్టడీలో ఉన్నట్లు వూహాన్‌కు సుమారు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై పోలీసులు ప్రకటించారు. జూన్ 19న ఝాన్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించగా మూడు నెలల నిర్బంధం తరువాత ఝాన్‌ను కలిసేందుకు న్యాయవాదికి అనుమతి లభించింది. ఝాన్ తన అరెస్ట్‌ను నిరసిస్తూ జైల్లోనే నిరాహార దీక్షకు దిగారని, సెప్టెంబర్ 18న ఆమెను దోషిగా నిర్ధారించామని ఝాన్ న్యాయవాదికి ఓ ఫోన్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఝాన్ కేసులో వెలువడిన తీర్పు ప్రతిని పరిశీలించగా అందులో ‘‘వీ చాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని అక్షరాలు, వీడియోలు, ఇతర రూపాల్లో ప్రసారం చేశారు’’అన్న ఆరోపణలపై ఝాన్‌కు శిక్ష విధించినట్లు ఉంది.
అంతేకాకుండా.. విదేశీ ప్రచురణ సంస్థల ఇంటర్వూ్యలకు అంగీకరించినందుకు, వూహాన్‌లో వైరస్‌కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు ఝాన్‌ను శిక్షిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, ఝాన్‌తోపాటు కనీసం ముగ్గురు జర్నలిస్టులు ఫిబ్రవరి నుంచి కనిపించకుండాపోయారు. వీరిలో లీ జెహూవా అనే విలేకరి ఏప్రిల్‌లో మళ్లీ ప్రత్యక్షమై.. అప్పటివరకు తాను క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పగా.. చెన్ కియుషీ తాను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకున్నారు. ఫాంగ్ బిన్ అనే ఇంకో విలేకరి ఇప్పటివరకు అయిపు అజా లేకపోవడ గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment