తొలి గెలుపు | Virologist Minal Dhakawei Bhosale is Behind The Indias First Testing Kit | Sakshi
Sakshi News home page

తొలి గెలుపు

Published Mon, Mar 30 2020 3:55 AM | Last Updated on Mon, Mar 30 2020 3:55 AM

Virologist Minal Dhakawei Bhosale is Behind The Indias First Testing Kit - Sakshi

కరోనా.. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో దాన్ని అరికట్టే వైజ్ఞానిక ప్రయోగాలూ అంతే త్వరితంగా జరుగుతున్నాయి. ఈ  ప్రయత్నాల్లో మన దేశం వెనకబడిపోయిందనే కామెంట్‌ను మోస్తూ వచ్చాం ఇన్నాళ్లూ. ఇప్పుడు ఆ మాటకు చెక్‌ పెట్టారు వైరాలజిస్ట్‌  మినల్‌ దఖావె భోశాలే పుణెలోని ‘మైల్యాబ్‌ డిస్కవరీ’ అనే డయాగ్నస్టిక్‌ కంపెనీలో రీసెర్చ్‌  అండ్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌గా పనిచేస్తున్న ఆమె కేవలం ఆరు వారాల్లోనే ‘కరోనా’ వ్యాధి నిర్ధారణ కిట్‌ను కనిపెట్టారు. దానిపేరు ‘పాథో డిటెక్ట్‌’. వ్యాధి నిర్ధారణా పరికరాన్ని కనుగొనే వరకు వైరస్‌ ఆగదు కదా.. ‘అందుకే ఆరువారాలు రికార్డ్‌ టైమ్‌. ఆ ఘనత మినల్‌కే దక్కుతుంది’ అన్నారు  ‘మైల్యాబ్‌ డిస్కవరీ’ డైరెక్టర్‌ డాక్టర్‌ గౌతమ్‌ వాంఖడే. మన దగ్గర నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ చేత ఆమోదం పొందిన మొట్టమొదటి కరోనా నిర్ధారణా పరీక్షా పరికరం ఇదే.

అయితే.. ఇది దేశానికే కాదు... మినల్‌కూ కష్టకాలమే. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆమె నిండు చూలాలు. పైగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురై ఆసుపత్రిలో చేరింది కూడా. అప్పుడే మైల్యాబ్స్‌ డిస్కవరీ కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ ప్రాజెక్ట్‌ను మినల్‌కు అప్పగించింది. క్లిష్టపరిస్థితుల్లో  తనకు చేతనైన దేశసేవ చేయడానికి ఇంతకు మించిన అవకాశం ఏం ఉంటుంది అని ఈ ప్రయోగాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది మినల్‌. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే  పదిమంది టీమ్‌తో టెస్టింగ్‌ కిట్‌ ప్రయోగం మొదలుపెట్టింది. కేవలం నెలా పదిహేనురోజుల్లో విజయం సాధించింది. ఈ కిట్‌కు సంబంధించిన ఫార్ములాను మొన్న పద్దెనిమిదో తేదీన (మార్చి నెల) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి సమర్పించింది. ఆ తర్వాత రోజే అంటే మార్చి 19న పండంటి పాపాయికి జన్మనిచ్చింది మినల్‌.  ప్రస్తుతం  ఈ రెండు శుభసందర్భాలనూ ఆమె ఆస్వాదిస్తోంది.

ఈ కిట్‌ సామర్ధ్యం..
ఇప్పటి వరకు మనం ఈ కిట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరినీ పరీక్షించే వీలు లేకపోయింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వాళ్లను.. వాళ్లతో కలిసి వాళ్లను, దగ్గు, జలుబు, జ్వరం మొదలైన లక్షణాలు కలిగిన వాళ్లను మాత్రమే పరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ కిట్‌తో ఆ సమస్య తీరిపోనుంది. ఇప్పటిదాకా మనం దిగుమతి చేసుకుంటున్న వ్యాధి నిర్ధారణా విదేశీ కిట్స్‌ ఒక్కోటి 4,500 రూపాయలు. పాథో డిటెక్ట్‌  కిట్‌ వెల  పన్నెండు వందల రూపాయలు మాత్రమే. అదీగాక విదేశీ కిట్‌లో ఫలితం రావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడితే ఈ స్వదేశీ కిట్‌తో కేవలం రెండున్నర గంటల్లోనే ఫలితం వస్తుంది. ఒక్కో కిట్‌తో వంద శాంపుల్స్‌ను పరీక్షించొచ్చు అని చెప్తున్నారు నిపుణులు.

► తొలి విడతగా 150 ‘పాథో డిటెక్ట్‌’ కిట్‌లను తయారు చేశారు. వీటిని పుణెతోపాటు ముంబై. ఢిల్లీ, గోవా, బెంగళూరు నగరాలకు పంపుతున్నారు.  తర్వాత మరిన్నిటిని మిగిలిన నగరాలకు సరఫరా చేస్తారు. 
► దీన్ని మన దేశంలో కరోనా మీద తొలి గెలుపుగా భావించొచ్చు. ఈ యుద్ధంలో  మహిళ మేధోశక్తి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణమే! 
► ‘ఈ అత్యవసర పరిస్థితి దేశానికే కాదు నాకూ సవాలుగానే అనిపించింది. అందుకే ఈ అసైన్‌మెంట్‌ తీసుకున్నాను’ అంటుంది మినల్‌. 
► మినల్‌ ఈ ప్రయత్నం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. వాళ్లలో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా , బయోకాన్‌ చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement