కాలివేళ్ల మధ్య చర్మం ఎర్రబారుతోంది.. ఏం చేయాలి?
నా వయసు 55 ఏళ్లు. గృహిణిని. బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ నేనే చేసుకుంటూ ఉండటం వల్ల తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. దీనికి సరైన మందులు చెప్పండి.
- నాగవర్ధని, కోదాడ
మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బునీళ్లలో కాళ్లుతడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్‌ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి.
నా వయసు 16 ఏళ్లు. ఇటీవలే ఇంటర్మీడియట్ కోసం మా ఊరినుంచి వచ్చి వైజాగ్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటున్నాను. నేను హాస్టల్‌లో చేరిన కొద్దిరోజుల తర్వాత నుంచి నా చేతివేళ్ల మధ్యన కురుపుల్లాగా వస్తున్నాయి. దురదగా కూడా ఉంటోంది. ఇదేమైనా అంటువ్యాధా? దీనికి తగిన పరిష్కారం చెప్పండి.
- సందీప్, విశాఖపట్నం
హాస్టల్‌లో ఉండే పిల్లల్లో చాలామందికి వచ్చే చాలా సాధారణమైన వ్యాధి ఇది. దీన్ని ‘స్కేబిస్’ అంటారు. మీరు ఊహించినట్లే ఇది చాలా త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాటు కలిసి ఉన్నా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందంటే, ఇది ఎంతటి తీవ్రమైన అంటువ్యాధో ఊహించవచ్చు. దీని చికిత్స కోసం మీరు ఫెక్సోఫినడిన్ 180 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను రోజూ రాత్రివేళ 10 రోజుల పాటు తీసుకోండి. ఇది దురదను తగ్గిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం వేడినీటితో స్నానం చేసి, ఆ టైమ్‌లో వేళ్ల మధ్య స్క్రబ్ (శుభ్రం అయ్యేలా గట్టిగా రాసుకోవడం) చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి పర్మెథ్రిన్ 5% అనే లోషన్‌ను శరీరమంతా రాసుకుని నిద్రపోండి. మళ్లీ ఉదయం లేవగానే వేళ్లమధ్య స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేయండి. హాస్టల్‌లో ఒకరికి ఉన్నా... మొత్తం హాస్టల్‌లో ఉన్నవారంతా ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నెల తర్వాత ఇదే ట్రీట్‌మెంట్ మళ్లీ తీసుకోవాలి.
డర్మటాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 2 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement